Loading...

 

సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam)

https://primeastrology.com/wp-content/uploads/2020/06/ramayanam.jpg

ఉపోద్ఘాతం

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ “, నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.
అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.
రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.

బాలకాండ

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి – కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి “నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు” అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.
మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా  తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||
వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె…………….
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||
ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు……..
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.
చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది………..
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.
ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు “ఓ బ్రాహ్మణుడా!  నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ.” అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి……
“నిషాద” అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. “మా” అంటె లక్ష్మి దేవి. “మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః”, అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. ” యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్”, కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, “నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను ” నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు” అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.
వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు………
కథ ప్రారంభం
రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు………….
పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.
దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు………..
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||
పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు…………ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు………….పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.
వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు….. ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే……….
తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||
ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు…మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దెగ్గరికి వచ్చి ఇలా అన్నాడు…….అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండ ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందొ, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతొ చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు……యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందొ ఆనాడే నీకు మంచి జెరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.
చైత్ర మాసంలొ చిత్రా నక్షత్రంతొ వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటె ఫాల్గుణ మాసంలొ వచ్చె అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు.
సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః |
న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి ||
పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకిలోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోమాకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలొ కూర్చున్నవాడు అతిధి రూపంలొ ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశి రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు….
వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ |
అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ||
అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, ఆహ! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళి ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికి  ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు. వచ్చినవాళ్ళందరూ “ఆహ! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజ, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్య, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.
ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.
దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ  మహర్షి లేచి….ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ  వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు…….
తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||
ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, ” పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు…..
నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||
రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది,  ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు  ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.
ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….
ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||
ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ,  అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……
హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||
మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.
తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||
నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.
అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా!  నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు,  ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.
యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.
కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.
తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు ||
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ |
ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ||
జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.
తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జెరుపుకున్నారు. అదే సమయంలొ బ్రహ్మ గారు దేవతలతొ ఒక సభ తీర్చారు……” శ్రీమహా విష్ణువు భూలోకంలొ రాముడిగా అవతరించారు, రావణసంహారంలొ రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి” అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.
అప్పుడు బ్రహ్మ ” ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి” అని అన్నారు. ఇంద్రుడి అంశతొ వాలి జన్మించాడు, సూర్యుడి అంశతొ సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతొ తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతొ గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతొ మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతొ నీలుడు జన్మించాడు, వాయువు అంశతొ హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చుసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.
అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం ||
సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా |
వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా ||
రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటె అగ్ని బీజం, మ అంటె అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మి) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.
తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటె వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతొ రాజమార్గంలొ వెళుతుంటె చూసిన దశరథుడికి తను యవ్వనంలొ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.
అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలొ ఇలా అన్నారు ” నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు ” దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలు కుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి” అన్నాడు.
స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం |
కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి ||
నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా, మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను, అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.
ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః |
న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః ||
మెల్లగా తేరుకొన్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడ, కావాలంటె నేను నా చతురంగ బలాలతొ వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటె, రాముడితొ నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.
రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటె ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు.
అప్పుడు దశరథుడు ” లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు ” అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, ” చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు” అని వెళ్ళిపోతున్నాడు. వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితొ ఇలా అన్నాడు ” ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావ? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటె ఎవరో తెలుసా……
ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః |
ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం ||
ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు,  ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు” అని అన్నాడు.
దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతొ నా కొడుకుని మీ చేతులలొ పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటె అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు.
విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతొ వెళితె ఎలా ఉంటుందొ, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితె ఎలా ఉంటుందొ, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలొ కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలొ విశ్రమించారు.
అప్పుడు  విశ్వామిత్రుడు……
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||
బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.
విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దెగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని……
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించె నువ్వు నరులలొ శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.
రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితొ మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దెగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ ” అని చెప్పాడు.
మరుసటి రోజున ఆ ఆశ్రమంలొ ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలొ ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలొ వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ” ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదె సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలొ గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు”. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.
అలా వాళ్ళు వెళుతుంటె అక్కడున్న అరణ్యంలొ ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు ” పూర్వము ఇక్కడ మలదము, కరూషము
అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు” అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగె ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతొ ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.
అలాగే పూర్వ కాలంలొ సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతె బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతొ, అరణ్యంలొ ఇష్టమొచ్చినట్టు  తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితొ కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ‘ నీకు వికృతరూపంవచ్చుగాక ‘ అని, మారీచుడిని ‘ ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ‘ శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలొ మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు ” అని విశ్వామిత్రుడు అన్నాడు.
అప్పుడు రాముడు…….
పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |
వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||
గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |
తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||
“మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటె అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను” అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందొ అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితొ, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా ” అన్నాడు.
ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతొ రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితొ ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతొ రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దెగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దెగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని,  క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.
మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితొ……. మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతొ ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే ” అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.
ఆ సిద్ధాశ్రమంలొ యాగం ప్రారంభించారు, ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జెరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జెరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతొ మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితె, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.
మిథిలా నగరంలొ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితొ చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.
అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతొ చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” పూర్వకాలంలొ బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, ” మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి ” అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములొ. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలొ ఉంది, శోణానది ఈ 5  పర్వతాల మధ్యలొ ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.
కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలొ అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలొ ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతొ పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటె మీరు కూడా నిత్య యవ్వనంలొ ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో………
కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||
మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||
మాదెగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటె నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జెరిగితె, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటె వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలొ ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంతొ చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.
తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, ” అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని……………
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||
స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటె ఇది. ఓర్పె దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు,  ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనె ఈ భూమి నిలబడుతోంది ” అని చెప్పాడు.
అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతొ……. నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారు. అప్పుడామె…….నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరిక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలొ ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు, అందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు….” కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కాని కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, ఆ యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు” అన్నాడు.
నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.
స పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||
అప్పుడు విశ్వామిత్రుడు….. ” నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్కకి దెగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను ” అని  రాముడితొ చెప్పాడు.
అక్కడే ఉన్న ఋషులు  అప్పుడు………
విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||
నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు.
అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు…… ” పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు” అని విశ్వామిత్రుడు చెప్పాడు.
మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు….” పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి – శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ!  మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.
వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు…..
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున…..
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.
శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు – మనోరమల కుమార్తెలైన గంగా – పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది.
అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.
తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |
పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||
ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి…..
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||
తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి…………….దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు……….మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.
కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||
ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక ‘హుం’కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు.
ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు ” నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు” అన్నాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు ” నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను” అని అన్నాడు.
అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి, రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, కాళ్ళని చాపి, తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్ధించగా, ఆయన ఆ గంగని బిందుసరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లాదినీ, పావనీ, నళిని అని మూడు పాయలుగా తూర్పుదిక్కుకి వెళ్ళింది, సుచక్షువు, సీతా, సింధువు అని మూడు పాయలుగా పడమరదిక్కుకి వెళ్ళింది, ఆ ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు, పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు.
అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా,  ఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.
స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకినీ అని, భూమి మీద భాగీరథి అని, పాతాళ లోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు.
ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ” పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళి ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళి చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.
అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |
ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||
షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |
అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||
అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడు సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.
కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది………నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు సౌచంగా( భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు.
దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దెగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మ అన్నాడు. దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఒక రోజు, మిట్ట మధ్యాహ్నం వేళ, దితి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది, అప్పుడామె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది, ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని అనింది. అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు.
రామా! ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుడికి సృంజయుసుడు, సృంజయుసుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు, ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు.
తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకొన్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితొ నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, సూర్యచంద్రులులాగ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులంటారు, దశరథుని కుమారులు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి, కుశల ప్రశ్నలు అడిగాక అక్కడినుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దెగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది, కాని అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పెను……
గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః ||
ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన, ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి  వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు.
ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ ||
అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో సంగమించింది.
అహల్య ఇంద్రుడితో ఇలా అనింది ” నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను, నువ్వు ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో ” అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే……
గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం ||
దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపఃశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు ” నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవు గాక ” అని ఇంద్రుడిని శపించారు.
పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |
అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు ” నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జెరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనని నేను ఏమి చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను, ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను, అహల్యని శపించడం వల్ల కొంత తపఃశక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను, కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె వృషణములను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుంసత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమం లోకి వెళ్ళగానే, ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరీక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు.
తరువాత వాళ్ళు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునేవాళ్ళతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌవరంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసిన జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు, ఖడ్గాలు, కొదండాలు పట్టుకున్నారు, సూర్యచంద్రుల వలె ఉన్నారు, అపారమైన తేజస్సుతో ఉన్నారు, ఈ పిల్లలు నీతో ఉన్నారు, ఇంతకి వాళ్ళు ఎవరు అని అడిగారు.
వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయ్యింది అని విశ్వామిత్రుడు చెప్పాడు.
అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశార అని శతానందుడు వాళ్ళని అడిగాడు.
పతితపావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ అమ్మగారికి శాపవిమోచనం అయ్యింది, ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు.
శతానందుడు ఎంతో సంతోషించాడు……… “రామ! నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది, అందువలన ఎన్నో సంవత్సరాలు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావ. మా అమ్మ సంతోషంగా ఉందా ” అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు…..మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు, గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళారు అని చెప్పాడు.
రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు ఇలా అన్నాడు…….
న అస్తి ధన్యతరో రామ త్వత్తో అన్యో భువి కశ్చన |
గోప్తా కుశిక పుత్రః తే యేన తప్తం మహత్ తపః ||
” విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు, ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను ” అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు.
శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు ” గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది, అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.
అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో……అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జెరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.
సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు…….నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా ( రాజధర్మం అంటె, ఎంత పన్ను ప్రజల దెగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా,  నీ మంత్రులు నీకు సహాయపడుతున్నార అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు………
సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |
రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||
ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాలన్నాడు.
మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడన్నాడు.
అప్పుడు వశిష్ఠ మహర్షి శబళని పిలిచి, చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.
శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు,  మళ్ళి మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు  చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తరక్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో……..
గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |
నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి అన్నాడు.
అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబళని ఇవ్వలేను అన్నారు.
విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, ………..రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటె అవి రాజుకే చెందుతాయి. రాజు దెగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జెరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు,……..నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడను అన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటె ఆ శబళ ఏడ్చింది. ఇంత జెరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ……..ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడ, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడ, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటె విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దెగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.
అప్పుడు వశిష్ఠుడు…….
న త్వాం త్యజామి శబలే న అపి మే అపకృతం త్వయా |
ఏష త్వాం నయతే రాజా బలాత్ మత్తః మహాబలః ||
శబళా! నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలొ వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు.
అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు.
అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటు యవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో……..చూశార! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు.
అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకుపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.
కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా “ఆ……” అని హుంకారం చేశారు, ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.
ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటె, ఆయన “ఆ….” అంటె వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటె గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.
హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై,……నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు…….
యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |
సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||
మహాదేవ! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దెగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తధాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దెగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.
ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.
తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు.
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.
ఇక తనదెగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు………
ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం |
ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||
ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు ” నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు ” అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.
అదే కాలంలొ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జెరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జెరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కుమారులు.
అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చణ్డాలుడివి అవుతావని శపించారు.
మరుసటి రోజు ఆ  త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుమ ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.
వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి…….మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చణ్డాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు.
విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని  జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని శపించాడు.
అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితొ త్రిశంకుడికి  పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన…….
త్రిశంకో గచ్ఛ భూయః త్వం న అసి స్వర్గ కృత ఆలయః ||
త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని, తలక్రిందులుగా కిందకిపో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతు ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.
మహానుభావ! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటె మాత్రం ఇలా వేరె స్వర్గాన్ని సృష్టిస్తావ, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనస్సాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు.
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జెరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి  బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.
ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దెగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు ”  పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.
రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దెగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు ” నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి ” అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.
కథం ఆత్మ సుతాన్ హిత్వా త్రాయసే అన్య సుతం విభో |
అకార్యం ఇవ పశ్యామః శ్వ మాంసం ఇవ భోజనే ||
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు……..
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||
మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.
అప్పుడాయన శునఃశేపుడితో………నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.
కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.
మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.
సర్వం సురాణాం కర్మ ఏతత్ తపో అపహరణం మహత్ |
అహో రాత్రా అపదేశేన గతాః సంవత్సరా దశ ||
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలని గెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.
మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు…..
యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.
విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదెగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి………
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||
ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితొ…….నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.
ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.
జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు…….వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.
అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||
అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.
ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భుమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దెగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.
అప్పుడు జనకుడు ” ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను” అన్నాడు.
ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.
ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జెరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు.
ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.
ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |
ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |
తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||
రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో “ఫడేల్” అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.
భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||
అప్పుడు జనకుడు ” మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది ” అన్నాడు.
అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దెగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జెరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దెగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.
వెంటనే దశరథుడు తన గురువులతొ, పురోహితులతొ సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, ” మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు” అన్నారు.
వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.
దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.
ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||
అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు ” అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను” అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.
మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు ” మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు” అన్నారు.
అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు……..
మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జెరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని ( గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు( ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు” అని వశిష్ఠుడు చెప్పాడు.
ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు ” మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి( ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధణుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది” అని జనకుడు చెప్పుకున్నాడు.
సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. కుశధ్వజుడు వచ్చాక…….
వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం |
ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః ||
నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.
నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.
దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.
దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.
మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండని జనకుడన్నాడు.
అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహొత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. జనక మహారాజు ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహొత్రం దెగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు………………
ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||
రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో( సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది. [ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]
అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జెరిపించారు.
అలా వివాహం జెరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజూ జెరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.
మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.
అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జెరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు.
ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను, శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దెగ్గరికి వచ్చి…….
మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు ” పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను ” అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. ” నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను ” అన్నాడు.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు ” రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను ” అని అన్నాడు. అయితే నీ తపఃశక్తితో  సంపాదించిన తపోలోకాలు(తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.
దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.
సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు……….
ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి |
గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే ||
రాముడికి సీతమ్మ అంటె చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే, మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట.
సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట.
అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది………………

