అ
అంగడి నెవ్వరు నంటకురో యీ
దొంగలగూడిన ద్రోహులను// పల్లవి //
దోసము దోసము తొలరో శ్రీహరి
దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెరుగక చెడి
వీసరపోయిన వెర్రులము //అంగడి//
పాపము పాపము పాయరో కర్మపు
దాపవువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరి కథలు
యేపొద్దు విననిహీనులము //అంగడి//
పంకము పంకము పైకొనిరాకురో
కొంకుగొసరులకూళలము
వేంకటగిరిపై విభునిపుణ్యకథ
లంకెల విననియన్యులము //అంగడి//
అంగన నిన్నడిగి రమ్మనె నీమాట
సంగతిగ మరుమాట సరి నాన తీవయ్యా
చెలులచే నింతి నీకు చెప్పిపంపిన మాటలు
తలచుకొన్నాడవా దయతో నీవు
తొలుత గాను కంపిన దొడ్డ పూవుల బంతి
లలిమించిన పరిమళము గొంటివా // అంగన //
చాయల నాసతో నాపె సారె జూచిన చూపులు
ఆయములు గరచేనా అంటుకొనెనా
చేయెత్తి సిగ్గుతోడ చేరి మొక్కిన మొక్కులు
ఆయనా నీకు శలవు అందరిలోనా // అంగన //
బెరసి తెరమాటున బెట్టిన నీపై సేసలు
శిరసుపై నిండెనా చిందెనా నీపై
అరుదై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
గరిమ నిన్ను గూడి గద్దెపై గూచున్నది // అంగన //
అంగన యెట్టుండినా నమరుగాక
సంగతే నీకు నాపె సాటికి బెనగను
తనకు బోదైనచోట తగిలి మాటాడకున్న
మనుజుడావాడు పెద్ద మాకు గాక
చనవున బెనగగా సమ్మతించకుండితేను
ఘనత యేది చులకదనమే గాక // అంగన //
చెల్లుబడి గలచోట సిగ్గులు విడువకున్న
బల్లిదుడా వాడూ కడు పందగాక
వెల్లివిరి నవ్వగాను వీడు దోళ్ళాడకున్న
చల్లేటి వలపులేవి సటలింతే కాక // అంగన //
తారుకాణలైన చీట తమకించి కూడకున్న
చేరగ జాణడా గోడచేరుపు గాక
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె రఘునాథుడవై
కూరిమి గూడితివిది కొత్తలింతే కాక //అంగన//
అంగనలీరే హారతులు
అంగజగురునకు నారతులు ||
శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి
ఆదిత్య తేజున కారతులు ||
సురలకు నమౄతము సొరది నొసంగిన
హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరి భయంకరున కారతులు ||
నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి
అచ్యుతునకు నివె యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ
యచ్చుగ నిలిచిరి యారతులు ||
అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీసతినిధానము // పల్లవి //
కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు // అంగ //
సతికి నీమెడ రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర // అంగ //
నెమ్మి నలమేల్‌మంగ నీకాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీభావమే భాగ్యము // అంగ //
అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంగతెఱిగిననెరజాణ డితడే
వొడలులేనివాని కొక్కడే తండ్రాయగాని
తడయక పురుషోత్తము డితడే
బడబాగ్నిజలధికి బాయకల్లుడాయగాని
వెడలించె నమృతము విష్ణుడితడే //అంగనలాల//
పులిగూడుదిన్నవానిపొం దొక్కటే సేసెగాని
నలువంక లక్ష్మీనాథు డితడే
చలికి గోవరివానివరుస బావాయగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధు డితడే //అంగనలాల//
యెక్కడో గొల్లసతుల కింటిమగడాయగాని
తక్కకవెదకేపరతత్త్వ మితడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీద మమ్ము నేలెగాని
తక్కక వేదముచెప్పేదైవమీతడే //అంగనలాల//
అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక
పంచమహాపాతకులభ్రమ వాపవశమా
కాననియజ్ఞానులకు కర్మమే దైవము
ఆనినబద్ధులకు దేహమే దైవము
మాననికాముకులకు మగువలే దైవము
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా
యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము
దోమటిసంసారి కూరదొర దైవము
తామసులకెల్లాను ధనమే దైవము
పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా
ధన నహంకరులకు తాదానే దైవము
దరిద్రుడైనవానికి దాత దైవము
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము
పరులముంచినయట్టి భ్రమ బాపవశమా
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె
వెంటబారనీదు నన్ను వెడమాయతురుము
కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి
లేగల దోలుకొని అలిగిపోయీని
రాగతనమున వాడె రాతిరి నారగించడు
ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను // అంటబారి //
కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి
కలవూరుగాయలెల్ల గలచిపెట్టె
పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె
చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను // అంటబారి //
మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు
ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును
వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె
యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను // అంటబారి //
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
బంతిగట్టినురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారముసేయునరు డందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||అంత||
వరుస జేదుదినేవాడు యెడ నెడ గొంత
సరవితోడుత దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించుమానవుడు
తరువాత హరిపేరు దలచుటే చాలు ||అంత||
కడు బేదైనవాడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురువాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు ||అంత|||
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును
నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు
నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే
శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము // అంతరంగమెల్ల //
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తాను రాజైతే ఏలెనాపరము // అంతరంగమెల్ల //
పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా // అంతరంగమెల్ల //
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా పనిమాలి ముదిసితే పాసెనా భవము
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా యెదుట తాను రాజైతే ఏలేనాపరము
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
కనక మిత్తడితోడ కలయ సరిదూచితే
అనువవునా అది దోష మవుగాక
ఘనుడైనహరితో గడుహీనదేవతల
ననిచి సరివేట్టితే నయ మవునా భువిని // అంతరుమాలినయట్టి //
పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై
వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా // అంతరుమాలినయట్టి //
కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక
అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను
కొంచెపుదైవాల పలువంచలనేకాక // అంతరుమాలినయట్టి //
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక // అంతర్యామి //
జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక // అంతర్యామి //
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక // అంతర్యామి //
అందరి బ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే
వేమరు జదివెడి విప్రుల వేదము
సోమకవైరి యశో విభవం
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు
ధామ ధనుని సంతత కరుణే
హితవగు నిలలో నీసుఖమెల్లను
దితి సుత దమనుడు దెచ్చినదే
తతి తల్లి దండ్రి తానై కాచిన
రతి ప్రహ్లాద వరదుని కృపే
అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు
బలి బంధను కృప బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలునృప భంజను పరిణతలే
పూని యనాథుల పొందుగ గాచిన
జానకీ విభుని సరసతలే
నానా భూభరణంబులు నందుని
సూనుడు చేసిన సుకృతములే
తలకొని ధర్మము తానై నిలుపుట
కలుష విదూరుని గర్వములే
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు
కలియుగమున వేంకటపతివే
అందరి వసమా హరినెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు // పల్లవి //
లలితపు పదిగోట్లనొకఁడుగాని
కలుగఁడు శ్రీహరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని // అందరి //
శ్రుతి చదివిన భూసురకోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతిఘనులట్టి మహాత్మకోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని // అందరి //
తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకఁడు తలఁపున హరిని
గుదిగొను హరిభక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీవేంకటపతిని // అందరి //
అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు
సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన //
సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన //
పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన //
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు
దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు
కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు
అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు
యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర –
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు
వైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము
నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు
అందరివలెనే వున్నాడాతడా వీడు
యిందుముఖుల గూడినా డీతడా నాడు
యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు
అందుకొని యారగించినాతడా వీడు
చెంది మునులసతులసత దెప్పించుక మంచి
విందులారగించినాడు వీడానాడు // అందరివలెనే //
తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు
అలరి మారుగడించినాతడా వీడు
నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి
యిల నావుల గాచినా డీతడా నాడు // అందరివలెనే //
బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి
అలరియాటలాడిన యాతడా వీడు
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే
యేలెను బ్రహ్మాదుల నీతడానాడు // అందరివలెనే //
అందరు మాలినయట్టిఆధమూలాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
కనక మిత్తడితోడ కలయ సరిదూచితే
అనువనువునా అది దోషమవుగాక
ఘనుడైనహరితో గడుహీనదేవతల
నవిచి సరివెట్టితే నయ మవునా భువిని
పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై
వెట్టింబంటు బెట్టేవారు వెఱ్రులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా
కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలేకాక
అంచెల శ్రీవేంకటేశుడాత్మలోనే వుండగాను
కొంచపుదైవాల పలువంచలనేకాక
అందాకదాదానే అంతుకెక్కుడు గాదు
ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు
చిత్తమంతర్ముఖము సేసుకొన నేర్చెనా
అత్తలనతడు యోగియనబడును
సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా
వుత్తమ వివేకియని వూహింపబడును // అందాకదాదానే //
భావము నబావమును పరికించి తెలిసెనా
కైవల్యనిలయుడని కానబడును
దైవముదన్నుమతిదలపోయెనేర్చెనా
జీవన్ముక్తుడని చెప్పబడునతడు // అందాకదాదానే //
అడరి వైరాగ్యధనమార్జించనోపెనా
దిడువై జితేంద్రియ స్థిరుడాతడు
జడియు శ్రీవేంకటేశ్వరుదాసుడాయనా
బడిబడిదుదబర బ్రహ్మమేయతడు // అందాకదాదానే //
అందాకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు
నీదాసుడననేటినిజబుద్ది గలిగితే
అదెస నప్పుడే పుణ్యుడాయ నతడు
వేదతొ వొక్కొక్క వేళ వెలుతులు గలిగితే
నిదయవెట్టి వెనక నీవే తీరుతువు
తొలుత నీశరణము దొరకుటొకటేకాని
చెలగి యాజీవునికి జేటు లేదు
కలగి నడుమంత్రాన గతిదప్పనడచిన
నెలకొని వంకలొత్తనీవే నేరుతువు
నీ వల్ల గొరత లేదు నీపేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిట్టె చేరి కాతువు
భావించలేకుండగాను భారము నీదంటే జాలు
నీవారి రక్షించ నీవె దిక్కౌదువు
అందిచూడఁగ నీకు నవతారమొకటే
యెందువాఁడవై తివి యేఁటిదయ్యా // పల్లవి //
నవనీతచోరా నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా // అంది //
పట్టపు శ్రీరమణా భవరోగవైద్య
జట్టిమాయలతోడిశౌరి కృష్ణ
పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేఁటిదయ్యా // అంది //
వేదాంతనిలయా వివిధాచరణా
ఆదిదేవ వేంకటాచలేశ
సోదించి తలఁచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేఁటిదయ్యా // అంది //
అందులోనె వున్నావాడు ఆది మూరితి
అందరాని పదవియైన నందిచ్చు నతడు
ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా
కని ణీ యాత్మ వాకిలి కావరాదా
యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా
అనిశము నీ మనో రాజ్యము నేలరాదా // అందులోనె //
చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా
చెలగి నీ రూప మేదో చింతించ రాదా
కెలన సుఖములు భోగించేటి జీవుడా
పొలసి సుజ్ఞానము భోగించరాదా // అందులోనె //
చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా
భావపు టానందాన బలియ రాదా
కోవరపు సంపదల కోరేటి జీవుడా
శ్రీ వేంకటేశుని సేవగోర రాదా // అందులోనె //
అక్కటా రావణు బ్రహ్మ హత్య నీకు నేడది
పుక్కిట పురాణ లింగ పూజ నీకు నేడది
గురు హత్య బ్రహ్మ హత్యన్ గూడి ద్రోణాచార్యు వంక
హరి నీ క్రుప నర్జునుకవి లేవాయ
యెరవుగా గల్లలాడి యేచిన ధర్మ రాజునకు
పరగ నీ యనుమతిన్ పాపము లేదాయను
అదివో రుద్రుని బ్రహ్మ హత్య బాయన్ గాసి ఇచ్చి
పొదలిన నీవతని బూజింతువా
అదనన్ పార్వతీదేవి కాతండే నీ మంత్రమిచ్చె
వదరు మాటల మాయా వచనాలేమిటికి
తగిలిన నీ నామమే తారక బ్రహ్మమై
జగము వారి పాపాలు సంతతమూ బాపన్ గాను
మిగుల శ్రీ వేంకటేశ నేడ మీకు పాతకాలు
నగున్ బాటు లింతే కాక నానా దేశముల
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
కుక్కనోరికళాసమై కొల్లబోయ బతుకు
ఎండచేత నీడచేత నెల్లవాడు నిట్లానే
బండుబండై యెందు గడపల గానక
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక
వండదరిగిన కూరవలెనాయ బతుకు // అక్కడ నాపాట్లువడి //
పంచమహాపాతకాలబారి బడి భవముల
దెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసలవెంట బొరలబోయెద మింక
దంచనున్న రోలిపిండితలపాయ బతుకు // అక్కడ నాపాట్లువడి //
యీదచేత వానచేత నెల్లనాడు బాయని
బాదచేత మేలెల్ల బట్టబయలై
గాదిలి వేంకటపతి గానగబోయెద మింక
బీదగరచినబూరె ప్రియమాయ బ్రదుకు // అక్కడ నాపాట్లువడి //
అక్కరకొదగనియట్టియర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే
దండితో దనకుగానిధరణీశురాజ్యంబు
యెండెనేమి యది పండెనేమిరే
బెండుపడ గేశవుని బేరుకొననినాలికె
వుండెనేమి వుండకుండెనేమిరే // అక్కరకొదగని //
యెదిరి దన్ను గాననియెడపులగుడ్డికన్ను
మొదల దెఱచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతిసేవ వేడుక జేయనివాడు
చదివెనేమి చదువు చాలించెనేమిరే // అక్కరకొదగని //
ఆవల నెవ్వరులేని అడవిలోనివెన్నెల
కావిరి గాసెనేమి కాయకున్ననేమిరే
శ్రీవేంకటేశ్వరు జేరనిధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలగిననేమిరే // అక్కరకొదగని //
అక్కలాల చూడుడందరును
నిక్కివారవట్టీ నేడు గృష్ణుడు
ఆనవాలవుట్టి అడకులవుట్టి
పానకపుటుట్టి బలిమినే
ఆనుక కోలలనందియంది కొట్టి
తేనెవుట్టి గొట్టి దేవకిసుతుడు // అక్కలాల //
పెరుగువుట్టి మంచిపేరిన నేతివుట్టి
సరివెన్నవుట్టి చక్కెరవుట్టి
వెరవుతో గొట్టి వెసబాలులతో
బొరుగువుట్టి గొట్టీపొంచి రాముడు // అక్కలాల //
మక్కువ నలమేలుమంగగూడి నేడు
చొక్కి శ్రీవేంకటేశుడు వీధుల
నిక్కి వుట్లెల్లా నిండా గొట్టివుట్టి
చక్కిలాలు గొట్టీ జగతీశుడు // అక్కలాల //
అచ్చపు రాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ // పల్లవి //
ఊరుఁగాయలును నొద్దికచద్దులు
నారగింపుచు నందరిలో
సారె బాలుల సరసాలతోడ
కోరి చవులు గొంటివి కృష్ణా // అచ్చ //
ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్త యాతఁడని
జోకఁ గొనియాడఁ జొక్కితి కృష్ణా // అచ్చ //
పేయలు లేవు పిలువుఁడనుచు
కోయని నోరఁ గూతఁలను
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా // అచ్చ //
అచ్చుత మిమ్ముదలచేయంతపని వలెనా యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా
మిమ్ము నెఱిగినయట్టిమీదాసుల నెఱిగే_ సమ్మవిజ్ఞానమే చాలదా నాకు వుమ్మడి మీసేవ సేసుకుండేటివైష్ణవుల_ సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు।
నిరతి నీకు మొక్కేనీడింగరీలకు సరవితో మొక్కుటే చాలదా నాకు పరగ నిన్ను బూజించే ప్రసన్నుల బూజించే_ సరిలేనిభాగ్యము చాలదా నాకు।
అంది నీకు భక్తులై నయలమహానుభావుల_ చందపువారిపై భక్తి చాలదా నాకు కందువ శ్రీ వేంకటేశ కడు నీబంటుబంటుకు సందడిబంటనవుటే చాలదా నాకు ।
అచ్చుతుశరణమే అన్నిటికిని గురి
హెచ్చుకుందు మరి యెంచఁగనేది // పల్లవి //
యోనిజనకమగు యొడ లిది
యే నెల వైనా నేఁటి కులము
తానును మలమూత్రపుఁ జెలమ
నానాచారము నడచీనా // అచ్చు //
పాపపుణ్యముల బదుకిది
యేపొద్దు మోక్షం బెటువలె దొరకు
దీపనబాధల దినములివి
చూపట్టి వెదకఁగ సుఖ మిందేది // అచ్చు //
మరిగినతెరువల మనసుయిది
సరవినెన్న విజ్ఞానంబేది
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁడే
వెరవని కంటే వెలితిఁక నేది // అచ్చు //
అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి
ఇటు గలిగె నీకు నైహికవిచారములు // పల్లవి //
కోరికలకును గలిగె ఘోరపరితాపంబు
కూరిమికి గలిగె ననుకూలదుఃఖములు
తారతమ్యములేని తలపోతలకు గలిగె
భారమైనట్టి లంపటమనెడిమోపు // అటు గుడువు //
తనువునకు గలిగె సంతతమైనతిమ్మటలు
మనువునకు గలిగె నామవికారములు
పనిలేని సంసార బంధంబునకు గలిగె
ఘనమైన దురిత సంగతితోడి చెలిమి // అటు గుడువు //
దేహికిని గలిగె నింద్రియములను బోధింప
దేహంబునకు గలిగె తెగనిసంశయము
దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు
దేహిదేహాంతరస్థితి జూడగలిగె // అటు గుడువు //
అటుగన రోయగ దగవా
నటనల శ్రీహరి నటమింతే // పల్లవి //
చిడుముడి మూగినజీవులలోపల
కడగి నే నొక్కడ నింతే
నిడువక పక్షులు వృక్షము లిలపై
వెడగుభోగముల వెదకీనా // అటుగన //
తనువులు మోచినతగుప్రాణులలో
గనుగొని నొకమశకమ నింతే
మునుకొని కీటకములు జీమలు నిల
చెనకి దొరతనము సేసీనా // అటుగన //
శ్రీవేంకటపతిసేవవారిలో
సోవల నొకదాసుడ నేను
భావించి సురలు బ్రహ్మాదు లతని
దైవపుమాయలు దాటేరా // అటుగన //
అటుచూడు సతినేర్పు లవుభళేశ
అటుమటములు గావు అవుభళేశ // పల్లవి //
యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ
అదివో నీ తొడ యెక్కినౌభళేశ
వుదుటున నంతలోనే వురముపై నెలకొని
అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ // యెదురు గొండల //
ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను
నంగన గద్దెపై బెట్టె నౌభళేశ
కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె
అంగా లంటె నింటిలోన నౌభళేశ // యెదురు గొండల //
చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి
ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ
గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను
అరసి రతి మెప్పించె నౌభళేశ // యెదురు గొండల //
అటువంటి వైభవము లమర జేసిన దైవ
మిటువంటి యోగంబు లిన్నియును జేసి // పల్లవి //
జలజాక్షి లావణ్య జలధినుప్పొంగిన
నలివేణి ముఖచంద్రు డభ్యుదయ మాయె
కలికి వలరాయడను కాలకూటంబుతో
దలకొన్న యధరామృతంబు జన్మించె // అటువంటి //
వనిత సౌభాగ్యంబు వనధిలోపల దోచె
గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు
తనివోని కోరికల తగు తురంగములతో
ననువైన విరహ బడబానలము గలిగె // అటువంటి //
భామయవ్వన మనెడి పాలజలధిలోన
వామాక్షి యైన యవ్వన లక్ష్మి గలిగె
యీ మంచి తిరువేంకటేశ్వరుం డిందులో
బ్రేమమున సుఖియించి పెంపొందగలిగె // అటువంటి //
అటువంటివాడువో హరిదాసుడు
ఆటమాటలు విడిచినాతడే సుఖి // పల్లవి //
తిట్టేటిమాటలును దీవించేమాటలును
అట్టే సరెయని తలచినాతడే సుఖి
పట్టిచంపేవేళను పట్టముగట్టేవేళ
అట్టునిట్టు చలించని యాతడే సుఖి // అటువంటివాడువో //
చేరి పంచదారిడిన జేదు దెచ్చిపెట్టినాను
ఆరగించి తనివొందే యతడే సుఖి
తేరకాండ్ల జూచిన తెగరానిచుట్టముల
నారయ సరిగాజూచే యాతడే సుఖి // అటువంటివాడువో //
పొంది పుణ్యము వచ్చిన పొరి బాపము వచ్చిన
నందలి ఫలమొల్లని యాతడే సుఖి
విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసుల జేరి
అందరానిపద మందిన నాతడే సుఖి // అటువంటివాడువో //
అట్టివేళ గలగనీ దదివో వివేకము
ముట్టువడితే శాంతము మరి యేలా // పల్లవి //
జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు
వొడలిలో జీవునికి నొక్కొకవేళ
బడబాగ్ని రేగినట్లు పైకొనీ ముంగోపము
వుడికించు మననెల్ల నొక్కొకవేళా // అట్టివేళ //
అరయ గొండయెత్తినట్టు వేగౌ సంసారము
వూరక కలిమిలేము లొక్కొకవేళ
మేరలేనిచీకటియై మించును దుఃఖములెల్లా
వూరటలేనికర్మికి నొక్కొకవేళా // అట్టివేళ //
పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు
వొనర నజ్ఞానికి నొక్కొకవేళా
యెనయగ శ్రీవేంకటేశుదాసుడైనదాకా
వునికి బాయవన్నియు నొక్కొకవేళా // అట్టివేళ //
అడుగరే చెలులాల అతనినే యీ మాట
వుడివోని తమకాన నుండ బోలు తాను
వేడుక గలప్పుడే వెస నవ్వు వచ్చు గాక
వాడి వున్నప్పుడు తలవంపులే కావా
యేడనో సతుల చేత యేపులబడి రాబోలు
యీడ నే జెనక గాను యిటులా నుండునా // అడుగరే //
ఆసల గూడినప్పుడె ఆయాలు గరగు గాక
పాసి వున్నప్పుడు తడబాటులే కావా
బేసబెల్లి వలపుల పిరి వీకై రాబోలు
వేన నే బెట్టగాను సిగ్గువడి వుండునా // అడుగరే //
సరస మాడి నప్పుడె చవులెల్లా బుట్టు గాక
గొరబైన యప్పుడు కొరతలే కావా
యిరవై శ్రీ వేంకటేశు డింతలోనె నన్ను గూడె
వరుస నిందాకా నిటువలె జొక్కకుండునా // అడుగరే //
అడుగరే యాతనినే అంగనలాలా
గుడిగొని తానే వట్టి గొరబాయగాక
యెదురాడేదాననా యెంతటి పనికినైనా
పదరి తానే మారువలికీ గాక
తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా
ముదమునదానే మారుమలసీగాక // అడుగరే //
కక్కసించే దాననా కడలెంత దొక్కినాను
వెక్కసీడై తానై యిటు వెలసీగాక
మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను
పక్కనె దానె ముంచి పంతమాడీగాక // అడుగరే //
తడబడేదాననా తనరతి వేళను
బడిబడి దానే చొక్కి భ్రమసీగాక
అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి
అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక // అడుగరే //
అడుగరే యీమాట అతని మీరందరును
యెడయనిచోటను ఇగిరించుఁ బ్రియము // పల్లవి //
పొరపొచ్చమగుచోట పొసఁగవు మాటలు
గరిమ నొరసితేను కలఁగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గళమవును
నొరసి పెనఁగేచోట నుమ్మగిలు వలపు // అడు //
వొలసీనొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేచోట పంతమురాదు
అలుకచూపేచోట అమరదు వినయము
చలివాసివుండేచోట చండిపడుఁ బనులు // అడు //
ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాఁడు వేంకటేశుఁడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారుఁ గోర్కులు // అడు //
అడుగవయ్యా వరములాపె నేమైనా నీవు
బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు
చెలయపేరే నీకు సేసే జపమంతములు
కలసేటి సన్నలే యంగన్యాసాలు
ములువాడి కొనగోరి మోపులే నానాముద్రలు
ఫలియించెదపమాపె ప్రత్యక్షమాయ నీకు // అడుగవయ్యా //
ఆపెపైజల్లేవలపదే తర్పణజలము
దీపించు నవ్వు పాయస దివ్యహోమము
దాపగు నీయథరామృతమే మంచిభోజనము
నీపాలబ్రత్యక్షమాయ నెలతె యిదె నీకు // అడుగవయ్యా //
పొందులకాగిటి రతి పురశ్చరణ ఫలము
అందియాపె చక్కని రూపది యంత్రము
యిందునె శ్రీవేంకటేశ యిటు నన్నుగూడితివి
అందమై ప్రత్యక్షమాయ నప్పటిదానె నీకు // అడుగవయ్యా //
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదు యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము
పాలజలనిధిలోన (బవళించేరూపము
కాల సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము
ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని
బ్రణుతించువారువో బ్రాహ్మలు // పల్లవి //
హరినామములనె సంధ్యాదివిధు లొనరించు
పరిపూర్ణమతులువో బ్రాహ్మలు
హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి
పరులైన వారువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
ఏవిచూచినను హరి యిన్నిటా గలడనుచు
భావించువారువో బ్రాహ్మలు
దేవకీనందనుడె దేవుడని మతిదెలియు
పావనులు వారువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
ఆదినారాయణుని ననయంబు దమయాత్మ
బాదుకొలిపనవారు బ్రాహ్మలు
వేదరక్షకుడైన వేంకటగిరీశ్వరుని
పాదసేవకులువో బ్రాహ్మలు // అణురేణుపరిపూర్ణుడైన //
అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
పతి యుండఁగ భయపడఁ జోటేది // పల్లవి //
అనంతకరము లనంతాయుధము –
లనంతుఁడు ధరించెలరఁగను
కనుఁగొని శరణాగతులకు మనకును
పనివడి యిఁక భయపడఁజోటేది // అతఁడే //
ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుఁడై యలరఁగను
నరహరికరుణే నమ్మినవారికి
పరఁదున నిఁక భయపడఁజోటేది // అతఁడే //
శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
నావల నీవల నలరఁగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపఁగ భయపడఁజోటేది // అతఁడే //
అతడు భక్తసులభు డచ్యుతుడు
రాతిగుండెవాడు గాడు రంతు మాను డికను
జీవుడా వేసరకు చిత్తమా జడియకు
దైవము గరుణించ దడవుగాదు
తోవచూపె మనకుతొల్లే ఆచార్యుడు
కావలసినట్లయ్యీ గలగకు డికను // అతడు భక్తసులభు //
కాలమా వేగిరించకు కర్మమా నన్ను మీరకు
పాలించ దైవానకు నే భార మికను
ఆలించి తిరుమంత్రమే ఆతని నన్ను గూరిచె
వేలగానిఅందాకా వేసరకు డికను // అతడు భక్తసులభు //
వెరవకు దేహమా వేసరకు ధ్యానమా
యెరిగి శ్రీవేంకటేశు డెడసిపోడు
తరి నిహపరము లితనిదాసు లిచ్చిరి
గురియైతి నిన్నిటికి గొంకకుడీ ఇకను // అతడు భక్తసులభు //
అతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటి క్రిశ్ణుడీతడే కాడుగదా ||
కందువ దేవకి బిడ్డగనె నట నడురేయి
అందియ్శోదకు గొడుకైనాడుట
నందడించి పూతకిచంటి పాలుదాగెనట
మందల ఆవులగాచి మలసెనట // అతడెవ్వాడు //
మంచిబండి దన్నెనట ముద్దులు విరిచెనట
ఇంచుకంతవేల గొండయెత్తి నాడుట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల బిల్ల గోలివట్టి మెరసెనట // అతడెవ్వాడు //
కాళింగుని మెట్టెనట కంసుబొరిగొనెనట
పాలించి సురల జేపట్టెనట
యీలీల వేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారు వేలింతుల నిందరిని // అతడెవ్వాడు //
ప. అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా
చ|| కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా?
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమర వంద్యుడు మాహరికే కాక
చ|| అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన శ్రీభాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికే(కి) గాక
చ|| నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక
అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు
అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో
కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు
వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా
మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన
తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో // అతడే యెరుగును //
తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు
పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై
పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే
విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో // అతడే యెరుగును //
అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని
పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత
గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు
ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో // అతడే యెరుగును //
అతడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది.
యెందును జూచిన యీశ్వరుడుండగ
విందుల మనసుకు వెలితేది
సందడించేహరిచైతన్య మిదివో
కందువలిక వెదకగ నేది.
అంతరాత్ముడై హరి పొడచూపగ
పంతపుకర్శపుభయ మేది
సంతత మాతడే స్వతంత్రుడిదివో
కొంత గొంత మరి కోరేది లేదు,
శ్రీ వేంకటపతి జీవుని నేలగ
యీవల సందేహ మిక నేది
భావం బీతడు ప్రపంచ మీతడు
వేవేలుగ మరి వెదకెడిదేది.
అతని కొక్కతెవే వాలు నైతివా
సతులందరును నీసాటివారే కారా ||
గాదె బోసుకొనే వేమే గంపముంచి వలపులు
పోదిసేసి రమణుని పొంతనీవుండి
పాదుసేసి విత్తేవేమే పద నుతోనీసిగ్గులు
అదిగొని చన్నులు పయ్యద గప్పికప్పి ||
నెదజల్లేవేమే వెన్నెలవంటి నవ్వులు
కొదదీర నీతని కొలువునను
తుద బచరించేవేమే తొంగి తొంగినీ చూపులు
చెదరిన నీ కొప్పు చేత దెట్టుకొంటాను ||
వొడిగట్టు కొనేవేమే వుబ్బరి సంతోసాలు
కడగి శ్రీవేంకటేశు కౌగిటగూడి
నడుమ నీవది యేమే నన్ను నీతండిపుడేలె
అడరియలమేల్మంగనౌతనీ వెఅగవానీ ||
అతని గూడినప్పుడే అన్నియు సాధించవమ్మా
రాతిరాయ నికనైన రమ్మనవమ్మా
అంపినమాట కుత్తర మానతియ్యవమ్మా
వంపుమోముతో నలుక వలదమ్మా
పంపుడు చెలులమిదే పలుక విదేమమ్మా
చెంప జారిన తురుము చెరుగుకోవమ్మా
తమకించే పతితో నీతలపు లేమందుమమ్మా
కొమరు చూపుల లోన కోపమేలమ్మా
జమళినిద్దరి గూడి గములవారమమ్మా
చెమరించె మేనెల్లా చిన్నబోకువమ్మా
యెదురుగా వచ్చు నాతడిట్టె మమ్మంపవమ్మా
కదిసితి వికనీకు కడుమేలమ్మా
యెదుట శ్రీవేంకటేశు డేగివచ్చి నిన్నుగూడె
వదలడు దినమిట్టె వచ్చీ నోయమ్మా
అతని దోడితెచ్చినందాకా
హిత బుద్దుల చెలియేమరకు మీ ||
వెలది విరహముల వేసవికాలమిది
యెలమి మోవి చిగురెండనీకు మీ
కలికి నిట్టూర్పుల గాలికాద మదె
తేలివలపుపదని తియ్యనీకుమీ ||
వనిత పెంజెమట వానకాల మదె
మొనపులకననలు ముంచనీకిమీ
మనవుల సిగ్గుల ముంచుగాలమదె
ఘనకుచగిరులను గప్పనీకు మీ ||
వెసగాంత నవ్వు వెన్నెల కాలము
ససి గొప్పు చీకటి జారనీకు మీ
పసగా శ్రీవేంకటపతి విచ్చెసి కూడె
వసంతకాల మిదె వదలనీకు మీ ||
అతని పాడెదను అది వ్రతము
చతురుని శేషాచల నివాసుని // పల్లవి //
సనకాదులు ఏ సర్వేశు గొలిచిరి
అనిశము శుకుడెవ్వని దలచె
మును ధ్రువు డేదేవుని సన్నుతించె
ఘన నారదు డేఘనుని పొగడెను // అతని పాడెదను //
ఎలమి విభీషణు డేదేవుని శరణని
తలచె భీష్ముడే దైవమును
బలు ప్రహ్లాదుని ప్రాణేశు డెవ్వడు
ఇలలో వశిష్ఠు డేమూర్తి దెలిసె // అతని పాడెదను //
పురిగొని వ్యాసు డేపురుషుని చెప్పెను
తిరముగ అర్జునుని దిక్కెవ్వడు
మరిగిన అలమేలమంగపతి ఎవ్వడు
గరిమల శ్రీవేంకటేశు డీతడు // అతని పాడెదను //
అతనికెట్ల సతమైతినో కడు
హితవో పొందులహితవో యెఱగ // పల్లవి //
హృదయము తలపున నిరవయినగదా
పదిలమౌను లోపలిమాట
వెదకినచిత్తము వెర వెఱుగదు నే
నెదిరి నెఱగ నే నేమియు నెఱగ // అతనికెట్ల //
కాలూద మనసుగలిగినకదా నా
తాలిమి మతిలో దగులౌట
మేలిమిపతితో మెలగుటేదో నే
నేలో నే నిపుడెక్కడో యెఱగ // అతనికెట్ల //
నేడని రేపని నే నెఱిగికదా
పోడిమి మతిలో పొలుపౌట
వాడే వేంకటేశ్వరుడు రాగలిగె
ఆడుజన్మ మేనౌటిది యెఱగ // అతనికెట్ల //
అతను సంపద కంటెన సదా చెలిరూపు
మతి చింత చేత వేమరు నలగె గాక // పల్లవి //
తగు జందురుని నణచ దగదా చెలిమోము
వగలచే నొకయింత వాడెగాక
పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు
జగడమున బతి బాసి సన్నగిలె గాక // అతను సంపద //
కదలు గందపు గాలి గావదా చెలియూర్పు
కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక
కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము
చెదరి మరు బాణముల చేజాఱె గాక // అతను సంపద //
లీల బన్నీటికిని లేతా చెలి చెమట
లోలి బూబానుపున నుడికె గాక
యేల చిగురున కంటె నెరవా చెలి మోవి
గేళి వేంకట విభుడు గీలించెగాక // అతను సంపద //
అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి
మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను
సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి // అతి సులభం బిదె //
తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి // అతి సులభం బిదె //
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు
అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి // అతి సులభం బిదె //
అతిదుష్టుడ నే నలసుడను
యితరవివేకం బికనేల // పల్లవి //
ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ
నిక్కపుదప్పులు నేరములు
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది // అతిదుష్టుడ //
ఘోరపుబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినివి
నీరసునకు నిటు నీకృప నాకిక
కూరిమి నా యెడ గుణమేది // అతిదుష్టుడ //
యెఱిగి చేసినది యెఱుగక చేసిన
కొఱతలు నాయెడ గోటులివే
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మఱి యేది // అతిదుష్టుడ //
అతివ జవ్వనము రాయలకు బెట్టిన కోట
పతిమదన సుఖ్హరాజ్య భారంబు నిలువ ||
కంతకనుచూపు మేఘ్హంబులోపలి మెఋగు
కాంతుని మనంబు చీకటి వాపను
ఇంతిచక్కని వదన మిందుబింబము విభుని
వంత కనుదోయి కలువల జొక్కజేయు ||
అలివేణి ధమ్మిల్ల మంధకారపు భూమి
కలికి రమణునకు నేకతమొసగును
పొలతికి బాహువులు పూవు దీగల కొనలు
పొలసి ప్రాణేశు వలపుల లతల బెనచ ||
పంకజానన రూపు బంగారులో నిగ్గు
వేంకటేశ్వరు సిరులు వెదచల్లగా
చింకచూపుల చెలియచేత మదనునిచేత
యింకా నతనినె మోహించజేయగను ||
అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న
హితవు చేకొన నొల్లరిందరు
కడలేని విజ్ఞానగతికి దోడుగారు
యెడపులవారలె యిందరు
అడరిన మోక్ష సహాయు లెవ్వరు లేరు
ఇడుమపాట్ల వారె యిందరు // అతిశయమగు //
తిరమైన పుణ్యము బోధించేవారు లేరు
యెరవులవారే యిందరు
తిరువేంకటాచలాధిపుని మీదిచిత్త
మిరవు సేయక పోయిరిందరు // అతిశయమగు //
అతిశోభితేయం రాధా
సతతవిలాసవశా రాధా // పల్లవి //
దర్పకబలభోధా రాధా
తర్పణగంధవిధా రాధా
దర్పయుతక్రోధా రాధా
దర్పకరసవేధా రాధా // అతి //
తారితావరోధా రాధా
తారుణ్యోద్బోధా రాధా
ధారితానురోధా రాధా
దారితాపరాధా రాధా // అతి //
తరుణీమరుగాథా రాధా
ధరసమకుచబాధా రాధా
తరుణసదనుబోధా రాధా
ధరణిదుస్సాధా రాధా // అతి //
తనుభవగురుగాధా రాధా
స్తనకృతగిరిరోధా రాధా
తనువరవచనసుధా రాధా
ధ్వనిజితపికమేధా రాధా // అతి //
తరుణసఖీసవిధా రాధా
దరశశిరుచిసౌధా రాధా
తరళితతటిద్విధా రాధా
దరహసనవరోధా రాధా // అతి //
ధనగర్వనిషేధా రాధా
స్తవతత్పర విబుధా రాధా
ద్రవధునీకృతసుధా రాధా
దవమదనవ్యాధా రాధా // అతి //
తరుణత్వ పురోధా రాధా
తరుణస్మరయోధా రాధా
తరుపశుమణిగుణధారక బహుల వి
తరణపరా బహుధా రాధా
దైవికసుఖోపధా రాధా
ద్రావకనిజాభిధా రాధా
శ్రీవేంకటగిరిదేవకృపాము
ద్రావైభవ నాథా రాధా // అతి //
అతిసులభం బిది యందరిపాలికి
గతియిది శ్రీపతికైంకర్యంబు
పాలసముద్రము బలిమి దచ్చికొని-
రాలరిదేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము
యేల కానరో యిహపరము అతి||
అడరి బాతిపడి యవని దేవతలు
బడివాయరు యఙ్న భాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము
కడిగడియైనది కానరుగాని అతి||
యెక్కుదురు దిగుదు రేడులోకములు
పక్కన దపముల బడలుచును
చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరు
డిక్కడితుదిపద మెఱగరుగాని అతి||
అది నాయపరాధ మిది నాయపరాధ
మదియు నిదియు నాయపరాధము // పల్లవి //
నెరయ రూపములెల్ల నీరూపమేకా
నరయనియది నాయపరాధము
పరిపూర్ణుడగునిన్ను బరిచ్ఛిన్నునిగా
నరయుట యది నాయపరాధము // నెరయ //
జీవాత్మునిగా జింతింప దలచుట
యావంక నది నాయపరాధము
సేవించి నిను నాత్మ జింతింపకుండుట
ఆవల నిది నాయపరాధము // నెరయ //
ఈడెరగక వేంకటేశుడ నిను గొని
యాడుట యది నాయపరాధము
యేడ జూచిన నాయెదుర నుండగ నిన్ను
నాడనీడ వెదకుటపరాధము // నెరయ //
అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు
దుటు జీవులము వున్నారమిదివో // పల్లవి //
ఉదయాస్త మయము లొనరిన వలెనే
నిదురలు మేల్కను నిమయములు
కదిసి తిరిసంధ్యా కాలంబులవలె
గుదిగొను దేహికి గుణత్రయములు // అది బ్రహ్మాణ్డంబిది //
పుడమి సస్యములు పొదలిన వలెనే
వొడలి రోగములన్నవివే
ఉడుగని వెలుపటి వుద్యోగమువలె
కొడిసాగెడి మితి కోరికలు // అది బ్రహ్మాణ్డంబిది //
వెలుపలగల శ్రీ వేంకట విభుడే
కలడాతుమలో ఘనుడితడే
చలమున నీతని శరణాగతియే
ఫలమును భాగ్యము బహు సంపదలు // అది బ్రహ్మాణ్డంబిది //
అదిగాక నిజమతంబది గాక యాజకం
బదిగాక హృదయసుఖ మదిగాక పరము // పల్లవి //
అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు
నమరినది సంకల్పమను మహాపశువు
ప్రమదమను యూపగంబమున వికసింపించి
విమలేంద్రియాహుతులు వేల్పంగవలదా // అదిగాక //
అరయ నిర్మమకార మాచార్యుడై చెలగ
వరుసతో ధర్మదేవత బ్రహ్మ గాగ
దొరకొన్న శమదమాదులు దానధర్మ
భాస్వరగుణాదులు విప్రసమితి గావలదా // అదిగాక //
తిరువేంకటాచలాధిపు నిజధ్యానంబు
నరులకును సోమపానంబు గావలదా
పరగ నాతనికృపా పరిపూర్ణజలధిలో
నర్హులై యపబృథం బాడంగవలదా // అదిగాక //
అదిగాక సౌభాగ్యమదిగాక వలపు
అదిగాక సుఖ్హమింక నందరికి గలదా ||
ప్రాణవల్లభుని బెడబాసి మరుబాణముల
ప్రాణబాధల నెగులుపడుటేటి వలపే
ప్రాణేశ్వరుదు దన్ను బాయజూచిన యపుడు
ప్రాణంబు మేనిలో బాయంగవలదా ||
ఒద్దికై ప్రియునితో నొడగూడి యుండినపు
డిద్దరై విహరించు టిదియేటి వలపే
పొద్దుపోకలకు దమ పొలయలుకకూటముల
బుద్దిలో బరవశము పొందంగ వలదా ||
చిత్తంబులోపలను శ్రీ వేంకటేశ్వరుని
హత్తించి నాడుదాన ఈ యుండవలదా
కొత్తైన ఈటువంటి కొదలేని సంగతుల
తత్తరము మున్నడి తగులంగవలదా ||
అదిగో కొలువై వున్నాడు
అలమేలు మంగపతి
పదివేల విధములను
పారు పత్తెము చేయుచు
రంగ మండపములో
రత్న సింహాసనముపై
అంగనామణులతొ
అమరవేంచేసి
బంగారు పావడలు పసరించి యిరుగడల
శృంగారముగ సురలు సేవ సేయగను
వెండి పైడి గుదియలను నేత్రహస్తులు పొగడ
నిండు వెన్నెల పూల దండలు అమర
గుండిగలు కానుకలను పొనర లెక్కలు చేయ
దండిమీరగ నిపుడు దేవరాయడు చెలగి
అంగ రంగ వైభవముల రంగుగా చేకొనుచు
మంగళ హారతుల మహిమ వెలసీ
శృంగార మైనట్టిమా శ్రీవేంకటాధిపుడు
అంగనలు కొలువగాను యిపుడు వేంచేసి
అదినీకు దారుకాణము అవునో కాదోకాని
కదిసి చెప్పగబోతే కతలయ్యీగాని // పల్లవి //
కలలోన నీరూపు కన్నుల గన్నట్లయ్యీ
చెలగి ఆసుద్ది చెప్ప జింతయ్యీగాని
వెలయ నీపలుకులు వీనుల విన్నట్లయ్యీ
సెలవి గమ్మర జెప్ప సిగ్గయ్యీగాని // అదినీకు దారుకాణము //
మంతనాన నీతో మాటలాడి నట్లయ్యా
అంతట జూచితే వెరగయ్యీగాని
కంతు సమరతి నిన్ను గాగలించినట్లయ్యీ
పంతాన నేమనినాను పచ్చిదేరీగాని // అదినీకు దారుకాణము //
వరుస నీమోవితేనె చవిగొన్న అట్లనయీ
వొరసి చూపబోతే గోరొత్తీగాని
ఇరవయిన శ్రీ వేంకటేశ నీవు ద్రిష్టముగా
సరుగ గూడిన నదె చాలాయగాని // అదినీకు దారుకాణము //
అదినే నెఱగనా అంతలో భ్రమతు(గాక
మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే // పల్లవి //
యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము // అదినే నెఱగనా //
నానాదేశ వార్తలు జింతామూలము
పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము
ఆనినకృషివాణిజ్యాలన్నియు( దీరని వెట్టి
మానని యాచార మాత్మకు( బడ్దపాటు // అదినే నెఱగనా //
పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలగు నాచార్య సేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండు విధాలు
నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి // అదినే నెఱగనా //
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము॥
అదివో కనుగొను మది యొకతె
యెదుటనె నెలకొనె నిది యొకతె
తేటల మాటల తెరలదె కట్టీ
గాటుకకన్నుల కలికొకతె
జూటరిచూపులఁ జొక్కులు చల్లీ
నీటుగర్వముల నెలతొకతె
ముసిముసినవ్వుల మోపులుగట్టీ
రసికుడ నీపై రమణొకతె
కొసరుల కుచములఁ గోటలు వెట్టీ
మిసమిస మెఱుగుల మెలుతొకతె
కాయజకేలికి కందువ చెప్పీ
చాయలసన్నల సతి యొకతె
యీయెడ శ్రీవేంకటేశ కూడి నిను
వోయని మెచ్చీ నొకతొకతె
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు
యెదురులేనివారు యేకాంగవీరులు ॥పల్లవి॥
రచ్చల సంసారమనేరణరంగములోన
తచ్చి కామక్రోధాలతలలు గొట్టి
అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ
యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు ॥అది॥
మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి
తెరలి నడుములకు దెగవేసి
పొరి గర్మము బొడిచి పోటుగంటుల దూరి
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు ॥అది॥
వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి
చెడ్డయహంకారమును చెఱలు పట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు ॥అది॥
అదె చూడరే మోహన రూపం
పది కోట్లు గల భావజరూపం // పల్లవి //
వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహనరూపం
వలచిన నందవ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగురూపం // అదె చూడరే //
ఇందిరా వనితనెప్పుడు తనవుర
మందు నిలిపిన మోహనరూపం
కందువ భూసతి కాగిట సొంపుల
విందులు మరిగిన వేడుకరూపం // అదె చూడరే //
త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహనరూపం
కపురుల శ్రీ వేంకటపతియై ఇల
ఉపమించగ రాని వున్నతరూపం // అదె చూడరే //
ప|| అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు
చ1|| గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె
సరుసనే విష్ణుదేవచక్రమదే
మురవైరిపంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కారై పారరో దానవులు //పల్లవి//
చ2|| తెల్లని గొడుగులవె దేవదుందుభులునవె
యెల్లదేవతల రథాలింతటానవె
కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళాన బడరో దనుజులు //పల్లవి//
చ3|| వెండిపైడి గుదెలవె వెంజామరములవె
మెండగు కైవారాలు మించినవవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె
బడుబండై జజ్జరించి పారరో దైతేయులు //పల్లవి//
అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని
వెదకి వెదకి తిరువీధులందు దేవుడు // పల్లవి //
అలసూర్యవీధి నేగీ నాదిత్యునితేరిమిద
కలికికమలానందకరుడుగాన
తలపోసి అదియును దవ్వు చుట్టరికమని
యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు // అదె వాడె యిదె //
చక్క సోమవీధి నేగీ జందురునితేరిమీద
యెక్కువైనకువలయహితుడుగాన
చుక్కలుమోచినదవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు // అదె వాడె యిదె //
యింతులమనోవీధి నేగీ మరుతేరిమీద
నంతటా రతిప్రియు డటుగాన
రంతుల నదియు గానరానిచుట్టరికమని
వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు // అదె వాడె యిదె //
అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు
యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో // పల్లవి //
“అనాయుధాసో అసురా అదేవా” యని
వినోదముగ ఋగ్వేదముదెలిపెడి
సనాతనము విష్ణుచక్రధారునకును
అనాది ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
“యచ్చ యింద్రే” యని “యచ్చ సూర్యే” యని
అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి
ముచ్చట గోవిందుని ముద్రధారణకు
అచ్చమయిన ప్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
మును “నేమినా తప్త ముద్రాం ధారయే” త్తని
వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని
మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు
అనువుగ బ్రమాణమందే తెలియరో // అదె శిరశ్చక్రములేనట్టిదేవర //
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును
కదిసి యున్నారు తమకమున పెండ్లికిని
బాసికములు కట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబనాలు పాడరో
మోసపోక యిట్టే ముహూర్తమడుగరో
గక్కునను మంగలాష్టకములు చదువురో
తక్కట జేగట (జేగంట?) వేసి తప్పకుండాను
నిక్కినిక్కి చూచేరదె నెరి(దెర తీయరో
వొక్కటైరి కొంగుముళ్ళు వొనరగ వేయరో
కంకణ దారములను కట్టరో యిద్దరికిని
సుంకుల పెండ్లిపీట కూర్చుండబెట్టరో
లంకె శ్రీవేంకటేశు నలమేల్ మంగను దీవించి
అంకెల పానుపుమీద అమరించరో
అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము
లందు వెలుగొందీ ప్రభమీరగాను // పల్లవి //
తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల
స్థానికులును చక్రవర్తిపీఠకమలములును
అగణితంబైన దేశాంత్రులమఠంబులును
నధికమై చెలువొందగాను
మిగులనున్నతములగుమేడలును మాడుగులు
మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును
వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు
దిగువ తిరుపతి గడవగాను // అదెచూడు //
పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది
పదినొండుయోజనంబులపరపునను బరగి
చెదర కేవంకచూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడగంధర్వయక్షులును విద్యాధరులు
విదితమై విహరించువిశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను // అదెచూడు //
యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద
అకజంబైన పల్లవరాయనిమటము
అల్లయేట్ల పేడ గడవన్
చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద
నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
అంతంత గానరాగాను // అదెచూడు //
బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల
నీడలను నిలిచి నిలిచి
గగనంబుదాకి శృంగార రసభరితమై
కనకమయమైన గోపురములను జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గలనగరు
సరుగనను గానరాగాను // అదెచూడు //
ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగుదురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోకిన భవము
లంతంత వీడి పారగను
యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని
యేప్రొద్దు విహరించగాను // అదెచూడు //
అద్దిగా వోయయ్య నే నంతవాడనా! వొక
కొద్ది నీదాసులసేవ కోరగలగాక
హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమ పదాన కానపడుటయు ద్రోహము
సొరిది నీభండారము సొమ్ముగనక
పంచేద్రియముల నే బారదోలేవాడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నావిజ్ఞాన మది దహించవచ్చునా
నించి నీవు పాతినట్టినిధాన మది
వొట్టి సంసారపు మోపు నోపననేవాడనా
వెట్టి మమ్ము జేయించేటివేడుక నీది
గట్టిగా శృఈవేంకటేశ కదిసి నీశరణంటి
ఱట్టుగ నే జెప్పేనా మీఱగ నీరహస్యము
అన నింకే మున్నది అలుగ నేమున్నది
కనుగొనలనే చూచి కరగుట గాక // పల్లవి //
నవ్వూ నవ్వా జెల్లును నాలి సెయ జెల్లు నీకు
రవ్వగా నే మోహించి రాపైన యందుకు
యెవ్వరితో దగవూ లిక నాడే నేను
జవ్వనాన నొంటి నేను జడియుట గాక // అన నింకే //
బిగియూ నమరునూ బీరాలు నమరునూ
తగవు లెంచక నిన్ను దగ్గరిన యందుకు
జగడమూ జెల్లదూ సాదించ జెల్లదూ
మొగమోటమున నేనే ములుగుట గాక // అన నింకే //
సరసము దక్కెనూ చనవెలా నెక్కెనూ
మరగి నీ కౌగిట నేను మఱచిన యందుకు
తెరయెత్త బనిలేదు దిష్టము శ్రీ వేంకటేశ
సరుగ నీ రతిజిక్కి సత మౌట గాక // అన నింకే //
అనంతమహిముడవు అనంతశక్తివి నీవు
యెనలేనిదైవమా నిన్నేమని నుతింతును. // పల్లవి //
అన్నిలోకములు నీయందు నున్న వందురు నీ
వున్న లోక మిట్టిదని వూహించరాదు
యెన్న నీవు రక్షకుడ విందరిపాలిటికి
నిన్ను రక్షించేటివారి నేనెవ్వరి నందును. // అనంతమహిముడవు //
తల్లివి దండ్రివి నీవు తగుబ్రహ్మాదులకు
యెల్లగా నీతల్లిదండ్రులెవ్వరందును
యిల్లిదె వరములు నీ విత్తువిందరికిని
చెల్లబో నీకొకదాత చెప్పగ జోటేది. // అనంతమహిముడవు //
జూవుల కేలికవు శ్రీవేంకటేశుడవు నీ_
వేవల జూచిన నీ కేయేలికే లేడు
వేవేలు మునులును వెదకేరు నిన్నును
నీ వెవ్వరి వెదకేవు నిర్మలమూరితివి. // అనంతమహిముడవు //
అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు // పల్లవి //
ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా // అనరాదు //
తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా // అనరాదు //
కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోగా
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము // అనరాదు //
అనాది జగమునకౌ భళము
అనేకాద్భుతంబౌ భళము // పల్లవి //
హరి నివాస మీయౌ భళము
అరిది పరమ పదమౌ భళము
అరిదైత్యాంతకమౌ భళము
హరముఖ సేవితమౌ భళము // అనాది //
అమలరమాకరమౌ భళము
అమితమునీంద్రంబౌ భళము
అమరవందితంబౌ భళము
అమరె బుణ్యములనౌ భళము // అనాది //
అగరాజంబీ యౌ భళము
అగణిత తీర్థంబౌ భళము
తగు శ్రీవేంకట ధామ విహారం
బగు శుభాంచితంబౌ భళము // అనాది //
అనాది జగములు అనాది దేవుడు
వినోదములు గని విసుకదు మాయ
పుట్టేటి జీవులు పోయిన జీవులు
(పు)వొట్టిన జీవులు ఉన్నారు
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
తెట్టా( దెరువుననె తేగడు కాలము
కలడు బ్రహ్మయును కలరింద్రాదులు
కలవనేకములు కార్యములు
ఫలభోగంబులు పైపైనున్నవి
కలియు( గర్మము (గడవగ లేదూ
శ్రీవేంకటేశుడు చిత్తములో వేడె
భావము లోపల భక్తి యిదే
భావించి బ్రతుకుట ప్రపన్నులు వీరిదె
యేవల జూచిన యిహమే పరము
అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా // పల్లవి //
భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటిదేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటిదేవుఁడ నేను // అని //
దీపనాగ్నినై జీవదేహములయన్నములు
తీపుల నరగించేటిదేవుఁడ నేను
యేపున నిందరిలోనిహృదయములోన నుందు
దీపింతుఁ దలఁపుమరపై దేవుఁడ నేను // అని //
వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే
ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను
శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుడఁను భావించ నేను // అని //
అని రావణుతల లట్టలు బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ది // పల్లవి //
కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్లతల లదే
కట్టిడిరావణ గతియో నీకు // అని రావణుతల //
యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగినచెరయెల్ల
పక్కన సీతకు బరిణామమాయ
నిక్కము రావణ నీకో బ్రదుకు // అని రావణుతల //
పరగ విభీషణు బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరి రాముడు
మెరసెను రావణ మేలాయ బనులు // అని రావణుతల //
అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబిలం // పల్లవి //
హరి నిజనిలయం అహోబలం
హరివిరించి నుత మహోబలం
అరుణ మణి శిఖర మహోబలం
అరిదైత్యహరణ మహోబలం // అనిశము //
అతిశయ శుభదం అహోబలం
అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం
యతి మత సిద్ధం అహోబలం // అనిశము //
అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకుల రాజం అహోబలం // అనిశము //
అనుచు దేవ గంధర్వాదులు పలికేరు
కనక కశిపు నీవు ఖండించేవేళను
నరసింహా నరసింహా ననుగావు ననుగావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరిరక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ము కృపను
దేవదేవ వాసుదేవ దిక్కు నీవే మాకు మాకు
శ్రీవక్ష శ్రీవక్ష సేవకులము
భూవనిత నాథ నాథ పొడమె నీప్రతాపము
పావన పావన మమ్ము పాలించవే
జయ జయ గోవింద శరణుచొచ్చేము నీకు
భయహర భయహర పాపమడగె
దయతో శ్రీవేంకటేశ తగిలి కాచితి మమ్ము
దయజూడు దయజూడు దాసులము నేము
అనుచు నిద్దరునాడే రమడవలెనే
మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు // పల్లవి //
రాముడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందరా కృష్ణుడా // అనుచు //
యెక్కిన పుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కున బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి
అక్కతో జెప్పేగాని అందుకొనే రారా // అనుచు //
యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీ వింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయితే
యివ్వల నీకంటే బెద్ద యిది నీ వెఱగవా // అనుచు //
అనుచు మునులు ఋషు లంతనింత నాడఁగాను
వినియు విననియట్టె వీడె యాడీఁగాని // పల్లవి //
ముకుందుఁ డితఁడు మురహరుఁ డితఁడు
అకటా నందునికొడుకాయఁగాని
శకుంతగమనుఁ డితఁడు సర్వేశుఁ డితఁడు
వెకలి రేపల్లెవీధి విహరించీఁగాని // అను //
వేదమూరితి ఇతఁడు విష్ణుదేవుఁ డితఁడు
కాదనలేక పసులఁ గాచీఁగాని
ఆదిమూల మితఁడు యమరవంద్యుఁ డితఁడు
గాదిలిచేఁతల రోలఁ గట్టువడెఁగాని // అను //
పరమాత్ముఁ డితఁడే బాలుఁడై వున్నాఁడుగాని
హరి యీతఁడే వెన్నముచ్చాయఁగాని
పరగ శ్రీవేంకటాద్రిపతియును నీతఁడె
తిరమై గొల్లెతలచేఁ దిట్టువడీఁగాని // అను //
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా // పల్లవి //
అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు
అదివో పైఁడిమేడలహరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరము లిచ్చె నిందిరానాథుఁడు // అను //
అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్లసంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు // అను //
అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్‍మంగ
అదివో నిత్య శూరులు ఆళువారలు
నిదులశేషాచలము నిక్కి పైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు // అను //
అనుమానపుబ్రదుకు కది రోతా తన
మనసెనయనికూటమి మరి రోతా // పల్లవి //
అపకీర్తులబడి ఆడికెలోనై
అపవాదియౌట అది రోత
వుపమ గెలిచెనని వొరు జెరుచుటలు
విపరీతపుగుణ విధమొక రోతా // అనుమానపుబ్రదుకు //
తనగుట్టెల్లా నెరిగిన వారలముందట
తనయెమ్మెలు చెప్పుకొనుట రోత
వనితలముందట వదరుచు వదరుచు
కనుగవ గావనిగర్వము రోత // అనుమానపుబ్రదుకు //
భువి హరిగతియని బుద్ధిదలంచని
యవమానపుమన నది రోత
భవసంహరుడై పరగు వేంకటపతి
నవిరళముగ గొలువని దది రోత // అనుమానపుబ్రదుకు //
అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
వన్నెల నప్పులు గొన్న వారువో వీరు // పల్లవి //
తెగనీక అప్పులెల్లా దీసి తీసి వారు
తగిలిన బెట్టలేక దాగిదాగి
వెగటున బారిపోగా వెంట వెంట పెక్కు
వగల నప్పులు గొన్న వారువో వీరు // అన్నలంటా //
సేయరాని పనులెల్ల చేసి చేసి తమ
రాయడికి లోలోనె రాసి రాసి
కాయములో చొచ్చి చొచ్చి కాచి కాచి మున్ను
వ్రాయని పత్రాలకాగే వారువో వీరు // అన్నలంటా //
దొరయై యప్పుల వారి దోసి తోసి యీ
పరిభవములనెల్ల బాసి పాసి
సిరుల వేంకటపతి జేరి చేరి యిట్టి
వరుసనే గెలిచిన వారువో వీరు // అన్నలంటా //
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
అన్నిచోట్ల బరమాత్మవు నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా // పల్లవి //
పాలజలధి నుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలో బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యలరూపై విచ్చేతుగా // అన్నిచోట్ల //
వుత్తరమధురలో నయోధ్యలోపల నుండి
సత్తైననందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయగను// అన్నిచోట్ల //
కైవల్యమున నుండి కమలజలోకాన
మోవగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా // అన్నిచోట్ల //
అన్నిజాతులు దానెయైవున్నది
కన్నుల కలికి మాయగరచెనోయనగ ||
కన్నె శంకిణిజాతిగాబోలు వీపునను
సన్నపుమదనాంకములు జడిగొన్నవి
వన్నెలుగ వలరాజు వలపు తలకెక్కించ
పన్నినటువంటి సోపానములో యనగా ||
తెఅవ దలపోయ చిత్తిణిజాతి గాబోలు
నెఋలు విచ్చుచు వీధి నిలుచున్నది
నెఅతనము మరుడు తనునిండనేసిన యంప
గరులిన్ని యనుచు రెక్కలు వెట్టుగతిని ||
కాంత హస్తిణిజాతి గాబోలు కరమూలము
లంతకంతకు నలుపులై యున్నవి
పమ్తంపు మరుడు తన భండార మిండ్లకును
దొంతిగా నిదిన కస్తూరి ముద్రలనగా ||
ఘనత పద్మిణిజాతి గాబోలు నీ లలన
తనువెల్ల పద్మ గంధంబైనది
మినుకుగా మరుడు తామెర లమ్ములనె మేను
కనలించి వడి బువ్వగట్టెనో యనగా ||
ఇదియు జగదేక మొహిణి దానె కాబోలు
కదలు కనుగవకెంపు గతిగున్నది
చెదరి చెలికనుగొనల జిందెనోయనగా ||
అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి // పల్లవి //
ఏకాంతంబున నుండినపతివి యెనసిరమించుటే సతిధర్మంబు
లోకమురచ్చలోనుండినపతి లోగొని పైకొనరానట్లు
యీకొలదులనే సర్వదేవతలయిన్నిరూపులై నీవున్నప్పుడు
కైకొని నిను బహుముఖముల గొలుచుట గాదు పతివ్రత ధర్మంబు // అన్నిట //
పూనినబ్రాహ్మాణులలోపలనే నిను బూజించుట వేదోక్తధర్మము
శ్వానకుక్కుటాదులలోపల నిను సరి బూజించగరానట్లు
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగతజనులను
కానక, వొక్కట సరిగాజూచుట కాద వివేకధర్మంబు // అన్నిట //
శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము
ఆవలనీవల నితరమార్గముల యాత్మలోన రుచిగానట్లు
భావింపగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము
కైవశమై యిన్నిటా వెనుతగులు కాద వివేకధర్మంబు // అన్నిట //
అన్నిట నేరుపరిగా అలమేలు మంగ నీకు
చిన్నచిన్న ముద్దులనే విడిపించెను // పల్లవి //
చనవు మెరసి నిన్ను సారెసారె చేరుకుని
మనసు దనియ నాపె మాటలాడెను
కనుసన్న చూపులనె కప్పుర విడెములిచ్చె
దనువు దనియ నీపై తలబాలు వోసెను // చనవు //
పన్నుగడ తొడనే పానుపు చేరువనే
కన్నులు దనియగ దగ్గర నిలచెను
మన్ననలు దైవార మచ్చికలు పెడరేచి
విన్నవీనుల దనియ విన్నపాలు సేసెను // చనవు //
మాగిన మోవి యిచ్చి మనసు గరచి యిట్టే
కౌగిలి దనియ నీకు కప్పె పయ్యెద
వీగక శ్రీ వేంకటేశు వెలది గూడితివిట్టె
రాగి వయసి దనియ రతి కేళి సేసెను // చనవు //
అన్నిటా జాణ వౌదువు ఓభళేశ్వర
యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము // పల్లవి //
మరు గొండలపైన నుండి మగువ బాయగ లేక
కోరివచ్చితి విందిర గుడిలోనికి
ఆరితేరిన దేవుడ వగ్గళ్ళురుకుదురా
యేరీతి వారికైనా నిట్టుండు మోహము // అన్నిటా //
నడుమను భవనాశినిది వారుచుండగాను
కడు దాటి వచ్చితివి కాంతయింటికి
వడి బారగానేరీది వత్తురా సాహసమున
యెడయ కెవ్వరికైనా నిట్టుండు మోహము // అన్నిటా //
అన్నిటా జాణడు అలమేలుమంగపతి
పన్ని నీకు మేలువాడై పరగివున్నాడు
పట్టినదే పంతమా పతితోడ నీకిప్పుడు
యిట్టె నిన్ను వేడుకోగా నియ్యకోరాదా
వొట్టి యప్పటినుండి నీవొడి వట్టుకొన్నవాడు
గట్టువాయ తనమేల కరగవే మనసు
చలములే సాదింతురా సారెసారెనాతనితో
బలిమి బిలువగాను పలుకరాదా
కలపుకోలు సేసుక కాగిలించుకున్నవాడు
పులుచుదనములేల పెనగవే రతిని
చేరి ఇట్టె బిగుతురా శ్రీవేంకటేశ్వరునితో
మేరతో నిన్నేలగాను మెచ్చగరాదా
యీరీతి నిన్ను పెండ్లాడె యెడయెక వున్నవాడు
వీరిడితనకులేల వెలయవే మరిగి
అన్నిటా నాపాలిటికి హరి యాతడే కలడు
యెన్నికగా దుధిపద మెక్కితిమి మేలు // పల్లవి //
కొందరు జీవులు నన్ను గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్ను బొగడినా మేలు // అన్నిటా //
కోరి నన్ను బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుడని భావించినా మేలు
కూరిమి గోదరు నన్ను గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు // అన్నిటా //
యిప్పటికిగలపాటి యెంతపేదయినా మేలు
వుప్పతిల్లుసంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కేనిచ్చినజన్మ మిది
తప్పు లే దాతనితోడితగులమే మేలు // అన్నిటా //
అన్నిటా నేరుపరి హనుమంతుడు
పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు // పల్లవి //
ముట్టిన ప్రతాపపు రాముని సేనలోన
అట్టె బిరుదు బంటు హనుమంతుడు
చుట్టిరానుండినట్టి సుగ్రీవు ప్రధానులలో
గట్టియైనలావరి చొక్కవు హనుమంతుడు // అన్నిటా //
వదలక కూడినట్టి వనచర బలములో
నదె యేకాంగ వీరుడు హనుమంతుడు
చెదరక కుంభకర్ణు చేతి శూల మందరిలో
సదరాన విరిచె భీషణ హనుమంతుడు // అన్నిటా //
త్రిజగముల లోపల దేవతా సంఘములోన
అజుని పట్టాన నిలిచె హనుమంతుడు
విజయనగరాన శ్రీ వేంకటేశు సేవకుడై
భుజబలుడై యున్నాడిపుడు హనుమంతుడు // అన్నిటా //
అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు // పల్లవి //
పడాతి మోహరసము పన్నీటి మజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుద కన్ను చూపులు నించిన తట్టు పునుగు
తొడిబడ సులభాన దొరకె నీకిపుడు // పడాతి //
కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటి మాటల విందు ధూప దీప నైవేద్యాలు
కామించి నటువలెనె కలిగె నీకిపుడు // పడాతి //
అలమేలుమంగ నవ్వులంగపు నవ్వు దండలు
కలసి వురాన నీకే కట్టిన తాళి
చలపట్టి యీకె రతి సకల సంపదలు
యిలవచ్చె శ్రీవేంకటేశ నీకు నిపుడు // పడాతి //
అన్నిటా శాంతుడైతే హరిదాసుడు దానే
సన్నుతి దానేపో సర్వదేవమయుడు // పల్లవి //
అత్తల మనసు యింద్రియాధీనమైతేను
చిత్తజుడనెడివాడు జీవుడు దానే
కొత్తగా తనమనసే కోపాన కాధీనమైతే
తత్తరపు రుద్రుడును దానే తానే // అన్నిటా //
భావము వుద్యోగములప్రపంచాధీనమైతే
జీవుడు బ్రహ్మాంశమై చెలగు దానే
కావిరి రేయిబగలు కన్నుల కాధీనమైతే
ఆవల జంద్రసూర్యాత్మకుడుదానే // అన్నిటా //
కోరిక దనబ్రదుకు గురువాక్యాధీనమైతే
మోరతోపులేని నిత్యముక్తుడు దానే
ఆరయ శ్రీవేంకటేశు డాతుమ ఆధీనమైతే
ధారుణిలో దివ్యయోగి తానే తానే // అన్నిటా //
అన్నిటా శ్రీహరిదాసుడగువానికి
కొన్నిదైవముల గొలువగ దగునా // పల్లవి //
విహితకర్మముసేసి వెదకేటిహరి నిట్టె
సహజమై కొలచేతిసరసునికి
గహనపుగర్మాలు కడమలైన నేమి
మహి గనకాద్రికి మరి పైడి వలెనా // అన్నిటా //
పలుదానములకెల్ల బలమైనహరి నిట్టె
బలువుగ జేకొన్న భక్తునికిని
నెలకొని యాత డన్నియును జేసినవాడె
తెలిసి సూర్యుని జూడ దీపాలు వలెనా // అన్నిటా //
వేదవేద్యుడు శ్రీవేంకటపతి రామ
మాదిగా బఠియించే యధికునికి
ఆదైవచదువులు అఱచేతి వతనికి
మేదిని దిరుగాడ మెట్లు వలెనా // అన్నిటా //
అన్నిటాను హరిదాసు లధికులు
కన్నులవంటివారు కమలజాదులకు // పల్లవి //
అందరును సమమైతే నరుహానరుహము లేదా
అందరిలో హరియైతే నౌగాక
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే
పొందుగానిశునకము బూజింపదగునా // అందరును //
అన్నిమతములు సరియైతేను వాసిలేదా
చెన్నగుబురాణాలు చెప్పుగాక
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు
సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా // అందరును //
గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు
చిక్కినకర్మములెల్లా జెలగెగాక
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు
యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా // అందరును //
అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది
మన్నించునాతనికంటే మఱి లేరు దొరలు // పల్లవి //
తగుబ్రహ్మలోకముదాకా నెక్కిచూచిన
మగుడ బుట్టేలోకాలే మనుజులకు
తెగియిచ్చే యింద్రాదిదేవతలవరములు
యెగుఅదిగువలను యీసందివే // అన్నిటి //
మాయలోన బుట్టేది మాయలోన బెరిగేది
కాయదారులుకు నెల్లా గలిగినదే
నేయరానిపుణ్యమెల్లా జేసి గండించుకొనేది
చాయల బహురూప సంసారమే // అన్నిటి //
చెడనివై కుంఠ మిచ్చు జేటులేనిపరమిచ్చు
వెడమాయ బెడబాపు విష్ణు డీతడే
యెడయక శ్రీ వేంకటేశుడై వున్నాడు వీడె
జడియ కితడే కాచు శరణంటే జాలును // అన్నిటి //
అన్నిటికి నిదె పరమౌషధము
వెన్నుని నామము విమలౌషధము // పల్లవి //
చిత్త శాంతికిని శ్రీపతి నామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమోచనంబునకు
చిత్తజ గురుడే సిద్ధౌషధము // అన్నిటికి //
పరిపరి విధముల భవరోగములకు
హరి పాద జలమె యౌషధము
దురిత కర్మముల దొలగించుటకును
మురహరు పూజే ముఖ్యౌషధము // అన్నిటికి //
ఇల నిహ పరముల నిందిరా విభుని
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె
నిలిచిన మాకిది నిత్యౌషధము // అన్నిటికి //
అన్నిటికి నొడయుడవైనశ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలగ మెంచుకో మాపౌజు // పల్లవి //
జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపుకామక్రోధాలవర్గములారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌజు // అన్నిటికి //
తప్పని గుణాలు మూడు తనువికారములారు
అప్పటి మనోబుద్ద్యహంకారాలు
వుప్పతిల్లువిషయము లుడివోని వొకాయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌజు // అన్నిటికి //
ఆకలి దప్పియును మానావమానములును
సోకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు
మూకగమికాడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేకటారగడసేవా నెంచుకో మాపౌజు // అన్నిటికి //
అన్నియు నీతనిమూల మాతడే మాపలజిక్కె
కన్నుల మావేడుకకు కడయేది యికను // పల్లవి //
కామధేనువు గలిగితే గర్వించు నొక్కరుడు
భూమి యేలితే నొకడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకడు
శ్రీమంతుడగుహరి చిక్కె మాకు నిదివో // అన్నియు //
పరుసవేదిగలిగితే పంతములాడు నొకడు
ధర జింతామణబ్బితే దాటు నొకడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకడు
పరమాత్ముడే మాపాలజిక్కెనిదివో // అన్నియు //
అమృతపానముసేసి యానందించు నొకడు
భ్రమసు దేహసిద్ది బరగొకడు
తమి శ్రీవేంకటేశుడే దాచినధనమై మాకు
అమరి నామతి జిక్కె నడ్డాములే దిదివో // అన్నియు //
అన్నియును దన ఆచార్యాధీనము
చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా // పల్లవి //
దైవమా గొంచము గాడు తానూ గొంచము గాడు
భావించికొలచేవారిపరిపాటి
చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు
వావిరి బోగెత్తెటివారివారినేరుపు // అన్నియును //
కాలము కడమలేదు కర్మము కడమలేదు
కేలి విశ్వాసముగలిగినపాటి
వ్రాలకి ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు
పోలించేటివిద్వాంసులబుద్ధిలోనినేరుపు // అన్నియును //
జ్ఞానానకు దప్పు లెదు జన్మానకు దప్పు లేదు
నానాటికి వివేకించి నడచేపాటి
పానిపట్టి శ్రీవేంకటపతి యింతకు మూలము
ఆనుక యీతని శరణనేవారినేరుపు // అన్నియును //
అన్నియును నతనికృత్యములే
ఎన్నియైనా నవు నతడేమి సేసినను // పల్లవి //
అణురేణు పరిపూర్ణుడవలి మోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే // అన్నియును //
పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతే
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీదిచింత పాయక నిజంబైతే
నిరతి బట్టినవెల్లా నిధానములే // అన్నియును //
మదనగురునిసేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతిభక్తి గలిగితేను
తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే // అన్నియును //
అన్నియును హరినేనేయటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోచును // పల్లవి //
తిరుపై యవ్వలవ్వల దిరుగుచుండేటివేళ
దిరిగినట్ల నుండు దిక్కులెల్లాను
సిరులసంసారభ్రమ జిక్కినజీవునికిని
సరిగ నైహికము పరమై తోచు // అన్నియును //
సొగిసి యద్దమునీడ చూచినవేళ దనకు
మగుడ వేఱొకరూపు మతి దోచును
తగిలి యిట్లానేపో తనుదా నెఱగకున్న
నిగిడినపుట్టువులు నిజమై తోచు // అన్నియును //
కదిసినసకలాంధకార మంతటా గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపుశ్రీవేంకటేశుడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోచు // అన్నియును //
అన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి // పల్లవి //
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మినాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి // అన్నిరాసుల //
చిన్నిమకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు దులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి // అన్నిరాసుల //
ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమూల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కొమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి // అన్నిరాసుల //
అన్నివిభవముల అతడితడు
కన్నులువేవేలు గల ఘనుడితడు // పల్లవి //
వేదాంత కోటుల విభుడితడు
నాదబ్రహ్మపు నడుమితడు
ఆదియంత్యముల కరుదితడు
శ్రీదేవుడు సరసిజనాభుడితడు // పల్లవి //
భవములణచు యదుపతి యితడు
భువనము లన్నిటికి పొడ వితడు
దివికి దివమైన తిరమితడు
పవనసుతు నేలిన పతి యితడు // పల్లవి //
గరుడుని మీదటి ఘనుడితడు
సిరు లిందరి కిచ్చే చెలువితడు
తిరు వేంకట నగము దేవుడితడు
పరమ పదమునకు ప్రభువితడు // పల్లవి //
అపరాధిని నే నై నాను
కృపగలవారికిఁ గపటము లేదు // పల్లవి //
సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకలలోకేశ్వరా
నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా // అపరాధిని //
పురాణపురుషా పురుషోత్తమా
చరాచరాత్మక జగదీశా
పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
యిరవు నీవేయట యెఱిఁగించఁగదే // అపరాధిని //
దేవోత్తమా శశిదినకరనయనా
పావనచరితా పరమాత్మా
శ్రీవేంకటేశా జీవాంతరంగా
సేవకుఁడను బుధ్ధిచెప్పఁగవలయు // అపరాధిని //
అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె
పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె
యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట ఇటు చేసెననె
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నా వలెనె తాపమనె
మను కులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరి గంటిననె
అపురూపమైన మొహముదాచి యిటువంటి
కపటపు నటనలు గడించనేలే ||
కిన్నెర కాయలబోలు కిక్కిరిసినట్టి
చన్నులపై నునుగొంగు జారగా
కిన్నెరమీటుచు మంచి నన్నపునడపుతో
కన్నులు దేలగ మేను కదిలించేవేలే ||
౧। అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ।
౨। ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే
మూక మూడు విధము లాయరా – ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ।
౩। అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే
వొల్వలెల్ల మల్ల్యెలాయే – ఓ వేంకటేశా
దీనిభావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౪। అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా।
౫। పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే
పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
అందవచ్చు కోయరాదురా – ఓ వేంకటేశా।
౬। చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే
కాళ్ళులేని వాడు నడచే ఓ వేంకటేశా
పెదవిలేనివాడు చిలుక తినేరా ఓ వేంకటేశా।
౭। గుంట యెండి పండు పండే – పండుకోశి కుప్పవేశే
కుప్పకాలి యప్పు తీరేరా – ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౮। సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా!
తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ!
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ!
౯। ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ
ముక్కంటి దేవుని జూచేరు ఓ వేంకటేశా!
దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!