అయోధ్యకాండ

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.
దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులవంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే…..
తేషామపి మహాతేజా రామో రతికరః పితుః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||
రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు( ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటె అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము), ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైన కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు(అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు(మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే……
ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః ||
గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.
ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటె దశరథుడికి అంత ప్రీతి.
ఒకనాడు దశరథుడు,……….నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు(తోకచుక్కలు, గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు……….
ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం |
పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా ||
ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.
అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా ” దశరథ మహారాజా! మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని, ఏనుగు మీద ఎక్కి, తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి.” అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నటుగా ఉంది.
ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి, వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేంటంటే……….” కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చుసుకుంటూ, ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవ్వాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే, మీలో ఒక్కరు కూడా…….దశరథా! ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చుసుకున్నావు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా, నా పాలనలో లోపాలు కనబడ్డాయ, నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయ, రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి ” అని అన్నాడు.
అప్పుడు వాళ్ళందరూ……………
రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః |
సాక్ష్హాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ ||
” ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకి సత్యము-ధర్మము కావాలి, అన్నిటికీమించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు ” అన్నారు.
అలాగే, రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది, భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది, ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము.
అలాగే, ” రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే, లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు, ఆయన స్నానం చేసి వెంటనే ఎనుగో, రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దెగ్గరికి వచ్చి, ముందు ఆయనే పలకరించి, కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటిముందు నుంచి వెళుతూ, కనపడ్డ వాళ్ళందరిని ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు. అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది, అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి ” అని అన్నారు.
అలాగే, ” ప్రజలు సుఖంగా ఉంటె, తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు (ప్రేమ అంటె = తాను అనుభవించక పోయినా, తనవారు అనుభవిస్తుంటే, వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం). ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి పోయినా కాని, రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమితెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమికానటువంటి వాళ్ళు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్ధిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ ” అన్నారు వాళ్ళందరూ.
వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు, వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి……….
” మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, నూరు కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి, వీటన్నిటిని దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి, గంధం కలిపిన నీళ్ళతో గడపలని కడగండి, ధూపం వెయ్యండి, పాలు పెరుగుతొ కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి, ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవెయ్యండి, నాటకాలు వేసేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని సిద్ధంచెయ్యండి, వేశ్యలు అలంకరించుకొని రావాలి, వాళ్ళు అంతఃపురంలో రెండవ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి, అన్ని దేవాలయాల్లో  ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడువైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి ” అని అన్నాడు.
సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చుసుకున్నట్టు ఉంది.
అప్పుడు దశరథుడు…….” రామ! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు, అయినా ఒకసారి విను……నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనన్ని నాశనం చేస్తాయి, కావున వాటిని దెగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము. (కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది, జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములని వేరొకరి దెగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది, సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది, కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది, అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) రామ నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు.
అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళి తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు ” నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు, ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది, ఎన్నో యజ్ఞాలు చేశాను, పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటె అది నీ పట్టాభిషేకమె, మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి, ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు, ప్రజలు దిక్కులేనివారు కాకూడదు, అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మారిపోకముందే చేసేయ్యని. భరతుడు చాల మంచివాడు, ఇప్పుడు తన మేనమామ అయినా యుధాజిత్ దెగ్గర ఉన్నాడు, భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి, నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను, సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి, దర్భల(గడ్డి) మీద పడుకో ” అని చెప్పి పంపించాడు.
దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు.
రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది, సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు( ఉపవాసం అంటె, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాధ్విక ఆహరం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు).
అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది.
ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందని ఆనందంగా ఉన్నారు, అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది.
ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దెగ్గరకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు.
అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర(పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో ” ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి ” అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి ” కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జెరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా ” అనింది. వెంటనే మంథర కైకేయి దెగ్గరకి వెళ్ళింది.
ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది………….
అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం |
రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి ||
” నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జెరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలొ ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా ” అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది……
” అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో ” అని ఒక బహుమతిని ఇచ్చింది.
కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది………
” మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జెరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు.” అనింది.
“చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు ” అని కైకేయ అనింది.
అప్పుడు మంథర ” పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దెగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దెగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జెరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.
ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||
ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దెగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి ” అని మంథర కైకేయతో అనింది.
మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో……” నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు ” అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే………………
అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||
” ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు ” అని చెప్పింది.
“మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది ” అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర………….
” ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు.” అని చెప్పింది.
ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో ” ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి ” అనింది. అప్పుడా మంథర…………..నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.
అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానె ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలొ కైకేయ ఎక్కడా కనపడలేదు.  కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు……….
” కైకేయ, నీకు ఎమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటె నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటె చెప్పు, తప్పక తీరుస్తాను.
అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |
దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||
ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైక. నీ కోరికెంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను ” అన్నాడు.
నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది.
అప్పుడు దశరథుడు ” ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను ” అన్నాడు. అప్పుడా కైక…………..
” రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా!, పగటి దేవతలారా!, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులార,  మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని……
అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః |
అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |
నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||
” ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి ”  అని అనింది.
 (త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమనింది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)
అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు………………
” ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దెగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జెటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైక, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.
రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దెగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.
ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, నాన్న! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు “, దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జెరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.
కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది ” ఏమయ్యా! ఇక్ష్వాకువంశములొ జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.
నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దెగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దెగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.
దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే ” అని అనింది.
అప్పుడు దశరథుడు ” ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను ” అన్నాడు.
అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో……
” రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను ” అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది………….
త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |
మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||
” సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా ” అని అడిగింది.
అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలీనా కైకేయ ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన……..
” ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగె ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగె ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో ” అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.
మెల్లగా తెల్లవారుతోంది……………………..
అప్పుడు కైకేయ ” ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను ” అని అనింది.
అప్పుడు దశరథుడు………….
యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||
” నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటె ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు ” అన్నాడు.
అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఎమిటని సుమంత్రుడు కైకేయని అడుగగా………….
” ఏమిలేదయ్య సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా ” అనింది కైకేయ.
అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయ్యబోగా, ” రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా ” అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు.
ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు………
” అమ్మ! నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఎమన్నా పొరపాటు జెరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లి ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” ఎంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళి సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామ, నీకు చెప్తాను ” అనింది.
ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు “ఛి” అని తలవంచుకున్నాడు.
అప్పుడు రాముడు…..
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
” అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” ఏమిలేదు రామ, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు ” అనింది.
అప్పుడు రాముడు ” నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,
అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |
హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||
భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను ” అన్నాడు.
అప్పుడు కైకేయ ” రామ! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి ” అనింది.
అప్పుడు రాముడు….
న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |
విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||
” అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకు పితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావ అమ్మ, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను ” అన్నాడు.
ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జెరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్తత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.
కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు…….
అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దెగ్గరికి వెళ్ళి ” నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలొ పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు ” అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది.
అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో ” అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను ” అని రాముడన్నాడు.
ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది.
తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది ” రామ, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరె బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామ, నీకొక నిజం చెప్తాను,
న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే |
అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా ||
నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులొ పట్టాభిషేకం జెరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను ” అని కౌసల్య అనింది.
ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో ” అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి “ఊ” అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు ” అని అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది ” రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటె నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు ” అని కౌసల్య అనింది.
అప్పుడు రాముడు ” అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి ” అన్నాడు.
తరువాత లక్ష్మణుడితో,
తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం |
విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం |
మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ |
అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||
” లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దెగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బంగిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది.
ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం |
ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం ||
ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.
త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |
పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః ||
అమ్మ, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము.
ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ||
లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది.
( అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[ శాస్త్రం ప్రకారం అర్థం అంటె ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటె కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జెరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ( కైకెయ) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా……
సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ |
యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ||
సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే ” అని రాముడన్నాడు.
రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు ” నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను ” అన్నాడు.
అప్పుడు రాముడు ” లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు ” అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు.
” సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు ” అని కౌసల్య రాముడితో అనింది.
భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః | 
స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః ||
అప్పుడు రాముడు ” ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే “ఛి” అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది.
భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |
అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ ||
ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ” అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు.
అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి ” నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో,  అటువంటి మంగళం నీకు లభించుగాక ” అని ఆశీర్వదించింది.
కౌసల్య దెగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దెగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దెగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దెగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి ” ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జెరగలేదు ” అని రాముడిని అడిగింది.
అప్పుడు రాముడు తలదించుకొని ” సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు ” అని అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి…….
ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను.
న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా ||
తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను ” అని సీతమ్మ అనింది.
అప్పుడు రాముడు ” సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను ” అన్నాడు.
యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ ||
అప్పుడు సీతమ్మ ” నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటె మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు ” అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.
అప్పుడు రాముడు ” సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి ” అన్నాడు.
కోశాధికారిని పిలిచి తన దెగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని ” నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు  కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటె నాకు పరమ ఆనందంగా ఉంటుంది ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు ” అన్నాడు.
” నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను ” అన్నాడు లక్ష్మణుడు.
నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.
రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయ మందిరానికి పయనమయ్యారు. వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతూలికా పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా, నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది. కాలం అంటె ఇదే కదా, నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చెయ్యవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు.
” రాముడు, సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రిగారికి నివేదించండి, నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకోని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను ” అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా, దశరథుడు ఇలా అన్నాడు….
” సుమంత్రా, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు, రాముడికంటే ముందు, నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను ” అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక, సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు.
లోపలికి వస్తున్న రామలక్ష్మణులని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దెగ్గరికి వెళ్ళబోయి, మధ్యలోనే నేల మీద కళ్ళుతిరిగి పడిపోయాడు. తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు…..
” తండ్రీ! మీరు కోరినట్టు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది, నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వికి ప్రభువులు, మాకు తండ్రి, అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి ” అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు.
దశరథుడు రాముడిని పైకి లేపి ” నన్ను కైక వంచించి నిగ్రహించి, ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీలులేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో, అలాగైనా నిన్ను రోజూ చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామ ” అని అన్నాడు.
” మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు, కావున నన్ను ఆశీర్వదించండి, నేను అరణ్యాలకి వెళతాను ” అని రాముడన్నాడు.
అప్పుడు దశరథుడు ” సరే రామ, నువ్వు అలాగే వెళ్ళిపో, కాని ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు, నీకు కావలసిన, కోరుకున్న భోగములన్నిటిని అనుభవించు, నేను కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఇవ్వాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు, కాని 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు, 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు. మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటె దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేనేమి ఆక్రోశంతో వెళ్ళడంలేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో, ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి, ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు ” అన్నాడు.
ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్తితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కాని కైకేయ మాత్రం, నువ్వు వాళ్ళని ఇక్కడినుంచి తొందరగా పంపించెయ్యి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో……
” ఛి, దుష్టురాల! మహా పాపి! పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా క్షోభింప పడదో అటువంటి గాంభీర్యము కలవాడు మహారాజు, అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు, నిన్ను బతిమాలుతున్నాడు, ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది, అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది.
నీ తల్లిగురించి మాకు తెలుసు. నీ తండ్రిగారికి సర్వప్రాణుల మనస్సులలోని విషయాలని, వాటి భాషనీ అర్ధం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా, ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది, దాని పేరు జ్రుంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల బాష అర్ధం అవుతుంది కనుక, ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు ఫక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి, ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు, అసలు ఆ చీమ ఏమందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు, దానిప్రకారం నేను నాకు అర్ధమైన విషయాలని బయటకు చెపితే, నా తల వెయ్యి ముక్కలు అవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడావిడ, నీ తల వెయ్యి ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి, నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడా కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల వెయ్యి ముక్కలు అవుతుందన్నా విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్ధమవుతుంది, ఆమె మళ్ళి పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి అన్నాడు. అంత మంక్కుపట్టు పట్టిన స్త్రీ, నీ తల్లి. అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది ” అని అన్నాడు.
అప్పుడు దశరథుడు ” ఆ కైకేయకి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్రా. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగుల్ని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చెయ్యండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగే వంటగాళ్ళని సిద్ధం చెయ్యండి, 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధన రాశులని పంపండి, పట్టుచీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చెయ్యడానికి డేరాలు పంపండి, ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి, ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను ” అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది….
” పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవ్వాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపిస్తున్నావు.
రాజ్యం గత జనం సాధో పీత మణ్డాం సురాం ఇవ |
నిరాస్వాద్యతమం శూన్యం భరతః న అభిపత్స్యతే ||
నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు, మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరంలేదు ” అని అనింది.
అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి ” అసమంజసుడు పిల్లలని సరయు నదిలో తోసేసి, వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా, తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలికా? రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము ” అని చెప్పాడు.
కైకేయ ఏమి మాట్లాడలేకపోయింది.
అప్పుడు దశరథుడు ” ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా. కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు కాని, రాముడి వెనకాల ఎవరూ వెళ్ళకూడదు అని అడుగలేదు, నేను నీకు అలా వరమూ ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళతాయి ” అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు ” నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు. నాకు ఇవేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను ” అన్నాడు.
ఈ మాటలు వినగానే, కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నారచీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో, అలా ఆ నారచీరలని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ, పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది.
ఇది చూసిన వశిష్ఠుడు ” పాపివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు.
ఆత్మా హి దారాః సర్వేషాం దారసంగ్రహవర్తినాం |
ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీం ||
ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి. నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు, దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు, కాని రాముని వెనకాల సీతమ్మ పత్నిధర్మంతో వెళుతుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు.
యద్యపి త్వం క్షితితలాద్గగనం చోత్పతిష్యసి |
పితుర్వంశచరిత్రజ్ఞః సోన్యథా న కరిష్యతి ||
నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడినుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులు వెయ్యి, కాని తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు, అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ట అంతా నీ మీద పడుతుంది ” అని వశిష్ఠుడు అన్నాడు.
సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి, ఆ నారచీరలని కట్టుకోవడం చేతగాక, కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు, సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూలేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడిచారు.
అప్పుడు దశరథుడు ” కైక! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది ” అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.
రామ! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు.
తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, “రామా” అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని ” సుమంత్ర! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు ” అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.
అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అనింది ” అమ్మ సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడె “.
అప్పుడు సీతమ్మ ” మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను.   
న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా ||
వీణలొ ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దెగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు ” అనింది.
తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అనింది ” నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు.
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||
లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో  ” అనింది.
రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు ‘ రామా! రామా! ‘ అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. ఆశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు.
” నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు ” అన్నాడు దశరథుడు. రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.
అప్పుడు రాముడు ” సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు ” అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది.
మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు.
రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు ” ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకొలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా ” అన్నాడు.
” అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా ” అని కౌసల్య అనింది.
అప్పుడు దశరథుడు ” పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దెగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావ కౌసల్య ” అని మళ్ళి మూర్చపోయాడు.
అటుపక్క తెలవరుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి ” వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడక పోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు ” అన్నాడు.
అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి ” ఏడి రాముడు ఏడి రాముడు ” అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ.
రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు….
ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||
” ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు ” అని వేడుకున్నాడు.
తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.
తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |
నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||
రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో( ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన( తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు……
” రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా ” అన్నాడు.
గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |
అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |
పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||
అప్పుడు రాముడు ” గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు ” అన్నాడు.
ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా….
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||
” నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను ” అన్నాడు లక్ష్మణుడు.
మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, ‘ నేను ఏమి చెయ్యను ‘ అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు ” నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు ” అన్నాడు.
అప్పుడు సుమంత్రుడు ” రామా! నేను మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను ” అన్నాడు.
” నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి ” అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.
తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |
లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||
అప్పుడు రాముడు గుహుడిని పిలిచి ” గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా ” అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు ” నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను ” అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి ” ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు ” అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో ” అన్నాడు.
రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు ” అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు.
న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |
ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||
నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా ” అన్నాడు.
” లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు ” అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.
మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజ ముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకోని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు.
అప్పుడు రాముడు ” మీ ఆశ్రమం మా రాజ్యానికి దెగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటె జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దెగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము ” అన్నాడు.
భారద్వాజుడు ఇలా అన్నాడు ” ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చెరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి ” అని అన్నాడు.
భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తు హొమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు.
అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.
సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు ” రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు ” అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు……
” లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు ” అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా ” సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ” అన్నాడు.
అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు  ” ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ ” అని సుమంత్రుడు అన్నాడు.
అప్పుడు కౌసల్య ” ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దెగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దెగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దెగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దెగ్గర ఉండను ” అని అనింది.
కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు ” నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దెగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను ” అని రెండు చేతులతో నమస్కారం చేశాడు.
న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే ||
కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని ” మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దెగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు ” అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది.
తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు ” నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను.
అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు.
తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి ‘హా! కుమారా, హా! కుమారా’ అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ ‘హా! కుమారా’ అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు.
ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, ‘హా! కుమారా’ అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా……రామా………” అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.
అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు.
దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలొ(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జెరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు.
మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః |
కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః ||
ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ |
వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం ||
ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు ” మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలొ కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జెరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.
రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం | 
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ||
రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది ” అని ఆ మహర్షులు అన్నారు.
అప్పుడు వశిష్ఠుడు ” ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము ” అని అన్నడు.
తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచి పాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.
అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా, భరతుడు ఇలా చెప్పాడు ” నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుంచి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు, తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలొ చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలొ ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది, దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జెరిగిందని నాకు అనిపిస్తుంది ” అని అన్నాడు.  
ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు…..
ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ |
అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః ||
” సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా.
ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచ హ ||
మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది, అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదుకదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా ” అని అడిగాడు.
అప్పుడా దూతలు ” నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని ” చెప్పారు.
అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు( ఆయన అసలు పేరు ఆశ్వపతి) దెగ్గరికి వెళ్ళి, తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్, ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానలన్నిటిని వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితొ కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక, ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు.
ఆయన బయలుదేరి సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడినుంచి శల్య కర్తన నగరాన్ని, చైత్ర రథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు, కులింగ నదిని దాటాడు, తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడినుంచి భాగీరథీ నదిని దాటాడు, తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు, అక్కడినుంచి ధర్మవర్ధనము, తోరణము, వరూథి అనే గ్రామాలు దాటాడు, తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు, తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు, అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు, అక్కడినుంచి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు, తరువాత కపివతీ అనే పట్టణానికి చేరుకున్నాడు, అక్కడినుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత స్థాణుమతీ అనే ఊరిని దాటాడు, తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దెగ్గరినుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్ళు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు.
అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు, అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని, గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని ” చాలా సంతోషంగా గడిపావ, అందరూ ఆనందంగా ఉన్నారా, అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు ” అని అనింది.
అప్పుడు భరతుడు ” అమ్మ! నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని, నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది, నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా! తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా ” అని అడిగాడు.
ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా,
యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః ||
” చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో, మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు ” అనింది.
అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే, ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు.
అప్పుడా కైకేయ ” ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా, గొప్ప గొప్ప సభలలో కుర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి, పైకి లేచి కూర్చో ” అనింది.
అప్పుడు భరతుడు ” అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా, రాముడికి పట్టభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మ, నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మ. అసలు దశరథ మారాజు ఎలా చనిపోయారు, చిట్టచివర చనిపోయేముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా ” అన్నాడు.
” మీ నాన్న వెళ్ళిపోయేముందు, ‘హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా’ అంటూ చనిపోయాడురా, చినిపోతూ చనిపోతూ, ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా ” అని కైకేయ చెప్పింది.
మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటె, మీ నాన్న పంపించేసాడు అని చెప్పింది.
అప్పుడు భరతుడు ” నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని, రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడ, పరస్త్రీని దోష బుద్ధితో చూశాడ, పరకాంతని అనుభవించాడ, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడ, అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడ. ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదె, రాముడిని అడవులకు ఎందుకు పంపించారు, రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏమి జెరిగిందో నాకు యధాతధంగా చెప్పు ” అన్నాడు.
అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ ” నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయ, పరకాంతని అనుభవించడం ఏమిటిరా, రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీతండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి, చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది ” అనింది.
ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి ” అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు,  నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జెరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.
అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి ” నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను ” అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం ” అని భరతుడు అన్నాడు.
ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలేదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఎడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి ” రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు, ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దెగ్గర దిగబెట్టు ” అని అనింది.
భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని ” అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావ. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహా పాపములు చేసిన వాడినవుదునుగాక ” అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే ” గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా, ఆ భార్యతో క్రిడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి, రుతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా, అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషం, లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటివాడికి, ఋషుల, పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానం కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దెగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది ” అని అన్నాడు.
అప్పుడు కౌసల్య ” నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడను ” అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు.
తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి ” నీ తండ్రి శరీరం తైల ద్రోణిలొ ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు ”  అన్నారు.
అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దెగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దెగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.
అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి,
రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః | 
అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ ||
” నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి ” అన్నాడు.
ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు.
ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు ” అసలు ఇంత జెరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు, మూర్ఖురాలై మా అమ్మా కైకేయ రెండు వరాలు అడిగి ఉండవచ్చు, సత్యపాశములచేత బందింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు, కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు ” అని వారు మాట్లాడుకుంటుండగా, అటువైపు నుంచి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దెగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కత్తే అని, అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీసారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా, అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది.
హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్ట చారిణీం |
యది మాం ధార్మికో రామః న అసూయేన్ మాతృ ఘాతకం ||
అప్పుడు భరతుడు ” అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి. ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది, కాని ఎందుకు చంపడంలేదో తెలుసా, ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలెయ్యడం పెద్ద లెక్కా. దీన్ని చంపినా, స్త్రీని చంపిన వాళ్ళు అని, రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలెయ్యి ” అన్నాడు.
భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః |
న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరాం ||
అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు, భరతుడి మాట విని, తన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు.
మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంత రాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ” నాయనా! నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో, అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము, కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో ” అన్నాడు.
అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి ” నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు ” అని, ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు.
తరువాత భరతుడు వశిష్ఠుడితో ” నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ. నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టానయ్య, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవ్వాళ, ఈ రాజ్యం రాముడిది, నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు ” అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు.
ఈ మాట విన్నవాళ్ళందరూ సంతోషపడిపోయి ” సంతోషం భరతా, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం ” అన్నారు.
అప్పుడు భరతుడు ” నేను నిన్ననే ఆదేశించాను, కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి, రాముడి దర్శనం చేసుకోని, ఆయనని వెనక్కి తీసుకువద్దాము ” అన్నాడు.
అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి  సైన్యం వచ్చి నిలబడింది.
అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి ” భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముంది నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడె ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దెగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటె, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటె, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను ” అన్నాడు. 
అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దెగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో ” భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి ” అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.
యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి |
సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి ||
లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి “నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి ” అని అడిగాడు.
అప్పుడు భరతుడు ” నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దెగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను ” అన్నాడు.
” సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది ” అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.
అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో ” ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక ” అన్నాడు.
ఈ మాటలు విన్న గుహుడు ” ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దెగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా  రాముడు ” అని అన్నాడు.
ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు ” రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ‘ నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దెగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ‘ అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి  మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటె, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు ” అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.
అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దెగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.
మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః ||
అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.
తరువాత భరతుడు ” ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను ” అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.
మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలేదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దెగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు, అలా బ్రహ్మగారిచె ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు).
ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. ( భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు)
అప్పుడు భారద్వాజుడు ” మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది ” అని అన్నాడు.
హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె |
మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ||
ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ ” మహానుభావ! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావ అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి ” అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.
అప్పుడు భారద్వాజుడు ” నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక ” అని ఆశీర్వదించిన పిమ్మట ” నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు ” అన్నాడు.
అప్పుడు భరతుడు ” మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమి వద్దు అన్నాడు “. మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు.
అప్పుడు భారద్వాజుడు ” అంత దూరంగా ఎందుకు పెట్టావయ్య, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను ” అన్నాడు.
ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ |
ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం ||
ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్ |
తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ||
ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం |
భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ||
తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ | భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ||
అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి ” ఇక్కడికి  రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక.” ( రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)
విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు .
తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి ” కుబేరా! నీ దెగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవ!, నీ దెగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి .
వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు( powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం( ఉసిరికాయలతో చేసిన ముద్ద ), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.
అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి ” అని ప్రార్ధించాడు.
అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.
అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటె బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు .
అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికిలు ” మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము ” అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి.
మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.
తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దెగ్గరికి పిలిచి ” వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావ ” అన్నాడు.
అప్పుడు భరతుడు ” సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య. వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి ” అని అన్నాడు.
న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా |
రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి ||
దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం |
హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ ||
అప్పుడు భారద్వాజుడు ” ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జెరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు ” అన్నాడు.
భారద్వాజుడి మాటలు విన్న భరతుడు ” సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి” అన్నాడు.
” అయితే నువ్వు ఇలా దక్షినాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గురాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు ” అని భారద్వాజ మహర్షి చెప్పారు.
అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దెగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ ” సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు.
రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.
భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రముల పద ఘట్టనలని విన్న రాముడు ” ఇంతకముందు ఎన్నడూ ఇలా లేదు, ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులుతీస్తున్నాయి. ఎవరో ఒక రాజో, లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది ” అని లక్ష్మణుడిని పిలిచి, ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు దెగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమి కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి, కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో….
అగ్నిం సమ్షమయతు ఆర్యహ్ సీతా చ భజతాం గుహాం |
సజ్యం కురుష్వ చాపం చ షరామ్హ్ చ కవచం తథా ||
” అన్నయ్యా! వెంటనే మన దెగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటిని తగ్గించేసెయ్యి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూణీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే, నీకు రాజ్యం దక్కకుండా చేసి, అరణ్యాలకి పంపించడమే కాకుండా, శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయ తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక, వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే, చూసి నేను సంతోషిస్తాను ” అన్నాడు.
లక్ష్మణుడి మాటలను విన్న రాముడు ” లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాల? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా?
ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ |
ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె ||
ధర్మము కాని, అర్థము కాని, కామము(కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటె, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడ? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము ” అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి ” నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని ” అని రాముడు అన్నాడు.
ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు ” అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు ” అన్నాడు.
అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి ” నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో పీడని సంకిస్తుంది ” అన్నాడు.
ఇంతలో భరతుడు ” ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు ” అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
తం తు కృ్ఇష్ణ అజిన ధరం చీర వల్కల వాససం |
దదర్ష రామం ఆసీనం అభితహ్ పావక ఉపమం ||
సిమ్హ స్కంధం మహా బాహుం పుణ్డరీక నిభ ఈక్షణం |
పృ్ఇథివ్యాహ్ సగర అంతాయా భర్తారం ధర్మ చారిణం ||
గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్ధత కలిగినవాడైన రాముడు, ఈనాడు నార చీర కట్టుకొని, ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని, వీరాసనం వేసుకొని కూర్చునేసరికి, చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని, పరిగెత్తుకుంటూ వస్తూ, “రామా” అని ఒకసారి పిలిచి, శోకభారంతో నేల మీద పడిపోయాడు.
అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి ” ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా ” అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.
అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి ” నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా.
పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దెగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దెగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.
మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటె రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటె, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దెగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా ” అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.
రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |
కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||
రాముడి మాటలు విన్న భరతుడు ” అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది ” అన్నాడు.
ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు.
సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |
భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||
సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |
అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||
వాళ్ళని చూసిన రాముడు ” భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు ” అన్నాడు.
(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)
అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు ( తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి).
అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు ” అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు ” అన్నాడు.
” మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు ” అని రాముడు అన్నాడు.
ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ( రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది.
అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి ” అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంతమాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి ” అన్నాడు.
అప్పుడు భరతుడు ” అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దెగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు ” అన్నాడు.
రామభరతుల మధ్య జెరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు.
ఈ మాటలు విన్న రాముడు ” దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటె నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి.
త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |
వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం ||
నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో ” అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి ” నేను ఇందాకటినుంచి నీ మాటలు వింటున్నాను రామ. చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను కనేటప్పుడు దశరథుడికి తెలుసా నువ్వు ఇలా పుడతావని. దశరథుడు కాముకతతో తన వీర్యాన్ని అయన భార్య అయిన కౌసల్య యందు ప్రవేశపెట్టాడు. కౌసల్య కూడా కాముకతతో దశరథ మహారాజు దెగ్గర నుంచి వీర్యాన్ని పుచ్చుకొని, ఆ శుక్లాన్ని తన శోణితంతో కలిపింది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా గర్భం ఏర్పడింది. అందులోనుంచి నువ్వు పుట్టావు. తల్లేమిటి తండ్రేమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏమి ఉండవు. చనిపోయిన వాళ్ళని పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నార. వెళ్ళిపోయిన వాడి మాటకి కూడా గౌరవమేమిటి. వాళ్ళతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యము, ధర్మము అంటావేంటి. అసలు ఇవన్నీ ఎందుకోచ్చాయో నేను చెప్పనా రామ, ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాసేస్తే డబ్బున్న వారి దెగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాల్ని రాశారు. అసలు నిజంగా పితృకార్యాలు, తద్దినాలు లేవు, అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే, వాడి ఆకలి తీరదు కాని, చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకి ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా, ఎవడు చెప్పాడు ఇవన్నీ. హాయిగా ఉన్న దానిని అనుభవించు ” అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో ” జాబాలి! నువ్వు చెప్పిందే సత్యమైతే, నిజమైతే, అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండడు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించచ్చు. ఒకడి ప్రవర్తనని బట్టి వాడు ఎటువంటివాడో నిర్ణయిస్తారు పెద్దలు. ఆ ప్రవర్తన వేదమునకు అనుగుణంగా ఉండాలి. ఆ వేదము అపౌరుషేయము. వేదం ఏమి చెప్పిందో అది చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కావు, ఈ బుద్ధికి పుట్టినవన్ని సత్యాలు కావు, మన సంప్రదాయంలో వేదమే సత్యం. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహా పురుషులు, 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసినవారు ఊర్థలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసినవారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే, సూక్ష్మ శరీరంతో మూడు తరాల వరకు పితృ లోకంలో ఉన్నవాడికి కడుపు నిండుతోందని వేదం చెబుతోంది. నీలాంటి నాస్తికుడిని( దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాదు, నాకు వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు), ప్రవర్తన తెలియనివాడిని,
సత్యం ఎవ ఈష్వరొ లొకె సత్యం పద్మా సమాష్రితా |
సత్య మూలాని సర్వాణి సత్యాన్ న అస్తి పరం పదం ||
ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉన్నదో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మాండములు నిలబడ్డాయో, అటువంటి సత్యానికి ఆధారమైన వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీవంటి నాస్తికుడిని ఎలా చేర్చుకున్నాడయ్య దశరథ మహారాజు. నాకు ఇవ్వాళ దశరథ మహారాజుని చూస్తే జాలి వేస్తుంది ” అన్నాడు.
ఈ మాటలు విన్న జాబాలి గజగజ ఒణికిపోతూ ” నేను వేదాన్ని తిరస్కరించినవాడిని, నమ్మని వాడిని కాదు రామ, భరతుడు అంత బెంగ పెట్టుకున్నాడు కదా, కనుక ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను ” అన్నాడు.
అప్పుడు వశిష్ఠుడు వచ్చి, బ్రహ్మగారి నుంచి ఇక్ష్వాకు వంశం ఎలా ఏర్పడిందో చెప్పి ” ఈ వంశంలో ఎప్పుడూ పెద్దవాడే రాజవుతున్నాడు. తండ్రి మాటని విని నేను అరణ్యాలకి వచ్చానంటున్నావు, తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు. తండ్రి ఎలా గొప్పవాడో, తల్లి కూడా అలా గొప్పది. ఇప్పుడు నీ ముగ్గురు తల్లులు వచ్చి నిన్ను వెనక్కి రమ్మంటున్నారు. తండ్రి వీర్యప్రదాత, తల్లి క్షేత్రాన్ని ఇస్తుంది. పిల్లవాడు బయటకి వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ పెంచుతారు. కాని మళ్ళి ఈ శరీరంలోకి రాకుండా జ్ఞానం ఇచ్చేవాడు గురువు మాత్రమే. నేను నీకు, నీ తండ్రికి కూడా గురువుని. నేను చెప్తున్నాను, నువ్వు అరణ్యమునుంచి వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకుంటే ధర్మము తప్పిన వాడివి అవ్వవు, అందుకని వెనక్కి వచ్చి రాజ్యాన్ని తీసుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” మా తండ్రిగారు నాతో ఒక మాట అన్నారు. రామ! నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను కైకకి ఇచ్చిన వరం నిజం అవ్వడం నీ చేతిలో ఉందని చెప్పారు. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. మీరు అన్నట్టు, నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగం కావచ్చు. కాని, నేను ఇచ్చిన వరం ఎందుకూ పనికిరాకుండా పోయందని నా తండ్రిగారు బాధ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మ శరీరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన తేజస్సు వలన కదా శిశువు అనే వాడు బయటకి వచ్చేది, ఆ శిశువు పెరిగాక గురువు జ్ఞానం బోధిస్తాడు. ఆ శిశువు అనే వాడు రావడానికి మూలం తండ్రి. కావున ఆ తండ్రి మాట చెడిపోకూడదు, అందుకని నేను నా తండ్రి మాటని అతిక్రమించాలేను ” అన్నాడు.
అప్పుడు భరతుడు సుమంత్రుడిని పిలిచి ” దర్భలు తీసుకొచ్చి ఇక్కడ పరవండి, నేను ముఖం మీద బట్ట వేసుకొని, ఏది చూడకుండా, రాముడికి ఎదురుగా కూర్చుంటాను ” అన్నాడు  (పూర్వకాలంలో రాజు తప్పుచేస్తే, ధర్మం తప్పితే, బ్రాహ్మణులు ఇలా ముఖం మీద గుడ్డ వేసుకొని రాజుకి ఎదురుగా కూర్చునేవారు, రాజుకి తన తప్పుని తెలియచెయ్యడం కోసమని). అప్పుడు వెంటనే సుమంత్రుడు దర్భలని పరిచేశాడు, వాటి మీద భరతుడు ముఖం మీద బట్ట వేసుకొని కూర్చున్నాడు.
” నువ్వు నన్ను ఇలా నిర్బందించచ్చా భరతా, నేను ఏ తప్పు చేసానని నువ్వు ఇలా దర్భల మీద కూర్చున్నావు. ఇలా బ్రాహ్మణుడు కూర్చుంటాడు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి. క్షత్రియుడవైన నువ్వు ఇలా కూర్చోవడం నీ మొదటి తప్పు. నా యందు ఏ తప్పు లేకపోయినా నువ్వు ఇలా కూర్చోవడం నీ రెండవ తప్పు. కాబట్టి నువ్వు చేసిన ఈ దోషముల యొక్క పరిష్కారానికి లేచి ఆచమనం చెయ్యి, అలాగే ఒక ధార్మికుడిని ముట్టుకో ” అన్నాడు రాముడు.
అప్పుడు భరతుడు లేచి, ఆచమనం చేసి రాముడిని ముట్టుకున్నాడు. తరువాత ఆయన అక్కడున్న పౌరులందరినీ పిలిచి ” రాముడు ఎంత చెప్పినా రానంటున్నాడు. అందుకని నేను కూడా ఇక్కడే రాముడితో ఉండిపోతాను, లేకపోతే నా బదులు రాముడు రాజ్య పాలనం చేస్తాడు, నేను అరణ్యాలలో ఉంటాను ” అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు నవ్వి ” భరతా! అలా మార్చుకోవడం కుదరదు. నాన్నగారు నిన్ను అరణ్యాలకి వెళ్ళమని చెప్పలేదు. 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక నేను తిరిగి వచ్చి రాజ్య పాలన చేస్తాను. అప్పటివరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించు ” అన్నాడు. అక్కడే ఉన్న ఋషులు భరతుడి దెగ్గరికి వచ్చి, రాముడు చెప్పిన్నట్టు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.
అప్పుడు భరతుడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని రాముడి పాదాల మీద పడ్డాడు.
” చంద్రుడికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతాల నుంచి జలం రాకుండా ఆగిపోవచ్చు, సముద్రం చెలియలి కట్ట దాటిపోవచ్చు కాని, నేను నా ప్రతిజ్ఞని మాత్రం మానను ” అని రాముడన్నాడు.
ఈ సమయంలో వశిష్ఠుడు లేచి ” అయితే రామ, నీదైన రాజ్యాన్ని భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలిస్తాడు, నువ్వు తిరిగొచ్చాక నీకు ఇస్తాడు ” అని చెప్పి, తాను తీసోకొచ్చిన బంగారు పాదుకలని భరతుడికి ఇచ్చి ” భరతా! ఈ పాదుకల మీద రాముడిని ఒకసారి ఎక్కి దిగమను. ఇక నుంచి అయోధ్యని ఈ పాదుకలు పరిపాలిస్తాయి ” అన్నాడు.(వశిష్ఠుడు త్రికాలవేది, ఆయనకి ముందే తెలుసు రాముడు తిరిగి రాడని. అందుకనే తనతో పాటుగా బంగారు పాదుకలని తీసుకొచ్చాడు).
భరతుడు ఆ బంగారు పాదుకలకి నమస్కరించి, వాటిని రాముడి పాదాల దెగ్గర పెట్టాడు. అప్పుడు రాముడు ఒకసారి వాటి మీద ఎక్కి దిగాడు.
తతహ్ షిరసి కృ్ఇత్వా తు పాదుకె భరతహ్ తదా |
ఆరురొహ రథం హృ్ఇష్టహ్ షత్రుఘ్నెన సమన్వితహ్ ||
అప్పుడు భరతుడు సంతోషంగా ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి పయనమయ్యాడు. అయోధ్యకి వెళ్ళాక ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి, తాను ఏ పని చేసినా, ఆ పాదుకలకి చెప్పి చేసేవాడు. ఆ పాదుకలలో రాముడిని చూసుకుంటూ గడిపాడు.
తరువాత రాముడి దెగ్గరికి అక్కడ ఉండేటటువంటి తాపసులంతా వచ్చి ” ఇక్కడ దెగ్గరలో ఖరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావని తెలిసి, నీ మీద ఏ క్షణానైనా దండయాత్ర చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే వాడు మమ్మల్ని రోజూ కష్టపెడుతున్నాడు, అందుకని మేము ఇక్కడ ఉండకుండా, దూరంగా వేరొక వనానికి వెళ్ళిపోతున్నాము. కావున నువ్వు కూడా మాతో వస్తావా ” అని అడిగారు.
ఇక్కడికి భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చారు, ఇక్కడే ఉంటె నాకు వాళ్ళు బాగా జ్ఞాపకం వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన సైన్యములోని జంతువులన్నీ మలమూత్రాలని విసర్జించడం వలన ఈ ప్రదేశం సౌచాన్ని కోల్పోయింది, అని రాముడు తన మనస్సులో అనుకొని, సీతా లక్ష్మణులతో కలిసి ఆ తాపసులతో బయలుదేరాడు.
అలా కొంత దూరం ప్రయాణించాక వారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి వారికి స్వాగతం చెప్పి ” నా భార్య పేరు అనసూయ( కర్దమ ప్రజాపతి – దేవహుతిల కుమార్తె). ఆమె చాలా వృద్ధురాలు, ఆవిడ ఒకసారి దేవతల కోసం 10 రాత్రులని కలిపి ఒక రాత్రి చేసింది, దేశంలో 10 సంవత్సరాల పాటు క్షామం వస్తే, ఎండిపోయిన గంగా నదిని తన తపఃశక్తితో ప్రవహించేటట్టు చేసింది, ప్రజలందరికి అన్నం పెట్టింది, ఆమె పదివేల సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేసింది, సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. రామ! సీతమ్మని ఒకసారి అనసూయ చూస్తుంది, కనుక ఆమె దెగ్గరికి ఒకసారి పంపించు ” అని అన్నాడు.
తన దెగ్గరికి వచ్చిన సీతమ్మని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని అనసూయ ఇలా అనింది ” సీతా! నువ్వు మహా పతివ్రతవని, భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావని విన్నాను. ఆయన దుర్మార్గుడే కావచ్చు, ధనం లేనివాడు కావచ్చు, హీనుడే కావచ్చు, పతితుడే కావచ్చు, గుణములు లేనివాడు కావచ్చు, కాని స్త్రీకి పతియే దైవము అని నేను విశ్వసిస్తున్నాను, నీ అభిప్రాయం కూడా చెప్పు ” అని అడిగింది.
అప్పుడు సీతమ్మ ” నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు ఈ మాటే చెప్పారు, పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా ఈ మాటే చెప్పారు, అత్తవారింటికి వచ్చాక కౌసల్య ఈ మాట చెప్పింది, అరణ్యాలకి బయలుదేరేముందు కూడా కౌసల్య ఈ మాట చెప్పింది. కాని నా అదృష్టం ఏంటంటే, అమ్మ, నాన్న, సోదరులు, గురువు ఎలా ప్రేమిస్తారో, నా భర్త నన్ను అలా ప్రేమిస్తాడు. గొప్ప ధర్మం తెలిసున్నవాడు, జితేంద్రియుడు. ఇటువంటి భర్త లభిస్తే, అతనిని ప్రేమించడంలో గొప్ప ఏముందమ్మ ” అనింది.
సీతమ్మ మాటలకి ఎంతో సంతోషించిన అనసూయ కొన్ని కానుకలు ఇస్తూ  ” సీతా! నీకు కొన్ని బట్టలు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ నలగవు, కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాడవు, అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడూ వాసన తగ్గవు, ఇవి నువ్వు పెట్టుకుంటే, నీ భర్త నిన్ను చూడగానే ఆనందాన్ని పొందుతాడు. లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువుని సంతోషపెట్టినట్టు, నువ్వు ఇవి పెట్టుకొని నీ భర్తని సంతోషపెట్టు. కాబట్టి ఇవి కట్టుకొని ఒకసారి రాముడికి కనబడు ” అనింది.
అప్పుడు సీతమ్మ ఇవన్నీ కట్టుకొని, అత్రికి, అనసూయకి నమస్కారం చేసి రాముడి దెగ్గరికి వెళ్ళింది. రాముడు సీతని చూసి ” సీతా! ఎవ్వరూ పొందని గొప్ప గొప్ప బహుమతులు పొందావు ” అని సీతమ్మ వంక చూసి పొంగిపోయాడు.
తరువాత అనసూయ సీతమ్మని తన దెగ్గర కూర్చోపెట్టుకొని ” నీ పెళ్లి గురించి వినాలని నాకు చాలా కోరికగా ఉంది, నాకు నీ కళ్యాణం గురించి చెప్పు” అనింది.
అప్పుడు సీతమ్మ ” జనక మహారాజు భూమిని దున్నుతుంటే, నాగటి చాలుకి తగిలి పైకి వచ్చాను కాబట్టి నన్ను సీతా అని పిలిచారు. మా నాన్నగారు నన్ను చాలా కష్టపడి పెంచారు. నాకు యుక్త వయస్సు వచ్చాక, శివ ధనుస్సుని ఎత్తినవాడికి నన్ను ఇస్తానన్నారు. అప్పుడు రాముడు శివ ధనుర్భంగం చేశాడు. వెంటనే మా తండ్రి నాకు ఒక వరమాల ఇచ్చి, నా చెయ్యిని రాముడి చేతిలో పెట్టి, నీళ్ళు పోద్దామని జలకలశం తీసుకొచ్చి చెయ్యి పెట్టబోయాడు. కాని రాముడు, నేను క్షత్రియుడని కనుక శివ ధనుస్సుని విరిచాను, నీ కుమార్తెని భార్యగా స్వీకరించాలంటే, మీరు
కన్యని ఇచ్చినంత మాత్రాన స్వీకరించను. ఈ కన్య నాకు భార్యగా ఉండడానికి తగినదో కాదో, నా తండ్రిగారు నిర్ణయించాలి. ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తాను అన్నాడు. అందుకని మా నాన్నగారు దూతల చేత దశరథ మహారాజుకి కబురు చేశారు. దశరథ మహారాజు మా వంశ వృత్తాంతాన్ని విన్నాక వివాహానికి ఒప్పుకున్నారు. అప్పుడు నేను రాముడికి అర్థాంగిని అయ్యాను ” అని సీతమ్మ చెప్పింది. ఈ మాటలు విన్న అనసూయ పొంగిపోయింది.
తరువాత వారు, మేము ఆశ్రమం నిర్మించుకుంటాము, ఎటువెళ్ళమంటారు అని అత్రి మహర్షిని అడుగగా, ఆయన ” ఇక్కడ  రాక్షసులు, క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి.  ఋషులు పళ్ళు తెచ్చుకునే దారి ఒకటి ఉంది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఆ దారిలోవెళ్ళండి ” అని, ఆ దారిని చూపించారు. అప్పుడు అత్రి మహర్షి దెగ్గర, అనసూయ దెగ్గర ఆశీర్వాదం తీసుకొని, సీతారామలక్ష్మణులు ఆ దారిలొ తమ ప్రయాణాన్ని సాగించారు.
మేఘాలలోకి సూర్యుడు వెళితే ఎలా ఉంటుందో, అలా సీతాలక్ష్మణులతో రాముడు వెళ్ళాడు.