౧౦। ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౧। ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె
పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౨। ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఒ వేంకటేశా।
౧౩। పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా।
౧౪। అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని
నిద్రించిన నిన్ను పాడగ – ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా – ఓ వేంకటేశా।
తాళ్ళపాక పదసాహిత్యము సంపుటము ౨౭
శృంగార సంకీర్తనలు నుండి
అప్పటికప్పుడే కాక అంత యేటికి
యెప్పుడూ మనకు బోదు ఇందవయ్య విడెము // పల్లవి //
తక్కి మాటున నున్నంత తడవు నిను దూరితి
నిక్కిచూడ బోతేను నీవే నేను
కక్కసించనిక నిన్ను కడు నాసవెట్టకిక
యిక్కువలు గరగేను ఇందవయ్య విడెము // అప్పటికప్పుడే //
గుట్టుతో నూరకుండగా గుణము వెరపులాయ
నెట్టుకొని మాటాడితే నీవే నేను
పెట్టను రట్ల నిన్ను పెనగకుమిక నీవు
ఇట్టే నీమాటలు వింటి నిందవయ్య విడెము // అప్పటికప్పుడే //
అరయ దూరకున్నందు కటునిటు బిగిసితి
నేరిచి పొందు సేసితే నీవే నేను
కోరి శ్రీ వేంకటేశుడ కూడితి మిద్దరమును
యీరీతి బాయకుందము ఇందవయ్య విడెము // అప్పటికప్పుడే //
అప్పడు దైవాలరాయ డాదిమూలమీతడు
యిప్పు డిట్టిమహినుల నెక్కుడాయ నీతడు // పల్లవి //
చేకొని తొలికొలితే చేసినపన్నీరు కాపు
జోక గాలువలై సొరిది జార
సైకపునీలాద్రినుండి జలజలబారేటి
కేకలసెలయేరులరీతి నున్న దిదివో // అప్పడు //
తెప్పలుగా గుప్పినట్టితెల్లనికప్పురకాపు
చిప్పిలుచు వెన్నెలలై చిందగాను
పుప్పొడిదోగినకల్ప భూజము నిలుచున్న
చొప్పున నున్నాడిదివో సొంపులు మీరుచును // అప్పడు //
పొందుగ నంతటిమీద జూసినపునుగుకాపు
కందువ మాణిక్యముల గనియైనట్టు
అంది శ్రీవేంకటేశ్వరు కదె యలమేలుమంగ
చెంది యరత గట్టగా శ్రీవిభుడై నిలిచె // అప్పడు //
అప్పణిచ్చేనిదె నీకు ననుమానించకు మిక
చిప్పిల మోహించిన నీ చేతిలోని దానను // పల్లవి //
యెంత నవ్వినా మేలే యెరిగిన విభుడవు
చెంత నుండి మరియేమి సేసినా మేలే
యింతమాత్రమునకే యెగ్గులెంచ తప్పులెంచ
సంతోసాన నీకులోనై సమ్మతించే దానను // అప్పణిచ్చేనిదె //
అలయించినా మేలే ఆయము లెరుగుదువు
కొలువు యిట్టే సేయించు కొన్నామేలే
మలసిన మాత్రానకే మచ్చరించ నెచ్చరించ
చెలగుదు నీపాదాల సేవచేసేదానను // అప్పణిచ్చేనిదె //
చేరి కూడితివి మేలే శ్రీవేంకటేశుడవు
యీరీతి నలమేల్మంగ నేమన్నా మేలే
సారె యీమాత్రానకే జంకించ బొంకించ
మేరతో నుండుదు నిన్ను మెచ్చేటిదానను // అప్పణిచ్చేనిదె //
అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి
కప్పినదియు గప్పనిదియు గనుగొన గలనాడు
ఆపదలకు సంపదలకు నడ్డముచెప్పనినాడు
పాపములకు పుణ్యములకు బనిదొలగిననాడు
కోపములకు శాంతములకు గూటమి మానిననాడు
లోపల వెలుపల తనమతిలో దెలిసిననాడు
తనవారల బెరవారల దా దెలిసిననాడు
మనసున జైతన్యంబును మరపందిననాడు
పనివడి తిరువేంకగిరిపతి నీదాసులదాసుల
గనుగొని నీభావముగా గనువిచ్చిననాడు
అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా
కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా
విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా
వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా
అప్పులవారే అందరును
కప్పగ దిప్పగ గర్తలు వేరీ // పల్లవి //
ఎక్కడ చూచిన నీ ప్రపంచమున
జిక్కులు సిలుగులు జింతలునే
దిక్కెవ్వరు ఈతిదీపులలో
దిక్కుముక్కులకు దేవుడేగాక // అప్పులవారే //
ఏది తలంచిన నేకాలంబును
సూదుల మూటల సుఖము లివి
కాదన నౌనన గడ గనిపించగ
పోదికాడు తలపున గల డొకడే // అప్పులవారే //
ఎన్నడు వీడీ నెప్పుడు వాసీ
బన్నిన తమ తమ బంధములు
ఉన్నతి సేయగ వొప్పులు నెరపగ
వెన్నుడు వేంకట విభుడే కలడు // అప్పులవారే //
అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి //
కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు
చింతలేని యంబలొక్క చేరెడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని //
తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని //
లంపటపడని మేలు లవలేసమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపు గోరికకంటే రతి వేంకటపతి
పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //
అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు
దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
పుట్టు శంఖు చక్రముల( బుట్టిన యా శిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిసువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
నిండిన బండి తన్నిన చిన్ని శిశువు
అండవారి మదమెల్ల నణచిన శిశువు
కొండలంతేశసురుల( గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
వే(గైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌగిటి యిందిర దొలగని శిశువు
ఆగి పాలజలధిలో నందమైన పెను(బాము
తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి
అభయదాయకుడ వదె నీవేగతి
ఇభరక్షకా నన్నిపుడు కావవే || పల్లవి ||
భయహరదైత్యేయ భంజనకేశవ
జయజయ నృసింహ సర్వేశ్వరా
నియతము మాకిదె నీపాదములే గతి
క్రియగా మమ్మేలి కింకలుడుపవే ||అభయ||
బంధవిమోచన పాపవినాశన
సింధురవరదా శ్రితరక్షా
కంధర వర్ణుడ గతి నీనామమె
అంధకారముల నణచి మనుపవే ||అభయ||
దైవశిఖామణి తతచక్రాయుధ
శ్రీవేంకటగిరి శ్రీరమణా
సావధాన నీశరణ్యమే గతి
వేవేలకు నా విన్నపమిదియే ||అభయ||
అభయము అభయమో హరి నీవు
విభుడ వింతటికి వెర వికనేది // పల్లవి //
జడిగొని మదిలో శాంతము నిలువదు
కడుగడు దుస్సంగతి వలన
ఇడుమలేని సుఖ మించుక గానము
ఆడియాసల నా-యలమట వలన // అభయము //
తలపులోన నీ తత్వము నిలువదు
పలులంపటముల భ్రమ వలన
కలిగిన విజ్ఞాన గతియును దాగెను
వెలి విషయపు సిరివీకుల వలన // అభయము //
పక్కన పాపపు బంధము లూడెను
చిక్కక నిను దలచిన వలన
చిక్కులు వాసెను శ్రీ వేంకటపతి
నిక్కము నాకిదే నీ కృప వలన // అభయము //
అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు
గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు
ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు
అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు
అమరెగదె నేడు అన్ని సొబగులును
సమరతి చిన్నలు సతి నీమేన // పల్లవి //
చెలపల చెమటలు చెక్కిళ్ళ
మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొకిళ్ళ
తొలగని యాసలు తొక్కిళ్ళ // అమరెగదె నేడు //
నెరవగు చూపులు నిక్కిళ్ళ
మెఱసెను తమకము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ
తఱచగు వలపుల దక్కిళ్ళ // అమరెగదె నేడు //
ననుగోరికొనలు నొక్కిళ్ళ
పొనుగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట
ఎనసెను పంతము వెక్కిళ్ళ // అమరెగదె నేడు //
అమీదినిజసుఖ మరయలేము
పామరపుచాయలకే భ్రమసితిమయ్యా // పల్లవి //
మనసున బాలు దాగి మదియించివున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజము సేసుక
తనివోది యిందులోనే తడబడేమయ్యా // అమీదినిజసుఖ //
బొమ్మలాట నిజమటా బూచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేఅరైనట్టు
కిమ్ముల యీజన్మదు కిందుమీదు నేఱక
పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా // అమీదినిజసుఖ //
బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు
వీలి వెఱ్రివాడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడపితిమయ్యా // అమీదినిజసుఖ //
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ // పల్లవి //
నీరిలోన తల్లడించి నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ // అమ్మమ్మ ఏమమ్మ //
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా // అమ్మమ్మ ఏమమ్మ //
చక్కదనములె పెంచీ సకలము గాదలంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ // అమ్మమ్మ ఏమమ్మ //
అమ్మెడి దొకటి అసిమలోదొకటి
బిమ్మిటి నిందేటిపెద్దలమయ్యా // పల్లవి //
సంగము మానక శాంతియు గలుగదు
సంగలంపటము సంసారము
యెంగిలిదేహం బింతకు మూలము
బెంగల మిందేటిపెద్దలమయ్యా // అమ్మెడి//
కోరికె లుడుగక కోపం బుడుగదు
కోరకుండ దిక్కువమనసు
క్రూరత్వమునకు కుదువ యీబ్రదుకు
పేరడి నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//
ఫలము లందితే బంధము వీడదు
ఫలములో తగులు ప్రపంచము
యిలలో శ్రీవేంకటేశుదాసులము
పిలువగ నేమిటిపెద్దలమయ్యా // అమ్మెడి//
అయనాయ వెంగెమేలే అతివా ! నీ-
ఆయమే తాఁకీ మాఁట లందుకేమి సేతురా // పల్లవి //
కప్పురమిందవే వోకలికీ ! మాకు –
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి
తప్పులెవ్వ రెందున్నవో తలఁచుకో నీవు // అయ //
నిమ్మ పండిందవే వో నెలఁతా ! ఆ –
నిమ్మపండే పాఁపరమును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు // అయ //
కుంకుమపూ విందవే వో కోమలీ ! నీ –
కుంకుమలే పుప్పుడౌను కూడుకొంటేను
యింకనేలే కలసితి నింతీ ! వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరిచెమటలు // అయ //
అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి // పల్లవి //
అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో
వ్యయమేవ వటదళాగ్రాధీశయనః
అయమేవ దశవిట్ట రవతార రూపై చ్య
నయమార్గ భువిరక్షణం కరోతి // అయమేవ //
అయమేవ సతతం శ్రియఃపతి దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్ణు క్రమ్య
ప్రియభక్తపోషణం పిదృతృనోతు // అయమేవ //
అయమేవ శ్రీవేంకటాద్రి విరాజితే
అయమేవ వరదోప్యాచకానా
అయమేవ వేదవేదాంతశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు // అయమేవ //
అయ్యో నానేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచుచంచలాన మోసపోతిగాక // పల్లవి //
కాననా నావంటివారే కారా యీజంతువులు
నానా యోనుల బుట్టి నడచేవారు
మానక నాగర్వమున మదాంధమున ముందు
గానక భయపడినకర్మి నింతేకాక // అయ్యో నానేరమికే //
చదువనా నేదొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నాభోగవాంఛలే పెంచి పెంచి
తుదకెక్క వెదకనిదుషుడనేను // అయ్యో నానేరమికే //
వినవా నే బురాణాల వెనకటివారినెల్ల
మనెడిభాగవతులమహిమలెల్లా
యెనయుచు శ్రీవేంకటేశుకృపచేత నేడు
ఘనుడ నయితిగాక కష్టుడగానా // అయ్యో నానేరమికే //
అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు
గయ్యాళినై వ్రిధా గర్వింతుగాని // పల్లవి //
తడిపివుదికినట్టిధౌతవస్త్రములు నా
యొడలు మోచినమీద యోగ్యము గావు
వుడివోక వనములో వొప్పైనవిరులు నే
ముడిచివేసినంతనే ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
వెక్కసపురచనలవేవేలురుచులు నా
వొకనాలు కంటితేనే యోగ్యముగావు
పక్కనదేవార్హపుబరిమళ గంధములు నా
ముక్కుసోకినంతలోనే ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
గగనానుండి వచ్చేగంగాజలములైన
వొగి నాగోరంటితేనె యోగ్యము గావు
నగుశ్రీవేంకటపతి నన్నే రక్షించినదాక
మొగడై యెరుకతుది ముట్టరాదాయను // అయ్యో నేనేకా //
అయ్యో మానుపగదవయ్య మనుజుడు తన
కయ్యపుగంట గానడు // పల్లవి //
పాపపుణ్యలంపటుడైనా దుష్ట
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరగడు // అయ్యో //
నరకభవనపరిణతుడైనా కర్మ
పురుషుడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము వట్టి
అరవెరమాట లాడీనీ // అయ్యో //
దేహమోహసుస్థిరుడై నా ని
ర్వాహుడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతుని గని
వూహల జేరనొల్లడు // అయ్యో //
అయ్యో మాయల బొంది అందు నిండు నున్నవారు
యియ్యగొన గర్తలుగా రెఱగరు జడులు // పల్లవి //
చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండిపోయినయీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యెక్కుడైనహరి నాత్మ నెఱగరు జడులు // అయ్యో మాయల //
పాతాళవాసులును పలులోకవాసులును
యీతరవాతనుండినయీజీవులే
కాతరాన వారిపుణ్యకతలె వినేరుగాని
యీతల శ్రీహరికత లెఱగరు జడులు // అయ్యో మాయల //
యిరవెఱిగినముక్తులెఱగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాడు శ్రీవేంకటేశ్వరుడే
శరణాగతులు దక్క చక్కగారు జడులు // అయ్యో మాయల //
అయ్యో యేమరి నే నఁ ప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆదరింతుగా // పల్లవి //
అల్లనాఁడు బాలుఁడవై ఆవులఁగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుఁడవై రేపల్లెలో నుండే నాఁడు
గొల్లెత నయినా నన్ను కూడుకొందుగా // అయ్యో //
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్నుఁ బనిగొని యీడేర్తువుగా // అయ్యో //
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాఁడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిఁగా // అయ్యో //
అయ్యో వారిభాగ్య మంతేకాక
నెయ్యపువెన్న వట్టుక నెయ్యి వెదకేరు // పల్లవి //
దేవుడు వెల్లవిరై దిక్కులెల్లా నిండుండగా
సోవల నాస్తికునకు శూన్యమై తోచు
యీవల వాన గురిసి యేరెంతబంటి వారినా
కావరపుజీవునకు గతుగతుకే // అయ్యో వారిభాగ్య //
హరి శరణంటే గాచేఅట్టియుపాయమే వుండగ
విరసానకు గర్మమే వెగాళమాయ
పరగ నరులకెల్లా బట్టపగలై యుండగా
అరయ గొన్నిజంతుల కంధకారమాయను // అయ్యో వారిభాగ్య //
యిక్కడ శ్రీవేంకటేశు డెదుటనే వుండగాను
అక్కటా మూడున కెందు ననుమానమే
మక్కువ నింతా నమృతమయమైన గోడికి
తెక్కుల దవ్వ బోయ్యేది తిప్పపెంటలే // అయ్యో వారిభాగ్య //
అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు
యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము. // పల్లవి //
నీముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు
కామించి నీమీదిభక్తి కడు నొల్లరు
నామమంత్రము నొల్లరనామయుండ వనెందురు
తాము వైష్ణవుల మంటా దర్కింతురు. // అయ్యో //
పైకృతవేళ నీప్రసాదమూ నొల్లరు
ఘాతలనూర్ధ్వపుండ్రము గాదందురు
ఝాతరదైవాల నిన్ను సరిగా బూజింతురు
ఆఅతల వైష్ణవులు దామనుకొందురు // అయ్యో //
శ్రీవైష్ణవుల గంటే జేతులెత్తి మొక్కరు
భావింతురు పగ వారిబలె గన్నట్టు
ఆఅవల వైకుంఠమూ ననిత్యమందురు
కావించి వైష్ణవులము కామా నే మందురు. // అయ్యో //
వరుస రావణాదులవలె నెజ్ఞాలు సేతురు
శరుస నట్టే వేదమూ జదువుదురు
ణిరతి శ్రీవేంకటేశ నీమహిమ లెరగక
ఆరిది వైష్ణవులమే యని యాడుకొందురు. // అయ్యో //
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచుమనసున నే మోహమతి నైతి // పల్లవి //
చుట్టంబులా తనకు సుతులుఁగాంతలుఁ జెలులు
వట్టియాసలఁ బెట్టువారేకాక
నెట్టుకొని వీరు గడునిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృథా పిరివీకులైతి // అయ్యో //
తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారేకాక
మిగుల వీరలపొందు మేలనుచు హరి నాత్మఁ
దగిలించలేక చింతాపరుఁడనైతి // అయ్యో //
అంతహితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెనఁగువారేకాక
అంతరాత్ముఁడు వేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంతకూటములయలజడికి లోనైతి // అయ్యో //
అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో // పల్లవి //
వసుదేవుని పాలిట వర తపోధనము
యెసగి దెవకీదెవి యెదపై సొమ్ము
సురాసుర గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిరులై వుదయించె శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
నంద గోపుడుగన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజదైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాడు శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
శ్రీవేంకటాద్రినేచిన బ్రహ్మాము
వోవరి నలమేల్మంగ నురముపై బెట్టుగొని
చేవ దేర నుదయించె శ్రీకృష్ణుడిదివో // అరయశ్రావణ //
అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు
వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు
అందరికి ప్రాణమైన ఆతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవునికి శరణు
అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు
తానే చైతన్యమైన దైవానకు శరణు
నానా బ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రి యందునుండి వరములు
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు
అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ
సరిలేక వుండితివి జలరాశికాడ // పల్లవి //
పొలియంబీర్చితి వొకతి బురిటిమంచముకాడ
నలచితి వొకని గగనంబుకాడ
బలిమి దన్నితి వొకని బండిపోతులకాడ
దులిమితివి యేడుగుర దోలి మందకాడ // అరిదిసేతలే //
తడవి మోదితి వొకని తాటిమాకులకాడ
నడిచితి వొకని బేయలకాడను
పిడిచివేసితి వొకని బృందావనముకాడ
వొడిసితివి వొకని నావులమందకాడ // అరిదిసేతలే //
పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి
నటియించితివి మామనగరికాడ
కుటిలబాహు దైత్యాంతకుడవు వేంకటరాయ
పుటమెగసితి జగంబుల యింటికాడ // అరిదిసేతలే //
అరుదరుదీగతి అహోబలేశ్వర
పొరి(బొరి దాసుల పొగడుట యెట్టు
యెదుట( జించితివి హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు
ఘనసింహాకృతి గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
పనివడి కంబము పగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్టు
సరవితో వీరరసమున మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు
అరుదరుదు నీమాయ హరిహరీ
అరసి తెలియరాదు హరిహరీ // పల్లవి //
అనంత బ్రహ్మాడములవె రోమకూపముల
అనంతములై వున్నవి హరిహరీ
పొనిగి కుంగినవొక్కభూమి నీవెత్తినది యే
మని నుతింతు నిన్ను హరిహరీ // అరుదరుదు //
పొదిగి బ్రహ్మాదులు నీబొడ్డున నేకాలము
అదివో పుట్టుచున్నారు హరిహరీ
పొదలి యీజీవుడు పుట్టించే యీసామర్ధ్యము
అదన నేమనిచెప్పే హరిహరీ // అరుదరుదు //
పావన వైకుంఠము నీపాద మూలమందున్నది
ఆవహించే భక్తిచేత హరిహరీ
శ్రీవేంకాటాద్రి మీదచేరి నీవిట్టె వుండగా
నావల వెదకనేల హరిహరీ // అరుదరుదు //
అఱిముఱి హనుమంతుడు అట్టి బంటు
వెఱపులేని రఘువీరునికి బంటు
యేలికను దైవముగా నెంచి కొలెచేవాడే బంటు
తాలిమిగలిగినయాతడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాడే బంటు
వేళ గాచుకవుండేటి వెరవరే బంటు
తను మనోవంచన లెంతటా లేనివాడే బంటు
ధనముపట్టున శుధ్ధాత్మకుడే బంటు
అనిశము నెదురు మాటాడనివాడే బంటు
అనిమొన తిరుగనియతడే బంటు
చెప్పినట్లనే నడాచినయాతడే బంటు
తప్పులేక హితుడైనాతడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలగువాడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుడే బంటు
అలపు దీర్చుకోరాద అన్నీనయ్యీ గని
నిలువెల్లా జెమరించి నీళ్ళు గారీని // పల్లవి //
వీడెమందుకొనరాదా వెనక విచ్చేతుగాని
బీడై నీకెమ్మోవి పిప్పిగట్టెను
చూడరాదా మమ్ముగొంత చొక్కి కన్నుమూతుగాని
ఆడ నీడా నుమ్మదాకి యలపుదేరీని // అలపు //
పాదమొత్తించుకోరాదా ప్రక్కన నవ్వుదుగాని
వీధులెల్లా దిరుగాడి విసిగినది
జూదమైనా నాడరాదా సొంట్లు సోదింతుగాని
ఆదిగొని కోరికలు అంకెకు దీసీని // అలపు //
పవళించివుండరాదా పానుపుపై నికనైనా
జవళి బులకలు మైజడిపీని
యివల శ్రీవేంకటేశ యిట్టె నన్నుగూడితివి
సవతులదేకుమీ చలమెక్కీని // అలపు //
అలమేలు మంగవు నీ వన్నిటా నేరుపరివి
చలము లేటికి నిక సమ్మతించవే // పల్లవి //
విడియము చేతికిచ్చి విభుడు వేడుకపడి
వొడివట్టి పెనగగా నొద్దనకువే
వుడివోని వేడుకతో నుంగరము చేతికిచ్చి
యెడయక వేడుకొనగా నియ్యకొనవే // అలమేలు //
చిప్పిలు వలపుతోడ చెక్కులు నొక్కుచు మోవి
గప్పుర మందియ్యగాను కాదనకువే
కొప్పుదువ్వి బుజ్జగించి కొసరి మాటలాడి
అప్పసము నవ్వగాను అట్టె కానిమ్మనవే // అలమేలు //
యిచ్చగించి శ్రీవేంకటేశ్వరుడు నిన్నుగూడి
మచ్చిక గాగిలించగాను మారాడకువే
పచ్చడము మీద గప్పి పట్టపు దేవులజేసి
నిచ్చలాన నేలుకొనె నీవూ గైకొనవే // అలమేలు //
అలమేలుమంగనీ అభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ // పల్లవి //
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదవమ్మ // అలమేలుమంగనీ //
శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ // అలమేలుమంగనీ //
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ // అలమేలుమంగనీ //
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ వుయ్యాల||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||
కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||
ఆ
ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
చేరి బిభీషణుని శరణాగతుడని చేకొని సరిగాచితివి
ఫాలలోచనుడు బ్రహ్మయు నింద్రుడు
సోలి నగ్నియును సూర్యచంద్రులును
నీలోనుండగ నెరి గనె కిరీటి
మూల భూతివగు మూర్తివి గాన
అనంత శిరసుల ననంతపదముల
ననంతనయనము లనంతకరముల
ఘన నీరూపము కనుగొనె కిరీటి
అనంతమూరితి వన్నిట గాన
జగములిన్నియును సకల మునీంద్రులు
నగు శ్రీవేంకటనాధుడ నిన్నే
పొగడగ కిరీటి పొడగనె నీరూపు
అగణిత మహిముడ వన్నిట గాన
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
ఆకెవో నాప్రాణ మోహనపు రాణి
దాకొని వేవేలు కాంతలలోన నున్నది
ముదిత కురులనెల్లా ముత్యములు మాణిక్యాలు
గుదిగుచ్చి కలుగంటు గొన్నది
సదరపు పసిడి వజ్రాలచనుకట్టుది
అదె పైడి పూవుల పయ్యద వల్లెవాటుది
పచ్చలు దాచిన యట్టి పాదుకలు మెట్టినది
లచ్చన మొగవుల మొలనూళ్ళది
అచ్చపు టుంగరముల అందెలు బాయవట్టాలు
గుచ్చుల ముంజేతుల కంకణ సూడిగేలది
నానాభూషణముల నానా సింగరాల
పానిపట్టి నాదిక్కెతప్పక చూచేది
ఆనకపుశ్రీ వేంకటాద్రి పతినైన నన్ను
తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది
ఆచారవిచారా లవియు నే నెరఁగ
వాచామగోచరపువరదుఁడ నీవు // పల్లవి //
తపమొక్కటే నాకుఁ దగునీశరణనుట
జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట
వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీతవిఙ్ఞానవిధులేమి నెరఁగ // ఆచార //
కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు
ధర్మమొక్కటే నీ దాసానుదాస్యము
మర్మమొక్కటే నామతి నిన్నుఁ దలఁచుట
అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ // ఆచార //
బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట
కలిమియొక్కటే నీవు గలవని నమ్ముట
యెలమితో శ్రీవేంకటేశ నీవు గతిదక్క
పలుబుధ్ధుల నేఁబొరలు భావనలేనెరఁగ // ఆచార //
ఆటవారి గూడితౌరా // పల్లవి //
ఆటవారిగూడి అన్నిచోట్ల బొమ్మ
లాట లాడించ నధికుండవైతివి // అనుపల్లవి // //
గురుతరమగు పెద్ద కొట్టాములోపల
తిరుమైన పెనుమాయ దెరగట్టి
అరయ నజ్ఞానములవి యడ్డముగజేసి
పరగ సుజ్ఞానదీపములు ముట్టించి // ఆటవారి //
తోలుబొమ్మల దొరకొని గడియించి
గాలిచేత వాని గదలించి
తూలేటి రసములు తొమ్మిది గడియించి
నాలుగుముఖముల నలువున నాడించ // ఆటవారి //
నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు
మన్నించుదాతలు మరి లేరు
యెన్నగ దిరువేంకటేశ్వర నీదాసు
లున్నతులై నిన్ను నుబ్బించి పొగడగ // ఆటవారి //
ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుక పరషులెల్ల వీధి చూడరమ్మ
అల్లదివో ఓగునూతుల ఔభళేశు పెద్దకోన
వెల్లిపాల నీటి జాలు వెడలే సోన
చల్లని మాకుల నీడ సంగడి మేడలవాడ
ఎల్లగాగ నరసింహుడేగీ నింతితోడ
సింగారపు మండపాల సింహాల మునిమందలు
అంగపు తెల్లగోపురము అదె మిన్నంద
చెంగట నాళువార్లు చేరి పన్నిద్దరు గొల్వ
సంగతి తా కొలువిచ్చీ జయనరసింహము
కందువ శ్రీవేంకటేశు కల్యాణముల వేది
అందమై భూమికెల్ల ఆదికి అనాది
మందల పాల కొండ మలకు నట్టనడుమ
విందగు దాసుల తోడ విహరించీ దేవుడు
ఆడరానిమా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే // పల్లవి //
కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే // ఆడ //
దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ –
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే // ఆడ //
పరిపరివిధములఁ బలుకులు గులుకఁగ
అరమరచి చొక్కిన దది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే // ఆడ //
ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేడు
కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడాధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిగల దేవతలు
వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలచే
చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు
బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి
అడరిన తలబాలందె నదె
నడచి పరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరో ముయిగా నరులు
ఆడరో పాడరో ఆనందించరో
వేడుక మొక్కరో విఙ్ఞానులు // పల్లవి //
హరి రక్షకుఁడై యందరి కుండఁగ
పరగఁగ బదికేరు బ్రహ్మాదులు
గరిమ నతఁడే చక్రము చేఁబట్టఁగ
సురిగి పారి రదె చూడుఁడు సురలు // ఆడ //
పదిలపువిష్ణుఁడె ప్రాణమై యుండఁగ
యిదివో మెలఁగేరు యీజీవులు
మొదలు యితఁడే మూలమై యుండఁగ
పొదలె నీతనిపంపున లోకములు // ఆడ //
శ్రీ వేంకటాద్రిని శ్రీపతి యుండఁగ
తావుల నిలిచెను ధర్మములు
యీవల నితఁడే యిచ్చేటివరముల
పావనులై రిదే ప్రపన్నులు // ఆడ //
ఆడుతా పాడుతా అట్టె ముద్దుగునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా
ఆస తల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములు తామెరగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము పడి నాత్మ దలచుక
యీసుల పుణ్య పాపము లెరగమయ్యా
యేలినవారు వెట్టగా నేపున దొత్తులు బంట్లు
ఆలకించి పరులబోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించగా
యేలని యేమియు గోర నెరగమయ్యా
చేత జిక్కి నిధానము చేరి యింటగలవాడు
యేతుల గలిమిలేములు లెరుగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీవుండగాను
యీతల నేవెలుతులు నెరగమయ్యా
ఆడువారు కడుగోపులవుట నీ వెరగవా
నేడు గొత్తలుగా భూమి నేర్పుక వచ్చేరా
వలచిన యాడువారు వాదులాటకు వచ్చిన
చలము సాధించువాడు జాణడా వాడు
కలయని కాకతోడ కమ్మటి నలిగిపోగా
పిలిచి మాటాడకున్న ప్రియుడా వాడు // ఆడువారు //
చనవుగలుగువారు సణగులదిట్టగాను
కనలియెగ్గువట్టితే ఘనుడా వాడు
గునిసి సవతులపై కోపాన పతి నంటేను
విని నవ్వకుండేవాడు విభుడా వాడు // ఆడువారు //
పాయరానియటివారు బలుములు చూపితేను
నాయాలబెట్టెడివాడు నాథుడా వాడు
యీయెడ శ్రీవేమ్కటేశ యింతినిట్టె గూడితివి
చాయకు రాకుండువాడు సరసుడా వాడు // ఆడువారు //
ఆణికాడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుగుదువటవో
యంగడి బేహారి యవి గొనవయ్యా
మొల్లమి మాచెలిమోవిమాణికము
అల్లవెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచే
కొల్ల లడిగితట కొనవయ్యా
నిడుదల చూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ వదె
యెడయని కాగిట నిటు గొనవయ్యా
ఆతఁ డితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు // పల్లవి //
యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాఁడు
యీతఁడా వసుదేవునియింటిలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండుసేసినాఁడు // ఆతఁ //
మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచేయశోదపాలి భాగ్య మీతఁడా
వాటమై గొల్లెతలను వలపించినాఁడు // ఆతఁ //
ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు // ఆతఁ //
ఆతడదె మీరదె అప్పగించితిమి మేము
మీతల పుదాన నేను మీకేలే చింత ||
నన్ను నేల అడిగేరే నాటి నేటి సుద్దులు
అన్నియును నడుగరే ఆతనిని
పన్నిన వారిద్దరికి పైపై మీరే కారా
వెన్నచేత బట్టుకొని నేడ నేలే నెయ్యి ||
యేలకొడ బర చేరే యింతలోనే నన్నును
చాలు నొడ బరచరే చాలు నాతని
పోలిమితో నింతేసి బుద్ది మీరెరగనిదా
తాలము చేత బట్టుకొని దాటణేలే వాకిలి ||
అనలేల పెట్టేరే ఆతనితో గూడుమని
పేనియాన లతనికే పెట్టరాదా
ఆనుక శ్రీవేంకటేశు డాతడే నన్ను గూడె
తేనెలు వంటి చెలులు తీపులు మీకేలే ||
ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా
కందువ దేవకి బిడ్డ గనెనట నడురేయి
అంది యశోదకు కొడుకైనాడట
సందడించి పూతకి చంటిపాలు తాగెనట
మందల ఆవుల గాచి మలసెనట
మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా
కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము
ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు
అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము
నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
ఆతడే సకలవ్యాపకు డతడే యాతురబంధువు
డతడు దలపులముంగిట నబ్బుట యెన్నడొకో
సారెకు సంసారంబనుజలనిధు లీదుచు నలసిన
వారికి నొకదరిదాపగువా డిక నెవ్వడొకో
పేరినయజ్ఞానంబను పెనుజీకటి తనుగప్పిన
చేరువవెలుగై తోపెడిచెలి యిక నెవ్వడొకో // ఆతడే సకలవ్యాపకు //
దురితపుకాననములో త్రోవదప్పినవారికి
తెరువిదె కొమ్మని చూపెడిదేవు డిదెవ్వడొకో
పెరిగినయాశాపాశము పెడగేలుగ దనుగట్టిన
వెరవకుమని విడిపించేటివిభు డిక నెవ్వడొకో // ఆతడే సకలవ్యాపకు //
తగిలినయాపదలనియెడిదావానలములు చుట్టిన
బెగడకుమని వడివార్చెడిబిరు దిక నెవ్వడొకో
తెగువయు దెంపునుగలిగినతిరువేంకటవిభు డొక్కడే
సొగిసి తలంచినవారికి సురతరువగువాడు // ఆతడే సకలవ్యాపకు //
ఆతనినే నే కొలిచి నే నందితి బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టియింతయును హరి మూలము // పల్లవి //
కోరుదుమా దుఃఖములు కోర కేతెంచు తముదామే
ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచార మంతేల
సారెకు దైవాధీనము లివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుడే యింతకు మూలము // ఆతనినే నే కొలిచి //
కమ్మంటిమా ప్రపంచము ప్రపంచము గలిగీ స్వభావము అందుకది
యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదనవుననరా దెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము // ఆతనినే నే కొలిచి //
సరి నెఱగుదుమా పోయినజన్మము సారెకు నేమేమి చేసితిమో
యిరవుగ నట్లా మీదటిజన్మముయెఱుకలు మఱపులు యికనేలా
నిరతమై శ్రీవేంకటేశుడు తనయిచ్చ నిర్మించిన దిది యీదేహము
గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి // ఆతనినే నే కొలిచి //
ఆతనిమూలమే జగమంతా నిది
ఆతుమలో హరి కీలుఅయివుండుఁగాని // పల్లవి //
మచ్చరము లేకున్నను మననే రామరాజ్యము
వచ్చినట్టె వచ్చితేను వలపే చవి
యెచ్చు కుందు లేకున్న నెక్కడైనా సుఖమే
యిచ్చకుఁడై హరి తన కియ్యవలెఁగాని // ఆత //
నెట్టుకొని నడచితే నిజమే మూలధనము
పట్టినదే వ్రతమైతే భవమే మేలు
జట్టిగా వొనగూడితే సంసారమే ఫలము
యిట్టె హరి దనకు నియ్యవలెఁగాని // ఆత //
చెప్పినట్టు సేసితేను చేరి దేహమే చుట్టము
తప్పులు లేనిదియైతే ధర్మమే సొమ్ము
చొప్పునహరిదాసులు సోదించి చూచిన దిది
యెప్పుడు శ్రీవేంకటేశుఁ డియ్యవలెఁగాని // ఆత //
ఆతుమ సంతసపెట్టుటది యెఱుక తా
నేతెరువు నొల్లకుండు టదియే యెఱుక
ముంచినబంధములలో ముణుగుడువడక తా
నంచల విడదన్నుటిది యెఱుక
చంచలపువిషయాల సగ్గుడుమగ్గుడుగాక
యెంచి హరిదలపోయు టిదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
పాయనియర్థములకు బంటుబంటై తిరుగక
ఆయతమై మోసపోని దది యెఱుక
పాయపుగామినలతో బలుమారు జేయుపొందు
హేయమనితలపోయు టిదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
ధరమీదగలప్రాణితతుల నొప్పించక
అరయగ సముడగు టది యెఱుక
గరిమల శ్రీవేంకటపతిదాసుడై
యిరవొంద సుఖియంటదియే యెఱుక // ఆతుమ సంతసపెట్టుటది //
ఆది మునుల సిద్ధాంజనము
యేదెస చూచిన నిదివో వీడే
నగినసెలవి బడు నాలుగు
జగములు మొగమున జూపే మోహనము
కనుదెరచిన నలుగడ నమృతములటు
అనువున గురిసీ నపారము
వనితలు నంద వ్రజమున జెలగగ
మనికిక నిరవై మలసీ వీడే
పరమునకును దా బరమై వెలసిన
పరిపూర్ణ పరాత్పరుడు
సరస రుక్మిణికి సత్య భమకును
వరుడగు వేంకట వరదుడే వీడు
ఆది దేవా పరమాత్మా
వేద వేదాంతవేద్య నమో నమో !!
పరాత్పరా భక్త భవభంజన
చరాచర లోక జనక నమో నమో !!
గదాధరా శ్రీ వేంకటగిరి నిలయా
సదానందా ప్రసన్న నమో నమో !!
ప|| ఆదిదేవ పరమాత్మా వేద | వేదాంత వేద్య నమో నమో ||
అనుప|| పరాత్పరా భక్త భవ భంజన | చరాచర లోక జనక నమో నమో ||
చ|| గదాధరా వేంకటగిరి నిలయా | సదానంద ప్రసన్న నమో నమో ||
ఆదిదేవుం డనంగ మొదల నవతరించి జలధి సొచ్చి
వేదములును శాస్త్రములను వెదకి తెచ్చె నితండు
వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల
మూలమూలం ద్రోసి ముసుగుపాలుసేసె నితండు
వేలసంఖ్యనైన సతుల వేడుక లలరంజేసి వొంటి
నాలిమగని రీతిగూడి యనుభవించె నితండు
కడుపులోని జగములనెల్ల గదలకుండం బాపరేని
పడకనొక్క మనసుతోడం బవ్వళించె నితండు
అడుగు క్రింద లోకమెల్ల నడంచదలంచి గురుతుమీర
పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చి నితండు
కొండెవయసువాడు మంచి గోపసతుల మనములెల్ల
ఆడికెలకు నోపి కొల్లలాడి బ్రదికె నితండు
వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుం
జాడుం డనుచు మోక్షపదము చూరవిడిచి నితండు
ఆదిదైవుడై అందరిపాలిటి
కీ దేవుడై వచ్చె నితడు
కోరినపరమయోగులచిత్తములలోన
యేరీతినుండెనో యీతడు
చేరవచ్చినయాశ్రితులనెల్ల బ్రోవ
యిరీతి నున్నవాడీతడు
కుటిలదానవుల కోటానుగోట్ల
యెటువలె ద్రుంచెనో యీతడు
ఘటియించి యిటువంటికారుణ్యరూపుడై
యిటువలె నున్నవా డితడు
తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా
నెక్కడ నుండెనో యీతడు
దిక్కుల వెలసినతిరువేంకటేశుడై
యిక్కడ నున్నవాడీతడు
ఆదిపురుషా అఖిలాంతరంగా
భూదేవతా రమణ భోగీంద్ర శయనా
భవ పాథోనిధి బాడబానల
భవజీముత ప్రభంజనా
భవపర్వత ప్రళయ భయద నిర్ఘాత దు
ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప
భవ ఘోర తిమిర దుర్భవ కాల మార్తాణ్డ
భవ భద్రమాతంగ పంచానన
భవ కమలభవ మాధవరూప శేషాద్రి
భవ వేంకటనాథ భవరోగ వైద్య
ఆదిమ పురుషుడు అహోబలమను
వేదాద్రి గుహలో వెలసీవాడే
ఉదయించే నదిగో ఉక్కు కంబమున
చెదరక శ్రీ నరసింహుడు
కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు
నెదుట గద్దెపై నిరవై నిలిచే
పొడ చూపెనదిగో భువి దేవతలకు
చిడుముడి శ్రీ నరసింహుడు
అదర నందరికి నభయంబొసగుచు
నిడుకొనె తొడపైన తిరము
సేవలు గొన్నాడె చెలగి సురలచే
శ్రీవేంకట నరసింహుడు
దైవమై మమ్మేలి దాసుల రక్షించే
తావు కనగ నిటు దయతో జూచి
ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు
ఆదిదేవు డీతడేపో హరి వేంకటవిభుడు
ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో
బైకొనియుండగ నొకవటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన
శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు
అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము
సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నదలించిన
పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు
క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా
ధారుణియును సిరియును బాదము లొత్తగను
చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి
నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు
ఆదిమూర్తి యీతడు ప్రహ్లాదవరదుడు
ఏదెస జూచినా తానె ఈతడిదె దేవుడు
నవ్వుల మోముతోడ నరసింహరూపుతోడ
జవ్వని తొడమీద సరసమాడ
పువ్వుల దండలు ఇరుబుజాలపై వేసుకొని
ఉవ్విళ్ళూర కొలువై వున్నాడు దేవుడు
సంకు చక్రములతోడ జమళికోరల తోడ
అంకెల కటి అభయహస్తాలెత్తి
కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపాన పొదలీని దేవుడు
నానా దేవతలతోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీవేంకటాద్రి నహోబలము నందు
తానకమై వరాలిచ్చి దాసులకు దేవుడు
ఆదిమూలమే మాకు నంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష
భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్యముందున్న జలరక్ష
మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష
పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష
ఆదివిష్ణు వీతడే యటరమ్మ
ఆదిగొని భూభార మణచీనోయమ్మా
చందురునుదయవేళా సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డగనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుటింటివాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా
వసుదేవుని యెదుట వైకుంఠనాథుడు
సిసువై యవతరించీ చెలగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాడభయమిచ్చీనమ్మా
కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూక లణచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాల(బరగీనమ్మా
ఆన పెట్టుదువు నీవప్పటి నానోరణఁచి వోరి
నీ నిజానకు నాతో నేఁడైన మానరా // పల్లవి //
పచ్చడాల జవ్వాది పరిమళమేడదిరా
పచ్చి సేతలు చెక్కిళ్ళపై నీకేడవిరా
గచ్చు మోవిమీఁదనున్న కసిగాటులేడవిరా
యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా // ఆన //
ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా
కొద్దిగాని సందొత్తుగోరేడదిరా
గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా
తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా // ఆన //
భీతిలో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా
రాతిరేడ నుండితి వెరవక చెప్పరా
యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి
యేతులతో వలపించ నెంత కలికివిరా // ఆన //
ఆనంద నిలయ ప్రహ్లాద వరదా
భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా
పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా
హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా
భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా
అవిరళ కేశవ ప్రహ్లాద వరదా
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా
భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా
బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా
లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా
బలి వంశ కారణ ప్రహ్లాద వరదా
ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను
పూనుక నీ వెంతనేర్పరివైనా భువి మనసు పేదను నేను // పల్లవి //
కొలిచేమనేబంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ
దెలిసేమనేజ్ఞానులు తెందేప లున్నారు
తలఁచే వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో // ఆనతి //
పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట
వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట
మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరు
వినయపునామవిసనవులకు వేళ లెపుడు గలిగీనో // ఆనతి //
వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు
అన్నిటాను నీకౌఁగిటిలోపల వలరీ నలమేల్మంగ
యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలో
పన్నిననామొక్కులు నీ కేబాగులఁ జేరీనో // ఆనతి //
ఆపదల సంపదల నలయుటేమిట మాను
రూపింప నిన్నిటను రోసినను గాక
కడలేని దేహ రోగంబులేమిట మాను
జడను విడిపించు నౌషధ సేవగాక
విడవ కడియాస తను వేచుటేమిట మాను
వొడలి కలగుణమెల్ల నుడిగినను గాక
దురిత సంగ్రహమైన దుఃఖమేమిట మాను
సరిలేని సౌఖ్యంబు చవికొన్న గాక
కరుకైన మోహాంధకార మేమిటి మాను
అరిది తేజోమార్గ మలవడిన గాక
చావులో బెనగొన్న జన్మ మేమిటి మాను
యీవలావలి కర్మమెడసిన గాక
భావింప నరుదైన బంధమేమిటి మాను
శ్రీ వేంకటేశ్వరుని సేవచే గాక
ఆపద్బంధుడు హరి మాకు గలడు
దూపిలి తలచినా దోషహరము
గరుడనినెక్కినఘనరేవంతుడు
గరుడకేతనముగలరథుడు
గరుడడే తనకును గరియగుబాణము
గరిమె నీతడేపో ఘనగారుడము
పాముపరపై బండినసిద్ధుడు
పాముపాశములపరిహరము
పామున నమృతముపడదచ్చినతడు
వేమరు నీతడే విషహరము
కమలాక్షు డీతడు కమలనాథుడును
కమలాదేవికి గైవశము
అమరిన శ్రీవేంకటాధిపు డితడే
మమతల మా కిదే మంత్రౌషధము
ఆపన్నుల పాలి దైవమాతడే గతి తక్క
ఏ ప్రొద్దును భజియించక నితరుడు మరి కలడా
నిరుపాధిక నిజ బంధుడు నిరతిశయానందుడు
కరి వరదుడితడే కాక ఘనుడధికుడు కలడా
సంతత గుణ సంపన్నుడు సాధులకు బ్రసన్నుడు
అంతర్యామితడే కాక అధికుడు మరి కలడా
పరమాత్ముడు పరమ పురుషుడు పరికింపగ గృపాలుడు
తిరువేంకట విభుడే కాక దేవుడు మరి కలడా
ఆమీదినిజసుఖ మరయలేము
పామరపుచాయలకే భ్రమసితిమయ్యా
మనసున బాలు దాగి మదియించివున్నయట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజముసేసుక
తవివొంది యిందులోనే తడబడేమయ్యా
బొమ్మలాట నిజమంటా బూచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరైనట్టు
కిమ్ముల యీజన్మమందు కిందుమీదు నేఱక
పమ్మి భోగములనేతెప్పల దేలేమయ్యా
బాలులు యిసుకగుళ్ళు పస గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱివాడు గంతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ము గొలువక నేము
కాల మూరకే యిన్నాళ్ళు గడిపితిమయ్యా
ఆముస్వతంత్రులు గారు ‘దాసోహము’ నన లేరు
పామరపుదేహులకు పట్టరాదు గర్వము
పరగుబ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు
హరికే మొరవెట్టేరు ఆపదైతేను
ధరలో మనుజులింతే తామే దయివమనేరు
పొరి దాము చచ్చిపుట్టే పొద్దెరగరు
పండినవ్యాసాదులు ప్రపంచము కల్లనరు
కొండలుగా బురాణాల గొనియాడేరు
అండనే తిరిపెములై అందరినడిగి తా_
ముందుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు
సనకాదియోగులు శౌరిభక్తి సేసేరు దు_
ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా
నినుపయి శ్రీవేంకటేశ నిను జేరి మొక్కుతానె
అనిశము నిరాకారమనేరు యీద్రోహులు
ఆరగించి కూచున్నా డల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు॥
ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీ నల్లవాడె
చెందిన మాణికముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు॥
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచీ నల్లవాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీనారసింగుడు॥
పెండెపు పాదము చాచిపెనచి ఒక పాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీ నారసింగుడు॥
ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును // పల్లవి //
తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును // ఆరగింపవో //
పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెఁగలు
పరిపరివిధముల భక్ష్యములు // ఆరగింపవో //
కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములను
సుడిగొనునప్పలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును // ఆరగింపవో //
కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరానియంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు // ఆరగింపవో //
ఒడికపుఁగూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా // ఆరగింపవో //
ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు
మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే // పల్లవి //
సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు
సర్వసర్వంసహాచక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే // ఆర్తు //
పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుఁడ నన్ను సరిఁ గావవే // ఆర్తు //
అణువులోపలినీవు ఆదిమహత్తును నీవు
ప్రణుతశ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు // ఆర్తు
ఆఱడిఁబెట్టఁగనేల అతని నింతేసి నీవు
మీఱక బంగారుపీఁటమీఁదఁ గూచుండవే // పల్లవి //
కొంగువట్టి తియ్యనేలే కొసర నేమిటికే
సంగతెఱిఁగిననెరజాణవిభుని
ముంగిట నున్నాఁ డతఁడు మొక్కితే నెఱుకగాదా
రంగుగాఁ దానే వచ్చీ రావే లోపలికి // ఆఱడి //
విన్నపము సేయనేలే వేఁడుకొన నింత యేలే
సన్న దెలిసినయట్టిసరసునికి
కన్నాఁడు నీగుట్టు వేళగాచుటే తగులుగాదా
పన్ని నిన్ను నేలీఁగాని పఱవవే పానుపు // ఆఱడి //
చనవునఁ దిట్టనేలే చవులు చూపఁగనేలే
యెనసినశ్రీ వేంకటేశునెదుట
ననిచి వున్నాఁ డితఁడు నగుటే వుంకువగాదా
తనివి నొందించి యింకాఁ దడవవే కాఁగిట // ఆఱడి //
ఆలాగు పొందులును అటువంటికూటములు
ఈలాగులౌట నేడిదె చూడనైతి
అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలని లోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసి పొందితిగాని
యెడలేని పరితాప మేరుగలేనైతి
చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలపలేనైతి
వరుస మోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనతి
శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
ఈ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి
ఆలాగు పొందులును అటువంటి కూటములు యీలాగు లౌటనేడిదె చూడనైతి
అడియాస చూపులకు నాసగించితిగాని వెడమాయలనిలోను వెదకలేనైతి కడువేడుకల దగిలి గాసిబొందితిగాని యెడలేని పరితాప మెఱగలేనైతి
చిరునగవుమాటలకు చిత్తగించితిగాని తరితీపులని లోను తలుపలేనైతి వరుసమోహపు బసలవలల చిక్కితిగాని గరువంపు పొలయలుక గానలేనైతి
శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని దేవోత్తమునిలాగు తెలియలేనైతి యీ వైభవముపై నిచ్చగించితి గాని యీ వైభవానంద మిది పొందనైతి
ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥
గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥
జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకొంటేనె
చనవి మనవి నీకే శరణుజొచ్చితిమి॥
లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥
ఆలికి మగనికి నాఱడేటికి
కాలిమితోడ లోలో తనివందరాదా
దొంతిబెట్ట వలపులు తోరపుబూజగుండలా
పంతాలు సంగడి బార బండికండ్లా
యింతేసి మీ రిద్దరును యేటికి బెచ్చు రేగేరు
యెంతకెంత సేసేరు యెనసివుండరాదా
మమతలు పేరబెట్ట మందలపాలా యేమి
తమకము తలదూచ తాసు చిప్పలా
జమళి నిద్దరూనెంత సరులకు బెనగేరు
తిముర నేటికి మీలో దిండుపడరాదా
సరిబేసి మాటలాడ జంట జాజాలా యివి
సిరులతో బెనగగ జెట్టిసాదనా
గరిమె శ్రీ వేంకటేశ కాంతా నీవు గూడితిరి
గరువాలేటికి నింకా గలయగ రాదా
ఆశాబద్ధుడనై యలసి నిన్ను గడు
గాసి బేట్టినవాడ గాను
ఘనకర్మపరుడనై కర్మరూపుని జేయ
నిను దూరి భారము నీకు గట్టినవాడ గాను
పనిలేని దుఃఖలంపటుడనై దుఃఖము
గనుపించకుమని కడు వేడినవాడ గాను
శ్రీవేంకటగిరిదేవేశ నాకిది
గావలెననువాడ గాను
కావలసినయవి గదిసిన నవి నాకు
గావనుమనుజుండ గాను
ఆసమీద విసుపౌదాక యీ
గాసిబరచుతన కపటమే సుఖము
తిరమగుగర్మము దెగుదాక తన
గరిమసుఖము పొగడునందాక
పరమార్గం బగపడుదాక తన
పరితాపపులంపటమే సుఖము
కాయము గడపల గనుదాక యీ
మాయ దన్ను వెడమరచుదాక
రాయడిమదము గరగుదాక యీ
రోయదగిన తనరూపమే సుఖము
అంకెలబొరలి నలగుదాక యీ
యంకెలభవము లెరవౌదాక
వేంకటపతి దడవినదాక యీ
కింకుర్వాణపు గెలుపే సుఖము
ఆహా నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి
లోకాలోకములు లోన నించుకొన్న నీవు
ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి
అన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవు
అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి
దేవతలచే పూజ తివిరి గొనిన నీవు
ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు
ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి ||
ఇ
ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము
వంకలొత్తకిక మరి వద్దువద్దు యిపుడు ||
వాపులు నీకెంచనేల వాడల గొల్లెతలకు
దేవరవు గావా తెలిసినదే
యీవలమావంక నిట్టె యేమి చూచేవు తప్పక
మోవ నాడితిమిదివో మొదలనే నేము ||
చందాలు చెప్పగనేల సతి నెత్తుక వచ్చితి
విందుకు రాజవు గావా యెరిగినదే
దిందుపడి మమ్మునేల తిట్టేవు పెదవులను
నిందవేసితి మిదివో నిన్ననే నేము ||
వెలినవ్వేల పదారువేల పెండ్లాడితివి
బలిమికాడవు గావా భావించినదే
చెలగి పులివిందల శ్రీ రంగదేవుడవని
కలసితిమిదె శ్రీ వేంకటరాయ నేము ||
ఇంకానేల చలము యేమిసేయగలము
అంకెకు వచ్చెను అధరామ్రుత ఫలము ||
కలికి వనాలనీడగడు నీకెదురుచూడ
కులుకు నవ్వులతోడ గొప్పువీడ
చెలులెల్లా జూచేరు జిగి గొఊనిలసియాడ
బలిమి జేకొనవయ్య బత్తితోగూడ ||
సతి నీపాదాలు మెట్ట చన్నుల నీవు ముట్ట
తతి నిన్ను నిదె దిట్టతనాల దిట్ట
అతివలు సొలసేరు అంగాల జెమటదొట్ట
సతతము మెచ్చవయ్యా జాణలు చేపట్ట ||
జలజాక్శి నీపక్క సరసముల వేచొక్క
తలపోసీ దనచక్కదనాలు నిక్క
లాలి శ్రీవేంకటేశ నీలలని నీకు మొక్క
కకాలమేలు మిక్కడరతికెక్క ||
ఇంత సేసెబో దైవ మింతలోననే అయ్యొ
సంతపాకలంజ దెచ్చి సన్యాసి జేసె ||
పరిగెలేరేటివాని బట్టపురాజుగా
బిరతభోగములిచ్చి నిలిపినట్లు
ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు
అరయ నిత్తడి దెచ్చి యపరంజి జేసె ||
కుక్కలవండుకతినే కులహీనుని దెచ్చి
వెక్కసపుబాపని గావించినయట్లు
దిక్కులెఋఅగగ గష్టదేహిని నన్ను దెచ్చి
గక్కన దెలుకపిండి కస్తూరి సేసె ||
చెడుగైనదోమ దెచ్చి సింహపుగొదమగా
బెడిదంపు బ్రేమతోడ బెంచినయట్లు
కడునధముని వేంకటపతి నను నిటు
చిడిపిరాయి దెచ్చి చింతామణి సేసె ||
ఇంతకంటే ఘనమిక లేదు
సంతత సౌఖ్యము జనార్దననుడే ||
భయ నివారణము పరమాత్ముని స్తుతి
జయ కారణ మీశ్వర చింత
అయుత పుణ్యఫల మచ్యుతుని సేవ
క్రియతో నిజమెరిగిన వారికి ||
కర్మహరము శ్రీకాంతు దరిసనము
ధర్మరాసి మాధవు శరణు
అర్మిలి సంపద లనంతుని తగులు
నిర్మలముగ పూనిన దాసులకు ||
ఆగమోక్తమీ హరికైంకర్యము
భోగము విష్ణుని పూజ ఇది
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు
బాగులు నేర్చిన ప్రపన్నులకు ||
ఇంతట: గావగదే ఇందిరానాయక నన్ను
పంతాన గాకాసురని బాలించినట్లు ||
దించని పంచభూతాల దేహము మోచితిగాన
నించిన యజ్గ్యానమున నిన్ను నెరగ
పంచేంద్రియములచే బట్టు వడ్డవాడ గాన
యెంచరాని సాపములే యిన్నియు జేసితిని ||
మిన్నువంటి జఠరాగ్ని మింగి వున్నవాడగాన
కన్నవెల్లా వేడివేడి కిశ్టపడితి
పన్నిన సంసారపుబ్రమ బడ్డవాడగాన
అన్నిటా దేవతలకు సరిగాపవైతి ||
ఆతుమలో నీ వుండే భాగ్యము గలవాడగాన
చైతన్యమున నీకు శరణంటిని
నీతితో శ్రీఎంకటేశ నీ పాలివాడగాన
బాతితో సర్వము నీ కొప్పనము సేసితిని ||
ఇంతయు నీమాయామయ మేగతి దెలియగవచ్చును
దొంతిబెట్టినకుండలు తొడరినజన్మములు ||
కలలోపలి సంభోగము ఘనమగు సంపదలిన్నియు
వలలోపలి విడిపరుపులు వన్నెల విభవములు
తలపున గలిగియు నిందునే తగులక పోదెవ్వరికిని
తెలిసిన దెలియదు యిదివో దేహరహస్యంబు ||
అద్దములోపలినీడలు అందరిదేహపు రూపులు
చద్దికివండిన వంటలు జంటగర్మములు
పొద్దొకవిధమయి తోచును భువి నజ్ఞానాంబుధిలో
నద్దినదిది దెలియగరా దంబుదముల మెఱిగు ||
మనసున దాగినపాలివి మదిగలకోరిక లిన్నియు
యిసుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు
పనివడి శ్రీ వేంకటగిరిపతి నీ దాసులివిన్నియు
కని మని విడిచిన మనుజుల కాయపుమర్మములు ||
ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||
సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ
సొరిదిమోములు తొంగి చూచుకొంటాను
విరులచెండులగొని వేటులాడుకొంటాను
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||
భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను
నవకపు సిరులను నవ్వుకొంటాను
జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను
చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||
వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా
ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||
ప|| ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు | చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||
చ|| సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ | సొరిదిమోములు తొంగి చూచుకొంటాను | విరులచెండులగొని వేటులాడుకొంటాను | సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||
చ|| భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను | నవకపు సిరులను నవ్వుకొంటాను | జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను | చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||
చ|| వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా | ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా | ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి | శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||
ఇంతే మరేమిలేదు యిందుమీదను
దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||
వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి
నొల్లకున్న తన్ను దానొల్లకుండుట
బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా
పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||
యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా
చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||
శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని
జేకొంటె సిరులెల్లా జేకొనుట
మేకులశ్రీహరినామమే నోరనుడుగుట
కైకొన్న యమృతపుగందు వగుట ||
ఇంతేపో వారివారిహీనాధికములెల్ల
పంతాన తా మేపాతిభాగ్యము నాపాటే।
అందరిలో దేవుడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదు రింతే
చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టికొలుచుండి పొల్లు కడబడును।
పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే
చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు
తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ
కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు
ఆరయ గిందెడు మీదెడై వున్నవింతే
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు
ఇంతేసి మతకాలు నే నెఱగనివా
పొంత నుండి నవ్వేవు పొద్దు వోదానీకు ||
తారుకాణాలంతే నేల తగవు నడపరాదా
గారావు నీ వెఱుగని కల్ల వున్నదా
కూరిమి సతులమూక కూరిచి తలవంచేవు
పోరులేల పెట్టేవు పొద్దు వోదా నీకు ||
వొడ బరచగనేల వూరకే వుండగరాదా
తడివితిమా నీవింతయు నేరవా
కడగడ లటుదొక్కి కమ్మినన్ను వేడుకొంటా
బుడికేవు నన్ను నీవు పొద్దు వోదా నీకు ||
నివ్వెరగంద నేల నిచ్చలాన నుండరాదా
జవ్వనపు నాచేత నీసలిగె కాదా
యివ్వల శ్రీ వేంకటేశ యిట్టె నిన్ను గూడితిని
పువ్వులనేల వేసేవు పొద్దు వోదా నీకు ||
ఇంతేసి సేవలు సేయ నెందాకా నోపు చెలి
కాంతుడవు మెచ్చి మెచ్చి కౌగలించవయ్యా ||
పయ్యదకొంగు జారగ పాలిండ్లు గదలగ
చయ్యన గుంచె వేసీని సతి నీకు
చెయ్యెల్ల బడలంగ జెక్కులు చెమరించగ
వొయ్యనే పాదా లొత్తీ నుల్లసాన నీకు ||
గరిమ దురుము వీడ గస్తూరి బేంట్లు రాల
పరగగ గాళాంజి పట్టీ నీకు
సరులు చిక్కువడగ సందడి నూర్పులు రేగ
సిరుల గందము పూసీ జెలరేగి నీకు ||
తనువు పులకించగ తమకములు ముంచగ
యెనచి యాకు మడచి యిచ్చీ నీకు
అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
చనవున గెమ్మోవి చవిచూసీ నీకు ||
ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి !!
వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి !!
తనివోక బలి చేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి !!
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి !!
ఇందరివలె జూడకు యింకా నన్ను
మందలించి యెటువలె మన్నించినా మంచిదే
తత్తరించి నీ మీద తప్పులు మోపగ నోప
కొత్త కొత్త మాటలను కొసర నోప
బత్తి గల దాన నీతో బంతము లాడగ నోప
చిత్తగించి యేమి దయసేసి నాను మంచిదే
చేయి చాచి కొనగోర బెనకగ నే నోప
చాయల సన్నల నిన్ను జరయనోప
నీ యాధీనపు దానను నిన్ను వెంగెమాడ నోప
రాయడించ కెటువలె రక్షించినా మంచిదే
అట్టే కౌగిట గూడితి వలయించ నే నోప
వట్టి సట లాడి నీతో వాదించ నోప
ఇట్టే శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
పట్టముగట్టి నన్నెంత పాలార్చినా మంచిదే
ఇందాకా నెఱగనైతి నిక గపటములేల
చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు
మంతనానకు రాగాను మనసెల్లా నొక్కటాయ
పంతము నీ వియ్యగాను పాసెగోపము
అంతరంగము చెప్పగా ననుమానమింక నెంచ
రంతులు సేయక యిట్టె రావయ్య యింటికి
సరసము నీవాడగా చల్లనాయనా మేను
సరుస గూచుండగాను సమ్మతించితివి
యెరవులేక నవ్వగా నిరవాయ గూరిములు
బిరిదులెల్లా గంటి బెట్టవయ్య విడెము
గక్కన నీవు గూడగా కాతాళము లణగె
మిక్కిలి మన్నించగాను మెచ్చితి నేను
అక్కున శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను
వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను
ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాళాలు నప్పాలు వడలు
పెక్కైనసయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి
మీరినకెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును బెరుగులు బాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ
ఇందిరారమణు దెచ్చి యియ్యరో మా కిటువలె
పొంది యీతని పూజింప పొద్దాయనిపుడు !!
ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
నేరుపున మించిన అంజనీతనయా
ఘోర(తూల)నాగపాశముల కొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా !!
నానాదేవతలకు నరసింహు కంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
మానవుడౌ కృష్ణ మహిమల విశ్వరూపు
పూని బండి నుంచుకొన్న పోటుబంట అర్జునా !!
శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
కైవసమైనయట్టి కార్తవీర్యార్జునుడా
దేవుని నీవేళనిట్టె తెచ్చి మాకు నియ్యరే !!
ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక
బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు
రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ళనిమియు
బాయట నిద్రాదేవి పలుమారును
చాయలకు నిచ్చానిచ్చా జచ్చిచచ్చి పొడమేటి
మాయజీవులకునెల్లా మని కేటిమనికి
కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీకటౌను
కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియు దోచె
యెనయుజీవుల కింక యెఱు కేటియెఱుక
వొప్పగుబ్రాణము లవి వూరుగాలివెంట
యెప్పుడు లోనివెలికి నెడతాకును
అప్పుడు శ్రీవేంకటేశు డంతరాత్ము డందరికి
తప్పక యాతడే కాచు తల పేటితలపు
ఇందిరానాథు డిన్నిటి కీత డింతే
బందెలకర్మములాల పట్టకురో మమ్మును ||
యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే
యెఱుగక చేసినది యీతనిమాయే
తెఱగొప్ప రెంటికిని తెడ్డువంటివాడ నింతే
పఱచుగర్మములాల పట్టకురో మమ్మును ||
కాయములోపలివాడు ఘను డొక్కడితడే
కాయ మీతనిప్రకృతికల్పిత మింతే
తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే
బాయటికర్మములాల పట్టకురో మమ్మును ||
యేలినవాడు శ్రీవేంకటేశు డిత డొక్కడింతే
యేలికసానై పెంచేది యీతనిసతే
పోలి నే వీరిగొలిచేసూత్రపు బొమ్మ నింతే
పాలుపుగర్మములాల పట్టకురో మమ్మును ||
ఇందిరానామ మిందరికి
కుందనపుముద్ద వోగోవింద ||
అచ్చుతనామము అనంతనామము
ఇచ్చినసంపద లిందరికి
నచ్చినసిరులు నాలుకతుదలు
కొచ్చికొచ్చీ నోగోవింద ||
వైకుంఠనామము వరదనామము
ఈకడనాకడ నిందరికి
నాకుదెరవులు వన్నెలు లోకాల
గూకులు వత్తులు నోగోవింద ||
పండరినామము పరమనామము
ఎండలునాపెడి దిందరికి
నిండునిధానమై నిలిచినపేరు
కొండల కోనేటివో గోవింద ||
ఇందిరానాయక యిదివో మాపాటు
చెంది నీవే గతి చేకొనవయ్యా ||
తీసీ గోరికతీదీపు లొకవంక
లాసీ సంసారలంపటము
మూసీ గర్మము మునుకొని పరచింత
సేసేదేమిక జెప్పేదేమి ||
వంచీ నాసలు వలసినచోటికి
పొంచీ దుర్గుణభోగములు
ముంచీ యౌవన మోహాంధకారము
యెంచేదేమి సోదించేదేమి ||
ఎరిగీ జిత్తము యించుకించుక నిన్ను
మరవని నీపైభక్తి మతినుండగా
నెరి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక
వెరచి నేజేసే విన్నపమేమి ||
ఇందిరాపతిమాయలు యింతులు సుండీ
మందలించి హరి గొల్చి మనుదురుగాని ||
అతివలచూపులే ఆయాలు దాకీ జుండీ
జితమైనపులకల జిల్లులౌజుండీ
రతిపరవశములు రాగినమూర్ఛలు సుండీ
మతిలో దప్పించుక మనుదురుగాని ||
మెఱయించేచన్నులే మించుబెట్లగుండ్లు సుండీ
మెరగుమోపులే మచ్చుమేపులు సుండీ
మఱి మంచిమాటలు మాయపుటురులు సుండీ
మఱవక తప్పించుక మనుదురుగాని ||
బలుసంసారపుపొందు పాముతోడిపొత్తు సుండీ
వెలలేని వలపులు విషము సుండీ
యెలమితో శ్రీవేంకటేశ్వరుమఱుగు చొచ్చి
మలయుచు సొలయుచు మనుదురుగాని ||
ఇందు నుండి మీకెడలేదు
సందడి సేయక చనరో మీరు ||
నాలుక శ్రీహరి నామంబున్నది
తూలుచు బారరొ దురితముల
చాలి భుజంబున చక్రంబున్న
తారిమి భవబంధములటు తొలగరో ||
అంతర్యామై హరి వున్నాడిదె
చింతలు వాయరొ చిత్తమున
వింతలు జెవులను విష్ణుకథలివిగొ
పొంత గర్మములు పోరో మీరు ||
కాపయి శ్రీ వేంకటపతి పేరిదె
నాపై నున్నది నయమునను
కోప(పు) కామాది గుణములాల మీ
రేపున కడగడ నెందైన బోరొ ||
ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వోమనసా
అంది సర్వసంపన్నుడు దేవుడు అతనికంటే నేరుతుమా
కల దొకటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది
తలకక మీశరణుచొచ్చి మీదాసుడ ననెడి దొకమాట
వలవనిజోలే యింతాను వడి నిదిగాక యేమిసేసినను
సులభ మిందునే తొల్లిటివారలు చూరలు గొని రదేమోక్షంబు
మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది
వొదుగుచు గోవిందునిదాసులకు నొక్కమాటే మొక్కినజాలు
తుదకెక్కనివే యితరములు దొరకొని మరేమిసేసినను
బదికి లిరిందునే పరమవైష్ణవులు పలుచదువులలో వినరాదా
తగులొకటే విడువరానిది తతి నెన్నటికిని జెడనిది
వొగి శ్రీవేంకటపతినామజపము వొకమాటే అబ్బిన జాలు
నగుబాటే యింతాను నానాటి కేమేమిసేసినను
తగునీబుద్దుల నడచిరి మున్నిటిదైవజ్ఞులు పూర్వాచార్యులును
ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును
అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||
ఆతుమ లోన నుండి యఖిలోపాయములు
చేతనునకు నీవే చింతించగాను
కాతుర పడి నేను కర్తననుచు బనులు
యాతల జెప్పగబూనే విస్సిరో ||
తనువిటు నీవొసగి తగుభాగ్యము నీవై
అనువుగ జీవునినీ యటు నీవేలగను
తనియక నేనొరులు దాతలనుచుబోయి
కనుగొని వేడగ దొడగేకటకటా ||
శ్రీ వేంకటాద్రిపై నుండి చేరి కన్నులెదుటను
సేవగొని యిటేకృపసేయ గాను
సేవలగన్న వారెల్ల జుట్టములంట నేను
జీవులతోబొందు సేసేజెల్లబో ||
ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు
కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||
హరి నీవు కప్పురకా పవధరించేవేళ
విరివిగా నిందరు భావించి చూచితే
తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీద
పెరిగిపెరిగి యట్టే పేరినయట్లుండె ||
భువనేశ నీవు తట్టుపుణుగు చాతుకొనగ
యివల నీదాసులెల్లా నెంచిచూచితే
కవగూడి నీసతులకనుచూపులెల్లాను
తివిరి నీమేనిమీద తిరమైనట్లుండె ||
శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో
తావున మెరసేది నే దలిచితేను
కోవరపుగొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు
వేవేలయి నీయందచ్చు వేసినయట్లుండె ||
ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు
కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||
నయమెంత గలిగినా ననుపులకే మేలు
ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు
జయమెంత గలిగినా చనవులకే మేలు
క్రియలెఱుగుదువు యీకీలు నీవే నేర్తువే ||
మొగమెంత చూచినా మోహానకే మూలము
తగవెంత నెరపినా తగులుకే మూలము
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము
పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||
వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు
వేడుకెంత నిలిపినా విఱ్ఱవీగుటకే దాపు
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు
జాడెఱుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||
ఇందుకేపో వెరగయ్యీ నేమందును
కందులేనినీమహిమ కొనియాడగలనా
అటు దేవతలకెల్ల నమృతమిచ్చిననీవు
యిటు వెన్న దొంగిలుట కేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టినీవు
నట రోలగట్టువడ్డచందాన కేమందును
కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు
యిల నావుల గాచుట కేమందును
తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు
చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును
భావించ నన్నిటికంటే బరమమూర్తివి నీవు
యీవల బాలుడవైతి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీవేంకటాద్రి నిలిచితి వేమందును
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||
అటమటపు వేడుకల నలయించి మరికదా
ఘటియించు బరము తటుకన దైవము
ఇటుసేయు నీశ్వరున కీసు గలదా లేదు
కుటిలమతి గని కాని గురి గానరాదు ||
బెండుపడ నవగతుల బెనగించి మరికదా
కొండనుచు బరమొసంగును దైవము
బండుసేయగ హరికి బంతమా యటుగాదు
యెండదాకక నీడహిత వెరగరాదు ||
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మరికదా
తనభక్తి యొసగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా అటుగాదు
తినక చేదును దీపు తెలియనేరాదు ||
ఇందునందు దిరుగుచు నెవ్వరివాడవుగాక
బందెపసరమువైతి బాపు జీవుడా ||
తోలుబొక్కలోన జొచ్చి తూలేటియాకలిచేత
పాలుమాలి యిందరికి బంటుబంటవై
యేలినవాని గానక యేచినయాసలవెంట
కూలికిబో దొరకుంటి కూళజీవుడా ||
తీటమేనిలోన జొచ్చి దిమ్మరిదొంగలచేత
మూటగట్టించుక నీవు మూలదొరవై
గాటపువిభునిచేతిఘనత కోరికలకు
వేటకుక్కవైతివి వెర్రిజీవుడా ||
చీమలింటిలోన జొచ్చి చిక్కువడి అందరిలో
దోమకరకుట్లకు తోడిదొంగవై
యేమరి వేంకటవిభు నెరుగక జాడుజొప్ప
నాము మేయ దొరకొంటి నాలిజీవుడా ||
ఇందునుండ మీకెడ లేదు
సందడిసేయక చనరో మీరు ||
నాలుక శ్రీహరినామంబున్నది
తూలుచు బారరో దురితములు
చాలి భుజంబున చక్రంబున్నది
తాలిమి భవబంధము లటుదలరో ||
అంతర్యామై హరి వున్నాడిదె
చింతలు వాయరొ చిత్తమున
వింతల జెవులను విష్ణుకథ లివిగొ
పొంత గర్మములు పోరో మీరు ||
కాపయి శ్రీవేంకటపతి పేరిదె
నాపై నున్నది నయమునను
కోపపు కామాది గుణములాల మీ
రేపున కడగడ నెందైన బోరో ||
ఇందుమీద సతిభావ మెట్లౌనో యేమౌనో
విందుగా జెలువునికి విన్నవించరే ||
కోవిలకూతకుగానే గుండె జల్లురని చెలి
పూవక పూచిన యట్టు పులకించె
మావినుండి యంతలోనే మదన భూతముసోకె
పోవులైన పుప్పొడినే పోయరే బడిమి ||
కోమలి చందురుడనే కొరవిదయ్యము జూచి
దీమన మింతయు మాని దిగులందెను
తేమలైన వెన్నెలల దిమ్మువట్టి నిలువున
మైమఅచె గప్పురాన మంత్రించరే ||
ఇంతలో శ్రీవేంకటేశుడిందుకు విచ్చేయగాను
చింతదీర మేనెల్ల జెమరించెను
వింతలైన రతులలొ విరహపు సోకు వాసె
కంతు చిగురాకు రక్షగట్టరే యంగనకు ||
ఇందులో మొదలికర్త యెవ్వడు లేడుగాబొలు
ముందు కరివరదుడే ముఖ్యుడుగాబోలు
ఆడితిబో బహురూపా లన్ని యోనుల బుట్టి
తోడనె బ్రహ్మాదులనేదొరలెదుటా
జాడలు మెచ్చాలేరు చాలునన్న వారు లేరు
వేడుక నడవిగానేవెన్నెలాయ బ్రదుకు
అన్ని కర్మములు జేసి ఆటలో బ్రాహ్మణుడనైతి
నన్ని వేదములనేటియంగడివీధి
నన్ను జూచేవారు లేరు నవ్వేటివారు లేరు
వన్నెలసముద్రములో వానలాయ బ్రదుకు
సంసారపు నాటకసాలలో ప్రతిమనైతి
కంసారి శ్రీవేంకటపతిమాయలోన
యింసలెన్నియు దేరె నిందరు జుట్టములైరి
హంసచేతిపాలునీరునట్లాయ బ్రదుకు
ఇందులోనే కానవద్దా యితడు దైవమని
విందువలె నొంటిమెట్టవీరరఘరాముని ||
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుడు ఖండించినాడు
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే
గొందిబడ గట్టివేసి కోపగించేనాడు ||
యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు ||
జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష
మమర జీవుల కిచ్చె నల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి
తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు ||
ఇచ్చలో గోరేవల్లా ఇచ్చేధనము
అచ్చుతనామమెపో అధికపుధనము
నారదాదులువొగడేనాలుకపయిధనము
సారపువేదములలో చాటేధనము
కూరిమిమునులు దాచుకొన్నట్టిధనము
నారాయణనామ మిదే నమ్మినట్టిధనము
పరమపదవికి సంబళమైనధనము
యిరవై భక్తులకెల్లా నింటిధనము
పరగ నంతరంగాన పాతినట్టిధనము
హరినామ మిదియపో అరచేతిధనము
పొంచి శివుడు కాశిలో బోధించేధనము
ముంచినాఅచార్యుల మూలధనము
పంచి శ్రీ వేంకటపతి పాలించేధనము
నించి విష్ణునామ మదే నిత్యమైనధనము।
ఇట మీద కడమెల్లా నిక నీవు దీర్చవయ్యా
పటుకున జెలి నీకు బాలుపెట్టీ నిదిగో ||
నెలత మంచముపై కిన్నెర వాయించి వాయించి
తలకొని నీవురాగా దలవంచెను
సొలసి చెలులతోడ సుద్దులు దాజెప్పి చెప్పి
చెలగి నీమోము చూచి సిగ్గువడీ నిదిగో ||
పడతి నీమీది పాట పాడిపాడి అర్థము నీ
వడిగితే నవ్వలి మోమై నవ్వీని
అడియాలముల రూపు అద్దములో జూచి చూచి
కడు నీవు కొంగు వట్టగా భ్రమసీని ||
సతి యేకతాన నుండి జవ్వాది పూసి పూసి
రతి నీవు గూడగా సరసమాడీని
ఇతవైన శ్రీ వేంకటేశ నీవాపె గూడగా
పతి చూచి యిప్పుడిట్టె పక్కున నవ్వీని ||
ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన బగిలె ||
ఎగసినగరుడని యేపున ’థా’యని
జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడ గడ వడకె ||
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై
తెరుపున నలుగడ దిరదిర దిరిగె ||
పల్లించిననీపసిడిగరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీమహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా ||
ప|| ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుడే రక్షకుడు |
తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగునిశ్చింతయే పరమసుఖము ||
చ|| ఆకటి కడుగనిశిశువుకు దల్లి యడిచిపాలు ద్రాగించినరీతి |
యీకడ గోరికలుడిగినయోగికి నీశ్వరుడే రక్షకుడు |
చేకొని బుద్దెరిగినబిడ్డలపై జింతింపరు తొల్లిటివలె దల్లులు |
యీకొలదులనే స్వయత్నదేహుల కీశ్వరుడును వాత్సల్యము వదలు ||
చ|| తతిగరిరాజు గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు |
హితమతి స్వతంత్రముడిగినయోగికి యీశ్వరుడే రక్షకుడు |
అతడును భస్మంబయ్యిననాడు అజునిశిరంబటు ద్రుంచిననాడు |
చతురుడు దానడ్డమురాడాయను స్వతంత్రముడుగని జీవుడుగాన ||
చ|| దిక్కని యనిశము జిత్తములోన జింతించేటి శరణాగతజనులకు |
యిక్కడనక్కడ శ్రీవేంకటాగిరియీశ్వరుడే రక్షకుడు |
మక్కువతో దనయంతర్యామిని మరచినస్వామిద్రోహులకెల్లా |
అక్కరతో బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన ||
ఇటువంటి దాన నాకేటి యలుకే
గట కట తేరాగా గాదనేనా నేను ||
మాటలాడ కుండు గాని, మనసు లోపల నైతే
నాటినది తనమీద నా చిత్తము
కాటుక కన్నుల జూచి కసరుదుగాని నేను
వాటపు వలపు మీద వంతుబో లోలోనే ||
దగ్గరి రాకుందుగాని, తా నన్ను నంటినప్పుడే
వెగ్గళించి సిగ్గులెల్లా వీడ గలవే
యెగ్గువట్టి వుందుగాని, యేపాటి నవ్వించినాను
అగ్గలపు సరసము లాడుదుబో నేను ||
నివ్వెర గందితిగాని, నేడు నన్ను గూడగాను
పవ్వళించి నప్పుడే పో పరవశము
యివ్వల శ్రీ వేంకటేశుడేకతమాయ నాతోను
జవ్వన భారము చేత జడిసీబో తనువు ||
ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను
చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||
వినయము సేసే చోట వెంగెములాడగ రాదు
చనవిచ్చిన చోటును జరయరాదు
మనసొక్కటైన చోట మంకులు చూపగరాదు
ననువులు గలిగితే నమ్మకుండరాదూ ||
ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననగరాదు
క్రియగల పొందులు తగ్గించగరాదు
నయమిచ్చి మాటాడగా నవ్వక మానరాదు
దయతో దగులగాను దాగగరాదు ||
పచ్చిదేర గూడగాను పంతములుడుగరాదు
కచ్చుపెట్టి చెనకగా గాదనరాదు
ఇచ్చట శ్రీ వేంకటేశుడింతలోనే నన్నుగూడె
మెచ్చి సరస మాడగా మితిమీఱరాదు ||
ఇటువలెపో సకలము యించుకగన భావించిన
అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||
పగగొనితిరుగేటిజన్మపుబాధలు తన కేకాలము
తగుసుఖ మెక్కడ నున్నది తడతాకులేకాక
పొగలోపల సెకగాసిన భుగభుగ గన్నుల నీళ్ళు
నిగిడినదుఃఖమేకాకిలు నిజసౌఖ్యము గలదా ||
పొలసినమాయపురూపులు పొలతులమచ్చికమాటలు
తలచిన తనకేమున్నది తలపోతలేకాక
బలుపున బారగ మోహపుపాశము తనమేడ దగిలిన
తలకిందుగ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ||
చేతిపదార్థము దలచక చేరువనుండినవారల
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా
ఆతుమగలవేంకటపతి నాత్మ దలచి సుఖింపక
యేతరిసుఖముల దిరిగిన నింపులు దనకౌనా ||
ఇట్టి జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే
పుట్టుగులు మరిలేవు పొందుదురు మొక్షము
అతిసూక్ష్మమీయాత్మ అందులో హరియున్నాడు
కతలే వినుటగాని కానరాదు
క్షితిదేహాలు ప్రకృతిజెందిన వికారములు
మతినిది దెలియుటే మహిత జ్ఞానము ||
లోకము శ్రీపతియాజ్ఞలో తత్త్వాలిరువదినాల్గు
కైకొని సేతలు సేసీగర్తలు లేరు
సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు
యీకొలది గని సుఖియించుటే సుజ్ఞానము ||
కాలము దైవము సృష్టి కలిమన్యుల భాగ్యము
వాలాయించి యెవ్వరికి వచింపరాదు
ఈలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుడు
తాలిమి జెప్పగా విని తలంచుటే సుజ్ఞానము ||
ఇట్టి నాస్తికులమాట యేమని సమ్మెడి దిక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు
వేదములు చదువుతా విశ్వమెలా గల్లనేరు
ఆదెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగువిష్ణుడుండగ బయలు తత్వమనేరు
లేదు జీవతత్వమంటా లేమల బొందుదురు
తిరమై తమ ఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముదామే దైవమనేరు
ఆరయగర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు
అందుక పురుషసూక్తమర్థము జెప్పుదురు
కందువ నప్పటి నిరాకారమందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుగాక
మందపురాక్షసులాడేమతము నడతురు
ఇట్టి ప్రతాపముగల యీతని దాసులనెల్ల
కట్టునా కర్మములెల్ల గాలి బోబుగాక
యెలమి జక్రాయుధున కెదురా దానవులు
తొలగ కెందుచొచ్చిన దుండించుగాక
ఇల గరుడధ్వజుపై నెక్కునా విషములు
కలగి నీరై పారి గాలిబోబుగాక
గోవర్దనధరునిపై కొలువునా మాయలు
వేవేలుదునుకలై విరుగుగాక
కేవలుడచ్యుతునొద్ద గీడు చూపగలవా
కావరమై తా దానె గాలి బోవుగాక
వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలగుగాక
కోరి యీ శ్రీవేంకటేశు గొలిచితి మిదివో
కారుకొన్నపగలెల్ల గాలి బోవుగాక
ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా
పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||
చెలియతోడే నీకు సింహాసనపుగద్దె
అలరుజూపులె రత్నాభిషేకాలు
చలువైన నవ్వులే ఛత్రచామరములు
కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||
చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు
నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు
వొనరిన కౌగిలే వుండెడి నీనగరు
యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||
రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు
సతతపుగూటమే సర్వసంపద
యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే
ఇట్టి విందు గంటివా నీవెక్కదైనా
అట్టె ఆకెపొత్తున నీవారగించవయ్యా ||
కలికి కెమ్మోవితీపు కమ్మని తేనెలవిందు
చలువచూపులు నీకు జిక్కెరవిందు
సెలవి లేనవ్వులే చిలుపాలతోడి విందు
అలమేలుమంగ సేసి నారగించవయ్యా ||
కాంత గోరిచెనకులు కారపు గూరలవిందు
పంతపు మాటలే ఆవపచ్చడి విందు
వింతబొమ్మల జింకెనలే వేడి పడిదాల విందు
అంతసేసీ నీదేవి యారగించవయ్యా ||
అట్టడి సమరతి యాఅడి తరితీపువిందు
గట్టి సిగ్గు పెరుగు మీగడల విందు
గుట్టుతో మన్నించితివి కమ్మను శ్రీవేంకటేశ
అట్టె నీతనివిదీర నారగించవయ్యా ||
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని
పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే ||
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువులచేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరినెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన
తప్పకుండ బెట్టెవాని తలకెత్తరే ||
ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద
యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||
కుడువడా ప్రాణములుగొనుచు బూతకిచన్ను
తుడువడా కపటదైత్యులనొసలివ్రాలు
అడువడా నేలతో నలమి శకటాసురుని
వడువడా నెత్తురులు వసుధ కంసుని ||
పెట్టడా దనుజారిబిరుదు లోకమునమ్దు
కట్టడా బలిదైత్యు కర్మబంధముల
మెట్టడా కాళింగుమేటిశిరములు, నలియ
గొట్టడా దానవుల గోటానగోట్ల ||
మరవడా పుట్టువులు మరణములు బ్రాణులకు
పరపడా గంగ దనపాదకమలమున
చెరుపడా దురితములు శ్రీవేంకటేశుడిదె
నెరపడా లోకములనిండ దనకీర్తి ||
ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ
శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ||
ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె
అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె
సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె
ఖరదూషణులను ఖండించి వేసె ||
కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె
వనధి బంధించి దాటె వానరులతో
కవలి రావణ కుంభకర్ణాదులను జంపి
వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును ||
సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ
భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె
శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద
కామించి విభీషణు లంకకు బట్టముగట్టె ||
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||
———————————————————————————————————————————–
ఇతనికంటె ఘనులిక లేరు
యిరర దేవతల యిందరిలోన॥
భూపతి ఈతడె పొదిగి కొలువరో
శ్రీపతి ఈతడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు॥
మరుగురుడితడే మతి నమ్మగదరో
పరమాత్ముడితడే భావించరో
కరివరదుడితడే గతియని తలచరో
పరగ శ్రీ వేంకటపతియైనాడు॥
తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీ వేంకటహరి అయినాడు॥
ఇతనికంటే ఘనులు ఇకలేరు
ఇతరదేవతల ఇందరిలోన ||
భూపతి యితడే పొదిగి కొలువరో
శ్రీపతి యితడే చేకొనరో
ఏపున బలుపుడు నితడే చెరరో
పై పై వేంకట పతి యైనాడు ||
మరుగురు డితడే మతినమ్మగదరో
పరమాత్ము డితడే భావించరో
కరివరదు డితడే గతియని తలచరో
పరగ శ్రీవేంకట పతియై నాడు ||
తల్లియు నితడే తండ్రియు నితడే
వెల్లవియై యిక విడువరో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీ వేంకట హరి యయినాడు ||
ఇతనికంటే నుపాయ మిక లేదు
మతిలోననున్న వాడు మర్మ మిదే సుండీ.
ఇన్నిలోకసుఖములు ఇంద్రియప్రీతులే
తన్ను గనినతల్లిదండ్రి తనుపోషకులే
కన్ను లెదిటిధనాలు కారణార్థములే
వున్నతి నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
కలదేవత లిందరు కర్మఫలదాతలే
లలి విద్యలెల్ల ఖ్యాతిలాభపూజలకొరకే
పలుమంత్రములెల్లను బ్రహ్మలోక మీసందివె
వొలిసి ఇష్టార్థసిద్ది కొక్కడే దేవుడు.