అరణ్యకాండ

అయోధ్యకాండలొ ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక, 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే, నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు.
రాముడు ఆ అరణ్యంలో తాపసులు ఉండేటటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు.
పుణ్యైః చ నియత ఆహారైః శోభితం పరమ ఋషిభిః |
తత్ బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మ ఘోష నినాదితం |
బ్రహ్మ విద్భిః మహా భాగైః బ్రాహ్మణైః ఉపశోభితం ||
ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారమును తినేవారు, అందరూ వేదం చదువుకున్నారు, ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేద ధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే, ఆ ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఆశ్రమము దెగ్గర యజ్ఞములలో వాడే సృక్కు, స్రువము మొదలైన పరికరాలు ఉన్నాయి, అలంకారం కోసం సిద్ధం చెయ్యబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి.
రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం |
దదృశుర్ విస్మిత ఆకారా రామస్య వన వాసినః ||
వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్ అనిమిషైర్ ఇవ |
ఆశ్చర్య భూతాన్ దదృశుః సర్వే తే వన వాసినః ||
ఆ ఆశ్రమం దెగ్గరికి వచ్చాక, రాముడు తన ధనుస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామలక్ష్మణులను చూసిన ఆ ఋషులు, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మతేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు.
అప్పుడా ఋషులు ” మహానుభావ! మేము అందరమూ నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి. ఇంద్రుడి యొక్క అంశలొ నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్ళని, నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేనివాడికి రాజు బలం రక్ష, బలం ఉందని చెలరేగిపోయేవాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము, మా తపస్సులో రాజుకి ఆరవ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు, అందుకని రామ నువ్వు మమ్మల్ని ఆ రాక్షసులనుంచి రక్షించాలి ” అని అన్నారు.
అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్ధనలని స్వీకరించి, వారు ఇచ్చిన అర్ఘ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడినుంచి బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). అయితే ఇక్కడికి దెగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని భుజానికి ధరించినవాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, వొంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన వొళ్ళో కుర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు.
అధర్మ చారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ |
అహం వనం ఇదం దుర్గం విరాఘో నామ రాక్షసః ||
చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ |
ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||
” మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్న వాళ్ళు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు(రాధ్ అంటె ఆనందం, విరాధ్ అంటె ఆనందానికి వ్యతిరేకం) అంటారు, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావా లక్ష్మణా, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో, నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా, నా కాళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళి, తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు, నాకు చాలా దుఃఖంగా ఉంది ” అని, ఆ విరాధుడి వైపు చూసి ” మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు ” అని రాముడు అన్నాడు.
అప్పుడా విరాధుడు ” నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను ” అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు.
అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు, లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందకి పడేసారు, అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్య తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు.
అప్పుడా విరాధుడు ” నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను, అందువలన నన్ను అస్త్ర-శస్త్రములు ఏమి చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది, నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కాని, నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళి స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పుడ్చేసి సంహరించండి. ఇక్కడినుంచి ఒకటిన్నర యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జెరుగుతుంది ” అని విరాధుడు రాముడితో అన్నాడు.
తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి, మట్టితో పుడ్చేసి, శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు.
వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే, వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది, సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డార, అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది, ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది, వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి, శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు.
ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు, ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చె ఇంద్రా, అని పిలుస్తాము కదా, అదిగొ ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు, అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను ” అన్నాడు.
అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు………….
ఇహ ఉపయాతి అసౌ రామో యావన్ మాం న అభిభాషతే |
నిష్ఠాం నయత తావత్ తు తతో మా ద్రష్టుం అర్హతి ||
” రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది, అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి ” అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని, లక్ష్మణుడిని తీసుకొని శరభంగ ముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు.
” రామ! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్నిగెలిచాను, అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి, నన్ను రమ్మన్నాడు. కాని నేను, నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను, యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు ” అని శరభంగుడు అన్నాడు.
ఈ మాటలు విన్న రాముడు ” మహానుభావ! మీరు తపస్సు చేసి నాకు ధారపొయ్యడమేమిటి. నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను ” అన్నాడు.
రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు ” ఇక్కడికి దెగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నారు, నువ్వు ఆయనని దర్శించు. రామ! నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం( ముసలిదయిపోయి ముడతలు పడిపోయింది) అయిపోయింది, కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను ” అని చెప్పి, ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి, తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు.
తస్య రోమాణి కేశాం చ తదా వహ్నిః మహాత్మనః |
జీర్ణం త్వచం తద్ అస్థీని యత్ చ మాంసం చ శోణితం ||
ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటకి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు.
బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న బ్రహ్మగారు లేచి ” మహానుభావ! శరభంగ, స్వాగతం, సుస్వాగతం ” అన్నారు. అలా శరభంగుడు ఉత్కృష్టమైన ఆ బ్రహ్మ లోకాన్ని చేరుకున్నాడు.
శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు (విఖనస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు), చెట్లనుంచి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్టుమీదనే ఉండి  తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు, ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు.
శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి ” రామ! ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపఃశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కాని మేము జితఃక్రోధులం, కోపాన్ని జయించినవాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపఃశక్తిని మాకోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న పిండంలాంటి వాళ్ళము, మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు, నువ్వు క్షత్రియుడవి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం, నీ దెగ్గర ధర్మం పుష్కలంగా ఉంది, నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు, సత్యధర్మములను రెండిటినీ అనుష్టానము చెయ్యడము తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు, రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ.
ఏహి పశ్య శరీరాణి మునీనాం భావిత ఆత్మనాం |
హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే ||
ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చిచూడు రామ, చిత్రకూట పర్వతాల మీద, దండకారణ్యంలో, మందాకినీ నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేసారు. అందుకని నీ ముందు నిలబడి, రెండు చేతులతో నీకు దండం పెట్టి, నీకు శరణాగతి చేస్తున్నాము రామ, మమ్మల్ని రక్షిస్తావ?” అని ఆ ఋషులు రాముడిని అడిగారు.
ఆ ఋషుల యొక్క ప్రార్ధనలని విన్న రాముడు ” మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను, మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు ” అన్నాడు.
తరువాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు.
వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణసహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దెగ్గర కూర్చుని ” మహాత్మా! నన్ను రాముడు అంటారు, ఒకసారి మీరు నన్ను చూసి, నాతో మాట్లాడవలసింది అని అభ్యర్దిస్తున్నాను ” అని అన్నాడు.
కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు ” రామ! దేవేంద్రుడు నా దెగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటిని గెలిచాను కనుక నన్ను ఊర్ధలోకములకు తీసుకువెళతాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని, ఆయనకి ఆతిధ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామ ” అన్నాడు.
శరభంగ మహర్షి చెపినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు.
అప్పుడు రాముడు ” మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి ” అన్నాడు.
“అయితే ఇక్కడ దెగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చుసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను ” అని సుతీక్ష్ణుడు అన్నాడు.
” నాకు కూడా ఆ ఆశ్రమాలన్నిటిని చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నిటిని చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను ” అని రాముడు అన్నాడు.
ఆ రోజూ రాత్రికి సుతీక్ష్ణుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి, సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దెగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష్ణ మహర్షి ” రామ! నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యదేచ్ఛగా ఆచరించు, ఇక్కడ ఏవిధమైన ప్రమాదము ఉండదు, కాని ఇక్కడికి మృగములు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు ” అన్నాడు.
అప్పుడు రాముడన్నాడు ” మృగాలని చూస్తే ధనుస్సు పట్టుకోవడం నా అలవాటు, ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే, ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణ ప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగచ్చు, అందువలన బాణ ప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి, అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించికోడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకొని వస్తాను ” అన్నాడు.
” అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకొని మళ్ళి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను ” అని  సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు.
సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది ” నేను పెద్దల దెగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే…..
తృతీయం యద్ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం |
ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు, అప్పుడా తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, తాపసులని హింసించే రాక్షసులని ఇకనుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి, కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శతృత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి…….
పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దెగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘ అయ్యా! నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదెగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దెగ్గర ఉంచండి’ అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి  వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు.
మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది, తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు, కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు?
మీరు నాతో ఒక మాట అనొచ్చు, ‘ నేను రాజుని కాకపోవచ్చు, కాని నేను ఒక క్షత్రియుడిని, అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు’ అని. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పనేమో. మీ తమ్ముడితో ఆలోచించి, ఒక మంచి నిర్ణయానికి రండి ” అని సీతమ్మ రాముడితో అనింది.
సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు ” సీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు.
తే చ ఆర్తా దణ్డకారణ్యే మునయః సంశిత వ్రతాః |
మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యాః శరణం గతాః ||
నేనేమి వాళ్ళని అడగలేదు, వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా. నేను క్షత్రియుడని కనుక వాళ్ళకి కష్టం వస్తే, ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు, నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు, వాళ్ళు నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశారు, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంతేకాని ఎట్టి పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీతా ” అని రాముడు అన్నాడు.
ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి ” మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జెరుగుతుంది” అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి ” ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏంటి సంగతి ” అని అడిగారు.
ఇదం పంచ అప్సరో నామ తటాకం సార్వ కాలికం |
నిర్మితం తపసా రామ మునినా మాణ్డకర్ణినా ||
అప్పుడా ధర్మభృత్ ” ఈ సరోవరాన్ని మాణ్డకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకొని, ఆయన తపస్సుని భగ్నం చెయ్యడానికి అయిదుగురు అప్సరసలని పంపారు. అప్పుడా మాణ్డకర్ణి ముని ఆ అప్సరసలకి వసుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపఃశక్తితో యవ్వనాన్ని పొంది ఈ అయిదుగురితో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటకి వినబడుతున్నాయి రామ ” అని అన్నాడు.
ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడినుంచి ముందుకి పయనమయ్యాడు.
(ఈ మాణ్డకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే, మాణ్డకర్ణి మహర్షి దెగ్గరికి వచ్చిన ఆ అయిదుగురు అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు. తన ఇంద్రియాలకి లొంగినవాడై, తను ఇప్పటిదాకా సంపాదించిన తపఃశక్తిని సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాడు)
తాను చూసినటువంటి ఆశ్రమములలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొకదానిలో 1 సంవత్సరము, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంత కాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు.
అప్పుడు రాముడు ” అయ్యా! 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళి రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడొ ఉందని విన్నాను, కాని ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు, అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను ” అని అన్నాడు.
అప్పుడా సుతీక్ష్ణుడు ” రామ! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత(అంటె అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలొ ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు ” అన్నాడు.
సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దెగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దెగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే…………..పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దెగ్గరికి వెళ్ళి, ‘ అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ‘ అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ‘ వాతాపి! రా……..’ అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి ‘వాతాపి! రా…..’ అన్నాడు.
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః | 
భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||
” నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా ” అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా ” అని రాముడు అన్నాడు.
ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు, కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడుగగా ” అదిగొ మీకు కనపడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతోంది ” అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పరు.
అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి( అంటె ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి, తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివ స్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి, అగస్త్యుడు శివుడిని పూజించేవాడు). ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కాని, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కాని, వంచన చేసేవాడు కాని, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కాని, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కాని ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జెరగదు.
సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడా చూసిన తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు మొదలైనవాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తార ” అని కబురు చెయ్యి అన్నాడు.
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా ” నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దెగ్గరికి తీసుకురాకుండా, నా దెగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు ” అని అగస్త్యుడు అన్నాడు.
అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |
జగ్రాహ ఆపతత్ తస్య పాదౌ చ రఘునందన ||
అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః |
సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు ” నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జెరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు.
రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను ” అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక  బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు.
” స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము ” అని రాముడు అడుగగా, ” నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దెగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో ” అన్నారు.
సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దెగ్గర సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు ” నువ్వు ఎవరు ” అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది…….
” నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి ” మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి ” అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు.
అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.
కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది.  ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి.
అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.
రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే ” అని అన్నాడు ఆ జటాయువు.
ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.
రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు ” అన్నాడు.
పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||
అప్పుడు లక్ష్మణుడు ” స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ” లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు ”  అన్నాడు.
ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు, వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు, దానిమీద అడ్డుకర్రలు వేశాడు, వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసెటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దెగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ” అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను ” అని అన్నాడు. ( ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు, అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)
ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |
ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||
ఆ పర్ణశాలని చూసిన రాముడు ” ఏమి పని చేశావయ్యా, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా ” అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని ” లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దెగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని ” అన్నాడు.
అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగ కాలం గడపసాగారు.
కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలొ మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.
నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |
ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే……సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి ” అన్నాడు.
” లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతొ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ” అని రాముడన్నాడు.
కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |
కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||
సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ( చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తెజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది.
రాముడిని చూస్తే ‘ అబ్బ ఎంత బావున్నాడో ‘ అంటారు, ఆమెని చూస్తే ‘ బాబోయి అలా ఉందేంటి ‘ అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది, ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళి చూడాలనిపించే రూపం రాముడిది, పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వాళ్ళు భయపడతారు.
ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి ” నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు ” అని అడిగింది.
అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దెగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు ” నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు? ” అని రాముడు అన్నాడు.
అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వ భయంకరా ||
రావణో నామ మే భ్రాతా యది తే శ్రోత్రం ఆగతః |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||
అప్పుడు శూర్పణఖ ” నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు ” అని సీతమ్మ వైపు చూసి ” ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు” అనింది.
విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు ” నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు ” అన్నాడు.
అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి ” నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు ” అని పరిహాసం ఆడాడు.
లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకొన్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకొంది. తాను అందగత్తెని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక, కాళ్ళు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక, అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక, ఆమె ముక్కు, చెవులు కోసెయ్యి ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు ” ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు ” అని అడిగాడు.
అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది ” ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా ” అనింది.
” అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను ” అని ఖరుడు అన్నాడు.
తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి ” మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది ” అన్నాడు.
తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు ” లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను ” అన్నాడు.
ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.
ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దెగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ ” పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటె నీ దెగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దెగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో ” అనింది.
ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి ” నేను ఇప్పుడే బయలుదేరతాను, నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కాని యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు ” అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.
ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి, ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు.
ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.
అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి, భూమి ఒక్కసారి కంపించింది, అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది, అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటె గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటె, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను.
తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |
గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||
అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో ‘సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో’ అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో ” అన్నాడు.
అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.
ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.
రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.
దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.
అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడాయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు, ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుంచి రక్తం కారింది.
అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు ” వాడు మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాసం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను ” అన్నాడు.
ఆ మాటలకి ఆగ్రహించిన ఖరుడు యమపాశం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించగా, ఆ గద మార్గమధ్యలోనే తుత్తునియలు అయిపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ ఖరుడి ధ్వజం, గుర్రాలు, సారధి పడిపోయారు. ఆ బాణాలు ఖరుడి గుండెల్లో దిగేసరికి, ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో, అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి, దాన్ని రాముడి మీద వెయ్యబోగా, రాముడు ఆ చెట్టుని నారాచ బాణములతో ముక్కలు చేశాడు. అప్పుడా ఖరుడు రాముడి మీద పడబోగా, ఆయన బాణం పెట్టి కొట్టగానె, ఖరుడు భూమి మీద పడి మరణించాడు.
అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |
చతుర్ దశ సహస్రాణి రక్ష్సాం కామ రూపిణాం |
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||
రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జెరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది.
అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడివంటి ముఖంతో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు.
రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 రాక్షసులని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు. నాకు కారణం చెప్పు ” అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు, ఆయన రాముడికి కుడిభుజం లాంటివాడు, సర్వకాలములయందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలని రాముడికి చెప్పుకుంటె, మీకు శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే కనుక వారిని సంహరిస్తాను అని ఆ ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు తన బాణముల చేత ఈ భూమిని కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాలని క్షోభింప చెయ్యగలడు, పర్వతాలని కదపగలడు ” అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు.
” అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరిస్తాను ” అని రావణాసురుడు అన్నాడు.
అప్పుడు అకంపనుడు ” మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రాముడిని సంహరించాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది, రాముడి భార్య అయిన సీత చాలా అందంగా ఉంటుంది. ఆ సీతతో అందంలో సమానమైన వాళ్ళు గంధర్వలులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, రాక్షసులలో కాని, మనుష్యులలో కాని లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో ” అన్నాడు. 
రావణుడు వెంటనే బయలుదేరి మారీచ ఆశ్రమానికి వెళ్ళి” నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసినవాడివి. అందుకని సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి ” అని అడిగాడు.
ఈ మాటలు విన్న మారీచుడు ” నీకు అసలు ఎవడు చెప్పాడు సీతాపహరణం చెయ్యమని. బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు ఎవడో నీకు సలహాలు చెప్పేవాడిగా మాటువేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు, రాముడి శక్తి సామర్ధ్యాలు ఏమిటో నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు ” అన్నాడు.
” నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను సీతాపహరణం చెయ్యను ” అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.
( పైన జెరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించార, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించార? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కాని ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడ? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడ? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కాని అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా ప్రకటించారు. అవునా, కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి.) ఇక కథ ప్రకారంగా చూస్తే………………..
అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్టు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. ఆ రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత సంహరింపబడడు. ఆ సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకంవస్తాడు.
దేవ అసుర విమర్దేషు వజ్ర అశని కృత వ్రణం |
ఐరావత విషాణ అగ్రైః ఉత్కృష్ట కిణ వక్షసం ||
వింశత్ భుజం దశ గ్రీవం దర్శనీయ పరిచ్ఛదం |
విశాల వక్షసం వీరం రాజ లక్ష్మణ లక్షితం ||
దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చెయ్యడం వలన, ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. ఆ రావణాసురుడు 20 చేతులతో, 10 తలకాయలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండలములు పెట్టుకున్నాడు, విశాలమైన భుజాలతో ఉన్నాడు, తెల్లటి పళ్ళతో, పర్వతమంటి నోటితో ఉన్నాడు. శ్రీమహా విష్ణువు యొక్క చక్రము చేత కొట్టబడ్డప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి, అలాగే మిగిలిన దేవతల ఆయుధముల దెబ్బలు వాడి ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయతిప్పుతూ ఉంటాడు. ఆయన పర్వతాలని విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటె, వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యలని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం.
అలాగే ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం తెలుసు, ఆ అస్త్రములను ఉపసంహరించడం కూడా తెలుసు. ఎవరన్నా యజ్ఞాలు చేస్తుంటే, తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు, అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దెగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు( కుబేరుడు స్వయంగా రావణుడికి అన్నయ్య. కాకపోతే కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే, రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. అలాగే స్వర్గలోకంలోని నందన వనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.
రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలి అని అడుగగా……..
దేవ దానవ గధర్వ పిశాచ పతగ ఉరగైః |
అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాద్ ఋతే ||
” నేను పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు ” అని అడిగాడు, కాని రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞం పూర్తవబోతుంది అనగా, అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలములయందు దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. ( ఒకసారి రావణుడు కైలాశ పర్వతాన్ని లేపాలని చూస్తే, పరమశివుడు తన బొటను వేలితో ఆ పర్వతాన్ని కిందకి తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండడంచేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసేవిధంగా అరిచాడు కనుక(రవం చేశాడు కనుక) ఆయనని రావణ అని పిలిచారు.)
రావణం సర్వ భూతానాం సర్వ లోక భయావహం | రాక్షసీ భ్రాతరం క్రూరం సా దదర్శ మహాబలం ||
రావణాసురుడు సర్వ లోకములకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా, శూర్పణఖ భయపడుతూ ఆయన దెగ్గరికి వెళ్ళి “నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములని అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు, సరైన గూఢచారులని నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జెరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్టు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దెగ్గరకి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జెరుగుతుందో తెలుసుకోరా?, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా?, చెప్పినా నువ్వు బాధపడవా?. రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒకసారి కాని నువ్వు రాజ్యభ్రష్టుడివి అయ్యావంటే, అవకాసం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా, ప్రకాశించడం మానేస్తుంది.
నువ్వు దండకారణ్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. కాని, ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు ” అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకొచ్చాడు? ఆయన దెగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసులని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్టు నాకు చెప్పు ” అన్నాడు.
దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |
కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||
అప్పుడా శూర్పణఖ ” రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునులలాగ నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు, కాని రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కాని రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.
రామస్య దక్షిణే బాహుః నిత్యం ప్రాణో బహిః చరః |
ఆ లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా, బయట తిరుగుతున్న ప్రాణంలా సర్వకాలములయందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత, ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది, అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది, ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలినుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది, పద్మంలాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరులకి, దానవులకి చెందినదికాదు, ఆమె నరకాంత. కాని ఈ భూమండలంలో నేను ఇప్పటివరకూ అటువంటి సౌందర్యరాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు.
నాకు ఆ సీతని చూడగానే, ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు అన్నయ్యా. నువ్వు కాని సీతని చూస్తే, మన్మధ బాణాలకి వసుడవయిపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటె, ఇంక ఆలోచించకుండ వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముడిని సంహరించు ” అనింది.
శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి ” ఇక మీరు బయలుదేరండి ” అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది.(తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడిని అడిగాడు, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు ” నువ్వు హిమాలయ పర్వతాలకి దెగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి ” అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బయలుదేరాడు, అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దెగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుక్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూత చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.
అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు ” ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను.  నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో ” అన్నాడు.
ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు…..
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||
” రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||
ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.
జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |
యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||
నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.
అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |
ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||
నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.
పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.
ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళి కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు, ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపెస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.
అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దెగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, ‘ర’ అని పలుకగానే, వారు తరువాత ‘మ’ అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటె, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు.
ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేసారో అని మీరెవరన్నా అడిగార. ఇలా అడగకుండా వెళ్ళిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు ” అని మారీచుడు అన్నాడు.
మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు ” అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి, రాముడు కేవలం ఒక మనిషి, నాదెగ్గర రాముడిని పొగడద్దు, నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దెగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే, నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను, కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను ” అన్నాడు.
అప్పుడు మారీచుడు ” రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.
స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||
రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద ” అని అన్నాడు.
రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, అక్కడున్న మృగాల దెగ్గరికి వెళుతూ, మళ్ళి తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి ” రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి ” అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో ” ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు…………..” అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు…..
శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |
తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||
” అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో ” ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు, ఒంటి మీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి ‘ అబ్బ, ఏమి మృగం వదిన ‘ అంటాడు, అత్తగార్లు అందరూ చూసి ‘ అబ్బ, ఏమి మృగం ‘ అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ‘ ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే ‘ అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండె ” అనింది. 
అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి ” లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి ” అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు.
జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా ” హా! సీత, హా! లక్ష్మణా ” అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.
ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి ‘ హా! సీత, హా! లక్ష్మణా ‘ అనే కేక సీతమ్మ చెవినపడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి ” చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. ‘ హా! సీత, హా! లక్ష్మణా’ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు ” అని అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు ” అని అన్నాడు.
తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి ” నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతువిని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో ‘ హా! సీత, హా! లక్ష్మణా ‘ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు ” అనింది.
తన రెండుచేతులతో సీతమ్మకి అంజలిఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు ” దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము.
న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |
గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||
నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగపెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది ” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని ” వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.
వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను ” అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ ” అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా….” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా ” అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది.
అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.
అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి……….” అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే ” చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి ” అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)
కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.
సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.
అప్పుడా సీతమ్మ ” నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.
మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||
అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు  ” అని చెప్పి  ” ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు ” అని అడిగింది.
అప్పుడా రావణుడు ” సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను ” అన్నాడు.
రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ ” రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది ” అని అనింది.
అప్పుడా రావణుడు ” నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు ” అని గర్వంగా అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” కుబేరుడి తమ్ముడిని అంటావు, పదిమంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము ” అనింది.
అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు, ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన ” నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు ” అని, అపారమైన కామంతో కన్ను మిన్ను కానక, భయపడుతున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని, కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి, ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటివరకూ ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది.
ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ ” రామ, రామ, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది. ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మంకోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కాదా. లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కాదా. రక్షించండి, రక్షించండి ” అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే ” ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి ” అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, 20 బాహువులతో ఆడ త్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కుర్చోపెట్టుకున్నాడు.
అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడా జటాయువు ” దుష్టుడైన ఓ రావణా! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజె ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావ. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటె ఏంటో చూద్దువు ” అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.
తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు.
ఇది చూశిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది.  రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.
అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపుతప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు ” జటాయువు కోసం ఏడుస్తావే, రా ” అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది.
అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి ” చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా ” అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి ” ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా ” అన్నారు.
రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు.
ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.
త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |
మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||
రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది ” నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాద్రుచ్చికముగా జెరిగిన సంఘటన కాదు. ఇలా జెరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని, నీ తపస్సుకి కాని, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు, ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా. నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయవు. నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరులైనవారు అంగీకరించేటటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన, నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్ళి, చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలొ పడేస్తారు, అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, రేపు నువ్వు చచ్చాక నరకంలో ఒంటి నిండా శూలాలుండే శాల్మలీ వృక్షాన్ని కూడా గట్టిగా పట్టుకుంటావు. నిన్ను పాశములతో కట్టేసి కాలము లాక్కొనిపోతుందిరా. నువ్వు ఎప్పుడైతే మహాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్నావో, ఆనాడే నీ జీవితంలో సుఖం అనేది పోయింది, నువ్వు మరణించడం తధ్యం ” అనింది.
సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని, గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి, మయుడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి, తన అంతఃపురం దెగ్గర దిగాడు.
అబ్రవీత్ చ దశగ్రీవః పిశాచీః ఘోర దర్శనాః |
యథా న ఏనాం పుమాన్ స్త్రీ వా సీతాం పశ్యతి అసమ్మతః ||
తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి ” ఈ సీత అంతఃపురంలో ఉంటుంది, నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కాని, పురుషుడు కాని సీతని చూడడానికి వీలులేదు. నేను మిమ్మల్ని ఎవన్నా రత్నాలు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని తీసుకురండి అంటె, వేరొకరి అనుమతి లేకుండా నాకు తెచ్చి ఎలా ఇస్తారో, అలాగే ఈ సీత మణులు కాని, మాణిక్యములు కాని, ఆభరణములు కాని, వస్త్రములు కాని అడిగితే, ఎవరి అనుమతి అవసరం లేకుండా వెంటనే తీసుకొచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కాని, తెలియక కాని సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితము అక్కడితో సమాప్తము ” అని వాళ్ళతో చెప్పి, తాను చేసిన ఈ పనికి చాలా ఆనందపడినవాడై అంతఃపురం నుంచి బయటకివెళ్ళి, నరమంసాన్ని తినడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులని పిలిచి ” నేను చెప్పే మాటలని జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జనస్థానంలొ ఖర దూషణుల నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉండేవారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ రాముడి చేతిలో నిహతులయిపోయారు, ఆ జనస్థానం ఖాళీ అయిపోయింది. అప్పటినుంచీ నా కడుపు ఉడికిపోతుంది. ఆ రాముడిని చంపేవరకు నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరి అక్కడికి వెళ్ళండి, పరమ ధైర్యంగా ఉండండి. అక్కడ ఏమి జెరిగినా వెంటనే నాకు చెప్పండి ” అన్నాడు.
రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసులు జనస్థానానికి బయలుదేరారు. అప్పుడు రావణుడు అక్కడినుంచి బయలుదేరి అంతఃపురానికి వచ్చి, సీతని తెచ్చానని మనసులో చాలా ఆనందపడ్డాడు.
అశ్రు పూర్ణ ముఖీం దీనాం శోక భార అవపీడితాం |
వాయు వేగైః ఇవ ఆక్రాంతాం మజ్జంతీం నావం అర్ణవే ||
ఆ అంతఃపురంలో కళ్ళనిండా ఏడుస్తూ, చెంపల మీద ఆ కన్నీళ్ళు కారుతూ, అత్యంత దీనంగా, శోకం చేత పీడింపబడి, పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నౌకలోని వారు ఎటువంటి దిగ్భ్రాంతికి లోనవుతారో, అటువంటి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది. వేటకుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడి పిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో, అలా సీతమ్మ తల దించుకుని ఏడుస్తూ ఉంది.
అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి తీసుకువెళ్ళి, తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులని, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చెయ్యబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైనవాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక ” ఈ లంకలో ఉన్న బాలురని, వృద్ధులని లెక్కనుంచి మినహాయిస్తే, 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు, వీరందరూ నన్ను కోరి వచ్చినవారే. ఓ ప్రియురాల! నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా, నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు, నాయందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కాని, దానవులు కాని, గంధర్వులు కాని, యక్షులు కాని, నాగులు కాని, పక్షులు కాని కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు ఎవరు, తీసుకెళ్ళే వాడు ఎవరు?
రాజ్య భ్రష్టేన దీనేన తాపసేన పదాతినా |
కిం కరిష్యసి రామేణ మానుషేణ అల్ప తేజసా ||
ఇంకా రాముడు, రాముడు అంటావేంటి. ఆ రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు, రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యములను పట్టి తిరుగుతున్నాడు, రాముడు కేవలం మనిషి, అటువంటి రాముడితో నీకేమి పని. నీకు తగినవాడిని నేను, అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో, మళ్ళి పట్టాభిషేకం చేసుకుందాము. ఆ పట్టాభిషేకము చేసినప్పుడు మీద పడినటువంటి జలములతో తడిసి, నాతో కలిసి సకల ఆనందములు అనుభవించు. నువ్వు నీ జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు, ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు, రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నాదెగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకొని చక్కగా అలంకరించుకో, మనమిద్దరమూ పుష్పక విమానంలో విహారం చేద్దాము ” అన్నాడు.
ఏ ముఖాన్ని చూసి ఆ రావణుడు ఇలా హద్దులు మీరి మాట్లాడుతున్నాడో, ఆ ముఖాన్ని తన ఉత్తరీయంతో కప్పుకొని, సీతమ్మ తల్లి కళ్ళు ఒత్తుకుంటూ ఏడ్చింది.
ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ
ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||
ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు ” నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు ” అన్నాడు. ( రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు.)
అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని పెట్టి ” రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు, ఆయన నా భర్త, నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటె, ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివిరా. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యము పోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ ఇంద్రియాలు కూడా పతనమయిపోతాయి, నీ లంకా పట్టణం విధవగా నిలబడడానికి సిద్ధంగా ఉంది, ఇవన్నీ నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో జెరగబోతున్నాయి. నీటి మీద పట్టే నాచుని తినే నీటికాకిని, నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటుపడిన హంస చూస్తుందా. రాముడిని చూసిన కన్నులతో నిన్ను నేను చూడనురా పాపి, అవతలకి పో ” అనింది.
ఈ మాటలకి ఆగ్రహించిన రావణుడు ” నీకు 12 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతట నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలాకాకపోతే 12 నెలల తరువాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు ” అని చెప్పి, భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి ” ఈమెని అశోక వనానికి తీసుకువెళ్ళండి. ఆమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి, బతికీ బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని ఇస్తూ, శూలాలలాంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి. ఇక తీసుకువెళ్ళండి ” అన్నాడు.
వికృత నేత్రములు కలిగిన ఆ రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి భయపెడుతుంటే, అశోక వనంలో శోకంతో ఏడుస్తూ ఆ సీతమ్మ ఉంది.
ఇటుపక్క రామచంద్రమూర్తి మాంసం పట్టుకుని వస్తుంటే, విచిత్రంగా వెనకనుంచి ఒక నక్క కూత వినబడింది. అలాగే రాముడిని దీనంగా చూస్తూ అక్కడున్న మృగాలన్నీ ఎడమ వైపు నుండి ప్రదక్షిణంగా తిరిగాయి. ఈ శకునాలని చూసిన రాముడు, సీతమ్మకి ఏదో జెరిగిందని భావించి గబగబా వస్తుండగా ఆయనకి ఎదురగా లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడిని చూడగానే రాముడి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి.
అప్పుడాయన లక్ష్మణుడితో ” సీతని వదిలి ఎందుకు వచ్చావు. సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. సీత క్షేమంగా ఉంటుందా? బతికి ఉంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖర దూషణులని సంహరించాక రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ ‘హా సీతా! హా లక్ష్మణా!’ అన్నాడు. సీత నిన్ను నిగ్రహించి పంపి ఉంటుంది, అందుకని నువ్వు వచ్చావు. నువ్వు వచ్చేశాక సీతని ఆ రాక్షసులు అపహరించడమైనా జెరిగుంటుంది, లేదా ఆమె కుత్తుక కోసి, ఆమెని తినెయ్యడం అయినా జెరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైన పని జెరిగుంటుంది. లక్ష్మణా! నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు. నువ్వు రాకుండా ఉండి ఉండవలసింది. ఈ ముఖం పెట్టుకొని నేను అయోధ్యకి ఎలా వెళ్ళను. అందరూ వచ్చి సీతమ్మ ఏది అని అడిగితే, నేను ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చిన సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడు, అని అందరూ చెప్పుకుంటుంటే, ఆ మాటలు విని నేను ఎలా బతకను. నేను అసలు వెనక్కి రానే రాను. సీత ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను.
ఏ సీత యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని క్షణములా గడిపానో, ఆ సీత నా కంటపడనప్పుడు నాకు రాజ్యం అక్కరలేదు, అంతఃపుర భోగములు అక్కరలేదు. నువ్వు అయోధ్యకి వెళ్ళి, నేను చెప్పానని చెప్పి, భరతుడిని పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్యని సేవించు. నేను అయోధ్యకి తిరిగొస్తే, జనకుడు నన్ను చూసి ‘ రామ! నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ’ అని అడుగుతారు, అప్పుడు నేను జనకుడి ముఖాన్ని ఏ ముఖంతో చూడను. సీతని వదిలి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించాను. కాని నా ఆజ్ఞని పాటించకుండా సీతని వదిలి నువ్వు ఒక్కడివీ ఎందుకు వచ్చావు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్య! నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాటని పాటిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దెగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను. 
ఆర్యేణ ఏవ పరిక్రుష్టం – పరాక్రుష్టం – హా సీతే లక్ష్మణ ఇతి చ |
పరిత్రాహి ఇతి యత్ వాక్యం మైథిల్యాః తత్ శ్రుతిం గతం ||
కాని ఎప్పుడైతే అరణ్యంలోనుంచి నీ గొంతుతో ‘హా సీతా! హా లక్ష్మణా’ అన్న మాటలు సీతమ్మ విన్నదో, నీయందు ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత భయవిహ్వల అయిపోయింది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ, లక్ష్మణా వెళ్ళు, అని నన్ను ఒకటికి పదిమార్లు తొందరచేసింది. కాని మా అన్నయ్య అలా నీచంగా రక్షించండి అని ఒక్కనాటికి అరవడు, ఇది రాక్షస మాయ అని సీతమ్మకి చెప్పాను. కాని ‘నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి, నన్ను పొందడానికి రాముడి వెనకాల అరణ్యవాసానికి వచ్చావు’ అని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటె, నేను ఇంక తట్టుకోలేక బయలుదేరి వచ్చేశాను. నాయందు ఏ దోషము లేదన్నయ్య, నన్ను మన్నించు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నువ్వు ఎన్నయినా చెప్పు లక్ష్మణా, సీతని ఒక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు. నా మాటగా రాక్షసుడి మాట వినపడితే, సీత నిన్ను ఒకమాట అని ఉండవచ్చు, అంతమాత్రాన సీతని విడిచి వచేస్తావ. ఇప్పుడు సీత ఎంత ప్రమాదంలో ఉందో. నువ్వు కోపానికి లోనయ్యావు, అందుకని సీతని విడిచిపెట్టి వచ్చేశావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యను…….” అని అంటూ ఆ పర్ణశాల ఉండే ప్రదేశానికి చేరుకున్నారు.
రాముడు ఆ పర్ణశాలలో అంతా చూశాడు, కాని సీతమ్మ ఎక్కడా కనపడలేదు. అప్పుడాయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, దెగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు, నదుల దెగ్గరికి వెళ్ళి చూశాడు, అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళాడు, పెద్ద పులుల్ని, చెట్లని అడిగాడు. అలా ఏనుగు దెగ్గరికి వెళ్ళి ” ఓ ఏనుగా! నీ తొండం ఎలా ఉంటుందో సీత జెడ కూడా అలానే ఉంటుంది, నీకు తెలిసుంటుంది సీత ఎక్కడుందో, నాకు చెప్పవా ” అన్నాడు. దెగ్గర ఉన్న చెట్ల దెగ్గరికి వెళ్ళి ” సీత ఎక్కడుందో మీకు తెలిసుంటుంది, నాకు నిజం చెప్పరా ” అన్నాడు. అక్కడే ఉన్న జింకల దెగ్గరికి వెళ్ళి ” సీత మీతో ఆడుకునేది కాదా, సీతకి ప్రమాదం జెరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది. నాకు సీత ఎక్కడ ఉందో చెబుతారా ” అన్నాడు. అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ ” అయ్యో, రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి, ఆమె రక్తాన్ని తాగేసి, మాంసాన్ని భక్షిస్తుంటే, ‘హా! రామ, హా! రామ’ అని అరిచి ఉంటుంది. ఎంత అస్త్ర-శస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చెయ్యగలిగాను, సీతని కాపాడుకోలేకపోయాను ” అని ఏడుస్తున్నాడు.
రాముడి బాధని చూసి లక్ష్మణుడు ” అన్నయ్యా! బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను ” అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు.
తిరిగొచ్చిన లక్ష్మణుడు ” సీతమ్మ ఎక్కడా కనపడలేదు ” అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దెగ్గరికి వెళ్ళి ” గోదావరి! నిజం చెప్పు. ఎక్కడుంది సీత. నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు, కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు ” అన్నాడు.
భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |
న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||
అక్కడున్న పంచభూతాలు జెరిగినది చూసాయి, కాని చెపుదాము అంటె, రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో ” గోదావరి! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేకపోతున్నాము ” అన్నాయి. కాని రావణుడి దుష్ట చేష్టితములు, భయంకరమైన స్వరూపం, వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు. అక్కడున్న మృగాలు జెరిగినదాన్ని చెబుదాము అనుకున్నాయి, కాని అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి.
మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు ” అన్నయ్యా!  ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు. అవి కొంత దూరం పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి, ‘మాకు చెప్పడం రాదు, నీకు అర్ధం అవ్వడం లేదా, మా వెంట రా’ అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళి పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటూ వైపు తీసుకెళ్ళారేమో అన్నయ్యా, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఈ మృగాల వెనకాల వెళదాము ” అన్నాడు.
అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ మృగాల వెనుక పరుగు తీసారు. అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనపడింది. అప్పుడు రాముడు ” మారీచుడు వచ్చేముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను. ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు. చూశావ ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి, అంటె ఎవరో సీతని తినేశారు. ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతుంది, ఎవరిదో గొప్ప ధనుస్సు విరిగి కింద పడిపోయి ఉంది, ఎవరో ఒక సారధి కూడా కింద పడిపోయి ఉన్నాడు, పిశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో గెలిచినవాడు సీతని తీసుకెళ్ళి తినేశాడు.
సీత ఏ ధర్మాన్ని పాటించిందో, ఆ ధర్మం సీతని కాపడలేదు. ఎవడు పరాక్రమము ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో, వాడిని లోకం చేతకానివాడు అంటుంది. లక్ష్మణా! ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపము ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి ‘సీత ఎక్కడుంది’ అని అడిగితే, నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళి ప్రతిధ్వనిగా పైకి పంపింది. ఇప్పుడే ఈ పర్వతాన్ని నాశనం చేసేస్తాను, నాకున్న అస్త్ర-శస్త్రములన్నిటిని ప్రయోగించి సూర్య చంద్రులని గతిలేకుండా చేస్తాను, ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను, దేవతలు ఎవరూ తిరగడానికి వీలులేకుండా చేసేస్తాను, నదులలో, సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింప చేసేస్తాను, భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను, నా బాణాలతో భూమిని బద్దలుకొడతాను, రాక్షసులు అనే వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను, నా క్రోధం అంటె ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు, మూడులోకాలని లయం చేసేస్తాను. సీత ఎక్కడున్నా, బతికున్నా మరణించినా, దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్ధన చేస్తే వదిలిపెడతాను, లేకపోతె ఇవ్వాళతో ఈ బ్రహ్మండాలని నాశనం చేసేస్తాను. వృద్ధాప్యం రాకుండా, మృత్యువు రాకుండా ఎవడూ ఎలా నిరోధించుకోలేడో, అలా క్రోధముర్తి అయిన నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు. పడగోట్టేస్తున్నాను లక్ష్మణా……” అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు.
అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి, అంజలి ఘటించి ” అన్నయ్యా! నువ్వు సర్వభూత హితేరతుడివి అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటివాడివి నువ్వు క్రోధమునకు వశమయిపోయి మూడులోకాలని కాల్చేస్తే, ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్ధం ఎక్కడుంది అన్నయ్యా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని, వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటిని బాధపెడతావ అన్నయ్యా. నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. రాజు ప్రశాంతమూర్తుడై తగినంత శిక్ష వెయ్యాలి, అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావ. అన్నయ్యా! ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడొ ఒకడే రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని, సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్యా! నీకు అంజలి ఘటించి, నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను, నువ్వు శాంతించు. రాముడే ఆగ్రహాన్ని పొందితే, ఇక లోకాలు నిలపడలేవు. నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో, నీ పక్కన నేనుండగా, సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము. అంత సాదుధర్మంతో నువ్వు అన్వేషించిననాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే, ఆనాడు నువ్వు కోదండం పట్టుకొని లోకాలన్నిటిని లయం చేసెయ్యి. కాని ఈలోగా నీకు ఉపకారం తప్పక జెరిగితీరుతుంది. నీకు ఋషులు, పంచభూతాలు, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మండములలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు, ఇది సత్యం, సత్యం సత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు. నువ్వు శాంతిని పొందు ” అన్నాడు.
లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందినవాడై, రాముడు తూణీరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు.
శాంతించిన రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే ” యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? ” అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా ” నేను ఎన్నడూ అసత్యం పలకలేదు ” అన్నాడు. ” నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు ” అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.)  జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.  
అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రశిస్తున్నారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే ” అన్నాడు.
పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||
అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి ” తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము ” అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ‘ రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను’ అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.
అప్పుడు జటాయువు ” రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు ” అన్నాడు.
జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.
రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||
అప్పుడు రాముడు ” నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది.  అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! ” అన్నాడు. అలాగే ” జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు ” అన్నాడు.
అప్పుడా జటాయువు ” ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య….” అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి ” ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు…..” అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.
అప్పుడు రాముడు ” చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.
అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము ” అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).
ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి ” నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు” అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.
జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని ” నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము ” అనింది.
లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.
తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు ” అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ వంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది……..” అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది ”  నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను ” అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో ” మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము ” అన్నాడు. 
అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు ” మీరు ఇద్దరు ఎవరు? ” అని అడిగాడు.
” ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు ” అని లక్ష్మణుడు అన్నాడు.
అప్పుడా కబంధుడు ” నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి ” అన్నాడు. ” సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా ” అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడా కబంధుడు ” మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి ” అన్నాడు.
” కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు” అని రామలక్ష్మణులు అడిగారు.
అప్పుడు కబంధుడు ” పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది, అదేంటంటే, ‘ నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ‘ అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ‘ ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగె చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు’ అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ‘ మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది’ అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ‘ నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పారు.
అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ‘ ఏమి కావాలి ‘ అని అడిగారు. అప్పుడు నేను ‘ నాకు దీర్ఘాయువు కావాలి ‘ అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది, నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను.
అప్పుడు నేను ఇంద్రుడితో ‘ నువ్వు నన్ను కొట్టేశావు, బాగానేఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కాదా, మరి నేను ఏమి తిని బతకను ‘ అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.
రామ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను, ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను ” అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది)
అప్పుడు వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతొ ధనువు పైకి వచ్చి ” రామ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కాదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి, సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు, అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు, అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దెగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడం వల్ల మీరు సేద తీరుతారు. అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి, మీరు వాటిని కూడా తినండి. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి, అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.
ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామ. పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.    
ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు, దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దెగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఎనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక, అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జెరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది, దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది, అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.
ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామ, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో ” నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా ” అని అడిగాడు.
అప్పుడా శబరి ” రామ! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు ‘ మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు ‘ అని చెప్పి వెళ్ళారు. అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను ” అని చెప్పింది.
అప్పుడా రాముడు శబరితో ” నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి ” అన్నాడు.
అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి ” రామ! మా గురువుగారు ఈ అగ్నివేది దెగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ! ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన, నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి, అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.
రామ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను, నువ్వు వాటిని స్వీకరించు” అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి ” మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ” అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర క్రిష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.
ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.