అనుదినరాజసేవ లల్ప్రార్థహేతులే
కొనగల్పవృxఅమైన గోరినవిచ్చేటిదే
ఘన శ్రీవేంకటేశుడు కల్పించె జీవుని గావ_
వొనర నిష్టార్థసిద్ది కొక్కడే దేవుడు
ఇతర చింత లిక నేమిటికి
అతడే గతియై అరసేటివాడు
కర్మమూలమే కాయము నిజ
ధర్మమూలమే తనయాత్మ
అర్మిలి రెంటికి హరియొకడే
మర్మ మీతడే మనిపేటివాడు
బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుడే
సహజపుకర్తై జరపేటివాడు
అతిదుఃఖకరము లానలు
సతతసుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకడిన్నిట బాలించువాడు
ఇతర దేవతల కిదిగలదా
ప్రతివేరి నీ ప్రభావమునకు ||
రతిరాజ జనక రవి చంద్ర నయన
అతిశయ శ్రీ వత్సాంకుడవు
పతగేంద్ర గమన పద్మావతి పతి
మతి నిను తలచిన మనోహరము ||
ఘన కిరీటధర కనకాంబర పా
వన క్షీరాంబుధి వాసుడవు
వనజ చక్రధర వసుధ వల్లభ
నిను పేరుకొనిన నిర్మలము ||
దేవ పితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీ వేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవార మనుటే నిజ సుఖము ||
ఇతర ధర్మము లందు నిందు గలదా
మతి దలప పరము నీమతముననే కలిగె ||
విదురునకు బరలోకవిధి చేసెనట తొల్లి
అదె ధర్మసుతుడు వర్ణాశ్రమంబులు విడిచి
కదిసి నీదాసుడైన కతముననేకాదె యీ
యెదురనే తుదిపదం బిహముననే కలిగె ||
అంటరానిగద్దకుల మంటి జటాయువుకు నీ
వంటి పరలోకకృత్యములు సేసితివి మును
వెంట నీకైంకర్యవిధి కలిమినేకాదె
వొంటి నీహస్తమున యోగ్యమై నిలిచె ||
యిరవైనశబరిరుచు లివియె నైవేద్యమై
పరగెనట శేషమును బహువిధములనక
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె
సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయె ||
ఇతరచింత లేక యేమిటికి
అతడే గతియై అరసేటివాడు ||
కర్మ మూలమే కాయము నిజ
ధర్మ మూలమే తన యాత్మ
అర్మిలి రెంటికి హరి యొకడే
మర్మ మీతడే మనిపేటి వాడు ||
బహుభోగ సమయము ప్రపంచము
విహిత జ్ఞానము నిజముక్తి
ఇహపరములకును ఈశ్వరుడే
సహజ కర్తయై జరిపేటి వాడు ||
అతి దుఃఖకరము లాసలు
సతత సుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీ వేంకట
పతి యొకడిన్నిట పాలించువాడు ||
ఇతరదేవతల కిది గలదా
ప్రతి వేరీ నీప్రభావమునకు
రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయశ్రీవత్సాంకుడవు
పతగేంద్రగమన పద్మాసతీపతి
మతి నిను దలచిన మనోహరము
ఘనకిరీటధర కనకాంబర పా__
వన క్షీరాంబుధివాసుడవు
వనజచక్రధర వసుధావల్లభ
నిను బేరుకొనిన నిర్మలము
దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవా మనుటే నిజసుఖమ
ఇతరము లిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుట పరము ||
ఎక్కడిసురపుర మెక్కడివైభవ
మెక్కడి విన్నియు నేమిటికి
యిక్కడనే పరహితమును బుణ్యము
గక్కున జేయగ గల దిహపరము ||
యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగులక్ష్మీరమణుని దలపుచు
యివ్వల దా సుఖియించుట పరము ||
యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెరిగి వేంకటగిరిరమణుని
చిందులేక కొలిచిన దిహపరము ||
ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము
సతత పూర్ణునికి శరణ్యము ||సకలలోకముల సాక్షియై గాచిన
సర్వేశ్వరునకు శరణ్యము
ఉర్వికి మింటికి ఒక్కట మెరిగిన
సార్వభౌమునకు శరణ్యము ||శ్రీకాంత నురము చెంగట నిలిపిన
సాకారునకును శరణ్యము
పైకొని వెలిగేటి పరంజ్యోతి యౌ
సౌకుమారునకు శరణ్యము ||తగ నిహ పరములు దాసుల కొసగెడి
జగదీశ్వరునకు శరణ్యము
నగు శ్రీ వేంకట నాథుడ నీకు
సుగుణమూర్తి యిదె శరణ్యము ||
—————————————————————————————————————————————————————————–
ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు
పతులకు సతులకు భావజుడే సాక్షి ||తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి
అలరు సమ్మతించితె నడ్డాకలేమి
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి
సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి
హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల
చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి
యెన్నికల కెక్కితేను యీడు జోడేది
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి
కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||
——————————————————————————————————————————————————————————–
ఇతరులకు నిను నెరుగదరమా // పల్లవి //
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర
హితులెరుగుదురు నిను నిందిరారమణా //అను పల్లవి//
నారీకటాక్షపటునారాచభయరహిత
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము //ఇతరులకు నిను //
రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా
యోగులెరుగుదురు నీవుండేటివునికి //ఇతరులకు నిను //
పరమభాగవత పదపద్మసేవానిజా
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు
పరగునిత్యానంద పరిపూర్ణమానస
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ //ఇతరులకు నిను //ఇతరులకు నిను నెఱుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర-
హితులెఱుగుదురు నిను నిందిరారమణా॥
నారీకటాక్ష పటు నారాచభయరహిత-
శూరులెఱుగుదురు నిను చూచేటిచూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుగుదురు నీదివ్యవిగ్రహము॥
రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుగుదురు నీవుండేటి వునికి॥
పరమ భాగవత పదపద్మ సేవానిజా-
భరణు లెఱుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-
స్థిరులెఱుగుదురు నిను తిరువేంకటేశ॥
ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటూ
కొత్తసేతలెల్ల దొరకొంటిగా నీవు ||
హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన
మైనపదవుల బెట్టేయటువలెనే
మానక యెవ్వతెనైన మచ్చిక దగిలి నాతో
నానిపట్టి సరిసేసే వద్దిరా నీవూ ||
కడుబాతకులు నిన్ను గదిసి కొలిచేరంటా
నడరి పుణ్యులజేయునటువలెనే
కడగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి
వడి నన్ను గెరలించవద్దురా నీవూ ||
దిందుపడ మాయసేసి దేవుడ నేగానంటా
నందరి భ్రమలబెట్టునటువలెనే
అందమైనతిరువేంకటాద్రీశ నీప్రేమ
చెంది నన్ను గూడి దాచజెల్లునా నీవూ ||
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదాఅతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండెతరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయశ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
———————————————————————————————————————————–
ఇదిగో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
కదిసి నీవే కరుణించవయ్యా ||
తల్లిచంకనున్న బిడ్డ తమితో జన్నుదాగు తా
నొల్లడు తండ్రి యెత్తుకొన బోతేను
మల్లడి నీ మాయలో మరిగిన జీవముల
మెల్లనె మీసేవజేసి మిమ్ము జేరజాలము ||
రెక్కల మరుగుపక్షి రెక్కలక్రిందనే కాని
యెక్కడు వద్దనే మేడ యెంతవున్నను
ప్రక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
యెక్కుడైన వైకుంఠ మిది గోరజాలము ||
నీరులో నుండేటి కప్ప నీటిలో వుండుగాని
వూరకే పరుపు మీద నుండదెంతైనను
అరయ సంసారములో అజ్ఞానపు జీవులము
బోరన శ్రీవేంకటేశ బుద్ధి చెప్పికావవె ||
ఇదియె నాకు మతము ఇదివ్రతము
వుదుటుల కర్మము వొల్లనింకను ||నిపుణత హరినే నిను శరణనుటే
తపములు జపములు ధర్మములు
నెపమున సకలము నీవే చేకొను
వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||హరి నీదాసుడ ననుకొనుటే నా
పరమును ఇహమును భాగ్యమును
ధర నీ మాయల తప్పు తెరువులను
వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||నారాయణ నీ నామము దలచుట
సారపు చదువులు శాస్త్రములు
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి
వూరక ఇతరము లొల్ల నే యింకను ||
———————————————————————————————————————————–
ఇదియే మర్మము హరి యిందుగాని లోనుగాడు
పదపడి జీవులాల బదుకరో ||
హరి గానలేరు అరసెందువెదికినా
హరిదాసు లెఱుగుదు రడుగరో
గరిమె బ్రత్యక్షము గాడు దేవు డెవ్వరికి
ధర బ్రత్యక్షము హరిదాసుల గొలువరో ||
చేత ముట్టి గోవిందుని శిరసు పూజించలేరు
చేతులార ప్రసన్నులసేవ సేయరో
జాతిగాగ విష్ణునిప్రపాద మేడ దొరకీని
ఆతల వారి బ్రసాద మడుగరో ||
అంతరంగమున నున్నాడందురు విష్ణుడు గాని
అంతటా నున్నారు వైష్ణవాధికులు
చెంతల దదియ్యులచేతియనుజ్ఞ వడసి
సంతతం శ్రీవెంకటేశుశరణము చొరరో ||
ఇదియే రమయోగ మిద్దరికి విభుడా
అదన ననిచన ద్రిస్శ్తాంత మాయనిపుడు ||వెలి మన మిద్దరము వేరై వుందుము గాని
తలపు లోపలను ఇద్దర మొకతే
వొలసి యుద్దములోన నొకరూపే రెండై
తెలిసినట్లనేపో ద్రిస్శ్తాంతమిపుడు ||పేరులిద్దరికి నిట్టె భేదమైతో చీగాని
తారుకాణ గుణము లిద్దరి కొకతే
కోరిన మాటొకటే కొండశలలో రెండవు
తేరి చూడనిది యేవో ద్రిస్శ్తాంతమిపుదు ||శ్రీ వేంకటేశ నీనా చేతవే వేరులుగాని
కేవలిద్దరికి కాగిలి వొకటే
పూవు గుత్తి వొకటే పూపలు వేరైనట్ట్లు
దేవ యిన్నిటికి నిదె ద్రిస్శ్తాంత మిపుడు ||
———————————————————————————————————————————–
ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము ||విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియేపో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనుక వారెల్ల
విరతి బొందకున్న వీడదు భయము ||చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలనే శ్రీహరి నిలుచును
చిత్తశాంతిలేక చేరదు పరము ||ఎంత చదివినా యెంత వెదికినా
యింతకంటె మరియిక లేదు
ఇంతట శ్రీవేంకటేశు దాసులౌట
యెంతవారికైన యిదియే తెరవు ||
———————————————————————————————————————————–
ఇదియే సాధన మిహపరములకును
పదిలము మాపాలి పరమపు నామము ||
కలిదోష హరము కైవల్యకరము
అలరినమా శ్రీహరి నామము
సులభము సౌఖ్యము శోభన తిలకము
పలుమారు శ్రీపతి నామము ||
పాప నాశనము బంధ విమోక్షము
పై పై నిది భూపతి నామము
స్థాపిత ధనమిది సర్వ రక్షకరము
దాపుర మిది మాధవ నామము ||
నేమము దీమము నిత్యకర్మ మిది
దోమటి గోవిందుని నామము
హేమము శరణము ఇన్నిట మాకును
యే మేర శ్రీ వేంకటేశ్వరు నామము ||
ఇదియే సులభము ఇందరికి
కదియగ వశమా కరుణనె గాక
నగధరుందు పన్నగశయనుదు భూ
గగనాంతరిక్ష గాత్రుండు
అగణితుడితని నరసి తెలియగా
తగునా కనెడిది దాస్యమె గాక
కమలజ జనకుడు కాముని జనకుడు
కమలాసతిపతి ఘనగుణుడూ
విమలుండీ హరి వెదకి కావగను
అమరున శరణా గతి గాక
దేవుడు త్రిగుణాతీతుడనంతుడు
కైవల్యమొసగు ఘనుడితడు
శ్రి వేంకతాపతి జీవాంత రాత్ముడు
భావించ వశమా భక్తినె గాక
ఇదివొ సంసార మెంతసుఖమోకని
తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి
కొంచెపుసుఖంబునకు గూర్పగాను
మించి కామంబనెడి మేటితనయుండు జని
యించి దురితధనమెల్ల గడియించె ||పాయమనియెడి మహాపాతకుడు తను దెచ్చి
మాయంపుసుఖమునకు మరువగాను
సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల
బోయి యీనరకమను పురము గడియించె ||అతిశయుండగు వేంకటాధీశుడను మహా
హితుడు చిత్తములోన నెనయగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య
ప్రతియయి మోక్షసంపదలు గడియించె ||
———————————————————————————————————————————–
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ( గైకొనవయ్యా
పలచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతె చూచెనటా
తళుకులగోళ్ళ దండె మీటి యదె
పలికి నిన్నొకతె పాడెనటా
చనవులు నెరపుచు సన్న సేయుచును
ననుపున నొక్కతె నవ్వెనటా
చెనకి యొకతె యదె చిగురుగేద(గుల
వెనకనుండి నిను వేసెనటా
అదన నీవు నన్నలమిపట్ట(గా
కొదలి యొకతె గని గొణ(గెనటా
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ
చెదరినయలకలు చెరిగెనటా
ఇదె నీ కన్నుల యెదిటికివచ్చితి
కదియుచు నెట్లైన గావక పోదు ||
పరమపురుష నీ భక్తి దొరకకనే
ఇరవగు జన్మము లెత్తితిని
హరి నీకరుణకు నరుహము లేకనే
దురితవిదుల సందుల బడితిని ||
జగదీశ్వర నీ శరణము లేకనే
వొగి సంసారపు వురి బడితి
భగవంతుడ నీ పదములు గనకనే
తెగని పాపముల తీదీపు లైతి ||
గోవిందుడ నిను కొలువగ నేరకనే
ధావతి యాసల తగిలితిని
శ్రీ వేంకటేశ్వర చేరి నీవు నా
దైవమవు కాగ ధన్నుడ నయితి ||
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా
రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆ
రామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెలుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని
కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
దశరధాత్మజా నీవు దశశిరుని చంపి
ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు
ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు
గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||
పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు
కాంతుని పీతాంబరపు కాంతులు సరి
దొంతల చెలినీలపుతురుము కాంతులకు
వంతుల మేనినీలవర్ణము సరి ||
జలజాక్షి వెలలేని జఘనచక్రమునకు
చలమరివల కేలిచక్రము సరి
కులికేటి యీయింతి కుత్తిక శంఖమునకు
చలివాయ రమణుని శంఖము సరి ||
కమలాక్షి శ్రీవేంకటపతి గూడుటకు
రమణుడంటిన సమరతులు సరి
తమితోడి నిద్దరికి తారుకాణలై నట్టి
సముకపు మోహముల సంతసములు సరి |
ఇద్దరి గూరిచితిమి యేము చెలికత్తెలము
పొద్దు కొకకొత్తలుగా భోగించరయ్యా
ప్రేమముతో సేసపాల పెండ్లికూతురురిదె వచ్చె
ఆముకొని సరసములాడవయ్యా
ఆమనిసిగ్గులతోడ నదె తెరలో నున్నది
చేముట్టి సేవలెల్లాఁ జేయించుకోవయ్యా
మక్కువతో నీ మేన మరదలిదివో వచ్చె
చక్కగా పాదాలీకపై జాచవయ్యా
వెక్కసాన తమకించి వేడుకటో నున్నది
గక్కననుఁ దప్పక మొగము చూడవయ్యా
అరుదై శ్రీవెంకటేశ అలమేలుమంగ వచ్చె
బెరసి రతులను నిట్టె పెనగవయ్యా
గరిమ వేళగాచి నీకౌగిటిలోనే నున్నది
సరికిబేసికి నీవు చనవియ్యవయ్యా
ఇద్దరి తమకము నిటువలెనె
పొద్దున నేమని బొంకుదమయ్యా
లలి నాకథరము లంచమియ్యగా
పలు సోకులయి పరగెనవే
పిలువగరాగా బెరసి నిందవడె
పొలతికి నేమని బొంకుదమయ్యా
అడుగుకొనుచు నిన్నంటి పెనగగా
తడయక నఖములు తాకెనవే
తొడుకొనిరాగా దూఱు మీదబడె
పొడవుగ నేమని బొంకుదమయ్యా
పెక్కులు చెవిలో ప్రియముగ చెప్పగ
ముక్కున జవ్వాది మోచె నిదే
యిక్కడ శ్రీవేంకటేశుడ సడివడె
పుక్కటి నేమని బొంకుదమయ్యా
ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె
అడ్డుకొని తులదూగినట్టి చందమాయెను ||
తళుకున నీవిప్పుడు తరుణి జూచితేను
తొలకి చెక్కుచెమట దొరుగ జొచ్చె
లలి మీరి ఆమెరుపులకు యీ తురుము మేఘ
మలరి వాన గురిసినట్టి చందమాయెను ||
చదురుమాటల నీవు జలజాక్షి బిలిచితే
పొదిగొని నిలువెల్ల బులకించెను
కదిసి ఆమాటల గాలికి యీమైదీగె
అదనుగూడ ననిచినట్టి చందమాయెను ||
ననుపై శ్రీ వేంకటేశ నవ్వి నీవు గూడితేను
యెనసి కామిని చిత్తమెల్ల గరగె
వొనరి ఆ వెన్నెల కీ మనసనే చంద్రకాంత
మనువుగా గరగినయట్టి చందమాయెను ||
ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే
పొద్దులు గడుపుదురా పొరుగునను ||
దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను
యెగ్గులు వట్టుదురా యింతలోననే
వెగ్గళించి చనవున వెస మర్మము లంటితే
సిగ్గులు వడుదురా జిగిమించను ||
జవ్వనపాయముతోడ సారె సారె జెనకితే
నవ్వులు నవ్వుదురా నట్టనడుమ
నివ్వటిల్లు సన్నలెల్లా నెట్టుకొన జేసితేను
రవ్వలు సేయుదురా రచ్చలోనను ||
సమ్మతించి కాగిళ్ళను సమరతి బెనగితే
బొమ్మల జంకింతురా పూచిపట్టుక
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి
దొమ్ములు సేయుదురా తోడదోడను ||
ఇద్దరు నొకటే యెప్పుడును
బుద్ధులు చెప్పరే పొలతుకలూ ||
చలమున నూరకే సాదించీ జెలి
తలపు దెలియకే తన పతిని
కలి ముదిసి మేడిదె గాక తొలుతనె
కలక దేరుచరే కామినులు ||
విచ్చల విడిగా వెంగెము లాడి
గచ్చుల యలుకల కాంతుని
హెచ్చి గోరి రేక యేరుగా నెపుడే
మచ్చిక సేయరే మానినులు ||
పనివడి కూడుచు బంతము లాడి
ఘనుడగు శ్రీ వేంకటపతి విభుని
ననలే విరులై నాటకమునుపనె
పెనగి మొక్కించరే ప్రియ సఖులు ||
ఇన్నాళ్ళు నందునందు నేమిగంటిని
అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని
అంగనలపసఁజిక్కి అలయికలే కంటి
బంగారు వెంటఁ దగిలి భ్రమ గంటిని
ముంగిటి క్షేత్రాలంటి ముంచి వెట్టిసేయగంటి
అంగపునన్నే చూచి అంతరాత్మఁ గంటి
చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి
మట్టిలేని వయసుతో మదము గంతి
వట్టి కామములు సేసి వరుస మాయలు గంటి
పట్టి నారాయణుని భక్తి నిన్ను గంటిని
వింతచదువులవల్ల వేవేలు మతాలు గంటి
సంతకర్మములవల్ల సాము గంటిని
యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము
చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి
ఇన్ని చేతలును దేవుడిచ్చినవే
ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా ||
తెగని యాపదలకు దేవుడే కలడుగాక
వగలుడుప బరుల వసమయ్యీనా
నొగలి యితరులకు నోళ్ళు దెరచిన
నగుబాటేకాక మానగ బొయ్యీనా ||
అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక
బగ్గన నొక్కరు వచ్చి పాప బొయ్యేరా
తగ్గుమగ్గులైనవేళ తలచినవారెల్ల
సిగ్గుబాటేకాక తమ్ముజేరవచ్చేరా ||
ఎట్టుసేసినను వేంకటేశుడే నేరుచుగాక
కట్టకడ వారెల్ల గరుణించేరా
ఇట్టే యేమడిగిన నితడే యొసగుగాక
వుట్టివడి యెవ్వరైనా నూరడించేరా ||
ఇన్ని జన్మములేటికి హరిదాసు
లున్న వూర దానుండిన జాలు ||
హరిభక్తుల యింటి యన్నము గొనువారి
వరువుడై యుండవలెనన్న జాలు
పరమభాగవత భవనంబుల జెడ్డ
పురువు దానయి పొడమిన జాలు ||
వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను
రోసిన యెంగిలి రుచిగొన్న జాలు
శ్రీసతీశుని దలచినవారి దాసాను
దాసుడైవుండ దలచినజాలు ||
శ్రీవేంకటేశు జూచినవారి శ్రీపాద
సేవకుడై యండజేరిన జాలు
ఈ విభుదాసుల హితుల పాదధూళి
పావనమై సోకి బ్రదికిన జాలు ||
ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి
పున్నతపుహరిదాస్యమొక్కటేకాక
హీనజంతువైననాడు యేనుగై పుట్టిననాడు
ఆనంద మొక్కటే అంగాలే వేరు
యీనేటియజ్ఞానము యీజీవుల కొక్కలాగే
జ్ఞానమే యెక్కుడుగాక సరిలేని దొకటే
నరలోక భోగానకు నరకానుభవానకు
సరేగాని ముగులదు చనెదొల్లె
గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచెమేమి
హరిదాసుడై బ్రదుకుటదియే లాభము
బాలుడైనయప్పుడూను పండి ముదిసినప్పుడు
కాలమొక్కటే బుద్ది కడు లేదు
ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి
యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము.
ఇన్నిచదువనేల ఇంత వెదకనేల
కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
వలెననేదొకమాట వలదనేదొక మాట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను
వలెనంటె బంధము వలదంటె మోక్షము
తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||
పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై రెంటికిని దేహమే గురియౌను
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
పరమనేదొకటే ప్రపంచమొకటే
సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను
ఇరవు వేంకటేశుడిహ పరములకర్త
శరణాగతులకెల్ల సతమీతడొకడే ||
ఇన్నిట నింతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయె ||
నళినదళాక్షుని నామ కీర్తనము
కలిగి లోకమున గల దొకటే
ఇల నిదియే భజియింపగ పుణ్యులు
చెలగి తలప సంజీవని యాయె ||
కోరిన నచ్యుత గోవిందా యని
ధీరులు తలపగ తెరువకటే
ఘోరదురితహర గోవర్ధన
నారాయణ యని నమ్మగ గలిగె ||
తిరువేంకటగిరి దేవుని నామము
ధర తలపగ నాధారమిదె
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయె ||
ఇన్నిటా ఘనుడు దాను యేమి చెప్పేరే
యెన్నుకోనీ నా గుణము లేమి చెప్పేరే ||
చెంత దన చెప్పినట్టు సేసితినంటా నిదె
యేంత నన్ను బుజ్జగించీ నేమి చెప్పేరే
అంతటా దన కిచ్చక మాడితినంటా నిదె
ఇంతలో నన్ను బొగడీనేమి చెప్పేరే
వొట్టి తనపై పాటలు వొనర బాడితినంటా
ఇబ్డె విదెమిచ్చీని యేమి చెప్పేరే
జట్టిగా జన్నులతోడ సాము సేఇంచితి నంటా
యెట్టనెదుటనే మెచ్చీ నేమి చెప్పేరే ||
మనసు మర్మములంటా మంతన మాడితినంటా
యెనసి కౌగలించీ యేమి చెప్పేరే
చెనకి మొక్కితినంటా శ్రీ వేంకటేశ్వరుడు
ఇనుముడిగా మన్నించె నేమి చెప్పేరే ||
ఇన్నిటి మూలంబీశ్వరుడాతని
మన్నన కొలదినె మలయుట గాక
మాయ మయమై మనియెడి జగమిది
చాయల నిందు నిజము కలదా
కాయము సుఖ దూఃఖములకు పొత్తిది
రేయి పగలు ఒకరీతే కలదా
దైవాధీనము తగు సంసారము
వావిరి జీవుల వసమౌనా
ధావతి మనసిది తన కర్మ మూలము
వేవేలైనా విడువగ వశమా
పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది
చంచలంబు నిశ్చల మౌనా
ఎంచగ శ్రీ వేంకటేశ్వరు కృప తో
సంచయ మైతే సతమౌ గాక
ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే
పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము ||
మనసున బుట్టిన మంకుగామక్రోధాలు
పనిలేవు తనకంటే బాపమంటదు
పనివి తొడిమ నూడి పండు తీగె నంటదు
జనులకెల్లా బ్రకృతి సహజమింతే ||
చేతులార జేసికొన్న కర్మానకు
ఘాతల గర్త గానంటే కట్టువడడు
ఆతల నబక ముంచినట్టివేడి చెయ్యంటదు
జాతి దేహము మోచిన సహజమింతే ||
వాకుననాడినయట్టి వట్టిపల్లదాలనెల్లా
దాకొని పొరయనంటే తప్పులే లేవు
పైకొని శ్రీవేంకటేశు బంటుకు వళకులేదు
సైకమైన హరిభక్తి సహజమింతే ||
ఇన్నిటికి మూలము యీతనిరూపు
యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||
కమలనాభునికి కప్పురకాపు మేన
సముచితముగ బైపై చాతినపుడు
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ||
దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను
చేవమీర నించి సేవసేసేయప్పుడు
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా
కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె ||
అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి
కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద
గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె ||
ఇన్నినేతలకు నిది యొకటే
కన్నా మన సిది కానదుగాని||
పాతకకోట్లు భవములు భస్మీ
భూతముసేయగ బొడవొకటే
శ్రీతరుణీపతిచింత, నిజముగా
యేతరి చిత్తం బెఱగదుగాని ||
మరణభయంబులు మదములు మలినీ
కరణము సేయగగల దొకటే
హరినామామృత మందుమీది రతి
నిరతము నాకిది నిలువదుగాని ||
కుతిలములును దుర్గుణములును దృణీ
కృతములు సేయగ గురుతొకటే
పతియగు వేంకటపతి సేవారతి,
గతియని మతిగని కానదుగాని ||
ఇన్నియు గలుగుటేజన్మమున నైన
జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు ||
అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర
కిరవైన శాస్త్రంబులెరుక కొరక
తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు
సరిలేని దానములు జన్మములకొరకు ||
మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ
సమవివేకంబు శాంతములకొరకు
అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ
జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు ||
ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే
పన్ని పరుల చెప్పగ చోటేది ||
కుందని నీ రోమకూపంబులలో
గొందుల బ్రహ్మాండ కోట్లట
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో
యిందు పరులమని యెంచగ నేది ||
నీ కొన చూపున నెరి కోటి సూర్యు
లేకమగుచు నుదయించురట
నీ కాయమెంతో నీ వుని కేదో
నీకంటె పరులని నిక్కగ నేది ||
జీవకోటి నీ చిన్ని మాయలో
ప్రోవులగుచు నటు పొడమె నట
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో
ఆవల పరులకు ఆధిక్య మేది ||
ఇన్నిరాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి ||
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి ||
చిన్నిమకరాంకపు బయ్యెద చేడియకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్యరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకు తులారాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి ||
ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిథునరాశి ||
ఇన్నిలాగులచేత లివియపో కడు
నెన్నికకెక్కిన చేతులివియపో ||గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై
నెనయజాచిన చేతులివియపో
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన
యినుమువంటి చేతులివియపో ||పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన
యిసుమంతలు చేతులివియపో
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో
యిసుకచల్లిన చేతులివియపో ||పరమచైతన్యమై ప్రాణులకెల్లను
యెరవులిచ్చిన చేతులివియపో
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి
నిరవుచూపెడు చేతులివియపో ||
———————————————————————————————————————————-
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి
కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి
అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు
తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||
నగవు లోపలి యలపు నంపైన పొలయలుక
పగటు లోపలి వెరగు పచ్చివేడి
మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు
పగలు చీకట్లాయె బాపురా చెలికి ||
బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు
చెలిమి లోపలి చేదు చింత చెలికి
బలుపు కుచములలోని బట్టబయలగు నడుము
కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||
నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ
వడి మంచి తరువు వడువని తమకము
కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము
మడుగు లోపలి మైల మాన దీచెలికి ||.
ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే
చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||
నయగారి వాడవు నాకు నీవు గలవు
ప్రియములేమి గడమ పెక్కుమారులు
క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద
నియతాన నిందుకే నీ యాలనైతిని ||
చలపాది వాడవు సతమై వున్నాడవు
చిలిము యేమి గడమ పై పై నేడు
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు
కలకాలమును నీకు గైవశమైతిని ||
శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి
దైవిక మేమి గడమ తగులాయను
భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో
వే వెలకును నీకే వెల్లివిరి యైతిని ||
ఇరవగువారికి యిహపర మిదియే
హరిసేవే సర్వాత్ములకు ||
దురితమోచనము దుఃఖపరిహరము
హరినామమెపో ఆత్మలకు
పరమపదంబును భవనిరుహరణము
పరమాత్ముచింతే ప్రపన్నులకు ||
సారము ధనములు సంతోషకరములు
శౌరికథలు సంసారులకు
కోరినకోర్కియు కొంగుబంగరువు
సారె విష్ణుదాస్యము లోకులకు ||
యిచ్చయగుసుఖము యిరవగుపట్టము
అచ్చుతుకృప మోక్షార్థులకు
అచ్చపుశ్రీవేంకటాధిపుశరణము
రచ్చల మాపాలి రాజ్యపుసుగతి ||
———————————————————————————————————————————–
ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ
తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు ||
అనిశమును దేహమున కన్నపానము లిడిన
యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో
గొనకొన్నమానినులకూటములసుఖము లివి
మనసుదాగినపాలు మట్టులేదెపుడు ||
వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా
వడవి గాసినవెన్నె లది కన్నులకును
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే
బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట ||
చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు
యెద్దుయెనుపోతునై యేకంబు గాదు
వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె ||
ఇలయును నభమును నేకరూపమై
జలజల గోళ్ళు జళిపించితివి ||
ఎడసిన నలముక హిరణ్యకశిపుని
దొడికిపట్టి చేతుల బిగిసి
కెడసి తొడలపై గిరిగొన నదుముక
కడుపుచించి కహకహ నవ్వితివి ||
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల
దెప్పరపసురల ధృతి యణచితివి ||
పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు
థళథళ మెరవగ దంతములు
ఫళఫళ వీరవిభవరస రుధిరము
గుళగుళ దిక్కుల గురియించితివి ||
చాతినప్రేవుల జన్నిదములతో
వాతెరసింహపు వదనముతో
చేతులువేయిట జెలగి దితిసుతుని
పోతర మణపుచు భువి మెరసితివి ||
అహోబలమున నతిరౌద్రముతో
మహామహిమల మలయుచును
తహతహ మెదుపుచు దగువేంకటపతి
యిహము బరము మాకిపుడొసగితివి ||
ఇలువేల్పితడే ఇందరికిని మరి
పలువేల్పులతో పనియికనేలా
కమలారమణుని కరుణేకాదా
అమరులు గొనియెడియమృతము
అమితపు శ్రీహరియాధారముగాదా
నెమకేటి ప్రాణులు నిలిచిన భూమి
దనుజాంతకుని బొడ్డుతామెర కాదా
జననకారణము సర్వమునకు
మనికై హరిసతిమహిమే కాదా
నినుపైన భువిలో నిండినసిరులు
యితనికొడుకు రచనింతాఁగాదా
సతులపతుల సంసారరతి
గతి శ్రీవేంకటపతిలోకమె వు-
న్నతి వైకుంఠపు నగరపు ముక్తి
ప|| ఇవి సేయగ నేనలసుడ యెటువలె మోక్షంబడిగెదను |
వివరముతోడుత నీవు సులభూడవు విష్ణుడ నిన్నే కొలిచెదగాక ||
చ|| జపయజ్ఞదానకర్మంబులు యెంచగ జిరకాలఫలంబులు |
యెపుడు బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు |
అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు |
వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకు గారణంబులు ||
చ|| రవిచంద్ర గ్రహతారాబలములు భువిలో గామ్యఫలములు |
తవిలిన పంచేంద్రియ నిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు |
అవిరళ ధర్మార్థ కామంబులు మఱియైశ్వర్యములకు మూలములు |
ఆవల గ్రహణకానాలుష్ఠానము లధికఫలంబులు ఆశామయము ||
చ|| పరగ సప్తసంతాన బ్రాహ్మణ తర్పణములు ఖ్యాతిసుకృతములు |
అరయ బుత్రదార క్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము |
హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొసగెడిదాతవు |
సరగున నీవే దయతో రక్షించజాలుదు వేకాలమును మమ్ములను ||
ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||
బయలు వలె నుండును పట్టరాదు వలపు
మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము
క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||
గాలివలె బారుచుండు కానరాదు మనసు
పాలవలె బొంగుచుండు పక్కన నణగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు
లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||
వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు
అన్నిటా వసంత ఋతువై యుండ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట
మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||
ఇసుక పాతర యిందుకేది కడగురుతు
రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||
బయలు వలె నుండును పట్టరాదు వలపు
మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము
క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||
గాలివలె బారుచుండు కానరాదు మనసు
పాలవలె బొంగుచుండు పక్కన నణగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు
లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||
వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు
అన్నిటా వసంత ఋతువై యుండ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట
మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||
ఇహపరములకును ఏలికవు
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
వేయికరంబుల వివిధాయుధంబుల
దాయల నడచిన దైవమవు
నీయందున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
కదిమి దుష్టులను గతము చేసితివి
త్రిదశుల గాచిన దేవుడవు
వదల కిందరికి వరములొసంగగ
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు
కావలసినచో కలుగుదువు
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
ఇహము బరము జిక్కె నీతనివంక
అహిశయనునిదాసులంతవారు వేరీ
సిరికలిగినవారు చింతలిన్నిటను బాసి
నిరతపువర్గముతో నిక్కేరటా
సిరికి మగడయిన శ్రీపతి యేలి మ__
మ్మరయుచునున్నాడు మాయంతవారు వెరి
బలవంతుడైనవాడు భయములిన్నిట బాసి
గెలిచి పేరువాడుచు గెరిలీనటా
బలదేవుడైన శ్రీపతి మా యింటిలోన
అలరివున్నాడు మాయంతవారు వేరి
భూములేలేటివాడు భోగములతో దనిసి
కామించి యానందమున గరగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుడు మాకు
ఆముకొనివుండగా మాయంతవారు వేరీ
ఇహమును బరమును యిందే వున్నవి
వహికెక్క దెలియువారలు లేరు ||
చట్టువంటి దీచంచలపుమనసు
కొట్టులబడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించిన గరగదు
పట్టబోయితే పసలేదు ||
చిగురువంటి దీజీవశరీరము
తగుళ్ళు పెక్కులు తతిలేదు
తెగనిలంపటమే దినమును బెనచును
మొగము గల దిదే మొనయును లేదు ||
గనివంటిది యీఘనసంసారము
తనిసితన్పినా దగ లేదు
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ
కొనమొద లేర్పడె కొంకే లేదు ||
ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు
సహజమై హరియే శరణము నాకు ||
చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య
పొత్తుల హరిదలచ బొద్దులేదు
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు
తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ||
చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష
యీతల హరి బూజింప నిచ్చలేదు
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి
రీతి హరినామ ముచ్చరించ వేళలేదు ||
వీనులివి రెండే వినికి కొలదిలేదు
పూని హరిభక్తి విన బుద్ధి లేదు
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను
తానే యేలె నిక దడబాటు లేదు ||
ఇహమేకాని యిక బరమేకాని
బహుళమై హరి నీపైభక్తే చాలు ||
యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి
కందువనీదాస్యము గలిగితే జాలు
అంది స్వర్గమేకాని అలనరకమేకాని
అందపునీనామము నాకబ్బుటే చాలు ||
దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు
కరగి నిన్నుదలచగలితే జాలు
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు
హరినీసేవాపరుడౌటే చాలు ||
యిల జదువులురానీ యిటు రాకమాననీ
తలపు నీపాదములతగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చలపట్టి నాకు నీశరణమేచాలు ||
ఈ
ఈ జీవునకు నేది గడపల తనకు
నేజాతియును లేక యిట్లున్నవాడు ||
బహుదేహ కవచముల బారవేసినవాడు
బహుస్వతంత్రముల నాపదనొందినాడు
బహుకాలముల మింగి పరవశంబైనవాడు
బహు యోనికూపములబడి వెడలినాడు ||
పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు
పెక్కునామములచే బిలువబడినాడు
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ
పెక్కులాగుల బెనగి చెండుపడినాడు ||
ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక
యెండలకు నీడలకు యెడతాకినాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయని
యండ జేరెదననుచు నాసపడినాడు ||
ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది
ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది॥
ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది
ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది
ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది॥
ఈ పాదమే కదా యిభరాజు దలచినది
ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది
ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది॥
ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది
ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము
ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది॥
ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను
నేమమెంత నేమెంత నీకరుణ యెంత.
సకలకర్మముచేత సాధ్యముగానినీవు
వొకైంచుకంతభక్తి కొగిలోనైతి
ప్రకటించి బహువేదపఠన జిక్కనినీవు
మొకరివై తిరుమంత్రమునకు జిక్కితివి.
కోటిదానములచేత కోరి లోనుగాని నీవు
పాటించి శరణంటేనే పట్టి లోనైతి
మేటి వుగ్రతపముల మెచ్చి కైకొననినీవు
గాటపుదాసు లైతేనే కైకొని మన్నించితి.
పెక్కు తీర్థములాడిన భేదించరానినీవు
చొక్కి నీముద్రవారికి సులభుడవు
గక్కన దేవతలకు గానరానినీవు మాకు
నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి.
ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిది
పావనులహ్రుదయమున బ్రభవించుగానిని ||
ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి
సమ్మతంబున జేయజాలుగాకేమి
కుమ్మరికి నొకయేడు గుదియ కొకనాడువును
నమ్మితలచినవిష్ణునామంబుచేత ||
కొదలేనిదురితములు కొండలును గోట్లును
చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హ్రుదయంబు హరిమీద నుండినంతటను ||
సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై
పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి
బెరసి కొండలమీద బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపుని దలచినను ||
ప|| ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిదిది | పావనులహృదయమున బ్రభవించుగాని ||
చ|| ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి | సమ్మతంబున జేయజాలుగాకేమి | కుమ్మరికి నొకయేడు గుదియు కొకనాడవును | నమ్మితలచిన విష్ణునామంబుచేత ||
చ|| కొదలేనిదురితములు కొండలును గోట్లును | చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి | పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను | హృదయంబు హరిమీద నుండినంతటను ||
చ|| సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై | పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి | బెరసి కొండలమీద బిడుగుపడ్డట్లౌను | తిరువేంకటాచలాధిపుని దలచినను ||
ఈకెకు నీకు దగు నీడు జోడులు
వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||
జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక
అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక
చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును ||
చందమైన వామలోచని యాపెయౌగనక
అందరు నిన్ను వామనుడనదగును
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక
అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||
చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక
అల శ్రీవక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన
యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||
ఈకెకు నీకు దగు నీడు జోడులు
వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||
జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక
అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక
చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును ||
చందమైన వామలోచని యాపెయౌగనక
అందరు నిన్ను వామనుడనదగును
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక
అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||
చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక
అల శ్రీవక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన
యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||
ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము
చేడెలాల ఇది చెప్పరుగా ||
పచ్చికబయళ్ళ పడతి ఆడగ
ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగ ||
మ్త్తెపు ముంగిట ముదిత నడువగ
ఉత్తముడే చెలి వురమునను
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక
జొత్తుమాని ఇటు జూపరుగా ||
కొత్తచవికెలో కొమ్మనిలిచితే
పొత్తున తలబాలు వోసెనట
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు
హత్తి సతిగూడె నని పాడరుగా ||
ఈడేర వలచితే యే పని సేయగ రాదు
యేడనైన యెగ్గు సిగ్గులెంచేరా భూమిని
వనిత చెప్పితే జాలు వారిదైనా ఈదేవు
అనువుగా గొండ మోవుమన్న మోచేవు
తనివోక బూమెల్లా దవ్వుమన్న దవ్వేవు
వొనర బహురూపాన నుండుమన్నా నుండేవు
ఇంతి చెప్పితే జాలు యెంతైనా గొంచపడేవు
అంతలో బగర జంపుమన్నా జంపేవు
చెంత నాపె తపములు సేయుమన్నా జేసేవు
కాంత తన పసులను గావుమన్నా గాసేవు
అతివ జూచి కల్లలాడుమన్నా నాడెవు
బతిమి బారాడుమన్న బారాడేవు
పతివైన కోసువాని పల్లె శ్రీవెంకటనాథ
గతియై కూడుండుమన్నా గాగిట నుండేవు
ఈతగవే నాకు నీకు నెంచి చూచితే
కాతరపుజీవులకు గలదా వివేకము
భారము నీదిగనక పలుమారు బాపములే
చేరి మొక్కలాన నే జేసితిని
పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను
వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున
కాన నీవుగలవని కడదాకా నేరములే
వేవేలు సేసితిని వెఱవక
భావించుక యింటిదొర పసురము దెంచుకొని
యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు
పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము
యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని
వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము
అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు
ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల
భూతములలోన దా బొదలువాడితడు ||
గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద
చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు
తాపసోత్తముల చింతాసౌధములలోన
దీపించు సుజ్ఞానదీప మితడు ||
జలధికన్యాపాంగ లలితేక్షణములతో
కలసి వెలుగుచున్న కజ్జలంబితడు
జలజాసనుని వదనజలధి మధ్యమునందు
అలర వెలువడిన పరమామృతంబితడు ||
పరివోని సురతసంపదల నింపులచేత
వరవధూతతికి పరవశమైన యితడు
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి
పరిపాలనముసేయు భారకుండితడు ||
ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు
డితడు గలుగబట్టి యిందరు బదికిరి ||
అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు
యిది వీడె శ్రీవేంకటేశు నెదుట
వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి
పదములు సేసి పాడీ పావనము సెసెను ||
అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు
నిలచి శ్రీవేంకట నిధియే తానై
కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల
పలుకుల నించి పాడినాడు హరిని ||
అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు
బంగారు శ్రీ వేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు
మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను ||
ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు
యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు
ఖరదూషణాదులను ఖండతుండముల సేసె
అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె
ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము
కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల
తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె
యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన
పుడమియంతయు( గాచె పొందుగా తనంతలేసి-
కొడుకుల( గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె
అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె
ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు
చేతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు
పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు
బట్టబాయిటనే రేపల్లెవారికి
అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు
గట్టిగా గృష్ణుడు లోకమువారికెల్లను
బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు
యిలమీద గలిగినఋషులకెల్లా
కొలదిమీరినయట్టికోతికొల దీర్చినాడు
సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని
వొలిసి పురాలు చొచ్చి పూర గొల దీర్చినాడు
అల తనదాసులైన అమరులకు
సిలుగుగొలలు దీర్చి సేన వరా లిచ్చినాడు
చెలగి పరుషలకు శ్రీవేంకటేశుడు
ఈతని మహిమలు ఎంతని చెప్పెద
చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||
శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి
నానా విధకర నఖరుడు
దానవ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు ||
అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహు దేవతాసార్వ భౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
ఇహపరము లొసగు యేలిక యితడు ||
కేవలుడగు సుగ్రీవనృసింహుడు
భావించ సుజన పాలకుడితడు
శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు
వేవేలకు వేల్పు ఇతడు ||
ఈతని మహిమలు ఎంతని చెప్పెద
చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||
శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి
నానా విధకర నఖరుడు
దానవ దైత్య విదారుడు విష్ణుడు
తానకమగు మా దైవంబితడు ||
అహోబలేశుడు ఆదిమపురుషుడు
బహు దేవతాసార్వ భౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు
ఇహపరము లొసగు యేలిక యితడు ||
కేవలుడగు సుగ్రీవనృసింహుడు
భావించ సుజన పాలకుడితడు
శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు
వేవేలకు వేల్పు ఇతడు ||
ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము
మోదమెరంగని మోహము ముందర గననీదు ||
నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు
సత్యాలాపవిచారము జరగదు లోభికిని
హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును
ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు ||
సతతానందవికాసము సంధించదు తామసునకు
గతకల్మష భావము దొరకదు వ్యసనికిని
జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి
అతులితగంభీర గుణంబలవడ దధమునకు ||
శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము
ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు
దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము
సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు ||
ఈపెకు నితడు దగు నితనికీపె దగు
చూపులకు పండుగాయ శోభనము నేడు ||
పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి
చెలగి తానెదురు చూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె
కలిమెల్ల మెరసి సింగారించరే ||
ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును
యీతడే జంట సోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు
రేతిట నుండియు వేగిరించేరు వీరు ||
పానుపు పరచరె బలునాగవల్లి నేడు
పూని తెరవేయరె పోలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును
లోననె భూకాంతయును లోలువైరి తాము ||
ఈభవమునకు జూడ నేది గడపల తనదు
ప్రాభవం బెడలించి బాధ పెట్టించె ||
చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల
రప్పించె నెన్నడును రానిచోట్లకును
నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను
తిప్పించె కోరికల తిరిగి నలుగడల ||
పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల
కట్టించె సంసారకలితబంధముల
పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను
తిట్టించె నిజద్రవ్యదీనకులచేత ||
బెదరించె దేహంబు పెనువేదనలచేత
చెదరించె శాంతంబు చెలగి చలమునను
విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి
పదిలించె నతనికృప పరమసౌఖ్యములు ||
ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||
పొదలి మాయాదేవిపట్టిన సముద్రము
అదె పంచభూతాలుండే అశ్వత్థము
గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము ||
అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము
కనలుదానవమత్తగజసంహరసింహము
మొనసి సంసారభారము దాల్చే వృషభము ||
సతతము జీవులకు చైతన్యసూత్రము
అతిశయభక్తులజ్ఞానామృతము
వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి
తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము||
ఈసుర లీమును లీచరాచరములు
యిసకలమంతయు నిది యెవ్వరు ||
ఎన్నిక నామము లిటు నీవై యుండగ
యిన్ని నామము లిటు నీవై యుండగ
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||
వొక్కరూపై నీవు వుండుచుండగ మరి
తక్కిన యీరూపములు తామెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు ||
శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా
దైవంబులనువారు తామెవ్వరు
కావలసినచోట కలిగి నీవుండగ
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||
ఈహీ శ్రీహరిగంటే యింత లేదుగా వట్టి
దాహపుటాసల వెఱ్రి దవ్వు టింతేకాకా
పలుమారు నిందరిని భంగపడి వేడేది
యిలపై దేహమువెంచేయిందు కింతేకా
కలికికాంతలచూపుఘాతలకు భ్రమనేది
చెలగి మైమఱచేటిచేత కింతేకా
పక్కన జన్మాలనెల్లా బాటువడేదెల్లాను
యెక్కడో సంసారాన కిందు కింతేకా
వొక్కరి గొలిచి తిట్టు కొడిగట్టే దెల్లాను
చక్కుముక్కునాలికెపైచవి కింతేకా
గారవాన ధనములు గడియించేదెల్లాను
ఆరయ నాదని వీగేయందు కింతేకా
చేరి శ్రీవేంకటపతి సేవకు జొరనిదెల్లా
భారపుగర్మపుభాద బట్టువడికా
ఉ
ఉండ బాసీనడవిలో నొకతెనేను
ఎండలు నీడలు గాసీ నేమి సేతురా ||
చిన్ని నానడుము చూచి సింహము దగ్గరెనంటా
ఉన్నతపు గుచముల కొరసెగరి
మున్నిటి వొందులు వైరమునుజేసె మ్రుగపతి
యిన్నిటికి నగ్గమైతి నేమిసేతురా ||
నిండు నానడపుచూచి నెమలి దగ్గరవచ్చె
బండు సేసి నారుసూచి పాయదు పాము
రెండు జూచి పగయు గూరిమి దోచెనింతలోనే
యిండె పట్టె నిన్నిటికి నేమి సేతురా ||
కోరి నా పలుకువిని కోవిల దగ్గరవచ్చె
చేరీ నా మోవికిదె చిలుకనేడు
గారవాన నిన్నియు వేంకటగిరి విభుడా
యేరా యిట్టె చేకొంటి వేమిసేతురా ||
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా
కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా
చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా
తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకు రోరమ్మా
ఉదయాద్రి తెలుపాయె ఉడు రాజు కొలు వీడె |
అద నెరిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె |
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీద |
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె |
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు |
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి |
చెన్ను గంగొప్పున విరులు చెలువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి |
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||
ఉన్న మాటలికనేల ఓ దేవా
యెన్నటికిదే మాట నింకా నింకా
కొంత నా కర్మ ఫలము కొంత నీ రక్షకత్వము
ఇంతలో రెండు గలవా ఏమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటి బొమ్మను నేను
చెంతగాచుట నీపని, సేవసేయ నా పని
నేనపరాధినయ్యేది నీవూహించుకోనేది
తేనెపాలు రెండూనేలయేమో దేవా
మానక ఇట్లైతే నీ మహిమకు గురుతేది
నానీ చింతించేనందులకపకీర్తియనుచో
మెదలే నా యధమము నీఘనత ఎంచి కావు
ఇదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీ వెంకటేశా ఇన్నిట నీ బంటు బంట
పదివేలూ నా నేరాలు పట్టకుమీ ఇకను
వినా వేంకటేశం ననాథో ననాథ..