కిష్కింధకాండ

కబంధుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. ఆ పంపా నదిలో అరవిసిరిన పద్మాలు, పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలని చూసి రాముడు బాధపడ్డాడు. ఆయనకి వాటిని చూడగానే సీతమ్మ ముఖము, కన్నులు గుర్తుకొచ్చి భోరున విలపించాడు. అప్పుడాయన లక్ష్మణుడితో ” చూశావ లక్ష్మణా! ఈ ప్రాంతం ఎంత బాగుందో, ఈ చెట్లకి విశేషంగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కిందకి పడుతున్నాయి, ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటూ కదులుతూ ఉన్నాయి. అలా కిందకి పడుతున్న పువ్వులని, కదులుతున్న గుత్తులని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయుదేవుడు ఎవ్వరికీ కనపడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా! అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటే, సీత నా పక్కన లేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా స్వస్థతని కోల్పోతున్నాను.
ఎవరూ అడక్కుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. అలాగే ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్లా, లేకపోతె పుష్పాలని వర్షించే మేఘాల? అని నాకు అనుమానం వస్తుంది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉంది.
మత్త కోకిల సన్నాదైః నర్తయన్ ఇవ పాదపాన్ |
శైల కందర నిష్క్రాంతః ప్రగీత ఇవ చ అనిలః ||
ఇక్కడ గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది, అలాగే ఇక్కడ కోకిల పాట పాడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, వాయువు పాట పాడుతున్నాడు, చెట్లన్నీ నాట్యం చేస్తున్నాయి, కోకిల చెట్టు మీద కూర్చొని పక్కవాయిద్యాలు కూస్తుంది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా? అనిపిస్తుంది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటె ఎంత బావుండేదో. సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది.
లక్ష్మణా! అలా చూడు, ఆ కొండ మీద మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే, ఆడ నెమలి దాని చుట్టూ పరమ సంతోషంగా ఎలా తిరుగుతుందో చూడు. అవునులే, ఎందుకు ఆడవు. ఆ మగ నెమలి భార్య అయిన ఆడ నెమలిని, ఎవరూ ఎత్తుకుపోలేదు కదా? ఎన్ని ఆటలన్నా ఆడతాయి. నా మనస్సు సీత దెగ్గర ఉంటుంది, సీత మనస్సు నా దెగ్గర ఉంటుంది. అందుకని మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనస్సు. ఆ ఒక్క మనస్సు ఆనందించాలంటే, ఒకరి పక్కన ఒకరం ఉండాలి. అలా లేకపోవడం చేత ఇవ్వాళ నా మనస్సు ఆనందపడడం లేదు. ఇది చైత్ర మాసం కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధ పడుతున్నానంటే, సీత ఇంకెంత బాధ పడుతుందో లక్ష్మణా.
పూర్వం చైత్ర మాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని, ఇవ్వాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖంగా ఉంది. ఈ అరవిసిరిన తామర పువ్వులని దెగ్గరగా చూస్తుంటే, ఆ పువ్వులలోని గాలి నా ముఖానికి తగులుతుంటే ఎలా ఉందో తెలుసా లక్ష్మణా, సీత ముఖం నా ముఖానికి దెగ్గరగా ఉన్నప్పుడు, సీత ముక్కునుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఆ తుమ్మెదలు పువ్వుల మీద వాలి, అందులోని మకరందాన్ని తాగి ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు, ఎంత అందంగా ఉంది ఆ సన్నివేశం. కాని నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. ఇలాంటప్పుడు సీత నా పక్కన ఉండి, అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ, అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటె, ఆమె నోటి వెంట వచ్చే ఆ మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది.
సీతని చూడకుండా నేను ఉండలేను, నా శరీరం పడిపోతుంది, అందుకని నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసేసుకోమను ” అని రాముడు అన్నాడు.
ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్తి ఉత్సాహాత్ పరం బలం |
సః ఉత్సాహస్య హి లోకేషు న కించిత్ అపి దుర్లభం ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! స్నేహము, ప్రేమ ఉండవలసిందే. కాని, మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్యా, నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికే వెళ్ళని, పాతాళలోకానికే వెళ్ళి దాక్కొనని, మళ్ళి తన తల్లి కడుపులోకి దూరిపోనీ, వాడిని మాత్రం వదలను, చంపితీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటె ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏది లేదు. కాని ఉత్సాహం పోతే, తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత, దుఃఖం చేత పనికిరాకుండా పోతుంది. అందుకని అన్నయ్యా ఉత్సాహాన్ని పొందు ” అని అన్నాడు.
లక్ష్మణుడి మాటలకి రాముడు సంతోషపడినవాడై ఉపశాంతిని పొందాడు. అప్పుడా రామలక్ష్మణులు ఇద్దరూ ఋష్యమూక పర్వతం వైపునకు బయలుదేరారు.
అలా వస్తున్న రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు. నార చీరలు కట్టుకొని, కోదండాలు పట్టుకుని, అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి, వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన 4 వానర మంత్రుల దెగ్గరికి వెళ్ళి ” చూశార, ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వచ్చేస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి పారిపోదాము ” అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే, చెట్లు విరిగిపోయాయి, ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి, తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. ( సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు ).
సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ |
మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||
అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో ” సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదివి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా ” అని అడిగాడు.
అప్పుడు సుగ్రీవుడు ” హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగ ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కొదండాలు ఉన్నాయి, అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దెగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతె మనం వేరె మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు ” అని సుగ్రీవుడు అన్నాడు.
కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః |
భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః ||
అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని( సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దెగ్గరికి వెళ్ళి నమస్కరించి ” మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కొదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.
నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి ” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.
రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు ” చూశావ లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావ. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దెగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణా ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకం అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు, అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము ” అన్నాడు.
ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః |
ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః ||
అప్పుడు హనుమంతుడు ” జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను ” అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.
అలా రామలక్ష్మణులని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో
అయం రామో మహాప్రాజ్ఞ సంప్రాప్తో దృఢ విక్రమః |
లక్ష్మణేన సహ భ్రాత్రా రామోయం సత్య విక్రమః ||
” సుగ్రీవా! వచ్చినటువంటివాడు మహా ప్రాజ్ఞుడైన, ధృడమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు. రాముడిని దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప, ధర్మబధమైన నడువడిలేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఈయన తన భార్య అయిన సీతమ్మతో, లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే, ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు. అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు, నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకని సుగ్రీవా, ఈయనతో స్నేహం చెయ్యవలసింది ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ! మీ దెగ్గర గొప్ప తపస్సు ఉంది, అనేకమైన గుణములు, విశేషమైన ప్రేమ ఉంది. ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నా అదృష్టం. ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైన పొందవచ్చు. అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని అనుకుంటున్నాను. రామ! నీకు తెలియని విషయం కాదు, స్నేహం చేసేటటువంటివాడికి ఒక ధర్మం ఉంది. భర్త ఎలాగైతే తన కుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాశి పట్టుకుంటాడో, అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి. అందుకని నువ్వు నాతో స్నేహమును ఇచ్చగించిన వాడివైతే, నా బాహువుని చాపుతున్నాను, నీ బాహువుని నా బాహువుతో కలుపు ” అన్నాడు.
వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలని తెచ్చి, కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు. అప్పుడు రాముడు, సుగ్రీవుడు ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి, ఇద్దరూ తమ చేతులు కలుపుకున్నారు.
అప్పుడు రాముడు ” మనిద్దరమూ స్నేహం చేసుకున్నాము కదా, ఇకనుంచి ఇద్దరి కష్టసుఖాలు ఇద్దరివీ ” అన్నాడు.
సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షము కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కుర్చోమన్నాడు. అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కుర్చోమన్నాడు. రామలక్ష్మణులిద్దరు  కూర్చున్న తరువాత సుగ్రీవుడు ” రామ! నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. దిక్కులేనివాడినై ఈ కొండమీద మీద జీవితాన్ని గడుపుతున్నాను ” అన్నాడు.
ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే |
వాలినం తం వధిష్యామి తవ భార్య అపహారిణం ||
అప్పుడు రాముడు ” ఉపకారము చేసినవాడు స్నేహితుడు కాబట్టి, నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారము చెయ్యాలి. నువ్వు బతికి ఉండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి, ఈ ఒక్కమాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపడానికి. అందుకని వాలిని చంపేస్తాను ” అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు. ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నార! అన్నట్టుగా చూసుకున్నారు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే, ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి. పద్మంలాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను, బంగారంలాంటి పచ్చటి కన్నులున్న వాలి ఎడమ కన్ను, ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరాయి.
తరువాత సుగ్రీవుడు ” కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు, నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కాని, స్వర్గలోకంలో కాని దాయని, నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను ” అన్నాడు.
సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకువచ్చి భోరున రోదించాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ శోకించకు. నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి, అందులో తన ఆభరణములను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను, అవి సీతమ్మ ఆభారణాలేమో చూడు ” అన్నాడు.
కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి, ఒక్కసారి శోకం తన్నుకొచ్చినవాడై రాముడు మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. తరువాత ఆయన తేరుకొని ఆ ఆభరణాలని చూద్దాము అంటె కళ్ళనిండా నీరు ఉండడం చేత, ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడంలేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! ఈ ఆభారణాలని ఒక్కసారి చూడు. ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు, సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడిఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూడు ” అన్నాడు.
న అహం జానామి కేయూరే న అహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్యా! ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు, ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలీదు. అన్నయ్యా! ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని, అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడి రాముడితో ” అయ్యయ్యో, అలా ఏడవకు రామ. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు, నేను నీలా ఏడుస్తున్నాన? నీలాగే నా భార్య కూడా అపహరింపబడింది. నీకు చెప్పగలిగేంత సమర్దుడిని కాదు, కాని ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో ” అన్నాడు.
వెంటనే రాముడు స్వస్థతని పొంది ” ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్య సుగ్రీవా. కాని నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు, నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కాని నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు. ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకముందెన్నడు నేను అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను ” అన్నాడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు ” నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి. నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా ” అన్నాడు.
అప్పుడు రాముడు ” అసలు ఏమి జెరిగిందో నాకు చెప్పు, నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది. నాకు అన్నీ వివరంగా చెప్పు ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు జెరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు ” అసలు నీకు, నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది. నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెపితే, నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు ” రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని.
దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కిందా ద్వారం దెగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ‘ వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ‘ అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ‘ ఎలాగు వాడు పారిపోతున్నాడు కాదా, ఇంక విడిచిపెట్టు ‘ అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను.
పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ‘ సుగ్రీవా! నువ్వు ఈ బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ‘ అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.
వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.
తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను.
ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలి బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు.
దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తో నిహతః చ త్వయా రిపుః |
అనాథస్య హి మే నాథః త్వం ఏకో అనాథ నందనః ||
అప్పుడు నేను ఆయన దెగ్గరికి వెళ్ళి నా రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి ‘ అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు ‘ అన్నాను.
అప్పుడు వాలి ‘ చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ‘ అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడాయన నన్ను చూసి ‘ నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిల ద్వారం దెగ్గర కాపలాగా ఉండు అన్నాను. కాని పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలా ద్వారాన్ని అడ్డు పెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. కాని నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను, కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ‘ అన్నడు.
అప్పుడు వాలి నన్ను కట్టుబట్టతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. కాని వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు కనుక, చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని, నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామ………….” అని సుగ్రీవుడు ఏడిచాడు.
ఈ మాటలు విన్న రాముడు ” గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, వాలిని ఇప్పుడే సంహరిస్తాను. వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు ” అన్నాడు.
సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపి చ ఉత్తరం |
క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః ||
అప్పుడు సుగ్రీవుడు ” రామ తొందరపడకు, నీకు ఒక విషయం చెబుతాను విను. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రతీరం దెగ్గర దిగుతాడు. అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రతీరం దెగ్గర దిగుతాడు. మళ్ళి అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దెగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు. దానితో పాటు నీకు ఇంకొక విషయం చెబుతాను రామ ” అని రాముడిని తీసుకువెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి, ” చూశావ ఈ పర్వతాలు. వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూశావ. వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళి ఈ అరణ్యానికి వస్తాడు. ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొడతాడు. అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు ” అని చెప్పి, రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి,
” పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దెగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ. నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి ‘ నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటె నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు ‘ అన్నాడు. అప్పుడా సముద్రుడు ‘ హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి ‘ అన్నాడు.
అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దెగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడా దుందుభి ‘ నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు ‘ అన్నాడు. అప్పుడు హిమవంతుడు ‘ నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కిందా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు ‘ అని చెప్పాడు.
అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ‘ ఛి, భార్యలతో కామం అనుభవిస్తున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు, నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు, నీతో సమానమైన వాడికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను ‘ అన్నాడు.
అప్పుడా వాలి ‘ నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోమాకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి ‘ అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. ఆ హొరాహొరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దెగ్గర పడింది. అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి ‘ ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలయ్యి మరణిస్తాడు ‘ అని చెప్పి, ‘ ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించినవాడు ఎవడైనా సరే ఇక్కడి చెట్లని పాడుచేస్తూ తిరిగితే, రేపటి తరువాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతట మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి ‘ అన్నాడు.
అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దెగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకోచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుందే పెద్ద తెల్లటి పర్వతంలాంటిది, అదే దుందుభి యొక్క కాయం. ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ! నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటె ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఒడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయనకి సంహరించాడు. నీను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామ? ” అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ” మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు ” అని అడిగాడు.
అప్పుడా సుగ్రీవుడు ” మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోని అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను ” అని లక్ష్మణుడితో అన్నాడు.
అప్పడు రాముడు ” సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను ” అన్నాడు.
రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా |
తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం ||
సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటను వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. కాని సుగ్రీవుడు ” ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము ” అన్నాడు.
అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.
రాముడి శక్తి ఏమిటో చూశిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు ” రామ! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దెగ్గరికి వెళదాము పద ” అన్నాడు.
“తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము”, అని అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.
సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం |
వృక్షైః ఆత్మానం ఆవృత్య హి అతిష్ఠన్ గహనే వనే ||
ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి ” ఏరా బుద్ధిహీనుడా మళ్ళి వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా ” అన్నాడు. అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.
సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు ” ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగాన. నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతాన. ఎందుకు కొట్టించావయ్య నన్ను ఇలాగ ” అని రాముడిని ప్రశ్నించాడు.
అప్పుడు రాముడు ” సుగ్రీవ! నేను ఇంతకముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.
గజ పుష్పీం ఇమాం ఫుల్లాం ఉత్పాట్య శుభ లక్షణాం |
కురు లక్ష్మణ కణ్ఠే అస్య సుగ్రీవస్య మహాత్మనః ||
నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు, అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవ! ఆ మాల వేసుకొని మళ్ళి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు ” అన్నాడు.
సుగ్రీవుడు సరే అని బయలుదేరాడు. ఆయన వెనకాల రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వారు బయలుదేరారు. అలా వారు వెళుతూ లోయలని, నదులని, పర్వతాలని, చెట్లని చూసుకుంటూ వెళుతున్నారు. అప్పుడు వాళ్ళకి పక్కన నుంచి అక్షర సముదాయము చేత అవ్యక్తమైనటువంటి గంధర్వ గానం ఒకటి వినపడింది. అది వింటున్నప్పుడు వాళ్ళ మనస్సులకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు రాముడు, ఈ వనం ఏమిటి? అని సుగ్రీవుడిని అడిగాడు. కాని సుగ్రీవుడు ఆగకుండా ముందుకి వెళ్ళిపోతూ ” రామ! ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వారు తలలు కిందకి పెట్టి, కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. అలా 700 సంవత్సరాలు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలిని తినేవారు. వాళ్ళ తపస్సుకి ఇందుడు ఆశ్చర్యపోయి, సశరీరంగా స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ తపోశక్తి ఇప్పటికీ ఈ వనంలో ఉంది, అందువలన క్రూరమృగం ఈ వనంలోకి వెళ్ళదు, వెళితే ఇక తిరిగిరాదు. నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడితో కలిసి రాముడు ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాడు. అలా వారు నమస్కారం చెయ్యగానే వాళ్ళ మనస్సులో గొప్ప ఉత్సాహం పుట్టింది.
వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి, కేకలు వేసి వాలిని పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపి ” ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు. నవరంధ్రములనుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు, సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళి యుద్ధానికి రమ్మంటున్నాడు, నీకు అనుమానం రావడం లేదా.
సుగ్రీవుడు మళ్ళి వచ్చి ‘ వాలి యుద్ధానికి రా ‘ అంటున్నాడంటే నాకు శంకగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనపడడం లేదా, చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనపడుతోంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా, అంగదుడి( అంగదుడు వాలి-తారలు కుమారుడు ) ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడంలేదు.
సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి, నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరమేమిటి, ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని ఆహ్వానించి యువరాజ పట్టాభిషేకం చెయ్యి, అప్పుడు నీ బలం పెరుగుతుంది. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు, రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు ” అనింది.
వాలి శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది, ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు కనుక ఇంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.
ఇద్దరూ హొరాహొరిగా యుద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సుగ్రీవుడు చెట్లని పెరికించి వాలిని తుక్కుగా కొట్టాడు. కాని వాలి మెడలో ఇంద్రుడి మాల ఉండడం వలన, మెల్లగా సుగ్రీవుడి శక్తి నశించింది, వాలి బలం పెరిగింది. సుగ్రీవుడు ఇంతకముందులా పారిపోకుండా ఈసారి రాముడి కోసం మళ్ళిమళ్ళి అన్ని వైపులా చూశాడు.
సుగ్రీవుడి శక్తి తగ్గిపోవడం గమనించిన రాముడు వెంటనే బాణాన్ని తీసి వింటినారికి తొడిగించి వెనక్కి లాగాడు. అలా లాగడం వలన ఆ వింటినారి నుండి వచ్చిన ధ్వని యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు చేసే శబ్దంలా ఉంది. ఆ శబ్దము చేత మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
రాఘవేణ మహా బాణో వాలి వక్షసి పాతితః |
రాముడి బాణం యొక్క శబ్దం వినపడి, ఆ శబ్దం ఎక్కడినుంచి వచ్చిందో అని వాలి అటువైపుకి తిరిగెలోగా ఆ బాణం అమితమైన వేగంతో వచ్చి వాలి గుండెల మీద పడింది. ఆ దెబ్బకి వాలి కిందపడిపోయాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడి మంత్రులు అక్కడికి వచ్చారు. పక్కనే చేతులు కట్టుకొని సుగ్రీవుడు నిలబడ్డాడు. అప్పుడు వాలి రాముడితో ” రామ! నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమము ఉన్నవాడివి అంటారు. నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. నా చర్మము ఒలిచి వేసుకోడానికి, మాంసము తినడానికి పనికిరావు. యుద్ధం అంటూ వస్తే బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి, కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని.
అయిదింటి మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు, క్షత్రియులు తినాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ( త్రేతా యుగంలో బ్రాహ్మణులు కూడా మాంసాన్ని తినేవారు, కలికాలంలో అది నిషిద్దము. అరణ్యకాండలో అగస్త్య మహర్షి వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులని చంపేముందు మాంసాహారాన్ని తిన్నారు). అయిదు గోళ్ళున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము మాంసాన్ని తినచ్చు, తాబేలు మాంసాన్ని తినచ్చు, కుక్కలని తరిమి చంపే ఏదుపంది మాంసాన్ని తినవచ్చు. ఇంక ఆరవదాని మాంసం తినకూడదు. ఒకవేళ అలా తిన్నా, రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినా, బ్రాహ్మణుడిని చంపినా, అలా చేసిన వారికి పాతకం చేసిన పాపం వస్తుంది. నువ్వు నన్ను చంపడానికి కారణం ఏమిటి. నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు.
ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావంట కదా, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో చెప్పి ఉంటె, పశువుని ఈడ్చుకు వచ్చినట్టు రావణుడిని మెడలో పాశం వేసి నీ కాళ్ళ ముందు పడేసేవాడిని. అటువంటిది నాకు చెప్పకుండా, నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి నువ్వు సీతని ఎలా తెచ్చుకోగలవు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు, ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా ” అని రాముడిని ప్రశ్నించి, ఇక మాట్లాడడానికి ఓపిక లేక, అలా ఉండిపోయాడు.
ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||
అప్పుడు రాముడు ” నీకు అసలు ధర్మం గురించి కాని, అర్ధం గురించి కాని, కామం గురించి కాని తెలుసా? నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నీకు ఏమి తెలుసని నామీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దెగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము.
నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం. అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే……..అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు ).
అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింప బడుతున్నవాడివి, సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇది తప్పు అని తెలిసికూడా నేను నిన్ను శిక్షించకపోతే, నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ఈ పాపం అవతలవాడు చేశాడని ప్రభువైనవాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కాని ప్రభువు అలా శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళుతుంది. అందుకే మా వంశంలో ఇంతకుపూర్వం మాంధాత అనే రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. ఇంక నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, నాతో స్నేహం చేసి ఉంటె సీతమ్మని తీసుకు వచ్చేవాడిని అన్నావు కదా, నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.
తప్పు చేసినవాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపము లేని స్థితికి వచ్చావు, నీ పాపం ఇక్కడితో పోయింది, అందుకని నువ్వు ఉత్తమలోకాలకి వెళ్ళిపోతావు.
న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||
నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు ” అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.
రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం పెట్టి ” మహానుభావ! ధర్మాత్మ! రామచంద్ర! నువ్వు చెప్పినది పరమయదార్ధము. దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలోకాని, నాయందు దోషం ఉన్నదీ అని చెప్పడంలోకాని కించిత్ సందేహం లేదు. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత, పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట, ఏమిచెయ్యాలో నిర్ణయించుకుని, నిర్ణయించుకున్నదానిని అమలుచేసి, అమలుచేసిన దానిమీద స్థిరంగా నిలబడగల వ్యక్తిత్వం ఉన్నవాడివి, అటువంటి నిన్ను చూసి పొంగిపోతున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామ ” అన్నాడు.
న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం ||
కిందపడిపోయిన వాలి అన్నాడు ” రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ ” అన్నాడు.
అప్పుడు రాముడు ” దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చుసేవాడో, నీ తరవాత సుగ్రీవుడియందు, నాయందు అలాగే ఉంటాడు. పిన తండ్రివల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోమాకు, అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను ” అన్నాడు.
అలా వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జెరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి ” మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు ” అని అడిగింది.
అప్పుడు ఆ వానరాలు ” రాముడికి, వాలికి యుద్ధం జెరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుద్ధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టేసాడు, అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో ” అన్నారు.
( ఇదే లోకం యొక్క పోకడ అంటె. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )
అప్పుడు తార ” భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు ” అని వాలి దెగ్గరికి పరిగెత్తింది.
అప్పుడా తార వాలితో ” నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లోంగావు ” అని చెప్పి, కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు.
అప్పుడు వాలి సుగ్రీవుడితో ” సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి, నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరమూ కలిసి ఏకాకాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవా. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నీకు ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవ, ఇది మాత్రం జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు, వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దెగ్గర, పిన్ని దెగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవా. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే, అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు.
నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని వెళ్ళిపోతే, ఈ శరీరం శవం అయిపోతుంది, అప్పుడీ మాల అపవిత్రం అవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో ” అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు.
అప్పుడు తార అనింది ” ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ‘ సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను ‘ అనేవాడివి. చూశావ దైవ విధి అంటె ఎలా ఉంటుందో, ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళి ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు, ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు.
పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్య సమృద్ధా అపి విధవా ఇతి ఉచ్యతే జనైః ||
మాటవినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలినైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది ” అనింది.
అప్పుడు సుగ్రీవుడు రాముడితో ” నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను, నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం, అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక, అన్నయ్య పొతే బాగుండు, పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక, అన్నయ్య అంటె ఏమిటో నాకు అర్ధం అవుతుంది రామ.
నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే, నన్ను కొట్టి, ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక, ‘ ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ‘ అని వెళ్ళిపోయేవాడు, కాని నన్ను చంపేవాడు కాదు. ఒకతల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు, కాని నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కాని జెరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామ.
పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి, దానితో నన్ను కొట్టి, ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే, ‘ ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు, పో ‘ అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడినుంచి వస్తాడు. ఇక నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు ” అన్నాడు.
సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఎడుద్దాము అంటె, రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. అప్పుడా తార భర్త యొక్క శరీరం దెగ్గర ఏడిచాక, రాముడి దెగ్గరికి వచ్చి ” రామ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో, రామ! నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతె వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో, నన్ను కూడా ఆ బాణంతో కొట్టు, నేనూ వాలి దెగ్గరికి వెళ్ళిపోతాను ” అనింది.
అప్పుడు రాముడు ” నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం, అది పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జెరగవలసిన క్రతువుని చూడండి ” అన్నాడు.
తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దెగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు ” ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేతట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి, నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు ” అని అన్నాడు.
అప్పుడు రాముడు ” 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు, మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీరందరు సంతోషంగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను ” అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు.
కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళి తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.
ఆలా సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషంగా కాలం గడపసాగాడు.
బాల ఇంద్రగోప్తా అంతర చిత్రితేన విభాతి భూమిః నవ శాద్వలేన |
గాత్ర అనుపృక్తేన శుక ప్రభేణ నారీ ఇవ లాక్ష ఉక్షిత కంబలేన ||
ఆ వర్షాకాలాన్నీ చూసి రాముడన్నాడు ” ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడడం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది. అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది. ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి. భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆకాశంలో వెళుతున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథాలలా ఉన్నాయి, మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాలలా ఉన్నాయి, ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేమి జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణా. ఎప్పుడెప్పుడు రావణాసురిడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది.
మార్గ అనుగః శైల వన అనుసారీ సంప్రస్థితో మేఘ రవం నిశమ్య | 
యుద్ధ అభికామః ప్రతినాద శంకీ మత్తో గజేంద్రః ప్రతిసంనివృత్తః ||
ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉంది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ‘ ఆహా, ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తుంది, దాని మదం అణిచేస్తాను ‘ అనుకొని, తన తొండాన్ని పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంతదూరం వెళ్ళాక మళ్ళి ఆ మేఘం శబ్దం చేసింది. ‘ ఓహొ, మేఘమా ఉరుముతున్నది. మరొక మదగజం కాదన్నమాట ‘ అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి, తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలీదు, కాని ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టాయో, ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు.
నిద్రా శనైః కేశవం అభ్యుపైతి ద్రుతం నదీ సాగరం అభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనం అభ్యుపైతి కాంతా స కామా ప్రియం అభ్యుపైతి ||
నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది, నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది, ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి, పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోంది. ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణా. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు, అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది, అప్పుడు వర్షం కురవదు. అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు ” అని రాముడు అన్నాడు.
అలా వర్షాకాలం పూర్తయిపోయింది, కార్తీక మాసం మొదలయ్యింది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి ” సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి, తగినంత సైన్యం ఉండాలి, మిత్రులయందు పరాకుగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి, ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది, ఇప్పుడు నువ్వు రాముడి దెగ్గరికి వెళ్ళాలి, కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు, ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనం చెయ్యడం మంచిది.
నువ్వు వానరాలని దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే, ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు, నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు, అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ‘ నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతని అన్వేషించి పెట్టు ‘ అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యదార్ధమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దెగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కాని నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే, ఇక ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదమే ” అన్నాడు.
హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి ” నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి, 15 రోజుల తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు ” అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్కమాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి ” పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి, నేల మీద ఉండే బురద ఇంకిపోయింది, చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు, శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడం లేదు.
లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చెయ్యడంలేదో, ఈ గుహ దెగ్గరికి ఎందుకు రావడంలేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా.
ప్రియా విహీనే దుఃఖ ఆర్తే హృత రాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||
నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపారమైన దుఖంతో ఉన్నాను, ఉన్న రాజ్యమా పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దెగ్గర ఏముంది లక్ష్మణా, గుహలో పడుకొని ఉన్నాను కదా, అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదయ్యా. నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు, ఇవ్వాళ ఆయన ఆ సంగతి మరిచిపోయాడు, నేను ఇప్పుడు అనాథని, రావణుడేమో నన్ను అవమానించాడు, దీనుడిని, ఇంటికి చాలా దూరంగా ఉన్నాను, నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను, అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడం లేదు.
ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు, ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇప్పుడు తన భార్యలతో కామ సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
అర్థినాం ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణాం |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||
ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో, వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడిపోతాడో, వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని, తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరం పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను మళ్ళి కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని, నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టు ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు, రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మరిచిపోయినట్టున్నాడు. అందుకని, లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ‘ మా అన్నగారు కోపం వచ్చి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా ‘ అని అడుగు.
న స సంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పథం అన్వగాః ||
అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ‘ వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతె నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ‘ అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణంతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు ” అని రాముడన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” ఎందుకన్నయ్యా అన్ని మాటలు, వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. అన్నయ్య! ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు, నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. ఆ అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదం తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వచేస్తోంది, అందుకని నేను ఇప్పుడే బయలుదేరిపోతాను ” అన్నాడు.
ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకోరా. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని, సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని, చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు నాన్న ” అని చెప్పాడు.
రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ‘ నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ‘ అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు. అలా ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు, అలా ఆయన కిష్కింద నగరానికి చేరుకున్నాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు, లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానర కాంతలతో విశేషమైన మధుపానం చేసి, హారములన్నీ చెదిరిపోయి, కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో ” నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ‘ రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ‘. ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి, ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు ” అన్నాడు. అప్పుడు అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనం చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు.
కాని అప్పటికే లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి ” ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు ” అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ” నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి, నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదే, వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది. స్నేహం చెయ్యడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయం చెయ్యకపోవడం నా తప్పే ” అన్నాడు.
సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో న అత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనం ||
అప్పుడు హనుమంతుడు అన్నాడు ” సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు, ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. కాని రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు, నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు, నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, కాని నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. కాబట్టి ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని, నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది, అవతలివాడి కష్టం ఎంతుంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ‘ రాముడు నన్ను ఇంతమాట అంటాడ ‘ అని వినవద్దు. ఇప్పుడు లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే, అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోమాకు ” అన్నాడు.
బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనంలో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు, సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆ ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.
అప్పుడు సుగ్రీవుడు తారతో ” తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నవో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉంది, ఆమె ఒంటిమీద గుడ్డ సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు ). నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడం కాని, స్త్రీ జోలికి వెళ్ళడం కాని ఇక్ష్వాకు వంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను ” అన్నాడు.
సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతుంది. ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది, పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి, ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.
స తాం సమీక్ష్య ఏవ హరి ఈశ పత్నీం తస్థౌ ఉదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖో ఆభూత్ మనుజేంద్ర పుత్రః స్త్రీ సన్నికర్షాత్ వినివృత్త కోపం ||
ఎప్పుడైతే తన దెగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకి దూరంగా ఉన్న లక్ష్మణుడు, యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు. అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమి వంక చూస్తూ, ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు.
అప్పుడు తార ” లక్ష్మణా! ఎందుకయ్యా అంత కోపంగా ఉన్నావు. నీకు ఇంత కోపం తెప్పించడానికి సాహసించిన వాళ్ళు ఎవరు. ఎండిపోయిన చెట్లతో కూడిన వనాన్ని దావాగ్ని దహించేస్తుంటే, దానికి ఎదురు వెళ్ళగల మొనగాడు ఎవడయ్యా ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” నీ భర్త యొక్క ప్రవర్తన ఆయన భార్యవైన నీకు తెలియడం లేదా. నీ భర్త ధర్మాన్ని పక్కన పెట్టేసి కేవలం కామమునందే కాలాన్ని గడుపుతున్నాడు. ( మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అని 4 పురుషార్ధాలు ఉంటాయి. ధర్మబద్ధమైన అర్ధము{ కష్టపడి సంపాదించినది}, ధర్మబద్ధమైన కామము{ కేవలం తన భార్య అందే కామసుఖాన్ని అనుభవించడం} వలన మోక్షం వైపు అడుగులు వేస్తాము. ధర్మాన్ని పక్కన పెట్టి మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని సుఖాలు అనుభవించినా ప్రమాదమే వస్తుంది ). మిత్రుడికి ఇచ్చిన మాట తప్పాడు. 4 నెలల సమయం గడిచిపోయింది.
న చింతయతి రాజ్యార్థం సః అస్మాన్ శోక పరాయణాన్ |
స అమాత్య పరిషత్ తారే కామం ఏవ ఉపసేవతే ||
రాజన్నవాడు అనుభవించాల్సింది కేవలం కామము ఒక్కటే కాదు. రాజు మొట్టమొదట మంత్రి పరిషత్తుతో కూడి సమాలోచన చేసి రాజ్యకార్య నిర్వహణ చెయ్యాలి. ఇవన్నీ నీ భర్త చేస్తున్నాడా?. వర్షాకాలంలో వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు సుఖములను అనుభవించి నాలుగు నెలల తరువాత స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చెయ్యమంటే, ఇచ్చిన సమయం గడిచిపోయినా ఇంకా కామసుఖాలని అనుభవిస్తూ ఉన్న సుగ్రీవుడిది దోషం కాదా?. ఇవ్వాళ నీ భర్త నిరంతర మధ్యపానం చేస్తుండడంవలన ఆయన బుద్ధియందు వైక్లవ్యం ఏర్పడింది. అందుచేత ఆ మధ్యపానమునందు రమిస్తున్న సుగ్రీవుడు పురుషార్ధములయందు చెడిపోయాడు ” అన్నాడు.
అప్పుడు తార ” నాయనా! ఇది కోపగించవలసిన కాలం కాదయ్యా. ఎవరో బయటివాళ్ళు చెడిపోతే నువ్వు కోపంతో గట్టిగా కేకలు వెయ్యచ్చు, నిగ్రహించచ్చు, చంపచ్చు. కాని ఇవ్వాళ నీ అన్నతో సమానమైన సుగ్రీవుడు కామానికి బానిస అయ్యాడు. అటువంటి సుగ్రీవుడి మీద నీకు ఇంత కోపం తగదయ్యా. ‘సుగ్రీవుడిది దోషము’ అని నువ్వు చెప్పినది పరమ యదార్ధము. నువ్వు గుణములు ఉన్నవాడివి కనుక సుగ్రీవుడిని క్షమించవయ్య. లక్ష్మణా! నువ్వు చాలా గుణాలు ఉన్నవాడివి, అందుకే నీకు ఇంత శాస్త్ర మర్యాద తెలుసు. నా భర్త చాలా అల్పమైన గుణములు ఉన్నవాడు, అందుకని కామమునకు లొంగిపోయాడు. మరి నువ్వు కోపమునకు లొంగిపోతున్నావేమయ్యా?
లక్ష్మణా! నువ్వు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు కాని, రాముడు బాణం వేస్తే ఆ ప్రభావం ఎలా వుంటుందో నాకు తెలుసు, సుగ్రీవుడు ఎంత విలువైన కాలాన్ని చేజార్చుకున్నాడో నాకు తెలుసు, దానివల్ల రాముడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఈ మూడు తప్పులు జెరిగాయి కనుక మీకు ఉపకారం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. మన్మధుడి బాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ఆ బాణాల దెబ్బకి కామానికి ఎంత తొందరగా పడిపోతారో నాకు తెలుసు. ఏ కాముని బాణాల దెబ్బకి సుగ్రీవుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు, ఆ సుగ్రీవుడు ఎవరి పొందుయందు సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. శత్రువులని చంపే ఓ లక్ష్మణా! ఇవ్వాళ సుగ్రీవుడు తన ఇంద్రియాలకి లొంగిపోయాడు. అంతేకాని ఆయనకి రాముడి మీద ఎటువంటి ద్వేషభావము లేదు, అందుకని నువ్వు ఆయనని క్షమించి తీరాలి.
మహర్షయో ధర్మ తపోభిరామాః కామా అనుకామాః ప్రతి బద్ధ మోహాః |
అయం ప్రకృత్యా చపలః కపిః తు కథం న సజ్జేత సుఖేషు రాజా ||
ఏమయ్యా లక్ష్మణా, నేను కొత్తగా చెప్పాల, నీకు తెలీదా, సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునే మహర్షులు ఇంద్రుడు పంపిన అప్సరసలని చూసి కామానికి లొంగి తమ తపస్సులను భ్రష్టు పట్టించుకున్నవారు చాలామంది ఉన్నారు. అంత గొప్ప మహర్షులే కామానికి లొంగిపోయినప్పుడు, చపలబుద్ధి కలిగిన వానరుడు కామంతో చెయ్యవలసిన పనిని కొన్ని రోజులు మరిచిపోవడం పెద్ద విషయమా. సుగ్రీవుడు ఇంతగా కామానికి లొంగిపోయినప్పటికీ కూడా, మీకు ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించాడు.
లక్ష్మణా! ఇక్కడే నిలబడి ఉన్నావు, నువ్వు అంతఃపురంలోకి రాకూడదా, నువ్వేమన్నా పరాయివాడివా. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే అంతఃపుర కాంతలు కనిపిస్తారని సందేహిస్తున్నావా. మిత్రుడైన వాడు, అన్యభావన లేకుండా మిత్రుడితో మాట్లాడేవాడు, చారిత్రం ఉన్నవాడు, నడువడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చయ్యా. ఏమి దోషంలేదు, లోపలికి రా ” అనింది.
బంగారు కన్నుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు, తన తొడ మీద రుమని కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు. తెర తీసుకొని లక్ష్మణుడు లోపలికి రాగానే సుగ్రీవుడికి తన దోషం జ్ఞాపకం వచ్చి గబ్బుక్కున ఎగిరి లక్ష్మణుడి దెగ్గర వాలి, శిరస్సు వంచి అంజలి ఘటించాడు.
కాని సుగ్రీవుడి చూడగానే లక్ష్మణుడికి కోపం వచ్చి ” సుగ్రీవా! రాజన్నవాడు ఉత్తమమైన అభిజనంతో కూడి ఉండాలి, జాలికలిగినవాడై ఉండాలి, ఇంద్రియములను గెలిచినవాడై ఉండాలి, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడై ఉండాలి, మాట తప్పనివాడై ఉండాలి. అటువంటివాడిని ఈలోకం రాజని గౌరవిస్తుంది. మిత్రుడి దెగ్గర సహాయం పొంది, ఆ మిత్రుడికి తిరిగి ఉపకారం చెయ్యనివాడిని ఈ లోకం క్రూరుడు అని పిలుస్తుంది.
శతం అశ్వ అనృతే హంతి సహస్రం తు గవ అనృతే |
ఆత్మానం స్వ జనం హంతి పురుషః పురుష అనృతే ||
ఎవడైనా గుర్రం విషయంలో అసత్యం చెబితే ( అంటె ఎవరికన్నా గుర్రం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడం), నూరు గుర్రాలని చంపిన పాపం వస్తుంది. ఆవు విషయంలో అసత్యం చెబితే, వెయ్యి ఆవుల్ని చంపిన పాపం వస్తుంది. అలాగే, ఉపకారం చేస్తానని చెప్పి ఆ మాటకి కట్టుబడనివాడు తన బందువులందరిని చంపి, వారిని తినేసి, తననితాను చంపుకున్నవాడితో సమానమవుతాడయ్య సుగ్రీవా. ఒకరిదెగ్గరికి వెళ్ళి ‘ అయ్యా మీరు నాకు ఉపకారం చెయ్యండి, నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను ‘ అని మాట పుచ్చుకొని, వారి దెగ్గరినుండి ఉపకారం పొందేసి, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, తాను ఇచ్చిన మాట మరిచిపోయినవాడిని లోకం అంతా కలిసి చంపేస్తుంది.
బ్రహ్మఘ్నే చ ఏవ సురాపే చ చౌరే భగ్న వ్రతే తథా |
నిష్కృతిర్ విహితా సద్భిః కృతఘ్నే న అస్తి నిష్కృతిః ||
బ్రహ్మహత్య చేసినవాడికి, మధ్యపానం చేసినవాడికి, దొంగతనం చేసినవాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసినవాడికి ప్రాయశ్చిత్తం ఉండచ్చు, కాని క్రుతఘ్నుడికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు రాముడికి ఉపకార్తం చేస్తానని ఒప్పుకున్నావు, కాని ప్రత్యుపకారం చెయ్యలేదు. నీ ప్రవర్తన చూసి మా అన్నయ్య నిన్ను మంచివాడు అనుకున్నాడు, కాని నువ్వు కప్పలా అరుస్తున్న పామువని మా అన్నయ్య కనిపెట్టలేకపోయాడయ్యా. నువ్వు మా అన్నయ్యకి చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. నీ మాట మీద నువ్వు నిలబడు, లేకపోతె వాలి వెళ్ళిన దారిలో వెళ్ళిపోవలసి ఉంటుంది ” అని లక్ష్మణుడు అన్నాడు.
లక్ష్మణుడు మాట్లాడుతున్నంతసేపు నక్షత్రముల మధ్యలో ఉన్న చంద్రుడిలా సుగ్రీవుడు తన భార్యల మధ్యలో చేతులుకట్టుకొని నిలబడిపోయి ఉన్నాడు.   
అప్పుడు తార ” లక్ష్మణా! నీ నోటి వెంట సుగ్రీవుడి గురించి ఇటువంటి మాటలు రాకూడదు. సుగ్రీవుడు కుటిలుడు కాదు, అసత్యవాది కాదు, ఇంద్రియనిగ్రహం లేనివాడు కాదు, శఠుడు కాదు. రాముడు చేసిన ఉపకారాన్ని సుగ్రీవుడు ఎన్నడూ మరిచిపోలేదు. రాముడు చేసిన ఉపకారం వల్లనే సుగ్రీవుడు ఈనాడు ఇంత గొప్ప రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రుమని, నన్ను పొందగలిగాడు. చాలా కాలం సుఖాలకి దూరంగా ఉండడం వలన సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడు. ఏమయ్యా, నా భర్తేన అలా మరిచిపోయినవాడు? విశ్వామిత్రుడంతటివాడు కూడా కామానికి లొంగి సమయాన్ని మరిచిపోయాడు కదా. ఏ రుమయందు, ఏ రాజ్యమునందు, నా యందు ఆనందముతో సుగ్రీవుడు ఈనాడు సమయాన్ని మరిచిపోయాడో, అదే సుగ్రీవుడు రామకార్యం కోసం అవసరమైతే నన్ను, రుమని, రాజ్యాన్ని వదిలేస్తాడు. రావణుడు యుద్ధంలో నిహతుడవుతాడు. చంద్రుడితో రోహిణి కలిసినట్టు, కొద్దికాలంలోనే సీతమ్మ రాముడితో కలవడం సుగ్రీవుడు చూస్తాడు.
శత కోటి సహస్రాణి లంకాయాం కిల రక్షసాం |
అయుతాని చ షట్ త్రింశత్ సహస్రాణి శతాని చ ||
నాయనా! లంకలో నూరు వేల కోట్ల రాక్షసులు(1 ట్రిలియన్), మరియు 36 వేల సంఖ్యలో( ఒక్కొక్క సంఖ్యలో 100 మంది సైనికులు) బలగాలు ఉన్నాయి. వాలి బతికి ఉన్నప్పుడు ఈ విషయాలని నాకు చెప్పాడు, కాని నాకు పూర్తిగా తెలియదు. అంతమంది రాక్షసులని మట్టుపెట్టడానికి మనకి కూడా కొన్ని కోట్ల కోట్ల వానర సైన్యం అవసరముంది. అందుకని సుగ్రీవుడు వానర సైన్యం కోసం కబురుపెట్టాడు. నువ్వు పద్దాక బాణ ప్రయోగం చేస్తాను అంటుంటే, ఆనాడు రాముడి బాణానికి వాలి పడిపోయిన సంఘటన గుర్తుకువచ్చి ఇక్కడున్నటువంటి స్త్రీలందరూ భయపడుతున్నారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ కోపాన్ని విడిచిపెట్టు ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు ” అమ్మా! నువ్వు చెప్పిన మాట యదార్ధమే, నేను అంగీకరిస్తున్నాను. ఇక నేను కోపంగా మాట్లాడను, నేను ప్రసన్నుడను అయ్యాను ” అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో తన మెడలో ఉన్న పుష్పహారాలని పీకేసి ” లక్ష్మణా! నేను రాజ్యాన్ని, భార్యని పోగొట్టుకున్నాను. మళ్ళి రాముడి అనుగ్రహంతో వాటిని పొందాను. కేవలం తన చూపు చేత, బాణ ప్రయోగం చేత రాముడు లంకని కాల్చేయగలడు, అటువంటి రాముడికి సహాయం చెయ్యడానికి నేను ఎంతటి వాడిని. ‘ నా రాముడే కదా ‘ అని ప్రేమ చేత కాలాన్ని మరిచిపోయానో, లేకపోతె ‘ వానర సైన్యానికి కబురు పంపించాను కదా ‘ అన్న విశ్వాసంతో మరిచిపోయానో, నేను కాలాన్ని మరిచిపోయిన మాట యదార్ధమే లక్ష్మణా. ప్రపంచంలో పొరపాటు చెయ్యనివాడు అంటూ ఉండడు కదా, అందుకని నన్ను క్షమించు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” నువ్వు మా అన్నయ్యకి నాథుడిగా ఉన్నావు. నీవంటి వాడి నీడలో ఉన్న రాముడి పని జెరిగి తీరుతుంది. అపారమైన శక్తి ఉండికూడా, తిరగబడకుండా, తప్పు జెరిగితే ఇలా చేతులు కట్టుకొని క్షమించమని అడగగలిగే ధార్మికమైన బుద్ధి మా అన్న రాముడి దెగ్గర ఉంది, సుగ్రీవ నీ దెగ్గర ఉంది. ఆ ప్రస్రవణ పర్వత గుహలో బాధపడుతున్న నీ స్నేహితుడిని ఓదార్చు. మా అన్నయ్య బాధాపడుతున్నాడన్న బాధతో కోపానికి లొంగి నిన్ను అనకూడని మాటలు ఏమైనా నేను అని ఉంటె, సుగ్రీవా! నన్ను క్షమించు ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి ” ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్న వానరాలు ఇక్కడికి రావాలని చెప్పాను. వాళ్ళని కేవలం 10 రోజులలో రమ్మని చెప్పండి. మలయ, హిమాలయ, మహేంద్ర, వింధ్య మొదలైన పర్వతాల మీద ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చెయ్యాలి. కాటుక రంగులో ఉన్నవారు, బంగారు రంగులో ఉన్నవారు, వెయ్యి ఏనుగుల బలం కలిగినవారు, పది ఏనుగుల బలం కలిగినవారు, నీటిమీద నడిచేవారు, నీళ్ళల్లో ఉండేవారు, పర్వతాల మీద ఉండేవారు, చెట్ల మీద ఉండేవారు మొదలైన వానరాలన్నిటికి కబురు చెయ్యండి ” అని చెప్పాడు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం మంత్రులు మొదలైనవారు వానరాలని తీసుకురావడానికి వెళ్ళారు. అలా వెళ్ళినవారు అన్ని ప్రాంతాలలోని వానరాలని కూడగట్టుకొని కిష్కిందకి పయనమయ్యారు.  
తరువాత సుగ్రీవుడు పల్లకిలో తనతోపాటు లక్ష్మణుడిని ఎక్కించుకొని ప్రస్రవణ పర్వతానికి చేరుకున్నాడు. ఇంతకాలానికి ప్రభువు బయటకి వచ్చాడని అక్కడున్న వానరాలు కూడా బయటకి వచ్చాయి. అప్పుడాయన రాముడి దెగ్గరికి వెళ్ళి, తన శిరస్సు రాముడి పాదాలకి తగిలేటట్టు పాదాభివందనం చేశాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడిని కౌగలించుకొని ” ధర్మము, అర్థము, కామము వీటికోసం కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరిదైనా ప్రాజ్ఞత ఉందయ్యా. కేవలం కామమునందే జీవితాన్ని నిక్షిప్తం చేసుకున్నవాడు, చెట్టు చివ్వరి కొమ్మమీద నిద్రపోతున్నవాడితో సమానం ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” రామ! నువ్వు ఇచ్చినదే ఈ రాజ్యం, ఈ భార్య, కాని నేను కృతఘ్నుడను కానయ్యా. కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు మొదలైనవి వచ్చేస్తున్నాయి. వీటన్నిటితో ఏ కార్యము చెయ్యాలో నన్ను శాసించు ” అన్నాడు.
రాముడన్నాడు ” నీవంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం సుగ్రీవ. సీత ఈ భూమండలం మీద ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా, ప్రాణములు తీయబడినదా. అసలు ఏ పరిస్థితులలో ఉన్నదో అన్న జాడ ముందు కనిపెట్టాలి. అందుకోసం వానరాలని అన్నిదిక్కులకి పంపించి అన్వేషణ జెరిగేటట్టు చూడు ” అన్నాడు.
ఇంతలో అక్కడికి కోట్ల కోట్ల వానరములు వచ్చాయి. అవి రావడం వలన ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. అంతా గోలగోలగా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారు, కొంతమంది చెట్లమీద ఉన్నారు, కొంతమంది నీళల్లో ఉన్నారు, కొంతమంది పర్వతాలమీద ఉన్నారు.
అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు అందరినీ సరిగ్గా నిలబడమన్నాడు. అప్పుడా వానరాలు తమని ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళ దెగ్గరికి వెళ్ళి నిలబడ్డాయి. ” ఎవరు ఎంతమందిని తెచ్చారో నాకు చెప్పండి ” అని సుగ్రీవుడు ఆదేశించాడు.
అప్పుడు వాళ్ళు అన్నారు ” సూర్యాస్తమయ పర్వతం నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి, శతబలి అనే వానరుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు. సుషేణుడు లెక్కపెట్టలేనన్ని వానరాలతో వచ్చాడు. రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరాలతో వచ్చాడు. హనుమంతుడి తండ్రి అయిన కేసరి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతో వచ్చాడు. ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతో వచ్చాడు, పనసుడు 3 కోట్ల వానరాలతో వచ్చాడు, నీలుడు 10 కోట్ల నల్లటి దేహం కలిగిన వానరాలతో వచ్చాడు, గవయుడు 5 కోట్ల వానరాలతో వచ్చాడు, దరీముఖుడు 1000 కోట్ల వానరాలతో వచ్చాడు, మైంద-ద్వివిదులు అశ్విని దేవతల్లా 1000 కోట్ల వానరాలని తెచ్చారు, గజుడు 3 కోట్ల వానరాలని తెచ్చాడు, జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలని తెచ్చాడు, రుమణుడు 100 కోట్ల వానరాలని తెచ్చాడు, గంధమాదనుడు 10 వేల కోట్ల వానరములతో వచ్చాడు, ఆయన వెనకాల లక్ష కోట్ల వానరాలు వస్తున్నాయి, అంగదుడు 1000 పద్మ వానరాలని, 100 శంకు వానరాలని తీసుకొచ్చాడు, తారుడు 5 కోట్ల వానరాలని తీసుకొచ్చాడు, ఇంద్రజానువు 11 కోట్ల వానరాలని తెచ్చాడు, రంభుడు 1100 ఆయుత వానరాలని తెచ్చాడు, దుర్ముఖుడు 2 కోట్ల వానరాలని తెచ్చాడు, హనుమంతుడు కైలాశ శిఖరాల్లా ఎత్తుగావున్న 1000 కోట్ల వానరాలని తెచ్చాడు, నలుడు 100 కోట్ల 1000 మంది 100 వానరాలతో వచ్చాడు, దధిముఖుడు 10 కోట్ల వానరాలతో వచ్చాడు.
10,000 కోట్లయితే ఒక ఆయుతం, లక్ష కోట్లయితే ఒక సంకువు, 1000 సంకువులయితే ఒక అద్భుదం, 10 అద్భుదములయితే ఒక మధ్యం, 10 మధ్యములయితే ఒక అంత్యం, 20 అంత్యములయితే ఒక సముద్రం, 30 సముద్రములయితే ఒక పరార్థం, అలాంటి పరార్థాలు కొన్ని వేలు ఉన్నాయి ఇక్కడ ” అని అన్నారు.
అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి ” వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి.
కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది, అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు.
దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూప శిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు, ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు ” నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలలో వెతకండి, తరవాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.
నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత |
తథైవ ఆంధ్రాన్ చ పుణ్డ్రాన్ చ చోలాన్ పాణ్డ్యాన్ కేరలాన్ ||
విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుణ్డ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి ” అన్నాడు.
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి  ” మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.
అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి ” అన్నాడు.
తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి ” శతబలి! నువ్వు లక్ష వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోగానాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి, ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్దపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది.
భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః |
బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః ||
అక్కడ శంకరుడు11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి ” అని చెప్పాడు.
తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో ” హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీమీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి ” అన్నాడు.
ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో ” నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది ” అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.
అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ ” బయలుదేరండి ” అని ఆదేశించాడు.
అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు ‘ ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను ‘ అని అంటున్నాడు. మరొకడు ‘ నేను భూమిని చీల్చేస్తానురా ‘ అని అంటున్నాడు. ఇంకొకడు ‘ నేను సముద్రాల్ని కలిపెస్తాను ‘ అని, మరొకడు ‘ నేను పర్వతాలని కుదిపెస్తాను ‘ అని అంటున్నాడు. ‘ నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా ‘ అని ఒకడు అంటున్నాడు. ‘ మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పదితలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను ‘ అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.
అప్పుడు రాముడు సుగ్రీవుడితో ” ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్య సుగ్రీవా? ” అన్నాడు.
సుగ్రీవుడు అన్నాడు ” నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నావెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నాను ” అన్నాడు.
అలా వానరాలన్నీ నాలుగు దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.
దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.
వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.
అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.
తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.
అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి ” మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది ” అన్నారు.
అప్పుడా స్త్రీ ” పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు, సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి ” అనింది.
అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో ” దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా ” అని అడిగాడు.
అప్పుడా స్వయంప్రభ ” ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి ” అనింది.
అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ ” మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు ” అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ( ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.)
అప్పుడు అంగదుడు ” మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని{గడ్డిని} దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను ” అన్నాడు.
అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి.
అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు ” అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు ” అన్నాడు.
స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||
సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో ” నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో.
ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము ” అన్నాడు.
అప్పుడు అంగదుడు ” ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి ” అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు.
అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.
సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||
వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి ‘ ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు ‘ అని ఆ పక్షి అనుకుంది.
ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది ” నా మనస్సు కంపించిపోయేటట్టుగా, నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా ” అనింది.
కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు ” అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనన్ని తినేస్తుంది ” అన్నారు.
వాళ్ళల్లో ఒకడు అన్నాడు ” అది మనన్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి ” అన్నాడు.
అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన ” అసలు మా జటాయువు ఏమయ్యాడు? ” అని అడిగాడు.
అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి ‘ నువ్వు ఎవరు? ‘ అని ఆ పక్షిని ప్రశ్నించాడు.
అప్పుడా పక్షి ” సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను ” అన్నాడు.
సంపాతి కోరిక మేరకు వాళ్ళు  ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు.
మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో ” జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా ” అని అడిగారు.
నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||
అప్పుడా సంపాతి ” రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై,  పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది.
అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.
తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః |
 మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం ||
గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చుసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ‘ నాన్నగారు! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హ రామ, హ లక్ష్మణా అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దెగ్గరికి వచ్చి నమస్కరించి ‘ మహానుభావ! నాకు దారి విడిచిపెట్టవయ్య ‘ అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతు సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దెగ్గరికి వచ్చి ‘ అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి ‘ అని చెప్పి వెళ్ళారు.
ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.
నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి ‘ నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి ‘ అని అడిగారు. అప్పుడు నేను జెరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు ‘ సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జెరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.
నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు ‘ అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.
తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||
సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ” ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు ” అని అడిగారు. 
అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిదుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు ” నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను ” అన్నాడు.
అప్పుడు అంగదుడు అన్నాడు ” నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు ” అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి ” అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి ” ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ‘ ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు ‘ అనింది. అప్పుడా వాయువు అన్నాడు ‘ అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు ‘ అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.
నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని ” హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు ” అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.
నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు ” అని జాంబవంతుడు అన్నాడు.
జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.
అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి ” నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దెగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుగ్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను ” అన్నాడు.
అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు “
మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావ అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము ” అన్నారు.
హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు.