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
అజ్ఞానినామయాదోషాన్ అశేషాన్
క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణే
ఉన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానడింతే కాక.
యెక్కడ వొయ్యెడి జీవుడేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల_
కక్కసాన జిక్కి తమ్ము గాన డింతే కాక.
యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాత డిన్నిటా గలిగుండగా
దోమటి సంసారపుదొంతికర్మముల జిక్కి
కాముకుడై కిందుమీదు గాన డింతే కాక.
యేవిధులు తా జేసీ యెవ్వరి నాడగబోయీ
శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుడగా
భావ మాతడుగాను బ్రతికె నిదవో నేడు
కావరాన నిన్నాళ్ళు కాన డింతే కాక
ఉన్నతోన్నతుడు ఒడయవరు
యెన్న ననంతుడే యీ ఒడయవరు
సర్వలోకముల శాస్త్రరహస్యము
లుర్వి( బొడమె నీ ఒడయవరు
పూర్వపు వేదాంత పుణ్యశాస్రములు
నిర్వహించె నన్నిటా నొడయవరు
వెక్కస(పు శ్రీవిష్ణుభక్తియే
వొక్కరూపమే ఒడయవరు
చక్కనైన సుజ్ఞానమున కిరవై
వుక్కు మీఱెనిదె నొడయవరు
కదినె మోక్షసాకారము దానై
వుదుటున నిలిచె నీ వుడయవరు
యిదిగో శ్రీవేంకటేశ్వరు యీ(నీ)డై
పొదలుచు నున్నాడు భువి నొడయవరు
ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే
విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము
పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము
అరయనిదొక్కటేపో హరినామమంత్రము
యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము
వోజదప్పితే జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము
సాజమైన దిదెపో సత్యమైన మంత్రము
యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము
సహజమై వేదాలసారమంత్రము
బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము
విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము
ఉన్నవిచారములేల వోహో సంసారులాల
యిన్నిటి కితడే రక్ష యిదే మీకు మనరో ||
తక్కక బ్రహ్మలగన్న తండ్రి గొలిచి మీరు
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణుల దలచి మీరు
చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో ||
భవరోగవైద్యునిపాదములు సేవించి
భువి రోగముల బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైనవాని
గవిసి పొగడి దిక్కుగలిగి బ్రదుకరో ||
తల్లిదండ్రీ నీతడే తగ జుట్ట మీతడే
యెల్లగా బుట్టించి పెంచేయేలి కీతడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో ||
ఉప్పవడము గాకున్నారిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ||
వున్నతి చంద్రుడును కమలమిత్రుడును
వున్నతి నివి నీకుండగను
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను
టెన్నడు నిద్దుర యెన్నడు నీకు ||
కందువ సతికనుగలువలు ముఖార
విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగు నీతెలివికి దుదయేది ||
తమము రాజసము తగుసాత్వికమును
నమరిన నీమాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపును బైకొనుటెట్లా ||
ప|| ఉమ్మడినే యేమనినా మారకుండను | అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను ||
చ|| మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని | గాటమై నీ చేతవై తే కారమయ్యీని |
యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ | కూటమి కాననరాదు కోపగించరాదు ||
చ|| కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని | యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని |
పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును | అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు ||
చ|| నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని | భావించి నీ సింగారాలు పాలుకొనీని |
యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి | చేవదేరె ననరాదు చిగురనరాదు ||
ఉయ్యాల యూఁపులు ఓ ముద్దులయ్యా
వెయ్యారు గోపికలు వేడుక నూఁచెదరు // పల్లవి //
భోగీంద్ర తల్పుఁడా భువన విఖ్యాతా
గోగోపరక్షకా కువలయాధీశా
ఆగమసన్నుతా యచ్యుతానంతా
యోగనిద్ర పోవయ్య యోగీంద్రవంద్య // ఉయ్యా //
దెసలందు వెలిఁగెడి దేవర్షివరులు
ప్రసరించి బంగారు భవనంబులోన
కొసరక నిద్రించు గోవిందా యనుచు
పసమీర పాడెదరు పన్నగశయనా // ఉయ్యా //
సన్నుతించెదరయ్యా సద్భాగవతులు
పన్నుగా శ్రీభూమి వనితలు చేరి
ఉన్నతి పదముల నొత్తెదరు నిద్రించు
వెన్నుఁడా ప్రసన్న వేంకటరమణా // ఉయ్యా //
ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు
బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు
తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు
చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు
ఊ
ఊరకుండు మనవే వొడబాటులిక నేలే
కోరికలు గోరుకొంటా గొణగే గాని ||
ఆగపడితిమి తొల్లే ఆయను తన పొందు
యెగసెక్కే లాడక తానిక నెన్నడే
జగడింప నోపము జవ్వనము మోచుకొని
మొగము చూచి చూచి మూలిగే గాని ||
సేవలెల్లా జేసేము చెల్లుబడి గలవాడు
యీ వలనవ్వులు నవ్వకిక నెన్నడే
చేపట్టి తియ్యనేల సిగ్గులుపై వేసుకొని
దేవరంట మొక్కుకొంటా దీవించే గాక ||
కూడితిమి కౌగిటను గురుతు చన్నుల నంటె
యీడనే ప్రియాలు సేయకిక నెన్నడే
జోడై శ్రీ వేంకటేశు చుట్టరికపు దనాన
మేడెపు రతులలోన మెచ్చేము గాక ||
ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా
చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక ||
వద్దని నీతో నేను వాదులాడిచేనా
గద్దించి యప్పటి నిన్ను గాదనేనా
తిద్ది నీ గుణాలు నేడు తీరుచ వచ్చేనా
వొద్దనే నీ వెట్టుండినా మంటివి గాక ||
చలపట్టి నిను నేను సాధించ వచ్చేనా
కలవి లేనివి తారుకాణించేనా
నిలువుకు నిలువే న్నిను నేరాలెంచేనా
వెలివెంత నవ్వినా నవ్వితివి గాక ||
పంతమాడి సారెసారె బంగించ దొరకొనేనా
వంతులకు నంతేసి వాసి పట్టేనా
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటునన్ను
యెంత చనువిచ్చినాను ఇచ్చేవుగాక ||
ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము
సారంబు దెలిసెగా జయము చేకొనుట ||
తలపులోని చింత దాటినప్పుదు గదా
అలరిదైవంబు ప్రత్యక్షమౌట
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా
తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||
కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా
నిర్మల జ్ఞానంబు నెరవేరుట
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా
కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||
తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా
పనిగొన్న తనచదువు ఫలియించుట
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
యేరీతి తక్కరియౌటా యెఱఁగవు నీవు // పల్లవి //
అతఁడు వాసులెక్కించి ఆటకానకుఁ బెట్టితే
యేతులకుఁ గాఁతాళించి యేలచూచేవే
రాతిరిఁబగలుఁ దాను రచ్చ లెందోసేసి వచ్చి
యీతల సటలుసేసే దెఱఁగవు నీవు // ఊర //
తానే సన్నలు సేసి తగవులఁ బెట్టితేను
పేనిపట్టుక నీవేల పెనఁగాడేవే
ఆనుకొని వాడవారి నందరిఁ బెండ్లాడివచ్చి
యీనేరుపులు చూపేది యెఱఁగవు నీవు // ఊర //
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యిద్దరిఁ గూడితే
చేవమీర నీవేల సిగ్గువడేవే
వేవేలుసతులకు వేరేసేసవెట్టి వచ్చి
యీవిధాన మొఱఁగేది యెఱఁగవు నీవు // ఊర //
ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా
ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను
చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా
కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను
అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నినప్రయాసాల బడనేటికయ్యా
శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా
ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన
చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు ||
జూదమాడ బిలిచేవు చూపులనే జంకించేవు
పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా
కేదమున నోడి గెలిచితి నంటా నా
పాదమంటి తీసుకోరా బంగారు మట్టెలు ||
నెత్తమాడ బిలిచేవు నెఱవాది నంటాను
అత్తమామ గలవార మదేమిరా
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు
రిత్తమాట వద్దు రేఖ రేఖ పందెమా ||
సొక్కటాలు నిన్ననాడి సోలి సత్యభామకు
మ్రొక్కితివి నేడు నాకు మ్రొక్కవలెగా
చక్కని వేంకటపతిస్వామి నన్నుంగూడితివి
మొక్కెద కర్పూర తాంబూలమీరా చాలును ||
ఊరకే వెదకనేల వున్నవి చదవనేల
చేరువనె వున్నదిదె చెప్పరాని ఫలము // పల్లవి //
కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా // ఊర //
ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము // ఊర //
కాంతలపొం దొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలె యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి // ఊర //
ఊరికి బోయెడి వోతడ కడు
చేరువతెరు వేగి చెలగుమీ ||
ఎడమతెరువువంక కేగిన దొంగలు
తొడిబడ గోకలు దోచేరు
కుడితెరువున కేగి కొట్టువడక మంచి
నడిమితెరువుననే నడవుమీ ||
అడ్డపుదెరువుల నటునిటు జుట్టాలు
వెడ్డువెట్టుచు నిన్ను వేచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక
దొడ్డపుతెరువువంక తొలగుమీ ||
కొండతెరువు కేగి కొంచెపుసుఖముల
బండై తిరుగుచు బడలేవు
అండనుండెడి పరమాత్ముని తిరుమల
కొండతెరువు తేకువ నేగుమీ ||
.——————————————————————————————————————————-
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు
గారవంబులేని ప్రియము కదియనేటికే ||
ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల
యెండలేని నాటి నీడ యేమిసేయనే
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల
రెండు నొకటిగాని రచన ప్రియములేటికే ||
మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు
మచ్చికలేని చోట మంచిమాట లేటికే
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే ||
బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన
శంకలేక కదియలేని చదువులేటికే
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి
వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే ||
ఎ
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ||
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి
నీలవర్ణుడేమా నిజదైవము ||
చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ||
పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||
ఎండలోనినీడ యీమనసు
పండుగాయ సేయబనిలేదు మనసు ||
వానచేతకములవలెనాయ మనసు
గోనెబట్టిన బంకగుణమాయ మనసు
మానజిక్కినకోలమతమాయ మనసు
తేనెలోపలి యీగతెరుగాయ మనసు ||
గడిరాజుబదుకాయ కడలేని మనసు
నడివీది పెసరాయ నయమైనమనసు
గడకుగట్టిన పాతగతిదోచె మనసు
అడసులోపలి కంబమై తోచెమనసు ||
తెరువుచూపినజాడ దిరుగు నీమనసు
మరుగుజేసినచోట మరుగు నీమనసు
తిరువెంకటేశుపై దిరమైన మనసు
సిరిగలిగినచోట జేరు నీమనసు ||
ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా ||
మొదల జగములకు మూలమైనవాడు
తుద ప్రళయమునాడు తోచేవాడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాడు
మదనగురుడేకాక మఱి వేరే కలరా ||
పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు
సురలకు నరులకు జోటయినవాడు
పరమైనవాడు ప్రపంచమైనవాడు
హరి యొక్కడేకాక అవ్వలను గలరా ||
పుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాడు
గట్టిగా శ్రీ వేంకటాద్రి కమలాదేవితోడి
పట్టపుదేవుడేకాక పరులిక గలరా ||
ఎంత చదివిన నేమి వినిన తన
చింత యేల మాను సిరులేల కలుగు ||
ఇతర దూషణములు ఎడసిన గాక
అతి కాముకుడు గాని యప్పుడు గాక
మతి చంచలము కొంత మానిన గాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను ||
పర ధనముల యాస బాసిన గాక
అరిది నిందలు లేని యప్పుడు గాక
విరస వర్తనము విడచిన గాక
పర మేల కలుగు నాపద లేల మాను ||
వేంకటపతి నాత్మ వెదికిన గాక
కింక మనసున తొలగిన గాక
బొంకు మాటలెడసి పోయిన గాక
శంక యేల మాను జయమేల కలుగు ||
ఎంత జాణరో యీకలికి
కాంతుడ నీ భోగములకే తగునూ ||
చెలి నీ కౌగిట చెమటలజేసెను
చలువగ నిప్పుడు జలకేళి
అలరుచు గుచముల నదుముచు జేసెను
పలుమరు ముదముల బర్వతకేళి ||
పైపై బెనగుచు బాహులతలనే
వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపయి సొలయుచు జేసెను
పూప వసంతము పూవులకేళి ||
అరుదుగ నట్టివి యధరామృతముల
సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసేను
పరగిన రతులనె పరిణయ కేళి |
ఎంత బాపనా సోద మింత గలదా
అంతయు నీమహిమే హరిభట్లూ
సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి
వారబియ్య మెత్తి యెత్తి వడదాకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారాట్టీ
కేరికేరి నగాయ్యా క్రిష్ణభట్లూ
దేవరొజ్ఝ లొకవంక దిక్కులలో బొలగూడు
దీవెనతో నారగించి తీవుమరిగి
యీవల బెట్టినవారి కేమైనా నొసగీని
వేవేలమాయలవిష్ణుభట్లూ
సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా-
నామనితో విందువెట్టీ ననుదినము
హోమపువిప్రులసొమ్ము లొడిసి తా బుచ్చుకొనీ
వేమరు శ్రీవేంకటాద్రివెన్నుభట్లూ
ఎంత బోధించి యేమిసేసిన దన
దొంతికర్మములు తొలగీనీ ||
సతతదురాచారజడునకు బుణ్యసం
గతి దలపోసిన గలిగీనా
అతిపాపకర్మబోధకుడై వెలయుదుష్టు
మతి దలపోసిన మరి కలిగీనా ||
బహుజీవహింసాపరుడైనవానికి
యిహపరములు దైవ మిచ్చీనీ
విహితకర్మములువిడిచినవానికి
సహజాచారము జరిగీనా ||
దేవదూషకుడై తిరిగేటివానికి
దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన
పావనమతియై బ్రతికీనా ||
ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా
వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే ||
యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు
బలివిభీషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా
తలచి చూడ నీదాసుల కోడుదువు ||
ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు
పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు
అందపునీదాసులకు నన్నిటా దాసుడవు ||
కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను
కొడుకవు దేవకికి గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు
విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి ||
ఎంత మానుమన్న జింతలేల మానునే
పంతపుమనసు హరిపై నుంటేగాక ||
తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు
భారపుమమత బెడబాసినగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను
వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక ||
వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు
తోకచిచ్చయినయాస దుంచినగాక
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి
మాకుపడి తత్తరము మరచుంటేగాక ||
పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు
యిట్టే వేంకటపతి యిచ్చినగాక
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు
వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక ||
ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము
కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి ||
నిద్దరించవలసినా నీ కౌగిటనే కాని
వొద్ద నిన్ను బాసి వొంటినొల్లదు చెలి
కొద్దిగా మాటాడినాను కోరి నీతోనే కాని
ముద్దరించి పరులతో మోసమే చెలి ||
ఆరగించవలసినా అటు నీ పొత్తునగాని
వూరకే వేరెయైతే నొల్లదు చెలి
సారె విడెమిచ్చినాను సగమాకు నీకియ్యక
చేరి వేరే తమ్ములము చేయదు చెలి ||
కొమ్మ పయ్యద గప్పినా గూడ నీతోగాని
వుమ్మడి దనంతనైతే నొల్లదు చెలి
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతలో గూడితిగాని
బమ్మర వెట్టినా నీకు బాయదు చెలి ||
ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల
వంతులకు బారనేల వగరించనేలా ||
దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల
చిక్కి నంతకే సంతసించ రాదా
ఒక్కమాటే వుప్పుదిని వుపదాప మందనేల
చక్క జూడ దగినంతే చవి గొనరాదా ||
పారి పారి వేడ నేల బడలిక పడనేల
మీరిదైన మిచ్చినంతే మెచ్చరాదా
వీరిడై పొడవెక్కి విరుగ బడగనేల
చేరి యుండినంతకే చేచాచరాదా ||
జీవులుగొలువనేల సిలుగుల బడనేల
శ్రీవేంకటేశుడాత్మ జిక్కి వుండగా
దావతి పడగనేల దప్పుల బొరలనేల
కైవశమైనందుకే గతి గూడ రాదా ||
ఎంత వనికోకాని యెఋగనేను
చెంతనే తెలుసుకో నేజెప్పితి నీ సుద్దులు ||
వదలే జారు దురుము వైపుగా ముడుచు కొంటా
కదలు గన్నుల చూపు కాడి పారగా
మదమువలెనే పెంజెమటలు చెక్కులగార
వెదకీ నెవ్వతో నిన్ను వీదుల వీదులను ||
అడచి చన్నులపై బయ్యద బిగిఇంచుకొంటా
కడలేని నిట్టూర్పులు కడుమగాను
తడబడ బెదవుల తమ్మబేంట్లు రాలగా
అడిగీ నీ వున్నచోటు అంగనల నెల్లాను ||
వుక్కుమీరి కరముల వొడిమీద బెట్టుకొని
మిక్కిలి నీ కాపెపొందు మీ దెత్తగా
ఇక్కడ శ్రీవేంకటేశ యిటు నన్ను గూడేవు
చొక్కుచు నీ మేడ దిక్కే చూచీ దానదివో ||
ఎంతగాలమొకదా యీదేహధారణము
చింతాపరంపరల జిక్కువడవలసె ||
వడిగొన్న మోహంబువలల దగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమిసుఖములచేత ననువుసేయగగదా
తొడరి హేయపుదిడ్డి దూరాడవలసె ||
పాపపుంజములచే బట్టువడగాగదా
ఆపదలతోడిదేహము మోవవలసె
చూపులకులోనైన సుఖము గానకకదా
దీపనభ్రాంతిచే దిరిగాడవలసె ||
హితుడైనతిరువేంకటేశు గొలువకకదా
ప్రతిలేనినరక కూపమున బడవలసె
ఆతనికరుణారసం బబ్బకుండగగదా
బతిమాలి నలుగడల బారాడవలసె ||
ఎంతచుట్టమో నీకునిదివో ఆపె
సంతసపు వలపుల జడిసీ నాపె ||
తేనెగారే పెదవుల తేటమాటలాడీ నాపె
నానబెట్టి సెలవుల నవ్వీనాపె
సానబెట్టిన చూపులు జరిపించీ నీపైనానాపె
మోనముతో దొమ్ములను మొక్కినాపె ||
నిండుజెక్కుటద్దముల నీడలు చూపీనాపె
గండు దుమ్మిద కొప్పుతోగదిమీనాపె
కొండలవంటి చన్నులకొనలు దాకించీ నాపె
మెండుజిగురుచేతుల మెచ్చు మెచ్చీ నాపె ||
ఆయపు మెఋగు మేన ఆసలురేచీ నాపె
పాయపు సిగ్గులచేత భ్రమించీ నాపె
మోయరాని పిరుదుల మురిపెము చూసీనాపె
యీ యెడ శ్రీవేంకటేశ యెనసె నిన్నాపె ||
ఎంతచేసిన తనకేది తుద
చింత శ్రీహరిపై జిక్కుటే చాలు ||
ఎడపక పుణ్యాలెన్ని చేసినా
గడమే కాకిక గడయేది
తడబడ హరియే దైవమనుచు మది
విడువకవుండిన వెరవే చాలు ||
యెన్నితపములివి యెట్లజేసినా
అన్నువ కధికము అలవేది
వన్నెల గలగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు ||
యిందరి వాదములెల్ల గెలిచినా
కందే గాకిక గరిమేది
యిందరినేలిన యీవేంకటపతి
పొందుగ మహిమల పొడవే చాలు ||
ఎంతటి వాడవు నిన్నేమని నుతింతును
వింతలు నీకమర కుండగ విచారించే ||
పాల సముద్రములోనం బవ్వళించి యుండే నీకు
బాలుండవై తేనెవెన్న బాతాయెనా
కాలమెల్లను శ్రీకాంత కౌగిట నుండ నీకు
గొల్లవైతే గొల్లతలం గూడ వేడుకాయెనా ||
పరమ పదమునందు బ్రహ్మమై వుండే
పెరిగీ రేపల్లెవాడ ప్రియమాయెనా
సురలనెల్ల గావగ సులభుండవైన నీకు
గరిమెతోడ పసులకావగ వేడుకాయె ||
ఏ ప్రొద్దు ముక్తుల నెనసి వుండే నీకు
గోపాలురతో గూడుండ కోరికాయెనా
బాపురె యలమేల్మంగపతి శ్రీ వేంకటేశ్వర
యే ప్రొద్దు నిట్టి లీలలే హితవాయెనా ||
ఎంతనేర్చెనే ఈ కలికి
ఇంతుల కేటకే ఇంతేసి పగటు ||
చలముల నెరపుచు సవతుల దూరుచు
సలిగెల పొరలీ జవరాలు
చెలువుని సొలయుచు చేతులు చాపుచు
కెలపుల నగవుల కెరలీని ||
సాటికి పెనగుచు సణగుచు రాల్చుచు
నీటున మురిసీ నెరజాణ
మాటల గునియుచు మదమున మొరయుచు
జూటుదనంబుల జూచీని ||
మంతన మాడుచు మలయుచు నవ్వుచు
పంతము లాడీ పసలాడీ
ఇంతలో శ్రీవేంకటేశుడు నన్నేలె
పొంతనుండి నను పొగడీని ||
ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ
వింతవారితోడిపొందు వేసటాయ దైవమా ||
చూడజూడ గొత్తలాయ చుట్టమొకడు లేడాయ
వీడుబట్టు అలుచాయ వేడుక లుడివోయను
జోడుజోడు గూడదాయ చొక్కుదనము మానదాయ
యేడకేడ తలపోత యెంతసేసె దైవమా ||
నీరులేనియేరు దాటనేర దెంతేలోతాయ
మేరవెళ్ళ నీదడాయ మేటి జేరడాయను
తోరమైన ఆసలుబ్బి తోవ గానిపించదాయ
కోరి రాకపోకచేత కొల్లబోయ గాలము ||
తల్లిదండ్రి దాత గురువు తానెయైననాచారి
వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
మొల్లమాయ నామనసు మోదమాయ దైవమా ||
ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు
కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు
అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు
సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు
ఎంతమోహమో నీకీ ఇంతి మీదను
వింత వింత వేడుకల మీదను ||
తరుణిగుబ్బలు నీకు దలగడ బిల్లలుగా
నొరగు కొన్నాడవు వుబ్బున నీవు
దొరవై పయ్యెదకొంగు దోమతెర బాగుగ
సరుగ మాటుక సేసుక జాణవై వున్నాడవు ||
భామిని తొడలు నీకు పట్టెమంచము లాగున
నాముకొని పవ్వళించే వప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల వరపుగాగ
కామించి ఇట్టె కోడెకడవై వున్నాడవు ||
వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ
నునికు సేసు కున్నాడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేలుమంగను
అనిశము సింగారరాయడవై వున్నాడవు ||
ఎంతవిచారించుకొన్నా నిదియే తత్త్వము హరి
వంతుకు నీకృపగలవాడే యెరుగు హరి ||
నిన్నునమ్మినట్టివాడు నిఖిలవంద్యుడు హరి
నిన్నునొల్లనట్టివాడు నీరసాధముడు
మున్నుదేవతలు నీకుమొక్కి బదికిరి హరి
వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి ||
యేపున నీపేరిటివాడిన్నిట ధన్యుడు హరి
నీపేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి
కైపులనిన్ను నుతించి గెలిచె నారదుడు హరి
పైపై నిన్నుదిట్టి శిశుపాలుడు వీగెను హరి ||
యిట్టె నీవిచ్చినవరమెన్నడు జెడదు హరి
గట్టిగా నీవియ్యనివి కపటములే హరి
అట్టె శ్రీ వేంకటేశ నీవంతరంగుడవు హరి
వుట్టిపడి కానకున్న దేహికి హరి ||
ఎంతవిభవము గలిగె నంతయును ఆపదని
చింతించినదిగదా చెడని జీవనము ||
చలము గోపంబు దను జంపేటిపగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని
తొలగినది యదిగదా తుదగన్నఫలము ||
మెరయువిషయములే తనమెడనున్న వురులుగా
యెరిగినది యదిగదా యెరుక
పరివోనియాశ తను బట్టుకొను భూతమని
వెరచినది యదిగదా విజ్ఞానమహిమ ||
యెనలేని తిరువేంకటేశుడే దైవమని
వినగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనగలిగినదిగదా మనుజులకు మనికి ||
ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు
నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||
కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె
కూరిమలరగ నింద్రు గోడి జేసె
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె
వీరుడగునలు బట్టి విరూపుజేసె ||
అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె
సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె
మతిమాలి కురురాజు మడుగచొరజేసె ||
పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె
తొడరి కాలునుకాలు దునియజేసె
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండగ భంగపడకపోరాదు ||
ఎంతసేయగలేదు యిటువంటివిధి యభవు
నంతవానిని భిక్షమడుగుకొన జేసె ||
కోరిచంద్రుని బట్టి గురుతల్పగుని జేసె
కూరిమలరగ నింద్రు గోడి జేసె
ఘోరకుడువగ ద్రిశంకుని నంత్యజుని జేసె
వీరుడగునలు బట్టి విరూపుజేసె ||
అతివనొడ్డుగ జూదమాడ ధర్మజు జేసె
సతినమ్ముకొన హరిశ్చంద్రు జేసె
కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగ జేసె
మతిమాలి కురురాజు మడుగచొరజేసె ||
పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోజేసె
తొడరి కాలునుకాలు దునియజేసె
అడర నీవిధికి విధియగు వేంకటేశుకృప
పడయకుండగ భంగపడకపోరాదు ||
ఎంతసేసినా నెడయకే పోయ
ముంతలోనినీట మునిగిలేచుట ||
ఉట్టిపై చెరలాట మూరబొత్తులకూడు
పట్టుచాలనికొమ్మ బహునాయకము
వెట్టిమోపరిలాగు వెర్రివోయినపోక
నట్టింటివైరంబు నగుబాటుబ్రదుకు ||
రాకపోకలచేత రాగినబెనుబుండు
వాకులేనివరము వలవనివలపు
యేకాలము వేంకటేశునికృపలేక
ఆకడీకడ నడయాడెడినడపు ||
ఎంతైన దొలగవై తేదైన నామతికి
వింతచవినేతుగా విషయబుద్ధి ||
ఎనసి జన్మముల నే నెట్లనుండిన బోక
వెనక దిరుగుదువుగా విషమబుద్ధి
అనువైన యనుభవన లనుభవించగజేసి
వెనక మఱపింతుగా విషయబుద్ధి ||
కెఱలి కాంతలు నేను గినిసినను బొలయలుక
విఱిచి కలపుదువుగా విషయబుద్ధి
తఱితోడ వావివర్తనదలంచిననన్ను
వెఱపు దెలుపుదువుగా విషయబుధి ||
యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను
విడిచిపోవైతిగా విషయబుద్ధి
సడిబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను
విడిపించవలనెగా విషయబుద్ధి ||
ఎందరితో బెనగేను యెక్కడని పొరలేను
కందర్ప జనక నీవే గతిగాక మాకు
నిక్కి నాబలవంతాన నేనే గెలిచేనంటే__
నొక్కపంచేంద్రియముల కోపగలనా
తక్కినసంసారవార్ది దాటగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో
పన్నుకొన్నపాయమున పరము సాధించేనంటే
యెన్న నీమాయ కుత్తర మియ్యగలనా
వన్నెలనామనసే పంచుకోగలనో మరి
కన్నట్టి యీప్రపంచమే కడవగగలనో
వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేజేసేనంటే
తొల్లిటియజ్ఞానము తోయగలనా
ఇల్లిదే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుడ నౌదుగాక పంద నే గాగలనా
ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు
కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక ||
తలరాయిగాగ నెందరికి మొక్కెడిని
తెలివిమాలినయట్టిదేహి
కొలదిమీరిన దేవకోట్లు దనలోన
కలవాని నొక్కనినే కొలుచుగాక ||
కాలీచపడగ నెక్కడికి నేగెడివి
పాలుమాలిన యట్టిప్రాణి
మేలిమిజగములు మేనిలో గలవాడు
పాలిటివాడై ప్రణుతికెక్కుగాక ||
నూరేండ్ల నెందరి నుతియింపగలవాడు
చేరదావులేని జీవి
శ్రీరమణుడు శ్రీవేంకటేశుని
కోరికె దలచి ముక్తి కొల్లగొనుటగాక ||
ఎందరు సతులో యెందరు సుతులో
యిందు నందు నెట్లెరిగే నేను ||
మలయుచు నాయభిమానములని నే
కెలన నిపుడు వెదకే నంటే
పలుయోనులలో పలుమారు బొడమిన
చలమరి నా తొలి జన్మంబులను ||
గరిమెల బాణి గ్రహణము సేసిన
సిరుల చెలుల గలనే నంటే
తరుణుల గురుతుల తలపున మరచితి
పరగిన బహు కల్పంబుల యందు ||
శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల
భావించియె కరి చైకొంటి
తావుల జూడగ తగిలిన కోర్కుల
భావరతుల బెంబడి మనసందు ||
ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందుర్లో నే నెవ్వడ నీ వాదరించే దెట్టో
పెక్కుబ్రహ్మాండములు నీపెనురోమకూపముల
గిక్కిరిశున్న వందొకకీటమ నేను
చక్కగా జీవరాసులసందడి బడున్నవాడ
ఇక్కువ నన్ను దలచి యెట్టు మన్నించేవో
కోటులైనవేదములు కొనాడీ నిన్నందులో నా_
నోటివిన్నపము లొక్క నువ్వు గింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపై బారుటెట్టో
అచ్చపునీదాసులు అనంతము వారలకు
రిచ్చల నే నొకపాదరేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్ను దలచుక
మచ్చిక గాచితి నన్ను మఱవనిదెట్టో
ఎందాక నేచిత్త మేతలపో
ముందుముందు వేసారితి ములిగి వేసరితి ||
ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును
నామాట వినదిదే నావిహారము
యేమరినా దలపించీ నేమైనా గడించీ
సాముసేసి వేసారితీ జడిసి వేసారితి ||
యేడ చుట్టాలేడ పొందులెవ్వరూ
తోడైనవారు గారు దొంగలు గారు
కూడుచీరగానిచోటై కొరగానిపాటై
వాడివాడి వేసారితి వదిలి వేసారితి ||
యెందున నున్నాడేమిసేసీ నెక్కడ భోగించీని
విందులకువిందయిన వేంకటేశుడు
యిందరి హృదయములో నిరవై యున్నాడతడు
చెందినన్ను గాచుగాక చెనకి వేసారితి ||
ఎందు నీకు బ్రియమో యీతెప్పతిరునాళ్ళు
బిందువడె సిరులతో తెప్పతిరునాళ్ళు ||
పాలజలధిలో బవ్వళించి పాముతెప్ప
దేలుచున్న దది దెప్పతిరునాళ్ళు
వోలి నేకోదకమై వొక్కమఱ్ఱియాకుమీద
తేలుచున్న దది తెప్పతిరునాళ్ళు ||
అమృతము దచ్చువాడు అంబుధిలో మందరము
తెమల దేలించుతెప్పతిరునాళ్ళు
యమునలో కాళింగుసంగపుపడిగెమీద
తిమిరి తొక్కిన తెప్ప తిరునాళ్ళు ||
అప్పుడు పదారువేలు అంగనలచెమటల
తెప్పల దేలిన తెప్పతిరునాళ్ళు
వొప్పుగ శ్రీవేంకటాద్రి నున్నతి గోనేటిలోన
తెప్పిరిల్లె నేటనేట తెప్పతిరునాళ్ళు ||
ఎందు బొడమితిమో యెఱుగము మా
కందువ శ్రీహరికరుణేకాక ||
ఏటిజన్మమో యెఱగము పర
మేటిదో నే మెఱగము
గాటపుకమలజు గాచినయీ
నాటకుడే మానమ్మినవిభుడు ||
యెవ్వారు వేల్పులో యెఱుగము సుర
లెవ్వరో నే మెఱుగము
రవ్వగుశ్రీ సతిరమణుడు మా
కవ్వనజోదరు డంతరియామి ||
యింకానేటిదో యెఱగము యీ
యంకెలబాముల నలయము
జంకెల దనుజుల జదిపినతిరు
వేంకటేశుడు మావిడువనివిభుడు ||
ఎక్కగా రాగా రాగా యిందాకా దగులు
యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు
తెగనికర్మమునకు దేహము తగులు
తగినదేహమునకు తరుణితో తగులు
సొగిసి యీరెంటికి సుతు లొక్కతగులు
అగడాయ గనకము అన్నిటితో తగులు ||
యింతటిసంసారికి యిల్లొక్కతగులు
బంతికి నందు గలిగె పాడిపంట తగులు
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు
సంతగూడేదాసదాసీజనులెల్లా ద్గులు ||
మొదల జీవుడొక్కడే మోపులాయ దగులు
వదలనిబంధములు వడ్డివారె దగులు
వుదుటిహము బరము నొక్కయందె తగులు
అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు ||
ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను
పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల ||
పిన్నవాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు
వన్నె నిద్ద రమడలవలె నున్నారు
వెన్నలు దొంగిలుదురు వీడు వాడు నొక్కటే
పన్నుగడై వచ్చినారు పట్టరే యీబాలుల ||
నల్లనివాడు కృష్ణుడు తెల్లనివాడు రాముడు
అల్లదివో జోడుకోడెలై వున్నారు
వెల్లవిరై తిరిగేరు వేరు లేదిద్దరికిని
పెల్లుగ యశోదవద్ద బెట్టరె యీబాలుల ||
రోల జిక్కె నొకడు రోకలి పట్టె నొకడు
పోలిక సరిబేనికి బొంచి వున్నారు
మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై
ఆలించి నెవ్వరి నేమి ననకురే బాలుల ||
ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు గడపల గానము
వుక్కున బరితాపాల మూదల మండెడి ||
హృదయవికారము మాన్పగ నేతెరగును సమకూడదు
మదనానందము చెరుపగ మందేమియు లేదు
పొదలినదేహగుణంబుల బోనడువగ గతి గానము
బ్రదికించినకోరికెలకు బ్రాయము దిరిగినది ||
కమలినయజ్ఞానం బిది కన్నులముందర గానదు
తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు
తెమలనియాశాపాశము తెంపగ సత్వము చాలదు
మమకారము వెడలింపగ మతి యెప్పుడు లేదు ||
దురితంబులు పుణ్యంబులు తొడిబడ నాత్మను బెనగొని
జరగగ శరీరధారికి సత్కర్మము లేదు
తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము
శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు ||
ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో
తొక్కులవడె జీవుడు దుండగీలచేతను.
ఆసలనియెడివెర్రి యంగడివెంటా దిప్పె
దోసిలొగ్గించె దైన్యము దొరలెదుట
యీసుల నాకటి వెఇషమేమైనా దినిపించె
గాసిబడె జీవుడిదె కన్న వారిచేతను.
కడు గోపపు భూతము కాయమెల్లా మఱపించె
వడి నజ్ఞానపుటేరు వరతగొట్టె
నడుమ బాపపుచొక్కు నరకపుగుంటదోసె
గడుసాయ జీవుడిదె కన్న వారిచేతను.
భవము సంసారపుబందెలదొడ్డి బెట్టించె
తగిలింద్రియపుతాళ్ళు దామెన గట్టె
యివల శ్రీ వేంకటేశు డింతలో దిక్కయి కాచె
కవడువాసె జీవుడు కన్న వారిచేతను.
ఎక్కడనున్నా నీతడు
దిక్కులు మాదెస దిరిగీగాక ||
సరసుడు చతురుడు జగదేకగురుడు
పరమాత్ము డఖిలబంధువుడు
హరి లోకోత్తరు డతడే నామతి
సిరితో బాయక చెలగీగాక ||
ఉన్నతోన్నతు డుజ్జ్వలు డధికుడు
పన్నగశయనుడు భవహరుడు
యిన్నిటగలిగిన యిందిరరమణుడు
మన్ననతో మము మనిపీగాక ||
మమతల నలమేల్మంగకు సంతత
రమణుడు వేంకటరాయడు
జమళిసంపదల సరసవిభవముల
తమకంబున మము దనిపీగాక ||
ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి
చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||
మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు
చెనకే దెటువలెనే చెలువునిని
వనితరో పతి కొప్పొ వంగీనంటూ లోగేవు
పెనగే దెటువలెనే ప్రియమైన వేళను ||
వెంగెమవునో యనుచును వెస నవ్వజాల్వు
సంగతయ్యే దెటులనే సరసములు
యెంగిలయ్యీ నంటామోవి యించుకంతా నడుగవు
ముంగిట రతులనింక ముందెటువలెనే ||
సిగ్గువడీనో యంటా చెరగుపట్టి తియ్యపు
వెగ్గళించే దెట్టే శ్రీ వేంకటేశుని
యెగ్గు వట్టీనోయంటా నిట్టెగోరు దాకించేవు
వొగ్గి కూడితివి యిట్టే వుబ్బుతెలిసే దెట్టే
ఎక్కడి కంసుడు యిక నెక్కడి భూభారము
చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు ||
అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు
అదన శ్రీకృష్ణుడందె నవతారము
గదయు శంఖచక్రాలుగల నాలుగు చేతుల
నెదిరించియున్నాడు ఇదివో బాలుడు ||
వసుదేవుడల్ల వాడే వరుస దేవకి యదే
కొసరే బ్రహ్మాదుల కొండాట మదె
పొసగ బొత్తులమీద బురుటింటి లోపల
శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు ||
పరంజ్యోతిరూప మిది పాండవుల బ్రదికించె
అరిది కౌరవుల సంహారమూ నిదె
హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో
కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుడితడు ||
ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు
దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి ||
తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే
యమ కింకర భయము లణగి పోయె
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే
అమర కాలదండము లవియెల్ల బొలిసె ||
మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే
ఘన యామ్య మార్గము కట్టువడియె
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే
కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె ||
యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే
కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ
అడరి వైకుంఠము మా యరచేత నిలిచె||
ఎక్కడి పరాకుననో యిందాకా నుండెగాక
మక్కువ నాపై బత్తి మానలేడె వాడు
పాయరాని వలపులు పక్కన దలచుకొంటే
రాయా మనసు గరగకేమే
వో యమ్మలాల నా వుంగరము చూపరమ్మ
వేయేల తానిప్పుడే విచ్చేసీ నీడకే
వూనినట్టి సరసాలు వూహించుకోంటేను
మానా దేహము తమకించకేమే
మానినులాలా వొక్కమాట విన్నవించరమ్మ
తానె వచ్చి నన్ను సంతస మందించీనే
సేదదేరే చనవులు చిత్తమున దగిలితే
దూదేవయ నేమి వూదితే బోను
ఆ దెస మండెమురాయడైన శ్రివెంకటనాథు
డాదరించి నన్ను గూడె నతి మోహముననూ
ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము
లొక్కట గెలిచితి మోహో నేము ||
ప్రపన్నులెదుటను బడినయాతుమకు
చపలత మరి నాశము లేదు
ఉపమల గురుకృపనొనరిన మనసుకు
రపముల మరి నేరములే లేవు ||
ఘనతరద్వయాధికారగు దేహికి
మినుకుల భవభయమే లేదు
చనువుల హరిలాంఛన కాయమునకు
వెనుకొను కర్మపువెట్టియు లేదు ||
శ్రీవేంకటేశ్వరు జేరిన ధర్మికి
ఆవల మరి మాయలు లేవు
కైవశమాయను కైవల్య పదమును
జావు ముదిమితో నడ్డే లేదు ||
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన
జిక్కి జీవుడు మోక్షసిరి జెందలేడు ||
ఒడలు మాంసపూర మొక పూటయిన మీదు
గడుగకున్న గొరగాదు
కడలేనిమలమూత్రగర్హితమిది, లోను
గడుగరాదు యెంతగడిగిన బోదు ||
అలర చిత్తముచూడ నతిచంచలము దీన
గలసిన పెనుగాలి గనము
మెలపులేనిచిచ్చు మీదమిక్కిలి గొంత
నిలుపులేదు పట్టి నిలుపగరాదు ||
తిరువేంకటాచలాధిపుడు నిత్యానంద
కరుడు జీవునకు రక్షకుడు
కరుణించి యొకవేళ గాచినగాని మేను
చొరకమానెడుబుద్ధి చోక దెవ్వరికి ||
ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము
తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక ||
కాదనగ నెట్టవచ్చు కన్నులెదుటి లోకము
లేదనగ నట్టవచ్చు లీలకర్మము
నీదాసుడ ననుచు నీమరుగు చొచ్చుకొంటే
యేదెసనైనా బెట్టి యీడేరింతుగాక ||
తోయ నెట్టవచ్చు మించి తొలకేటి నీమాయ
పాయనెట్టవచ్చు యీభవబంధాలు
చేయూర నిన్ను బూజించి చేరి నీముద్రలు మోచి
యీయెడ నీవే యీడేరింతుగాక ||
తెలియగ నెట్టవచ్చు ద్రిష్టమైననీమహిమ
తలచగ నెట్టవచ్చు తగునీరూపు
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండగా
యిలమీద మమ్ము నీవే యీడేరింతుగాక ||
ఎక్కువకులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||
వేదములు చదివియు విముఖుడై హరిభక్తి
యాదరించలేని సోమయాజికంటె
యేదియునులేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||
పరమమగు వేదాంత పఠన దొరికియు సదా
హరిభక్తిలేని సన్యాసికంటె
సరవి మాలిన యంత్యజాతి కులజుడైన
నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||
వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక
తనువు వేపుచునుండు తపసికంటె
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు |
ఎచ్చోటి కేగిన యెప్పుడు దమలోని
మచ్చిక పెనుదెవులు మానకపోయె ||
పాయపుసతులగుబ్బలపెదపొట్లాల
కాయము వడి నొత్తి కాచగను
రాయుడిచే ఘనమాయగాని లోని
మాయపు పెను దెవులు మానకపోయె ||
అతివలమోహపుటధరామ్రుతములు
యితవుగ నోరి కందియ్యగను
అతిమోహమే ఘనమాయగాని లోని
మతకరిపెను దెవులు మానకపోయె ||
తరుణుల మేని మెత్తనిపరపులమీద
నిరవుగ నిటు సుఖించగను
తిరువేంకటాచలాధీశుక్రుపచేగాని
మరుచేతి పెనుదెవులు మానకపోయె ||
ఎటువంటి మచ్చికలో యెట్టి తరితీపులో
చిటుకన నే వినేను చెవుల పండుగలు||
చెలరేఁగి యాపె నీకుఁ జెప్పెనిందాఁక సుద్దులు
వెలలేని వేడుకతో వింటివి నీవు
తలఁపునఁ బట్టెనా తమి నీకుఁ బుట్టెనా
అలరి యా సంతోసము లానతియ్యవయ్య
పలుమారు నీయెదుటఁ బాడె నాపె పాటలు
తలయూఁచి మెచ్చితివి దానికి నీవు
కలిగెనా నీకు మేలు కలఁగెనా నీకు గుండె
ఎలుఁగెత్తి నాకుఁ గొంత యెరిఁగించవయ్య
ఎలమి నీతో నామె యేకతములెల్లా నాడె
వలపులు చల్లితివి వద్దనుండి
నిలిచి శ్రీవేంకటేశ నే నలమేల్మంగను
కలిసితి వెచ్చరించు కలవెల్లా నాకును
ఎటువంటి మోహమో ఏట్టి తమకమో గాని
తటుకునను దేహమంతయు మరచె చెలియ
పలుకుతేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను పాడిపాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ
పడతి నీవును తాను పవళించు పరపుపై
పొడము పరితాపమున పొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి
ఉడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ
తావిజల్లేడి మోముదమ్మి కడు వికసించె
లో వెలితి నవ్వులను లోగి లోగి
శ్రీ వేంకటేశ లక్ష్మీకాంత నినుగలసి
ఈ వైభవము లందె ఇదివో చెలియ
ఎటువంటి రౌద్రమో యెటువంటి కోపమో
తటతట నిరువంక దాటీ వీడే ||
తోరంపు బెనుచేతుల మల్లచరచి
దారుణలీల బెదవు లపుడుకరచి
కారించి చాణూరు గడుభంగపరచి
వీరుడై యెముకలు విరచీ వీడే ||
పిడుగడచినయట్టు పెడచేత నడిచి
పడనీక పురములోపల జొరబొడిచి
తొడికి చాణూరు నెత్తుక దయవిడిచి
వడివెట్టి నెత్తురు వడిచి వీడే ||
బుసకొట్టుచును వూరువుల జెమరించి
మసిగాగ బెదపెదమల్లుల దంచీ
నెసగి శ్రీతిరువేంకటేశుడై మించి
ముసిముసినవ్వుల ముంచీ వీడీ ||
ఎటువంటి వలపో యెవ్వరి కొలది గాదు
ఘటనతో దమకించి గనుగొనవయ్యా ||
తళుకున నిన్నుజూచి తలవంచుకొని యింతి
తలపోసి నీరూపు తనలోననె
నిలువు జెమటతోడ నిట్టూరుపులతోడ
చెలరేగి గుబ్బతిలీ జిత్తగించవయ్యా ||
కోరినీపై నాసపడి గొబ్బునను సిగ్గుపడి
పెర బెట్టి మాటలాడీ బెదవులనె
సారపు తురుముతోడ జవ్వనభారము తోడ
ఆరీతి నివ్వెరగందీ నాదరించవయ్యా ||
కౌగిటికి జెయ్యి చాచి కన్నులనే నీకుమొక్కి
మాగినమోవి యిచ్చీ మతకాననె
చేగదేర నిన్నుగూడె శ్రీవేంకటేశుడ
వీగదలమేలు మంగ వినోదించవయ్యా ||
ఎటువంటి విలాసిని యెంతజాణ యీ చెలువ
తటుకన నీకు దక్క దైవార జూడవయ్యా ||
మగువ మాటాడితేను మాణికాలు నిండుకొనీ
పగడాలు పెదవుల బచ్చిదేరీని
మగడి చూచితేను మంచినీలాలుప్పతిలీ
తగు నీకు నీ పెదిక్కు తప్పకచూడవయ్యా ||
పడతి జవ్వనమున బచ్చలు గమ్ముకొనీని
నడచితే వైడూర్యా లెడలీ గోళ్ళ
తొడిబడ నవ్వితేను తొరిగీని వజ్రాలు
వొడికమైనది యీపె వొరపు చూడవయ్యా ||
కొమ్మ ప్రియాల తేనెల గురిసీ బుశ్యరాగాలు
కుమ్మరించీ జెనకుల గోమేధికాలు
మమ్మరపు జెమటల ముత్తెపుసరాలి నిండీ
నెమ్మది శ్రీవేంకటేశ నీదేవి జూడవయ్యా ||
ఎట్టయినా జేయుము యిక నీచిత్తము
కిట్టిన నీ సంకీర్తనపరుడ ||
కొందరు జ్ఞానులు కొందరు భక్తులు
కొందరు వైరాగ్య కోవిదులు
యిందరిలో నే నెవ్వడ గానిదె
సందడి హరి నీశరణాగతుడ ||
జపితలు గొందరు శాస్త్రులు గొందరు
ప్రపత్తి గొందరు బలువులు
వుపమించగ నిన్నొకడా గానిందు
కపురుల నీడింగరీడ నేను ||
ఆచార్యపురుషులు అవ్వల గొందరు
యేచినసమయులై యేర్పడిరి
కాచేటి శ్రీవేంకటపతి నేనైతే
తాచి నీదాసుల దాసుడను ||
ఎట్టయినా జేసుకో ఇక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మాగురుడు నీపాదాలు విడువను
పోడిమి నా నామములు పొద్దువొద్దు నుడిగీని
వీడేమడుగునోయని వెఱవకుమీ
నాడే నాయాచార్యుడు నాకు నన్నీ యిచ్చినాడు
నే డి దేలంటే నతని నేమము నే మానను
ప్రేమతో వీడు నన్నింట బెట్టుక పూజించీని
యేమిగారణమోయని యెంచుకోకుమీ
కామించి యాచార్యుడే కారణము నీకు నాకు
యీ మరులేలంటే నాతడిచ్చిన సొమ్మే నేను
పలుమారు వీడు నాపై వత్తిచేసీ నేటికని
వెలయ శ్రీవేంకటేశ వేసరతుమీ
యెలమి నాచార్యు డిదేపని చేసినాడు
నిలిచె గలకాలము నీకు నాకు బోదు
ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా
యెట్టివారికి నింక నేది తోవయ్య ||
పాము జంపినయట్టిపాతకమున బెద్ద
పాముమీద నీకు బవళించవలసె
కోమలి జంపినకొరతవల్ల నొక్క
కోమలి నెదబెట్టుకొని యుండవలసె ||
బండి విరిచినట్టిపాతకమున బెద్ద
బండిబోయిడవై పనిసేయవలసె
కొండవెరికినట్టిగుణమున దిరుమల
కొండమీద నీకు గూచుండవలసె ||
ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ
అట్టు లక్ష్మీనారాయణ యోగము ||
నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు
పొలతి నీకు గూడె పొంతనాలు
వలుద చక్రవాకాలు వనితకు చాలు నీకు
యెలమి జక్రాయుధుడ నిద్దరికి దగును ||
తరుణి నీలకుంతల తగునీల వర్ణుడవు
సరుస మీకే తగు సమ్మంధము
నిరతి హేమవర్ణకె నీవు పీతాంబరుడవు
పరవి నిద్దరకొక్క జాతియ్యము ||
పాలవెల్లి బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు
మేలు మేలు యిద్దరికి మేనవావి
యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి
పోలి మాకు పెట్టరాదా సోబన విడేలు ||
ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే
బట్టరానిఘనబలవంతములు
కడునిసుమంతలు కన్నులచూపులు
ముడుగక మిన్నులు ముట్టెడిని
విడువక సూక్ష్మపువీనులు యివిగో
బడిబడి నాదబ్రహ్మము మోచె
అదె తిలపుష్పంబంతనాసికము
కదిసి గాలి ముడెగట్టెడని
పొదిగి నల్లెడే పొంచుక నాలికె
మొదలుచు సర్వము మింగెడిని
బచ్చెనదేహపుపైపొర సుఖమే
యిచ్చ బ్రపంచం బీనెడిని
చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు
దచ్చి తలచగా దరిచెరెడిని
ఎట్టు దరించీ నిదె యీజీవుడు
బట్టబయలుగా బరచీ నొకటి ||
చెడనిమట్టిలో జేసినముద్దే
నడుమ ముంచుకొన్నది నొకటి
తడియనినీరై తడివొడమింపుచు
పడిసీని వేవుర వడితో నొకటి ||
పాయనితనుదీపనములుగా నటు
చేయుచు మది వేచీ నొకటి
కాయపుచుట్టరికమ్ములు చేయుచు
రేయిబగలు విహరించీ నొకటి ||
ఇన్నియు దానే యేచి కపటములు
పన్నీ నిదె లోపల నొకటి
వెన్నెలచూపుల వేంకటేశ నిను
యెన్నికతో గడు నెదిరీ నొకటి ||
ఎట్టు దొరికెనె చెలియ యిద్దరికి నిటువంటి
పట్టి నిలుపగరాని బరువైన వలపు ||
నిడివి తమకములచే నిట్టూర్పులివె నీకు
అడియాస తమకంబు లాతనికిని
కడలేని వేదనల కన్నీళ్ళివే నీకు
అడలు బరితాపంబు లాతనికిని ||
గుఱుతైన యతనిపై గోరాట లదె నీకు
అరుదైన ప్రియమాన మాతనికిని
పురిగొన్న విరహమున బొరలాటలవె నీకు
అరమరపు బరవశము లాతనికిని ||
ఎనసి యాతనిరాక కెదురు చూచుట నీకు
అనుకూలుడై కలయు టాతనికిని
అనయంబు తిరువేంకటాధీశుడిదె నీకు
అనుభవము కెల్ల నీ వాతనికిని ||
ఎట్టు నమ్మవచ్చునే ఇంతి మనసు నేడు
వొట్టి యొక వేళ బుద్ధి యొకవేళా వచ్చునా ||
వెన్నెల బయట నుండి వేడి బడి యిందాకా
సన్నల నీ పతి గూడి చల్లనైతివి
వున్నతపు జందురు డొక్కడే వెన్నెలొక్కటే
కన్నె భావాలు రెండుగతులాయ నివిగో ||
కోయిల కూతలకే గుండె బెదరి యిందాకా
యీ యెడ నీ పతి గూడి యిచ్చగించేవు
ఆ యెడా బలు కొక్కటే అప్పటి నీవు నీవే
రాయడి నీ గుణములే రెండుదెఱుగులాయ ||
వేడుక చల్లగాలి విసిగితి విందాకా
కూడి శ్రీ వేంకటేశుతో కోరే వదియే
ఆడనే యాల వట్ట మదియును నొకటే
యీడా నాడా దలపోత లివియే వేరు ||
ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క
గట్టిగా నిందుకే హరి కడుమెచ్చేమయ్యా // పల్లవి //
గరుడునిమీఁదెక్కి గమనించితివి నాఁడు
అరుదైన పారిజాతహరణానకు
గరిమతో రథమెక్కి కదలితి వల్లనాఁడు
సొరిది బ్రాహ్మణపడుచుల నుద్ధరించను // ఎట్టు //
చక్కఁగాఁ గుబేరుని పుష్పక మెక్కి కదలితి
మక్కువ సీతాదేవి మరలించను
తక్కక వాయుజు నెక్కి దాడివెటితివి నాఁడు
చొక్కపువానరులపౌఁజులు చూడను // ఎట్టు //
కొట్టఁగొన నీవు రాతిగుఱ్ఱము నెక్కి తోలితి –
పట్టియెడ నధర్మము నడఁచఁగను
మెట్టుక శ్రీవేంకటేశమీఁదఁ బల్లకి యెక్కితి –
విట్టె యిందిరఁ గూడి యేఁగుఁబెండ్లి యేఁగును // ఎట్టు //
ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టాన హరినే నమ్మనేర నయితిగా
దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నటే ముదిసె
వూహల నాభోగమెల్లా వొళ్ళబట్టెనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిననీరాయగా
మనసు నాదని నమ్మి మది మది నే పెంచితి__
ననుగుబంచేంద్రియములందు గూడెను
యెనసి ప్రాణవాయువు లివి సొమ్మని నమ్మితి
మెనసి లోను వెలినై ముక్కు వాత నున్నవి
ఇందుకొరకె నేను ఇన్నాళ్ళు పాటువడితి
ముందు వెనకెంచక నే మూఢుడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరు డంతటా నుండి నా_
చందము చూచి కావగ జన్మమే యీడేరె
ఎట్టు వలసినా జేయు మేటి విన్నపము లిక
కట్టుకో పుణ్యమైనాగాక మరేమైనాను
నన్ను నెంచి కాచెనంటేనా యవగుణి నేను
నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి
యిన్నిటా నాకంటే హీనుడిక మరెవ్వడూ లేడు
వున్నతి నీకంటే ఘను లొకరూ లేరు
నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుడ నీవైతే బ్రహ్మాండము
యెలమి నే నుపకార మెవ్వరికి జేయలేను
మెలగి నీవే తృణము మేరువు సేయుదువు
భావించ నీ వేలికవు బంటుమాత్రమింతే నేను
నీవు సర్వాంతరాత్మవు నే నొకడను
సావధానమున నేను సర్వభక్షకుండ నింతే
శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు
ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే ||
వొంటికాల గుంటికుంటి వూరిబందెలకు జిక్కి
పంటదాక దున్నె నొక్కపసురము
గంటుగంటులాక లొత్తి కల్లలనడిమిపంట
కుంటివాడు గావలుండి కుప్ప లేరుపరచె ||
కలది కుక్కిమంచము కన్నవారెల్లా బండేరు
తలెతో దొగ్గినంబలి దావకూళ్ళు
వెలిగంతలకొంపలు వీడుబట్లు చూపేరు
తలవరులెందులోనా దప్పు వెదకేరు ||
వొళ్ళుచెడ్డవా డొకడు వుభయమార్గము గొని
కల్లదొరపుట్టుబడి కడుగట్టీని
చల్లనిశ్రీ వేంకటేశ సకలలోకపతివి
యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే ||
ఎట్టు సేసినా జేయి యెదురాడను
నెట్టుకొని చూచేవి నీ మహిమలికను ||
మొగము నీవు చూచితే మొక్కుచును సంతోసింతు
నగితేనే నీ మేలు నమ్ముదు నేను
బిగి వీడెమిచ్చితేనే చెప్పుకొందు జెలులతో
పగటు నీ చిత్తము నా భాగ్యమికను ||
మాటలు నీ వాడితేనే మనసు గరుగుదును
గాటాన చేయి వేసితే గడు మెత్తును
పాటించి గోరనంటితే పలుమారు జెలగుదు
కోటికి నీ కరుణే కోరితి నేనికను ||
పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు
మచ్చిక నీవు చూపితే మరుగుదును
ఇచ్చకుడ శ్రీ వేంకటేశ నన్ను గూడితివి
సచ్చియైన నీ మన్ననే బతుకు నా కికను ||
ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు
చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి ||
ఒడలిలోపలిరోగ మొనర బరితాపంబు
కడుపులోపలిపుండు కడలేనియాస
తడిపాతమెడగోత తలపువిషయాసక్తి
గుడిమీదితరువు అలుగులము ప్రాణులకు ||
నీడలోపలయెండ నెలకొన్నబంధంబు
గోడపైసున్నంబు కొదలేనియెఱుక
పాడూరిలో బ్రదుకు పాపకర్మబుద్ధి
తాడుపైతపసు తమధనము ప్రాణులకు ||
మంటజేసినబొమ్మమనికి సంసారంబు
రెంటికినిగానివీరిడికొలువు బ్రదుకు
యింటివేలుపు వేంకటేశు గొలువక పరుల
వెంట దిరుగుట వోడవిడిచి వదరిడుట ||
ఎట్టున్నదో నీమనసు యేమి సేతురా
యెట్టనెదుట బాయలే నేమి సేతురా ||
చూచుదాకా వేగిరింత సొంపుగా విభుడ నీతో
దాచి మాటాడిన దాక దమకింతును
చెచేత దమకింతు చేరువ దాకానిట్లనె
యేచి తమకమేనిండె నేమి సేతురా ||
అట్టె నీ చెనకులకు నాసగింతు దనివోక
ముట్టి యాసగింతు నీమోవి తేనెకు
గట్టిగా నంతటి మీద కౌగిటికి నాసగింతు
యెట్లైనా నాసలే నిండె నేమిసేతురా ||
ఆదన నీమేనంటి అట్టె పరవశమవుదు
వదలక కూడి పరవశమవుదును
పొదలి శ్రీ వేంకటేశ పొందితివి నన్ను నిట్టే
యెదిరించె బరవశాలేమి సేతురా ||
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన
గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||
లంపు మేయగదొణగె లలితంపుమతి లోనె,
తెంపు దిగవిడిచె యెడతెగనిమానంబు,
చంప దొరకొనియె వేసటలేనితమకంబు,
యింపు ఘనమాయ నె నికనేమి సేతు ||
బయలువందిలివెట్టె పనిలేనిలంపటము,
దయ విడువదొడగె చిత్తములోనికాంక్ష,
పయికొన్న మోహంబు పడనిపాట్ల బరచె,
లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ||
చావుబుట్టువు మఱచె సంసారబంధంబు,
దైవమును విడిచెనే తరికంపుబ్రియము
శ్రీవేంకటేశ్వరుడు చిత్తరంజకుడు యిక
గావలసినది యతనికరుణ ప్రాణులకు ||
ఎత్తరే ఆరతులీపై కింతులాల
హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||
హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి
సరిలేని దేవుని సంసార ఫలము
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు
మెరగుబోడి యలమేలుమంగ ||
పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ
కెరలుచు నితడు భోగించే మేడ
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి
అరిది సంపదలది యలమేలుమంగ ||
శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి
యీవిభుని కాగిటిలో యేచినకళ
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము
ఆవల నీవల నీపె యలమేలుమంగ ||
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి ||
ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దా దెలిసేటివారికి ||
చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమితని పాదరేణువే
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి ||
చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి ||
ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
పరమ పురుషుడట పసులగాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని ||
వేదాల కొడయడట వెన్నలు దొమ్గిలెనట
నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది
ఆదిమూల మితడట ఆడికెల చాతలట
కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని ||
అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై విలిచెనట
కలదమ్మ తనకెంత కరుణోగాని ||
ఎదుటినిధానమ వెటుజూచిన నీ
వదె వేంకటగిరియనంతుడా ||
సొగిసి భాద్రపదశుద్ధచతుర్దశి
తగువేడుక నిందరు గొలువ
పగటుసంపదలు బహుళమొసగు నీ
వగు వేంకటగిరియనంతుడా ||
తొలుత సుశీలకు దుశ్శీలవలన
వెలయు సంపదల విముఖుడవై
వలెనని కొలిచిన వడి గాచినమా
యలవేంకటగిరియనంతుడా ||
కరుణ గాచితివి కౌండిన్యుని మును
పరగినవృద్ధబ్రాహ్మడవై
దొరవులు మావులు ధృవముగ గాచిన
హరి వేంకటగిరియనంతుడా ||
ఎదురు గుదురుగాను మేల నవ్వీనే
యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||
వరుసలు వంతులును వనితల మాదుకోగా
యిరవైన విభుడు తానేల నవ్వీనే
తరమిడి నిద్దరము తన్ను దగ వడిగితే
యెరవులు సేసుకొని యేల నవ్వీనే ||
వొక్కరొక్కరము సొమ్ములొనరగ సిరిచూడగ
యిక్కువైన రమణుడు యేల నవ్వీనీ
చకగామాలోనే మమ్ము సంతసముసేయమంటాను
యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే ||
మోవిమీద గుఱుతులు మూసుకొనే మమ్ముజూచి
యీవేళ శ్రీవేంకటేశుడేల నవ్వీనే
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను
యే వెలదులతోనైన నేల నవ్వీనే ||
ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు
అదను బదనుగూడి అడుసాయె వలపు ||
చిక్కని చెమటలను చిప్పిలీని వలపు
చొక్కపు కరగులను జొబ్బిలీని వలపు
చక్కని సరసముల జాలు వాలీ వలపు
తెక్కుల మచ్చికలచే దీగె వారీ వలపు ||
జవ్వనము కళల రసములబ్బీ వలపు
నివ్వటిట్లు కోరికల నీరుకమ్మీ వలపు
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు
చివ్వన దరితీపుల జిడ్డుకట్టీ వలపు ||
పంతపు రతులనే పాలుగారీ వలపు
బంతి మోవులనే కడు బచ్చిదేరీ వలపు
ఇంతలో శ్రీ వేంకటేశ యెనసి మీరుండగాను
దొంతరచుట్టరికాన దొప్పదోగీ వలపు ||
ఎదురేది యెంచిచూడ నితని ప్రతాపానకు
పదిదిక్కులను భంగపడిరి దానవులు
యెక్కువగా వినోదాన కితడు తేరెక్కితేను
యెక్కిరిదైత్యులు కొర్రు లిందరు గూడి
చక్కగా నితడు చేత చక్రమెత్తినమాత్రాన
దిక్కుల బరువెత్తిరి దిమ్మరిఅసురలు
దట్టమై యీతనిభేరి దగ నాదుపుట్టితేను
పుట్టె నుత్పాతాలు వైరిపురములందు
అట్టె గరుడధ్వజ మటు మిన్నుముట్టితేను
కిట్టిదనుజుల కపకీర్తి తుదముట్టెను
అలిమేలుమంగవిభు డటు వీధు లేగితేమ
ఖలు లేగిర యమునికట్టెదిరికి
యెలమి శ్రీ వేంకటేశు డేపుమీర జొచ్చితేను
ములిగి దైత్యసతులు మూలమూల చొచ్చిరి
ఎను పోతుతో నెద్దు నేరుగట్టిన యత్లు
యెనసి ముందర సాగదేటి బ్రదుకు ||
కడలేని యాసచే కరగి కరగి చిత్త
మెడమ వంకకు వచ్చె నేటి బ్రదుకు
పొడవైన సమతతో బొదల బొదల మాస
మిడుమపాట్లు బడనేటి బ్రదుకు ||
తెగదెంపులేని భ్రాంతికిజిక్కి యాచార
మెగసి గొందులు దూరె నేటి బ్రదుకు
వగగొన్న మోహతాపము వేరుగ విజ్గ్యాన
మిగురువెట్టక మానె నేటి బ్రదుకు ||
భావింప రోత లోబడి పొరలెడి సొఊఖ్హ్య
మేవగింపడు జీవుడేటి బ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్త మొక్కటెకాని
యేవంక సుఖ్హము లే దేటిబ్రదుకు ||
ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు
యెనసి ముందర సాగదేటిబ్రదుకు ||
కడలేనియాసతో కరగికరగి చిత్త
మెడమవంకకు వచ్చె నేటిబ్రదుకు
పొడవైనమమతతో బొదల బొదల మాన
మిడుమపాట్ల బడె నేటిబ్రదుకు ||
తెగదెంపులేని భ్రాంతికి జిక్కి యాచార
మెగసి గొందులు దూరె నేటిబ్రదుకు
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన
మిగురువెట్టక మానె నేటిబ్రదుకు ||
భావింప రోతలోబడి పొరలెడిసౌఖ్య
మేవగింపడు జీవుడేటిబ్రదుకు
శ్రీవేంకటేశుపై చిత్తమొక్కటె కాని
యేవంక సుఖము లేదేటిబ్రదుకు ||
ఎన్నగలుగుభూతకోటినెల్ల జేసినట్టిచేత
నిన్ను జేసుకొనుటగాక నీకు దొలగవచ్చునా ||
గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు
కట్టివేసినట్టిపాపకర్మ మేలతీరును
పట్టితెచ్చి నిన్ను రోలగట్టివేసి లోకమెఱగ
రట్టుసేసుగాక నిన్ను రాజనన్న విడుచునా ||
మిఱ్ఱుపల్లములకు దెచ్చి మెరసి భూతజాలములకు
దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును
అఱ్ఱుసాచి గోపసతుల నలమి వెంటవెంట దిరుగ
వెఱ్ఱి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ||
పరుల ఇంటికేగు పరులపరుల వేడజేసినట్టి
యెఱికమాలినట్టిచేత లేలనిన్ను విడుచును
వెరవుమిగిలి వేంకటాద్రివిభుడననుచు జనులచేత
నరులుగొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా ||
ఎన్నటి చుట్టమో యాకె నెరుగ నేను
అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును ||
నెలత యెవ్వతో కాని నిన్ను బొడగనవచ్చే
చెలప చెమటలతో సిగ్గులతోడ
చెలుల చెప్పుమనుచుచు జేరి వాకిటనున్నది
తొలుత నీవాపె మోము తోగి చూడవయ్యా ||
వాని నీకేమౌనో కాని, వలపుల మాటలాడి
వేవేగ దురుము జార విరులరాల
దేవులవలె దలుపుదెరచి లోనికేతెంచె
భావించి యాపెగురుతు పరికించివయ్యా ||
యెంత పనికోగాని యేకతము గద్దనీను
సంతసాలు గడునిండ జవులురేగ
యింతలో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
చెంత నన్నేలితి వాకె జిత్తగించవయ్యా ||
ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు
పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
కొననాలుకా! హరిగుణములే నుడుగవో
మనసా! ఆతని దివ్య మహిమెంచవో
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో
యెనలేని అడియాస లేటికి నీకికను ||
వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో
ఆనినచేతు లితనికంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షు జూడరో
యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
నలిబాదాలాల! హరి నగరికే నడవరో
కలభక్తి యాతనిపై ఘటియించరో
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో
యెలయింపు గోరికలకేల పారేవికను ||
ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు
పన్నిన యాస లితనిపైపై నిలుపవో ||
కొననాలుకా! హరిగుణములే నుడుగవో
మనసా! ఆతని దివ్య మహిమెంచవో
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో
యెనలేని అడియాస లేటికి నీకికను ||
వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో
ఆనినచేతు లితనికంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షు జూడరో
యీ నేటి పాపాల బారినేల పడేరికను ||
నలిబాదాలాల! హరి నగరికే నడవరో
కలభక్తి యాతనిపై ఘటియించరో
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో
యెలయింపు గోరికలకేల పారేవికను ||
ఎన్నడు దీరీ నీతెందేపలు (?)
పన్నిన జీవులబంధములు.
భారపుజిత్తము ప్రవాహరూపము
వూరెటిమదములు వీటెత్తె
తీర వింద్రయపుదేహభ్రాంతులు
కోరేటికోర్కుల గొండలు వెరిగె
ఉడికేటిపాపము లుగ్రనరకములు
తొడికేటికర్మము తోడంటు
విడువవు భవములు వెంటవెంటనే
చిడుముడి జిత్తము చీకటి వడెను.
రపణపుభవములు రాట్నపుగుండ్రలు
చపలపుబుద్దులు జలనిధులు
ఇపుడిదె శ్రీవేంకటేశుడ నీవే
కపటమువాయగ గరుణించితివి.
ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే
సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు ||
తిత్తితో నూరేండ్లకును దేహము పండగబండగ
చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయై
పొత్తులపుణ్యముబాపము పులుసును తీపై రసమున
సత్తు నసత్తును దోచీ సంసారఫలంబు ||
వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు
పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయు ముదురుక
చదురము వలయము తోచీ సంసారఫలంబు ||
వినుకలిచదువుల సదలో వేమరు మాగగ బెట్టిన
ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగాయై
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుడు కానుక
చనవున నియ్యగ వెలసెను సంసారఫలంబు ||.
ఎన్నడు మంచివాడ నయ్యేను నేను
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా
వేపమానికిని చేదు విడువక వుండేది
యేపొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటాన బరగింవుండేటినేను
చాపలదుర్గుణినౌట సహజమే
పాముకు విష మెప్పుడు పండ్ల బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుడ నాకు గరుణ యించుక లేక
సామజపుదుర్మదము సహజమే,
అటుగాన శృఈవేంకటాధిప నాకిక వేరే
తటుకన నేడు శాంతము వచ్చీనా
ఘటన నీకృపయందుగలిగిన మేలు నాపై
తటుకన ముంచి నన్ను దరిచేర్పవే.
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా ||
బాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ।
ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు
తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
మవెడినామనువెల్ల మదముపాలాయ।
పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు
కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు
చించరానినాబుద్ది చీకటిపాలాయ।
శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు
యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి
దేవుడంతర్యామి యని తేజము బొందితిమి।
ఎన్నాళ్ళదాక దానిట్టె వుండుట బుద్ధి
కన్నపోవుట పూర్వకర్మశేషం
కలకాలమెల్ల దుఃఖమెకాగ బ్రాణికిని
వలదా సుఖము గొంతవడియైనను
కలుషబుద్ధుల బ్రజ్ఞగల దింతయును మంట
గలసిపోవుటే పూర్వకర్మశేషం ||
జాలి తొల్లియుబడ్డజాలె నేడునుగాక
మేలు వొద్దా యేమిటినై నాను
తాలిమిలో హరి దలచక యెఱుకెల్ల
గాలిబోవుట పూర్వకర్మశేషం ||
తరగనినరకపుబాధయు నేడునుగాక
దరి చేరవలదా యింతటనైనను
తిరువేంకటాద్రిపైదేవుని గొలువక
గరివడే భవమెల్ల కర్మశేషం ||
ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
విన్నని వెరగులె వేడుకలాయె ||
భువి నెట్టున్నా బోయేదే కా
చవులకు జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు
భవముల కిదియే బందములాయె ||
ఎంత వొరలినా నిదే తాగద
కంతల కంతల కాయమిది
బొంత దగలుచుక పొరలగ బొరలగ
సంత కూటములె సరసములాయె ||
కైపుసేసినా ఘనమౌనే కా
పాపము బుణ్యము బైపై నే
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి
దీపించగ బెను దెరువొకటాయె ||
ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
విన్నని వెరగులె వేడుకలాయె ||
భువి నెట్టున్నా బోయేదే కా
చవులకు జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు
భవముల కిదియే బందములాయె ||
ఎంత వొరలినా నిదే తాగద
కంతల కంతల కాయమిది
బొంత దగలుచుక పొరలగ బొరలగ
సంత కూటములె సరసములాయె ||
కైపుసేసినా ఘనమౌనే కా
పాపము బుణ్యము బైపై నే
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి
దీపించగ బెను దెరువొకటాయె ||
ఎన్ని చందములనెట్లైన నుతింతు
కన్నుల నిన్నే కనుగొంటి గాన ||
గోవిందా యని కొలిచిన నిన్నే
శ్రీ వల్లభుడని చింతింతును
భూవిభుడవు యిది పునరుక్తనకు మీ
దైవ మొకడవే ధరణికి గాన ||
ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు
కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||
పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి
ఏలీల నుండె నని యెంచి చూచితే
పాల జలధిలోన పవళింపగా మేన
మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె ||
తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి
ఎట్టుండెనని మది నెంచి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా
అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె ||
అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి
ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను
నిలువెల్ల సిరులై నిండినట్లుండె ||
ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని భావాలు ||
యేమి లీలలు నటియించే వేమయ్య దేవుడా
భూమిలో జీవులనెల్ల బుట్టింపుచు
ప్రేమతో మాటలాడే పిన్నవాడవూ గావు
నీ మహిమ లిన్నియూ నీకె తెలుసు ||
యెంతని వదరుకొనే విందిరా నాథుడా
అంతరంగముల నుండె అందరిలోన
వింతలు లేవు నీకు వెఱ్ఱివాడవు గావు
యింతేసి విచారాలు యివి నీకె తెలుసు ||
చెలగి వరాలిచ్చేవు శ్రీ వేంకట నాథుడా
తలకక నిన్ను గొల్చే దాసులకు
అలరి నీవైతేను అశక్తుడవు గావు
నెలవైన నీ సుద్దులు నీకె తెలుసు ||
ప|| ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా|
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా ||
చ|| ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా |
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా |
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా |
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా ||
చ|| ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా |
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా |
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా |
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా ||
చ|| తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా |
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా |
వరుస నేనుగుమీదివాని సున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా |
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా |
ఎన్నిలేవు నాకిటువంటివి
కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||
అరయ నేజేసినయపరాధములు చూచి
కరుణించి వొకడైన గాచునా
కరచరణాదులు కలిగించిననిన్ను
బరికించి నీసేవాపరుడ గాలేనైతి ||
ఏతరినై నే నెరిగి సేసినయట్టి
పాతక మొకడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నోవొసగిన
చేతనమున నిన్ను జెలగి చేరనైతి ||
శ్రీవేంకటేశ నే జెసినయితరుల
సేవ కొకడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి ||
ఎపుడు గానిరాడో యెంత దడవాయ కాని
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా ||
ఇద్దర మదరిపాటు ఏకాంతాన నాడుకొన్న
సుద్దులు దలచి మేను చురుకనెనమ్మా
పెద్దగా గస్తూరి బొట్టూ పెట్టిన నాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనేనమ్మా||
పాయక యతడూ నేను బవ్వళించే యింటి వంక
బోయపోయి కడు జిన్నబోతినే యమ్మ
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుజంద్రులజూచి భ్రమసితినమ్మా ||
కూడిన సౌఖ్యములందు కొదలేని వానినా
వేడుక మతి దలచి వెరగాయనమ్మా
యీడులేని తిరు వేంకటేశుడిదె నాతోడ
నాడినట్టే నాచిత్త మలరించెనమ్మా ||
ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము
వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును ||
మాట మాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె
కాటుక కన్నుల జూచి కరగించీని
తేటలు నేరుచునాపె తేలించనోపు నాపె
యేటికి యవ్వరిపొందులేమి బాతి యికను ||
చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి
మాయపు నవ్వులు నవ్వి మరగించీని
చాయలకు వచ్చునాపె సరసములాడు నాపె
ఆయనాయ వున్నసుద్దులాడ నేల యికను ||
వలపులు చల్లి చల్లి వాడికెగా నిన్ను గూడి
వెలయించ నేర్చునాపె యిన్నిటా నాపె
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్ను గూడితి
తొలుతటి సద్దులేల దొమ్ములేల యికను ||
ఎఱుక గలుగునా డెఱుగడటా
మఱచినమేనితొ మరి యెఱిగీనా ||
పటువైభవముల బరగేటినాడె
తటుకున శ్రీహరి దలచడటా
కుటిలదేహియై కుత్తిక బ్రాణము
తటతటనదరగ దలచీనా ||
ఆలుబిడ్డలతో మహాసుఖ మందుచు
తాలిమితో హరి దలచడటా
వాలినకాలునివసమైనప్పుడు
దాళి వేడగా దలచీనా ||
కొఱతలేని తేకువ దానుండేటి
తఱి వేంకటపతి దలచడటా
మరులు దేహియై మఱచివున్నయడ
తఱచుటూరుపుల దలచీనా ||
ఎఱుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి
నెఱి దొరలనాడీని నేనే మందు నికను ||
కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే
బొండు మల్లెల వేసెనేపూచి నన్నును
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి
దుండగము సేసె నేమందు నేనికను ||
గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే
దప్పికి గప్పురదుంపె దరుణి చేత
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి
దుప్పటి గప్పీ నేమందు నికను ||
గుఱితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే
చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను
జఱయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి
మెఱసి తొరల నాడి మఱే మందు నికను ||
ఎఱుగుదురిందరు నెఱిగీనెఱుగరు
హరి దానే నిజపరమాతుమని ||
నలినాసనుడెఱుగు నారదుడెఱుగు
కొలది శివుడెఱుగు గుహుడెఱుగు
యిల గపిలుడెఱుగు నింతా మనువెఱుగు
తలప విష్ణుడే పరతత్త్వమని ||
బెరసి ప్రహ్లాదుడు భీష్ముడు జనకుడు
గురుతుగ బలియు శుకుడు గాలుడు
వరుస నెఱుగుదురు వడి రహస్యముగ
హరి యితడే పరమాత్ముడని ||
తెలియదగిన దిది తెలియరాని దిది
తెలిసినాను మది దెలియ దిది
యిల నిందరు దెలిసిరిదే పరమమని
కలవెల్ల దెలిపె వేంకటరాయడు ||
ఎవ్వడోకాని యెరుగరాదు కడు
దవ్వులనే వుండు తలపులో నుండు ||
యెదయవు తనరెక్క లెగసి పోలేడు
కడు దాగుగాని దొంగయు గాడు
వడి గిందుపడును సేవకుడునుగాడు
వెడగుగోళ్ళు వెంచు విటుడును గాడు ||
మిగుల బొట్టివాడు మింటికిని బొడవు
జగడాలు తపసి వేషములును
మగువకై పోరాడు మరి విరక్తుండును
తగు గాపుబనులు నెంతయు దెల్లదనము ||
తరుణుల వలపించు దగిలి పైకొనడు
తురగము దోలు రౌతునుగాడు
తిరువేంకటాద్రిపై పరగు నెప్పుడును
పరమమూర్తియై పరగు నీఘనుడు ||
ఎవ్వరి గాదన్న నిది నిన్ను గాదంట
యెవ్వరి గొలిచిన నిది నీకొలువు ||
అవయవములలో నది గాదిది గా
దవి మేలివి మేలన నేలా
భువియు బాతాళము దివియు నందలి జంతు
నివహ మింతయునూ నీదేహమేకాన ||
నీవు లేనిచోటు నిజముగ దెలిసిన
ఆవల నది గాదనవచ్చును
శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము
భావింప నీవే పరిపూర్ణుడవుగాన ||
ఎవ్వరికిగలదమ్మ యింత సౌభాగ్యము
యివ్వల నీతో సరి యెంచరాదే నొరుల ||
వీడిన తురముతోడ విరుల పైపై రాల
వాడిక కన్నులతోడ వచ్చేనేమి
వడియు జెమటతోడ వత్తివంటి మోవితోడా
నడపు మురిపెములతోడ నవ్వేవేమే ||
నిద్దుర కన్నులతోడ నిండుబులకలతోడ
ముద్దుగారే మోముతోడ మురిసేవేమే
వొద్దనే శ్రీవేంకటేశుడొగిగూడు తెరుగమే
ముద్దురాల నేడు నీ మోహ మెంచరాదే ||
ఎవ్వరికైనను యివ్రాత నను
నవ్వులు సేసెబో నావ్రాత ||
తొలిజన్మంబున దోషకారియై
నలుగడ దిప్పెను నావ్రాత
యిల దుర్గుణముల కీజన్మంబున
నలకువ సేసెబో నావ్రాత ||
పురుషుని జేసల్పుని ననిపించుట
నరజన్మమునకు నావ్రాత
తరుచయ్యినైపాతక మరుపెట్టుక
నరకము చూపెబో నావ్రాత ||
పామఱితనమున బహువేదనలను
నామ సెనసెబో నావ్రాత
కామితఫలు వేంకటపతిని గొలిచి
నామతి దెలిపెబో నావ్రాత ||
ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానె గురుతు
పరమమంగళము భగవన్నామము
సురలకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె వున్నది
వరుసల మఱచినవారికి మాయ
వేదాంతసారము విష్ణుభక్తి యిది
అదిమునులమత మయినది
సాదించువారికి సర్వసాధనము
కాదని తొలగిన గడుశూన్యంబు
చేతినిదానము శ్రీవేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజఏవకులకు
పాఠకులకు నది భవసాగరము
ఎవ్వరివాడో ఈ దేహి
యివ్వల నవ్వల నీ దేహి ||
కామించు నూరకే కలవియు లేనివి
యేమిగట్టుకొనె నీ దేహి
వాములాయ నిరువదియొక వావులు
యేమని తెలిసెనో యీ దేహి ||
కందువ నిజములు గల్లలునడపి
యెందుకు నెక్కెనో యీ దేహి
ముందర నున్నవి మొగిదనపాట్లు
యిందె భ్రమసీ నీ దేహి ||
పంచేంద్రియముల పాలాయ జన్మము
యించుక యెరుగడు యీదేహి
అంచెల శ్రీ వేంకటాధీశ నీకృప
వంచగ గెలిచెను వడి నీ దేహి ||
ఎవ్వరివాడో యెఱుగరాదు
అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే ||
ధర జనించకతొలుత తను గానరాదు
మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే
మరలుజీవునిబదుకు మాయవో చూడ ||
యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు
మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే
అహహ దేహికి బడుచులాటవో బదుకు ||
సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి
అంతి నితనిగన్నబదుకువో బదుకు ||
ఎవ్వరు గర్తలుగారు యిందిరానాథుడే కర్త
నివ్వటిల్లాతనివారై నేమము దప్పకురో ||
కర్మమే కర్తయితే కడకు మోక్షము లేదు
అర్మిలి జీవుడు గర్తయైతే బుట్టుగేలేదు
మర్మపుమాయ గర్తయితే మరి విజ్ఞానమేలేదు
నిర్మితము హరిదింతే నిజమిదెరుగరో ||
ప్రపంచమే కర్తయితే పాపపుణ్యములు లేవు
వుపమ మనసు గర్తైయుంటే నాచారమేలేదు
కపటపు దెహములే కర్తలయితే చావులేదు
నెపము శ్రీహరిదింతే నేరిచి బ్రదుకరో ||
పలుశ్రుతులు గర్తలై పరగితే మేరలేదు
అల బట్టబయలు గర్తైతే నాధారము లేదు
యెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రి
నిలయపుహరి యింతే నేడే కొలువరో ||
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ది
యివ్వల విచారించవే ఇందిరారమణా.
వెంటబెట్టి కామక్రోధవితతులు చుట్టి నన్ను
తొంటి మీసేవకు నన్ను దూరము సేసె
కంటకపుటింద్రియాలు కడుహితశత్రులై
అంటిన మోxఅముత్రోవ నంటకుండా జేసెను.
తిప్పి తిప్పి నాయాసలు తెగీ వైష్ణవధర్మాన
దెప్పల దేలకుండాను తీదీపు సేసె
వొప్పగుంసంసార మిది వున్నతి నాచార్యసేవ
చొపు మాపి పుణ్వాసకు జొరకుండాజేసెను.
మచ్చరపు దేహ మిది మనసిట్టె పండనిక
తచ్చి యజ్ఞానమునకు దావుసేసె
ఇచ్చల శృఈవేంకటేశ ఇంతలో నన్ను నేలగ
నిచ్చలు నీకృపే నన్ను నిర్మలము సేసెను.
ఎవ్వరు లేరూ హితవుచెప్పగ వట్టీ
నొవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||
అడవి బడినవాడు వెడల జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురిత కాననములతరి బడి
వెడలలేక నేము విసిగేమయ్యా ||
తెవులువడినవాడు తినబోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల బడి పరమామృతము నోర
జవిగాక భవములు చవులాయనయ్యా ||
తనవారి విడిచి యితరమైనవారి
వెనక దిరిగి తావెర్రైనట్లు
అనయము తిరువేంకటాధీశు గొల్వక
మనసులోనివాని మరచేమయ్యా ||
ఎవ్వరుగలరమ్మా యిక నాకు
నెవ్వగలలో జిత్తము నెలకొన్నదిపుడు ||
మనసుకోరిక దీని మానిపెదనంటినా
వొనగూడి మనసు నావొదలేదు
పెనగి తమకము వాపెదనంటినా మేన
అనయము వెరపు దానై యున్నధివుడు ||
చింత తాలిముల ముంచెదనంటినా మేన
సంతావముల సేయ జలపట్టెను
అంతరంగము నాది యంటినా నెవున
సంతతము నాతడే జట్టిగొనెనిపుడు ||
సింగారపు మెను నా చేతికి లోనంటినా
అంగవించి పరవశమై యున్నది
యింగితమెరిగి వేంకటేశుడు నాకంటినా
కంగినన్ను గారించి కలసెనిపుడు ||
ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ
నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక
కెందరికి దోబుట్ట డీజీవుడు
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ
మెందరికి గావింప డీజీవుడు ||
ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక
కెక్కడో తనజన్మ మీజీవుడు
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు
డెక్కడికి నేగునో యీజీవుడు ||
ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక
కెన్నిదనువులు మోవ డీజీవుడు
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి
యెన్నిపదవుల బొంద డీజీవుడు ||
ఏ
ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినెఱిగినవాడు
పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ దత్పరుడు గాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులదానే యని భావించువాడు
నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పరబుధ్ధి దలిగిన వాడు
కర్మమార్గములు తడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు
జగతి పై హితముగా జరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ దెలిసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు
ఏ నిన్నుదూరక నెవ్వరి దూరుదు నీ
వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||
అపరాధిగనక నన్నరసి కావుమని
అపరిమితపు భయమంది నీకు శరణంటిగాక
నెపములేక నన్ను నీకు గావగనేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ||
ఘనపాపి గనక నీకరుణ గోరి నీ
వనవరతము నాయాతుమను విహరించుమంటిగాక
యెనసి నన్ను గాచుటేమి యరుదు నీకు
ననఘుడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ||
ప|| ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||
చ|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
చ|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముగావు ||
చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||
ఏకతాన వున్నవాడు యిదివో వీడె
చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు
మంచిమంచిపన్నీట మజ్జన మవధరించి
పంచమహావాద్యాలతో పరమాత్ముడు
అంచల గప్పురకాపు అంగముల మెత్తుకొని
కొంచక నిలుచున్నాడు గోణాముతోడను
తట్టపుణుగామీద దట్టముగ నించుకొని
తెట్టలై వేదనాదాల దేవదేవుడు
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చి కుచ్చి కట్టుకొని
వెట్టదీర సురట్ల విసరించుకొంటాను
తనిసి యలమేల్మంగ దాళిగా గట్టుకొనె
వెనుకొని యిదివో శ్రీవేంకటేశుడు
మునుకొని యారగించి మూడులోకములు మెచ్చ
చనవరిసతులతో సరసమాడుతాను
ఏకాత్మవాదులాల యిందుకేది వుత్తరము
మీకు లొకవిరోధ మేమిట బాసీ నయ్యలాల
పాపమొక్కడు సేసితే పాపులే యిందరు గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపించి యొక్కడసురైతే కోరి యిందరు గావలదా
చూప దేవుడొక్కడైతే సురలిందరు గావలదా
వొకడపవిత్రుడైతే నొగి నిందరు గావలదా
వొకడు శుచైవుండితె వోడకిందరు గావలదా
వొకనిరతి సుఖమంటి యిందరును వొనర బొందవలదా
వొకని దుఃఖమందరు వూర బంచుకోవలదా
ఆకడ నొకడు ముక్తుడయితే నందరును గావలదా
దీకొని యొకడు బద్ధుడైతే యిందరు గావలదా
చేకొని శ్రీవేంకటేశు జేరి దాసులయి యుండేటి
లోకపుమునులను దెలుసుకోవలదా
ఏగతి నుద్దరించేవో యింతటిమీదట మమ్ము
భోగపుగొరింకలచే బొలిసెబో పనులు
పరగి నాలుకసొమ్పు వరసిపొయ
పరులనే నుతియించి పలుమారును
విరసపు బాపములవినికిచే వీనులెల్లా
గొరమాలె మాకు నేటికులాచారములు
మొక్కలాన బంధనమునకు జాచి చాచి
యెక్కువ జేతులమహి మెందో పొయ
తక్కక పరస్త్రీల దలచి మనసు బుద్ది
ముక్కపొయ మాకు నేటిముందరిపుణ్యములు
యెప్పుడు నీచుల ఇండ్ల కెడ తాకి పాదములు
తప్పనితపములెల్లా దలగిపోయ
యిప్పుడే శ్రీవేంకటేశ యిటు నిన్ను గొలువగా
నెప్పున నే జేసినట్టి నేరమెల్లా నడగె
ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము
కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము
నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము
ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము
ఏటికి దలకెద రిందరును
గాటపుసిరులివి కానరొ ప్రజలు ||
ఎండల బొరలక యేచినచలిలో
నుండక చరిలో నుడుకక
అండనున్నహరి నాత్మదలచిన
పండినపసిడే బ్రతుకరొ ప్రజలు ||
అడవుల నలయక ఆకునలము దిని
కడుపులు గాలగ గరగక
బడిబడి లక్ష్మీపతికి దాసులై
పొడవగుపదవుల బొందరొ ప్రజలు ||
పొక్కేటికాళ్ళ పుండ్లు రేగగ
దిక్కులనంతట దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతి గని
వొక్కమనసుతో నుండరొ ప్రజలు ||
ఏటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీ
నాటకములాల చీచీ నమ్మితిగా మిమ్మును ||
జవ్వనమదమ చీచీ చక్కదనమరో చీచీ
రవ్వైన రాజసగర్వమరో చీచీ
కొవ్వినమదమ చీచీ కూరిమియాసరో చీచీ
నవ్వులదేహమ చీచీ నమ్మితిగా మిమ్మును ||
ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెమ చీచీ
బచ్చురవణములోనిబచ్చన చీచీ
తెచ్చుకోలు తాలిములదిట్టతనమరో చీచీ
పుచ్చినపోకరో చీచీ పోయగా మీకాలము ||
సిరులచీకటి చీచీ సిలుగుసంపద చీచీ
పరవిభవమ చీచీ వాసిరో చీచీ
కరుణించె దిరువేంకటగిరిపతి నన్ను
విరసవర్తన చీచీ వీడెగా మీభారము ||
ఏటికి సత్యాలు సేసేవెందాకా నీవు
గాటముగనింకా దారుకాణించవలెనా ||
చెలియిచ్చిన పువ్వుల చెండునీచేతనున్నది
మలసి నీచేతకది మచ్చముగాదా
కొలది మీరగ తొల్లె గొల్లెతల మగడవు
యెలమి నీ యెడ్డతనా లెంచి చూపవలెనా ||
రమణి చేముద్దుటుంగరము నీవేలనున్నది
కొమరై నీపొందు కది గురుతుకాదా
తమితోడ నీవుతొల్లి ధర్మరాజు మరిదివి
గములై నీ నిజాలకు కడగురుతున్నదా ||
అంగనకంటసరి నేడట్టె మెడనున్నది
సంగతిగా నీకదే లాంచనము గాదా
చెంగట నన్నేలితివి శ్రీవేంకటేశ్వర
అంగపు నీరీతులకు నొఊగాములున్నవా ||
ఏటికే యీ దోసము మీ రెఱుగరటే
ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||
తామర మొగ్గలవంటి తగిన నా చన్నులివి
కాముని యమ్ములనేరు కాంతలదేమే
నా మగని కౌగిటలో ననిచే జక్క వలవి
ప్రేమమున మారుబేరు పెట్టుదురటే ||
చందురుని బోలేటి సరసపు నా మోము
అందపు బూబంతియంటా నాడు కోకురే
ముందు నా రమణునికి మోము చూచేటద్దమిది
కందువలేని నిందలు గడింతురటే ||
తీగెవంటి నామేను దిక్కుల మెఱుగనుచు
పోగులుగా సారె సారె బొగడకురే
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది
మోగము గూడెను వేరే వుప్పటించ నేటికే ||
ఏటినేను యేటిబుద్ది యెక్కడిమాయ
వీటిబొయ్యే వెర్రి గాను వివేకి గాను
ఆరసి కర్మము సేసి అవినన్ను బొదిగితే
దూరుదు గర్మము గొంది దూరుచు నేను
నేరక లంపటములు నేనే కొన్ని గట్టుకొని
పేరడి బరుల నందు బెట్టరంటాను
యెక్కుడు నాదోషములు యెన్నైనా వుండగాను
వొక్కరిపాపము లెంతు వూరకే నేను
తిక్కవట్టి నాకునాకే దేవతల కెల్లా మొక్కి
వొక్కరివాడ గాకుందు వుస్సురనుకొంటాను
విరతి బొందుదు గొంత వేరే సంసారము జేతు
యెరవుల దాడనే యెప్పుడు నేను
అరిది శ్రీవేంకటేశు డంతలో నన్ను నేలగా
దొరనైతి నధముడ దొల్లే నేను
ఏటిబ్రదుకు యేటిబ్రదుకు వొక్క
మాటలోనే యటమటమైనబ్రదుకు ||
సంతకూటములే చవులయినబ్రతుకు
దొంతిభయములతోడిబ్రదుకు
ముంతనీళ్ళనే మునిగేటిబ్రదుకు
వంత బొరలి కడవల లేనిబ్రదుకు ||
మనసుచంచలమే మనువయినబ్రదుకు
దినదినగండాల దీరుబ్రదుకు
తనియ కాసలనె తగిలేటిబ్రదుకు
వెనకముందర చూడ వెరపయినబ్రదుకు ||
తెగి చేదె తీపయి తినియేటిబ్రదుకు
పగవారిపంచలపాలైన బ్రదుకు
తగువేంకటేశ్వరు దలచనిబ్రదుకు
పొగకు నోపక మంట బొగిలేటి బ్రదుకు ||
ఏటిమాట లివి విన నింపయ్యనా మది
నేటవెట్టి దాసుడౌ టిదిసరియా
జీవుడే దేవుడని చెప్పుదురు గొందరు
దైవముచేతలెల్లా దమ కున్నవా
ఆవల గొందరు కర్మ మది బ్రహ్మ మందురు
రావణాదు లవి సేసి రతికెక్కిరా।
మిగుల గొందరు దైవమే లేదనెందురు
తగ నీప్రపంచమెల్లా దనచేతలా
గగన మతడు నిరాకార మందురు గొంద
రెగువ బురుషసూక్త మెఱగరా తాము
యెనిమిదిగుణములే యితని వందురు గొంద-
రనయము మిగిలిన వవి దమనా
యెనయగ శ్రీవేంకటేశ్వరుదాసులై
మనుట నిత్యముగాక మరి యేమినేలా
ఏటివిజ్ఞాన మేటిచదువు
గూటబడి వెడలుగతిరుగుచు గనలేడు ||
ఏడుమడుకలచర్మ మింతయును దూంట్లై
గాడబెట్టుచు జీము గారగను
పాడైనయిందులో బ్రదుకుగోరే బ్రాణి
వీడదన్నుక చనెడివెరవు గనలేడు ||
కడుపునిండిన మహాకష్టంబు నలుగడల
వెడలుచును బెనుకురికి వేయగాను
యిడుమ బొందుచు సుఖంబిందుకే వెదికీని
వొడలు మోపగ జీవు డోపనలేడు ||
వుదయమగుకన్నులురికి యేమైన గని
మదవికారము మతికి మరుపగాను
యిది యెరిగి తిరువేంకటేశు గని జీవుడా
సదమలానందంబు చవిగానలేడు ||
ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్నమాటలెల్లా నవి నిజాలా ||
తొలుకారుమెరుపులు తోచి పోవుగాక
నెలకొని మింట నవి నిలిచీనా
పొలతులవలపులు పొలసిపోవుగాక
కలకాలం బవి కడతేరీనా ||
యెండమావులు చూడ నేరులై పారుగాక
అండకుబోవ దాహ మణగీనా
నిండినట్టిమోహము నెలతలమది జూడ
వుండినట్టేవుండుగాక పూతయ్యీనా ||
కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక
మెలకువ జూడ నవి మెరసీనా
అలివేణులమేలు ఆశపాటేకాక
తలపు వేంకటపతి దగిలీనా ||
ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ గాలము ||
ఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని
కదిసియాసచే గడవలేక
యెదురు చూచిచూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయ గాలము ||
ఇంతట దీరెడి దుఃఖమంతట దీరెడినని
వింతవింత వగలచే వేగివేగి
చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయ గాలము ||
యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూరి కేగియేగి
గక్కన శ్రీతిరువేంకటపతి గానక
పుక్కిటిపురాణమయి పోయ గాలము ||
ఏణనయనలచూపు లెంత సొబగైయుండు
ప్రాణసంకటములగుపనులు నట్లుండు ||
ఎడలేనిపరితాప మేరీతి దా నుండు
అడియాసకోరికెలు నటువలెనె యుండు
కడలేనిదు:ఖసంగతి యెట్ల దానుండు
అడరుసంసారంబు నట్లనే వుండు ||
చింతాపరంపరల జిత్తమది యెట్లుండు
వంత దొలగనిమొహవశము నట్లుండు
మంతనపుబనులపయి మనసు మరి యెట్లుండు
కంతుశరమార్గములగతి యట్ల నుండు ||
దేవుడొక్క డెయనెడి తెలివి దన కెట్లుండు
శ్రీవేంకటేశుక్రుపచేత లట్లుండు
భావగోచరమైనపరిణ తది యెట్లుండు
కైవల్యసొఊఖ్యసంగతులు నట్లుండు ||
ప : ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు
చ : శునకము బతుకును సుఖమయ్యే తోచుకాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు
చ : పుఱువుకుండే నెలవు భువనేశ్వరమైతోచు
పెరచోటి గుంటయైన ప్రియమైయుండు
ఇరవై వుండితే చాలు ఎగువేమి దిగువేమి
వరుస లోకములు సర్వం విష్ణుమయము
చ : అచ్చమైన ఙ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చర తనతిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికీ దాసుడైతే
హెచ్చుకుందేమిలేదు ఏలినవాడితడే
ఏది కడ దీనికేది మొదలు వట్టి
వేదనలు తన్ను విడుచు టెన్నడు ||
తొడరినహృదయమే తోడిదొంగయై
వడిగొని తన్ను వలబెట్టగాను
కడగి కర్మముల గడచు టెన్నడు
నిడివిబంధముల నీగు టెన్నడు ||
తతిగొన్న తలపులే దైవయోగమై
మతినుండి తన్ను మరగించగాను
ప్రతిలేనియాపద బాయు టెన్నడు
ధృతిమాలినయాస దీరు టెన్నడు ||
పొదలినమమతయే భూతమై తన్ను
బొదిగొని బుద్ధి బోధించగాను
కదిసి వేంకటపతి గనుట యెన్నడు
తుదిలేనిభవముల దొలగు టెన్నడు ||
ఏది చూచిన తమకు యిన్నియును నిటువలెనె
వేదు విడిచిన కూడు వెదికినను లేదు ||
ఏకాంత సౌఖ్యములు ఎక్కడివి ప్రాణులకు
పై కొన్న దుఃఖముల పాలుపడి గాకా
ఏకమగు పుణ్యంబు లేడగల విందరికి
గై కొన్న దురితములు కలపాటి గాక ||
హితవైన మమకార మెందుగల దిందరికి
ప్రతిలేని విరహ తాపము కొలది గాకా
మతిలోని వేడుకలు మరియేవి మనుజులకు
జితమైన దైవ మిచ్చిన పాటిగాక ||
ఇరవైన దైవ కృప ఏల దొరకును తమకు
పరమైన కర్మంబు పరిపాటి గాక
ఎరవైన పెను బంధమేల వీడును నాత్మ
తిరు వేంకటేశు కృప తిరమైన గాక ||
ఏది చూచిన నీవే యిన్ని యును మఋఇ నీవే
వేదవిరహితులకు వెఋఅతు మటుగాన ||
ఇరవుకొని రూపంబులిన్నిటాను గలనిన్ను
బరికించవలెగాని భజియింపరాదు
హరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ
స్మరణ విగ్యానవాసన గాదుగాన ||
యిహదేవతాప్రభలనెల్ల వెలుగుట నీకు
సహజమనవలెగాని సరి గొలువరాదు
అహిమాంశుకిరణంబు లన్ని చోట్ల బరగు
గ్రహియింపరా దవగ్రాహములుగాన ||
యింతయును దిరువేంకటేశ నీవునికి దగ
జింతింపవలెగాని సేవింపరాదు
అంతయు ననరుహమును నరుహంబనగరాదు
అంతవానికి బరుల కలవడదుగాన ||
ఏది చూచినను గడు నిటువంటిసోయగములే
మేదినికి గిందుపడి మిన్నందనేలా ||
కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు
అరిది నరసింహరూపైతివేలా
వురగేంద్రశయనమున నుండి నీవును సదా
గరుడవాహనౌడవై గమనించరాదా ||
పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప
తరుణివై వుండ నిటు దైన్యమేలా
శరణాగతులకు రక్షకుడవై పాము నీ
చరణములకిందైన చలముకొననేలా ||
దేవతాధిపుడవై దీపించి యింద్రునకు
భావింప తమ్ముడన బరగితేలా
శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల
జీవకోట్లలోన జిక్కువడనేలా ||
ఏది తుద దీనికేది మొదలు
పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||
ఎన్నిబాధలు దనకు నెన్ని లంపటములు
యెన్నివేదనలు మరియెన్ని దుఃఖములు
యెన్నిపరితాపంబు లెన్నిదలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైనగలవు ||
యెన్నికొలువులు దనకు నెన్నియనుచరణలు
యెన్నియాసలు మరియు నెన్ని మోహములు
యెన్నిగర్వములు దనకెన్ని దైన్యంబులివి
యిన్నియును దలప మరి యెన్నైన గలవు ||
యెన్నిటికి జింతించు నెన్నటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును దిరువేంకటేశులీలలు గాగ
నెన్ని చూచినను దానెవ్వడును గాడు ||
ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోది తోడ నను బోధింపవే
సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చెప్పెడిని
వుత్తమమధ్యమ మొగి గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరచీని ||ఏది||
నానారూపులు నరహరి నీపని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి ||ఏది||
భావాభావము పరమము నీవని
దైవజ్ఞులు నిను దలచెదరు
శ్రీవేంకటగిరి జెలగిననీవే
తావుగ మదిలో దగిలితివి ||ఏది||
ఏదియునులేని దేటిజన్మము
వేదాంతవిద్యావివేకి గావలెను ||
పరమమూర్తి ధ్యానపరుడు గావలె నొండె
పరమానంద సంపదలొందవలెను
పరమార్థముగ నాత్మభావింపవలె నొండె
పరమే తానై పరగుండవలెను ||
వేదశాస్త్రార్థకోవిదుడుగావలె నొండె
వేదాంతవిదుల సేవించవలెను
కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె
మోదమున హరిభక్తి మొగినుండవలెను ||
సతతభూతదయావిచారి గావలె నొండె
జితమైనయింద్రియస్థిరుడు గావలెను
అతిశయంబగు వేంకటాద్రీశు సేవకులై
గతియనుచు తనబుద్ధి గలిగుండవలెను||
ఏదెస మోము లేదు యెవ్వరికి ననేరు మీ_
వేదాంతశ్రవణము వెట్టికి జేసేరా.
అంతా బ్రహ్మమైతేనాతుమా వొక్కటియైతే
చింతింప గురుడు లేడు శిష్యుడూ లేడు
బంతినే ముక్తుడూ లేడు బద్ధుడూ లేడిట్లయితే
వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయంబో
యిహమెల్లా గల్ల నేరు యేటికి బుట్టినవారు
సహజమే యిదనేరు చావనేటికి
మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యు
డహరహ మేమైయున్నా నాతనికేది గతి?
కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమది
యిందు జిక్కి బ్రహ్మమున కీఘోరమేలా
అందిన శ్రీవేంకటేశు డంతరాత్ముడొక్కదింతే
మందలించికొలువరు మంటికా మీజ్ఞానము.
ప|| ఏదైవము శ్రీపాదనఖమున బుట్టినగంగ
త్రిలోకపావనము చేయును త్రిపథగామిని ఆయను ||
అప|| ఏదైవము నాభినలినంబున జనియించిన అజుండు
అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను ||
యేదైవము వురస్థలంబు దనకును మందిరమైన యిందిర
మాతయయ్యె యీజగంబులకెల్లను
యేదైవము అవలోకనమింద్రాది దివిజగణంబుల
కెల్లపుడును సుఖంబు లాపాదించును ||
యేదైవము దేహవస్తువని అనిమిషులందరు గూడి
శ్రీనారాయణ దేవుండని నమ్మియుందురు
ఆదేవుడే సిరులకనంత వరదుడు తిరువేంకట
గిరినాథుడుభయ విభూతినాథుడే నానాథుడు ||
ఏనోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్ను దలచినది నిమిషమూ లేదు
పాయమెల్ల సంసారముపాలే పడితిగాని
చేయార నీసేవ నే జేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడుశేషమాయగాని
నీయవసరములందు నేనొదుగలేదు.
చిత్తము ఆసలపాలే సేసి బదికితి గాని
హత్తి నిన్ను ధ్యానము సేయగలేదు
సత్తెపునానాలుకెల్ల చవుల కమ్మితిగాని
మత్తిలి నీర్తనము మరపుటా లేదు.
పుట్టుగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిగాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు.
ప|| ఏపనులు సేసినా నిటువలెనేపో | యీపనికి జొరనిపని యేటిలోపైరు ||
చ|| హరికథలమీదిప్రియమబ్బేనా తొంటితమ- | పరిపక్వమగుదపఃఫలముగాక ||
గరిమె నివిలేకున్న గలకాలములు జేయు- | నిరతంపు దపమెల్ల నీటిపై వ్రాత ||
చ|| నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్ల | బారజల్లిన దానఫల మదియపో |
కోరి యిది లేకున్న కోటిదానములైన | పేరుకొన వరతగలపినచింతపండు ||
చ|| వదలకిటు వేంకటేశ్వరుడే దైవంబనుచు | జదువగలిగిన మంచిచదు వదియపో |
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను | చదువు లసురలు మున్ను చదివేటిచదువు ||
ప|| ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
చ|| వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
చ|| కమలాక్షుని మతిగాననిచదువులు | కుమతంబులు బహుకుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములే కాని వితథముగావు ||
చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపటధర్మములు |
శ్రీవేంకటపతి సేవించునేవలు | పావనము లధికభాగ్యపుసిరులు ||
ప : ఏమంటి వేమంటి వెరగనేను – ఓ
కామిని నీకిప్పుడైన కానవచ్చెగా
చ : వేలతలుపు మీటిన విటుడెవ్వడే – ఓ
తాలిమి నేనే మాధవుడను
వాలిన మాధవుడవంటే వసంతుడవా – కాదే
గాలింపు చక్రముచేత కలవాడనే
చ : ధర చక్రివైతే కుమ్మరవాడవా – కాదే
సిరుల భూమి ధరించినవాడనే
శిరసున భూమిమోచే శేషుడవా – కాదే
అరయ నిన్నియునేలే హరినే నేను
చ : వంతులకు హరివైతే వానరమవా – నీ
మంతనపు లక్ష్మీ రమణుడనేను
ఇంతయేల శ్రీవేంకటేశుడ ననగరాదా – తొల్లి
అంతేపో నామారు నీవంటివిగదవే
ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను
నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా
నేను నిన్ను గొలిచితి నీవు నన్ను నేలితివి
పాని పంచేంద్రియాలేల పనిగొనీవి
కానిలేనిబంట్ల దేరకాండ్లు వెట్టిగొనగ
దానికి నీ కూరకుండ ధర్మమా సర్వేశ్వరా
పుట్టించినాడవు నీవు పుట్టినవాడను నేను
వట్టి కర్మమేల నన్ను బాధపెట్టీని
వొట్టినసొమ్ముకు వేరొకరు చేయిచాచితే
తట్టి నీవు వహించుకోదగదా సర్వేశ్వరా
యెదుట నీవు గలవు యిహములో నే గలను
చెదరినచిత్తమేల చిమ్మిరేచీని
అదన శ్రీవేంకటేశ ఆరితేరినట్టినన్ను
వదలక రక్షించుకో వన్నెగా సర్వేశ్వరా
ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము
కామించి యీరేడు లోకములెల్లా నిండెను ||
యీవల దేవుడు రథమెక్కితేను దైత్యులెల్ల
కావిరి జక్రవాళాద్రి కడ కెక్కిరి
భావించి చక్రమీతడు పట్టితే నసురలెల్ల
ధావతి తోడుతను పాతాళము వట్టిరి ||
గరుడధ్వజము హరి కట్టెదుర నెత్తించితే
పరువెత్తిరి దానవ బలమెల్లను
గరిమ నితేరి బండికండ్లు గదలితేను
ఖరమైన దైత్యసేన క్రక్కదలి విరిగె ||
ధృతి శ్రీ వేంకటేశుడు తిరువీధులేగితేను
కుతిలాన శత్రులు దిక్కుల కేగిరి
తతి నలమేల్మంగతో తన నగరు చొచ్చితే
సతమై బలిముఖ్యులు శరణము జొచ్చిరి ||
ఏమని పొగడుదు ఇట్టి నీగుణము
యీ మహిమకు ప్రతి యితరులు కలరా
నిండెను జగముల నీ ప్రతాపములు
చెండిన బాణునిచేతులతో
కొండలంతలై కుప్పలు వడియెను
వండ(దరగు రావణుతలలయి(లు?)
పూడెనుజలధులు పొరి(గోపించిన
తోడ బ్రహ్మాండము తూటాయ
చూడ పాతాళాము చొచ్చె బలీంద్రుడు
కూడిన కౌరవకులములు నడ(గె
యెత్తితివి జవము లీరేడు నొకపరి
యిత్తల నభయం బిచ్చితివి
హత్తిన శ్రీవేంకటాధిప నీకృప
నిత్తెమాయె నీనిజదాసులకు
ఏమని పొగదుడుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ ||
తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పొదులివి గదవే
పలుమరు పువ్వుల పానుపులు ||
తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||
కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు ||
ఏమని పొగడేమిదె నీరమణిని
కోమలపు వయసు కోకిలవాణి ||
దొంతలు వెట్టీ తోడనె వలపులు
కొంతపు చూపుల కోమలి
సంతనసేసి సరసపు మాటల
వింత వేడుకల వెన్నెల పతిమ ||
విందులు చేసి వేమరు ప్రియములు
కందువ నవ్వులు కలకంఠి
బిందెల నించి పెకగు సిగ్గులు
మందె మేళముల మదనుని శరము ||
పైరులు విత్తీబలు తమకంబుల
మేరతో రతినలమేల్మంగ
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నెనసె
సారెపు గుణముల జమళిమెరుంగుల ||
ప : ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ
ఏమరక తలచరో యిదే చాలు
కామించినవియెల్ల గక్కున కలుగు ||
దురితములెల్ల దీరు దుఃఖములెల్ల నణుగు
హరియని వొకమాటు అన్నాజాలు
సురలు పూజింతురు సిరులెల్ల జేరును
మరుగురుని నామమటు పేరుకొన్నజాలు ||
భవములన్నియుబాయు పరము నిహముజేరు
ఆవల నారాయణ యన్నాజాలు
భువి యెల్లా దానేలు పుణ్యములన్నియు జేరు
తవిలి గోవిందునాత్మ దరచిన జాలు ||
ఆనందము గలుగు నజ్ఞానమెల్లబాయు
ఆనుక శ్రీ వేంకటేశ యన్నాజాలు
యీనెపాన నారదాదులిందరు నిందకు సాక్షి
దానవారి మంత్ర జపతపమే చాలు ||
ఏమి గలదిందు నెంతకాలంబైన
పామరపు భోగ మాపదవంటి దరయ
కొండవంటిది యాస, గోడవంటిది తగులు
బెండువంటిది లోని పెద్దతనము
పూండువంటిది మేను, పోలించినను మేడి-
పండువంటిది సరసభావమింతియును
కంచువంటిది మనసు, కలిమిగల దింతయును
మంచువంటిది, రతి భ్రమతవంటిది
మించువంటిది రూపు, మేలింతయును ముట్టు
పెంచువంటిది, దీనిప్రియ మేమిబ్రా(తి
ఆ(కవంటిది జన్మ అడవి వంటిది చింత
పాకువంటిది కర్మబంధమెల్ల
యేకటను తిరువేంకటేశు(దలచిన కోర్కి
కాక సౌఖ్యములున్న గనివంటి దరయ
ఏమి గలిగెను మాకిందువలన
వేమారు బొరలితిమి వెర్రిగొన్నట్లు ||
తటతటన నీటిమీదట నాలజాలంబు
లిటునటు జరించవా యీది యీది
అటువలెనెపో తమకమంది సంసారంపు
ఘటనకై తిరిగితిమి కడగానలేక ||
దట్టముగ బారావతములు మిన్నుల మోవ
కొట్టగొన కెక్కెనా కూడికూడి
వట్టియాసలనే యిటువలెనేపో యిన్నాళ్ళు
బట్టబయ లీదితిమి పనిలేనిపాట ||
బెరసి కుమ్మరపురువు పేడలోపలనెల్ల
పొరలదా పలుమారు బోయొపోయి
వరుస జన్మముల నటువలెనెపో పొరలితిమి
తిరువేంకటాచలాధిపు దలచలేక ||
ఏమి చేచే మిక నేము యెంతని దాచుకొందుము
నీమహిమ యింతంతననేరము నేమయ్యా
అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే
పొందినపాతకమెల్లా బొలిసిపోయ
మందలించి మఱి యొక మాటు నుడిగినఫల
మందె నీ కప్పగించితి మదిగోవయ్యా
యిట్టె మీకు రెండుచేతులెత్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండౌ వెట్టినఫల
మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా
సరుగ నీకొక మాటు శరణన్న మాత్రమున
సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుడనైనఫల
మరయ నీమీద నున్న దదిగోవయ్యా
ఏమి చేయుదు నింక నిందిరాధీశ్వరుడా
నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక
కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా
బడినుండి మిగుల రుణపరచుగాక
అడియాసలెల్లా ఋణ్యముబాప మెఱుగునా
వెడగుదనలో దయ విడిపించుగాక
వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన
బలిమి దూరించ జలపట్టుగాక
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా
కలిసి హేయమున కొడిగట్టించుగాక
యెలమి రతిపరవశము యెగ్గుసిగ్గెఱుగునా
బలిమి దిట్లకు నొడబఱచుగాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలగించి యేలితివి దయసేతుగాక
ఏమి బాతి నేడిదె నీకు మము
గామించు సిరులింతే కదవయ్యా ||
వెనక ముందర వెలయగ ముందర
వెనక లింతే విభవాలు
వనితల పిఋదులు వాడి కుచములు కొప్పు
కనుగొన భ్రమలింతె కదవయ్యా ||
వెలుగు చీకటి నిరసాలు విభవాలు
కలిమి లే ములే కదవయ్యా
పలు వన్నె మాటలు పసని తేటలు నివి
కలవెంత కలలింతె కదవయ్యా ||
ఏమి వలసిన నిచ్చు నెప్పుడైనను
ఏమరుక కొలచిన నితడే దైవము ||
ఘనముగా నిందరికి గన్నులిచ్చు గాళ్ళిచ్చు
పనిసేయ జేతులిచ్చు బలియుడై
తనుగొలువమని చిత్తము లిచ్చు గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కడే దైవము ||
మచ్చిక తనుగొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైన దైవము ||
పంతమాడి కొలచిన బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుడిదే మా
యంతరంగమున నుండే అరచేతిదైవము||
ఏమి వొరలేదు యేమి మరలేదు
యీమాయలంపటం బీదమోదనేకాని ||
సతులుగల దా సడిబొరలనేకాని
సతమైసౌఖ్యస్వస్థానంబు లేదు
హితులుగల మేలు తా నిడుమబొరలనెకాని
హితవివేకము నరుల కెంతైన లేదు ||
తనువులెత్తినమేలు తగులాయమేకాని
కనుగొనగ యోగభోగము గొంత లేదు
ఘనముగలమేలు తా గంధర్వమేకాని
ఘనుడైనశ్రీనాథు గనుగొనగ లేదు ||
చింతగలిగినమేలు చివుకబట్టనెకాని
చింత వేంకటవిభుని జింతించ లేదు
సంతుగలిగినమేలు సంసారమేకాని
సంతతము జెడనిసద్గతి జేర లేదు ||
ఏమి సేయగవచ్చు నీశ్వరాధీనంబు
తామసపుబుద్ధి కంతలు దూరవలనె ||
తెగి దురాపేక్షబడ తివియు గతిలేదుగన
పగగొన్న వగలకూపముల బడవలసె
తగుమోహసలిలంబు దాట మతిలేదుగన
మగుడబడి భవముతో మల్లాడవలసె ||
పాపకర్మముల జంపగ శక్తిలేదుగన
కోపబుద్ధులచేత కొరమాలవలసె
రూపములు బొడగాంచి రోయ దరిలేదుగన
తాపములచే బొరలి తగులుగావలసె ||
తిరువేంకటాచలాధిపు గొలువలేదుగన
గరిమిచెడి విషయకింకరుడు గావలనె
పరతత్త్వమూర్తి దలపగ బ్రొద్దులేదుగన
దొరతనం బుడిగి యాతురుడు గావలసె ||
ఏమి సేయవచ్చు గర్మమిచ్చినంతేకాని లేదు
తాము సేసినంత వట్టు తమకు బోరాదు ||
ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు,వీపు
బట్టగట్ట మోపు మోచి పాటువడ్డా లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు
తెట్టదెరువున నోరుదెరచినా లేదు ||
అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి
విడిచి నెత్తుటదోగి వీరుడైనా లేదు
అడవులెల్లాదిరిగి అలమటించిన లేదు
యిడుమపాటుకు జొచ్చి యియ్యకొన్నా లేదు ||
వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు
మెచ్చులగుఋఋఅము నెక్కి మెరసినా లేదు
యెచ్చరిక దిరువేంకటేశు గొలువక వుంటే
యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు ||
ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుడా
నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక ||
కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా
బడినుండి మిగుల ఋణపరచుగాక
అడియాసలెల్లా బుణ్యముబాప మెఱుగునా
వెడగుదనలో దయ విడిపించుగాక ||
వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన
బలిమి దూరించ జలపట్టుగాక
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా
కలిసి హేయమున కొడిగట్టించుగాక ||
యెలమి రతివశము యెగ్గుసిగ్గెఱుగునా
బలిమి దిట్లకు నొడబఱచుగాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలగించి యేలితివి దయసేతుగాక ||
ఏమి సేసేమిక నేము యెంతని దాచుకొందుము
నీమహిమ యింతింతననేరము నేమయ్యా ||
అందు నిన్ను నొకమాటు హరి యను నుడిగితె
పొందినపాతకమెల్లా బొలిసిపోయ
మందలించి మఱి యొకమాటు నుడిగినఫల
మందె నీకప్పగించితి మదిగోవయ్యా ||
యిట్టె మీకు రెండుచేతులె త్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండము వెట్టినఫల
మట్టె నీమీద నున్నది అదిగోవయ్యా ||
సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున
సిరుల బుణ్యుడ నైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుడనైనఫల
మరయ నీమీద నున్న దదిగోవయ్యా ||
ఏమి సేసేవిచ్చటను ఇంతి నిన్ను బిలిచీని
ప్రేమములు కణజాల బెట్టుకొందువు రావయ్యా ||
చెలియ చెమటలను చిత్తడివాన గురిసె
బలువుగా వలపుల పంటలు వండి
కలిమి మీరి చన్నులు కనకపురాసులాయ
కొంచికోరుగొందువు కొటారుకు రావయ్యా ||
వుడివోని తమనిపుతూర్పులనే తూరుపెత్తె
కడలేని యాసలగాదెలబోసె