సుందరకాండ

సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు.
రాముడు సుందరాతి సుందరుడు, సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు, ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్యరాశి హనుమంతుడు, ఆ అశోకవనము అంతా సౌందర్యము, లంకా పట్టణం సౌందర్యము, మంత్ర్రం సౌందర్యం. మరి ఈ సుందరకాండలో సుందరం కానిది ఏముంది?
సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.
తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ |
ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి ||
రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.
హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.
ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ |
తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం ||
అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ” ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ” అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.
అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి ” రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతె అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను ” అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.
హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి ” ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడ? ” అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.
హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి ” సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం ” అని అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి ” నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు ” అన్నాడు.
అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు ” ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు ” అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.
అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి ” అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ‘ పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ‘ అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో ” అన్నాడు.
అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని ” నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి ” ఓహొ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా ” అన్నాడు.
అప్పుడు మైనాకుడు ” ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను ” అనుకున్నాడు.
అప్పుడు ఇంద్రుడు అన్నాడు ” నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను ” అని అభయమిచ్చాడు.
అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) ” చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి ” అన్నారు.
అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో ” నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు ” అనింది.
అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి ” నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను ” అన్నాడు.
అప్పుడా సురస ” అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే ” అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి ” అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను ” అన్నాడు.
” ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక ” అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.
అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.
అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.
ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి ” రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను ” అన్నాడు.
ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు.
ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే ” నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు? ” అని అడిగింది.
హనుమంతుడు అన్నాడు ” ఓ వికృతమైన కన్నులున్నదాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు ” అన్నాడు.
అప్పుడు ఆవిడ అనింది ” నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు ” అనింది.
” సరే ఇంతకీ నువ్వు ఎవరు? ” అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు.
అప్పుడామె ” నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను ” అని చెప్పి చట్టుకున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.
ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.
అప్పుడామె అనింది ” నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ‘ ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది ‘ అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు ” అని రాజద్వారం తెరిచింది.
అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం సోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.
ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు, కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు, కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు, తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.
అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే, ప్రహస్త, కుంభకర్ణ, మహొదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రస్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాళ, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుకనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్ణ, దంష్ట్ర, రోమస.
హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు, ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.
ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు ” మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది ” అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దెగ్గరికి వెళ్ళాడు.
అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.
‘ ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను ‘ అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ” ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి ” అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.
అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. ( పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి, అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది.
అప్పుడు హనుమంతుడు ” మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది ” అనుకుంటూ, పుష్పక విమానం నుంచి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.
రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితొ కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగె నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.
అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.
రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దెగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో(సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి, అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు, ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద, పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి, ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి. 
తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది, ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది, ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.
రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ‘ ఈవిడే సీతమ్మ ‘ అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన అనుకున్నారు ” మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు ” అనుకొని ముందుకి సాగిపోయాడు.
అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళి పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు ” ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను ” అని బాధ పడ్డాడు.
కాని వెంటనే ” ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను ” అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.
అప్పుడాయన అనుకున్నాడు ” ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసునందు ఎటువంటి వికారము కలగలేదు, నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను ” అని హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, ” నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను ‘ సీతమ్మ దర్శనం చేశావా? ‘ అని అడుగుతారు. ‘ నాకు సీతమ్మ జాడ తెలియలేదు ‘ అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, తరవాత అయోధ్యలొ అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతె ఎంత.
బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు, కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతె రాక్షసులు సీతమ్మని తినేసుంటారు, కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దెగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను ” అనుకున్నాడు.
కాని ఆయన వెంటనే ” ఛి! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. మళ్ళి ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను ” అనుకొని,
నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, |
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||
(దీనిని రామాయణానికి ప్రార్ధనా శ్లోకంగా చెబుతారు)
” లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు కాటాక్షించెదరుగాక ” అని నమస్కారం చేశాడు. 
అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి విడవబడిన బాణంలా ముందుకి వెళ్ళి అశోకవనంలో దిగారు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీదనుంచి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన క్రుతికమైన ఒక కొండ, ఆ కొండ మీదనుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి.
అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మంటపం, దాని మీదకి శింశుపా వృక్షం ఉంది. అప్పుడాయన ఆ శింశుపా వృక్షం మీదకి దూకి, ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకి చూస్తే, చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రి పట్టుపుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నులనిండా నీరు ఉన్న, మళ్ళి మళ్ళి వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలలా, నలిగిన పసుపచ్చ బట్ట కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.
అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనందబాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ అంగ ప్రత్యంగములయందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు ( సీతమ్మని చూడడం అంటె ప్రకృతిని చూడడం, ఆ ప్రకృతియందు పురుషుడిని{రాముడిని} చూడడం, అంటె హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు).
సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు ” మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటె, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు, కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దెగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దెగ్గర ఉంది, అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు. మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి కన్నులతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే,
యది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమః|
ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు, ఈ కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు.
ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు, వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మ. నీకు నీ అమ్మ(భూదేవి) పోలిక వచ్చిందమ్మా, అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టుకింద కూర్చున్నావ అమ్మ. శీలం, వయస్సు, నడువడి, వంశాలు, శరీరాలు అనే ఈ అయిదు లక్షణాలలో(వివాహం చేసేముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి, మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. కాని రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి ” అని అనుకున్నాడు.
హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది , కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు.
అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దెగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు.
రావణుడు సీతమ్మతో ” సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదాన! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి.
ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు ” అన్నాడు.
రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి ” రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటె ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. ‘ నేను సీతని తీసుకొచ్చాను ‘ అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.
ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? ” అని ప్రశ్నించింది.
ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి ” ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటె ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు ” అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి ” ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు సీతని దండించండి ” అన్నాడు.
( ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నాకూడా, ఆ భార్యయందు మనస్సు ఉంచకుండా పరస్త్రీయందు మనస్సు ఉంచుకొని, పరస్త్రితో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటె, 6 నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి ‘ నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి, అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా ‘ అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.)
అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకొని ” నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము. మనము క్రీడిద్దాము పద ” అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.
అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి ” సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటె సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు, బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు, ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం. పోనిలె మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలం చూశాము, కాని మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి, ఎంత చెప్పాలి నీకు ” అని గద్దించారు.
అప్పుడు సీతమ్మ అనింది ” ఐశ్వర్యం ఉంటె భర్తగా చూడడం, రాజ్యం ఉంటె భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటె భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, కాని నా భర్త నాకు గురువు, సమస్తం. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి, నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి, నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు, నేను వినకూడదు ” అనింది.
అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి ” ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను ” అనింది.
ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అనింది ” నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కాని హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను, ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది ” అనింది.
అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు.
తరువాత అజముఖి అనే స్త్రీ అనింది ” ఈమెని అందరమూ సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము” అనింది.
అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ” ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేఛ్చ లేదు ” అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోట నుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది.
ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి ” ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దెగ్గరికి వెళ్ళింది, ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.
పాల సముద్రం మధ్యలో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు, ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనపడలేదు, ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.
ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుడిని బయటకి లాగింది. అప్పుడామె రావణుడిని పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు.
ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణంలోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ‘ ఓ తల్లి!, ఓ అక్క!, ఓ తండ్రి!, ఓ చెల్లి! ‘ అనే కేకలు వినపడ్డాయి, లంకంతా బూడిదయిపోయింది.
నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది, కట్టుకున్న పట్టు పుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తోంది, పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్తు సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కాని ప్రస్ఫుటంగా సుభశకునములు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటె, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటె, మీ మీదకి రామ బాణాలు పడకుండా ఉండాలంటె ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది ” అని త్రిజట చెప్పింది.
ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు.
అప్పుడు సీతమ్మ ” నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక, నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి ” అని, ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు అందుకనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని ‘ కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మొహపెట్టింది, నేను అల్ప భాగ్యం ఉన్నదానిని అందుకనే ఆ మృగాన్ని చూసి మొహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటె అన్నీ ఉండేవి, రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి. రాముడి తరవాత పుట్టిన వాడిని వదిలాను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు. రామా! రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభాపెట్టాలని చూశాడు, కాని నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను, భూమిమీద పడుకున్నాను, ఉపవాసాలు చేశాను, ధర్మాన్ని పాటించాను, ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహం కలుగుతుందని అనుకున్నాను. కాని నువ్వు రాలేదు, నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమయ్యింది. కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో, అలా నేను చేసిన ఉపాసన, నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు, విషం తాగి చనిపోదామంటే విషం ఇచ్చే వాళ్ళు లేరు ‘ అనుకొని, తన కేశపాశములని(జుట్టుని) చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది.
సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చాప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది, అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది. 
అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు ‘ ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతె, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జెరుగుతుంది. జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.
ఇప్పుడు నేను వానర బాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధం కాదు. మనుష్య బాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య బాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయె అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఒదార్చాలి? ” అని అనుకుంటూ, ” సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను ” అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు.
” పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని, ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేసపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను ” అని చెప్పి ఆగిపోయాడు.
ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దెగ్గర దెగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దెగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.
తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) ” లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి ” అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ‘ అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ‘ అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి  హనుమంతుడు అక్కడే ఉన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది ” ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక ” అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది.
అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి ” అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా ” అన్నాడు.
సీతమ్మ అనింది ” ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా. నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి, కనుక నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా? ” అన్నాడు.
సీతమ్మ ” ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని, నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కాని 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు ” అనింది.
‘ సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది ‘ అని హనుమంతుడు అనుకొని ఆమె దెగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళి మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని అనింది ” నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళి రూపం మార్చుకొని వచ్చావు ” అనింది.
కాని సీతమ్మ మనస్సులో ‘ ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులోనుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటివాడు కాదు అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యం కలుగుతుంది ‘ అని అనుకొని, ” నాయనా! నువ్వు ఎవరివో యదార్ధంగా నాకు చెప్పు ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, ఆ తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసినతరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది ” నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? ” అనింది.
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||
హనుమంతుడు అన్నాడు ” రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.
రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః|
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||
రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి.
తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః ||
తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు ” అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 inches(8 feet) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)
అలానే ” అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటె. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.
వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః|
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం||
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా|
సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||
( ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)
అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు ” అన్నాడు.
హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ ” నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా ” అని పలు ప్రశ్నలు అగిగాక, ” రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలొ అలా ప్రవర్తించడంలొ వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడ, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నాన, నన్ను తలుచుకుంటున్నాడ. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు ” అనింది.
సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని ” ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతొ ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటె, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ‘ హ సీత, హ సీత’ అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాధ్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దెగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దెగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడ ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడొ, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దెగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో ” అన్నాడు.
కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి ” ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోన, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా ” అనింది.
సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖంలాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు.
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ  ఆశ్చర్యపోయి ” నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి ” ఆనింది.
అప్పుడు హనుమంతుడు ” ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా ‘ నేను రాను ‘ అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దెగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది ” ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దెగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జెరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ‘ సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ ‘ అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చేసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ‘ ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ‘ అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది.
అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి(మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలె అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దెగ్గరికి వెళ్ళింది, కాని అందరూ ‘ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో ‘ అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).
రాముడు ఆ కాకిని చూసి ‘ నా దెగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు ‘ అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు.
అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు ” అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.
తరువాత సీతమ్మ అనింది ” శత్రువులను సంహరించగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జెరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటె లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము ” అనింది.
హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది.
మళ్ళి సీతమ్మ అనింది ” ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” నేను బయలుదేరతాను ” అంటె, ” నాయన! 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటె నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళి ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా ” అని, ఇంటినుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.
అప్పుడు హనుమంతుడు అన్నాడు ” అమ్మ! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళి శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమ! నువ్వు వస్తావు, గరుగ్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు, మరి రావణ సంహారం ఎలా జెరుగుతుంది? ” అనింది.
మత్‌ విశిష్టాహ్‌ చ తుల్యాహ్‌ చ సంతి తత్ర వన ఒకసహ్‌ |
మత్తహ్‌ ప్రత్యవరహ్‌ కశ్చిన్‌ న అస్తి సుగ్రీవ సన్నిధౌ ||
హనుమంతుడు అన్నాడు ” సుగ్రీవుడి దెగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, కాని నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దెగ్గర లేడమ్మా. (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్సనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి, రావణుడిని సంహరిస్తాము ” అన్నాడు.
హనుమంతుడు సీతమ్మ దెగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి ” లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో. కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదా వనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు ” అని అనుకొని, భీమరూపుడై ఆ అశోక వనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరారలోని నీళ్ళని బయటకి తోసేశాడు.
అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు.
అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దెగ్గరికి వచ్చి ” ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం చూశాము. ఆ కోతి నీ దెగ్గరికి వచ్చి కిచకిచలాడినట్టు మాకు అనుమానం, ఆ కోతి ఎవరు? ” అని అడిగారు.
అప్పుడు సీతమ్మ అనింది ” పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఆయన రాక్షసుడో, వేరొకడో తెలుసుకునే శక్తి నాకెక్కడ ఉంది. ఆయనెవరో మీకే తెలియాలి, నాకు తెలియదు ” అనింది.
అప్పుడా రాక్షస స్త్రీలు పరుగు పరుగున రావణుడి దెగ్గరికి వెళ్ళి ” ఎక్కడనుంచి వచ్చిందో కాని మహా వానరము ఒకటి వచ్చింది. అది ఇంద్రుడి దూతో, కుబేరుడి దూతో, విష్ణువు దూతో, యముడి దూతో మాకు తెలీదు. అది అశోక వనం అంతటినీ నాశనం చేసింది, కాని సీత కూర్చున్న శింశుపా వృక్షాన్ని మాత్రం అది వదిలిపెట్టేసింది. అలసట చేత వదిలిపెట్టిందో, కావాలని వదిలిపెట్టిందో తెలీదు. అలసట అని అనుకోడానికి వీలులేదు, ఎందుకంటే ఇంత అశోక వనాన్ని నాశనం చేసిన వానరానికి శింశుపా వృక్షాన్ని నాశనం చెయ్యడం పెద్ద లెక్కా, అది కావాలనే వదిలిపెట్టింది. నువ్వు ఏ కాంత మీదైతే నీ మనస్సుని, కామాన్ని ఉంచావొ, ఆ సీతతో ఈ వానరం మాట్లాడింది ” అని చెప్పారు.
అప్పుడు రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి 80,000 రాక్షస కింకరులని పిలిచి ” మీరందరూ వెళ్ళి ఆ మహా వానరాన్ని పట్టి బంధించండి, లేకపోతె సంహరించండి ” అని చెప్పి పంపించాడు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||
(ఈ శ్లోకాలని జయ మంత్రము అంటారు)
ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకాలని చెప్పాడు ” రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు ” అని జయ మంత్రాన్ని చెప్పాడు.
అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మళ్ళి ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు.
అప్పుడాయన ” మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు ” అని చెప్పి మళ్ళి తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.
80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళి ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళి ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.
” జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు ” అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు తన 7 మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది.
వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది, అప్పుడాయన 5 సేనాగ్ర నాయకులని పిలిచి ” మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది ” అన్నాడు. విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే 5 సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.
ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే ‘ ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము ‘ అని హనుమంతుడు అనుకున్నాడు. అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు హనుమంతుడు ‘ దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటె ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే ‘ అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దద్ది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి.
తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటె ఏంటో, భయం అంటె ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి ” నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడంలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకొ, అవకాశం దొరికితే వాడిని సంహరించు ” అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.
ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి, అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం( ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ‘ ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను ‘ అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. అప్పుడు హనుమంతుడు ‘ ఇలా ఈ రాక్షసులని ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను ‘ అనుకొని అలా ఉండిపోయాడు.
కాని ఇంద్రజిత్ అనుకున్నాడు ‘ ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళి సూర్యోదయం అయ్యేవరకు పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటె ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు ” అని అనుకొని సంతోషపడ్డాడు.
వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దెగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు. రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి ” ఎక్కడినుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి ” అన్నాడు.
అప్పుడు ప్రహస్తుడు లేచి ” నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడ? యముడు పంపించాడ? కుబేరుడు పంపించాడ? విష్ణువు పంపించాడ? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు? ” అని ప్రశ్నించాడు.
అప్పుడు హనుమ రావణుడి వంక చూసి ” ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దెగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతె వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా ” అన్నాడు.
హనుమని చూసిన రావణుడు భయపడి ‘ ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాశ పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ‘ వానరులు నా కొంప ముంచుతాయని ‘. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో ‘ అనుకొన్నాడు.
అప్పుడు హనుమంతుడు అన్నాడు ” నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైనవాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావ బాగుపడతావు, లేకపోతె నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు.
పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలొ పెట్టావు, సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము, నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు ‘ నర వానరములతో తప్ప ‘ అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు, వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దెగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు, అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు.
ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటె, శివుడు తన కాలి బొటను వేలితొ ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా. అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు ” అన్నాడు.
ఒక నిండు సభలొ తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి ” ఈ వానరాన్ని చంపెయ్యండి ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు లేచి ” అన్నయ్య! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసెయ్యడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని చంపద్దు ” అన్నాడు.
విభీషణుడి మాటలు విన్న రావణుడు ” వానరాలకి తమ తోక అంటె చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దెగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి ‘ తోకలేని కోతి, తోకలేని కోతి ‘ అని ఏడిపిస్తారు ” అన్నాడు.
అప్పుడు వాళ్ళు పాట బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ ‘ గూఢచారి, గూఢచారి ‘ అని ప్రకటించారు. ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు. 
అప్పుడు హనుమంతుడు ‘ వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను ‘ అనుకున్నాడు. వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు.
అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు ” అన్నారు.
సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి ” నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక ” అనింది.
వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ‘ అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు ‘ అని అనుకుని, ‘ ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను ‘ అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతుంది. ఆ లంకలో అందరూ ” హా తాత, హా పుత్ర, హా తల్లి ” అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.
అప్పుడాయన ” అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదొ, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుంద. సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుంద ” అని అనుకున్నాడు.
ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దెగ్గరగా ఆకాశంలొ ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) ” ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జెరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జెరగలేదు ” అన్నారు.
అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి ” అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతె వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జెరుగుతుంది, శోకమునకు గురికాకు ” అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.
ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడ, అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దెగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ‘ ఆకాశం బద్దలయ్యిందా ‘ అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దెగ్గరికి వచ్చి ” తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది, అది హనుమదేనా? ” అన్నారు.
జాంబవంతుడు అన్నాడు ” అది కచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు ” అన్నాడు.
హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు, అప్పుడు హనుమంతుడు ” చూడబడెను సీతమ్మ ” అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి, ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. ” నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశక్తి ఉందో, సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. కాని సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు, రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే ” అన్నాడు.
అప్పుడు అంగదుడు ” అంతా తెలిసిపోయింది కదా, ఇంక రాముడికి చెప్పడం ఎందుకు. ఇలాగె వెళ్ళిపోయి ఆ రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు ” తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి రాముడు ఎలా చెబితే అలా చేద్దాము ” అన్నాడు.
అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరములన్నీ అంగదుడి దెగ్గరికి వెళ్ళి ” ఆ మధువనంలోని మధువుని తాగుదాము ” అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తెనేపట్లు పిండేసుకుని తేనె తాగేశారు, అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు, అక్కడున్న చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి, కొంతమంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు, పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు, కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు.
ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి జెరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది(వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటె తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా ” అసలు ఏమయ్యింది ” అన్నాడు.
” ఏమిలేదయ్య, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనం చేశాయంట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు ” అని లక్ష్మణుడితో అని, ” వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను ” అని సుగ్రీవుడు దదిముఖుడితో అన్నాడు.
దదిముఖుడు ఆ వానరాలకి ” సుగ్రీవుడు రమ్మంటున్నాడు ” అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దెగ్గరికి వెళ్ళి ” రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం కింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి ” అన్నారు.
అప్పుడు రాముడు ” సీత నాయందు ఎలా ఉంది? ” అని అడిగాడు.
అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు, ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి ” సీతమ్మ తపస్సుని పాటిస్తుంది, నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది ” అని, సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి ” సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది, మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి, సీతమ్మని తీసుకురావాలి ” అన్నాడు.
అప్పుడు రాముడు ” సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను ” అని ఏడ్చి, సీత ఎలా ఉందని అడిగిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి ” నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను, నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది ” అని చెప్పాడు.
అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.

యుద్ధకాండ

హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి ” హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి, సీత దర్శనం చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి, ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పనికాదు.
సేవకులు మూడు రకాలుగా ఉంటారు, ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి, అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్ధ్యం ఉన్నప్పటికీ, ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా, నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి, ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని, బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దెగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దెగ్గర ఉన్నది ఈ దేహమే, అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను ” అని, హనుమని దెగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.
తవువాత రాముడన్నాడు ” అంతా బాగానే ఉంది కాని, ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు. మనకున్న ఈ వానర సముహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము. అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా…….” అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు, ” రామ! నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిననాడు నీముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు. నువ్వు సమస్త బ్రహ్మండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగుపెట్టిందంటే, రావణుడు నిహతుడయ్యిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టి కోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి ” అన్నాడు.
సుగ్రీవుడి మాటలకి ఉత్సాహం పొందిన రాముడు ” నిజమే, నేను తలుచుకుంటె నా తపఃశక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలుచుకుంటె నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింప చేస్తాను ” అని చెప్పి, హనుమ వంక తిరిగి ” హనుమా! ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది. ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి ” అని అడిగాడు.
అప్పుడు హనుమంతుడు ” ఆ లంకా పట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూటా పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేధ్యమైనది, దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో ఒక విశాలమైన అగడ్త నిర్మించారు. దానిమీద నాలుగు వైపులా నాలుగు వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చెయ్యబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకి నాలుగు దుర్గాలున్నాయి, అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు. నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. ఆ లంకా పట్టణము ఈ నాలుగు దుర్గములతోటి శోభిల్లుతోంది. లంకకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం దెగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధములు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని లక్ష మంది సైనికులు కాపు కాస్తుంటారు. పది లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తుంటారు. కోటి మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడమంటే మహా ప్రీతికరమైన విషయం. రాజద్వారమునకు భయంకరమైన ఇనుప గడియలు, పరిఘలు బిగించి ఉంటాయి. ఆ లంకని చేరుకొని యుద్ధం చెయ్యడం అంత సామాన్యమైన విషయం కాదు.
మీరు కాని ఆజ్ఞాపిస్తే ఒక సుషేణుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిదుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. అక్కడున్న అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరిచేశాను. అనేక ప్రాసాదాలని విరగొట్టాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది, రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” నాకన్నీ శుభనిమిత్తములు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడు అయిపోయినట్టే. మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదాము ” అన్నాడు.
అప్పుడు రాముడు ” మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యన ఉన్నాడు. ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మన వెంటనే సైన్యాన్ని తీసుకొని బయలుదేరదాము ” అన్నాడు.
రాముడు ఈ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది ” జై శ్రీరాం, జై జై రామ, బయలుదేరదాము, లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము ” అన్నాయి.
తరువాత రాముడు సుగ్రీవుడితో ” వృద్ధులైన వారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు, ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి, ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన లక్ష వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్ళడానికి అనువైనరీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు, అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయం ఉండాలి, తాగడానికి మంచి నీరు దొరకాలి, పళ్ళు, తేనె దొరకాలి, అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్ళని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి.
వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలొ శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరు కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి ” అని చెప్పాడు.
అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. అప్పుడా సైన్యంలో కొంతమంది వెనుక నడవకుండా ముందుకొచ్చి నడుస్తున్నారు. రాముడికి పక్కన నడుస్తున్నవారు అంటున్నారు ” ఒరేయ్! చూడరా లంకకి వెళ్ళగానే రావణుడిని ఏమి చేస్తానో ” అని ఒకడు, ” నేను ఒక్క గుద్దు గుద్దానంటే వాడి తలకాయలు పగిలిపోతాయి. చూడరా నా కండ ” అని రాముడికి వినపడేటట్టుగా తమ ప్రతాపాలు చెప్పుకుంటున్నారు. ఆ సైన్యంలో బలంగా ఉన్నవాళ్ళు మెల్లగా నడుస్తున్నవారిని ఎత్తి పక్కకు పారేసి ముందుకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తొందరగా వెళ్ళాలని పర్వతాల మీద ఎక్కి వెళుతున్నారు. కొంతమంది చెట్లని పీకేసి వాటిని గోడుగులుగా పట్టుకొని వెళుతున్నారు. వాళ్ళందరూ అలా వెళుతుంటే అరణ్యం అరణ్యమే వెళ్ళిపోతుందా అన్నట్టుగా ఉంది. అలా వాళ్ళందరూ బయలుదేరి దక్షిణ దిక్కున ఉన్న సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడున్న రకరకాల పళ్ళని తిని కాలం గడిపారు. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్ళకి సముద్రం కనపడింది. వాళ్ళు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది.
అప్పుడు రాముడు ” మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి, రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి ” అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరములని ఒక వైపు నిలబెట్టారు, కొండముచ్చులని ఒక వైపు నిలబెట్టారు, భల్లూకాలని ఒక వైపు నిలబెట్టారు.
చంద్రుని కాంతి కెరటాలు మీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలి చేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్ళెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రం మీద ప్రతిఫలిస్తూ, అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి, రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి, ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంది, కదులుతున్న తరంగాలతో సముద్రం ఉంది, అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు.
ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ ” సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా! సీత నిన్ను చూసుంటుంది, అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది ” అన్నాడు.
అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తల దించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్ళతో ” జెరగకూడని పని జెరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడొ మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు (తన గూఢచారుల వల్ల రాముడు సముద్ర తీరానికి వచ్చాడని రావణుడు తెలుసుకున్నాడు). అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఎకాభిప్రాయంగా చెప్పిన మాట, ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట, మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి, ఎవరిమానన వాళ్ళు తలోమాట చెబితే, అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి ” అన్నాడు.
అప్పుడా మంత్రులన్నారు ” ప్రభు! మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు. మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి, ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభీనస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్ళని ఓడించి అపారమైన కీర్తి గడించారు. అక్కడినుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు, యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు. మీ దెగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు, ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత ” అన్నారు.
ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి ” రావణ! నువ్వు భయపడవద్దు, నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరిని సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము ” అన్నాడు.
అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి ” నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్ళని కొట్టి వచ్చేస్తాను ” అన్నాడు.
అప్పుడు వజ్రదంష్ట్రుడు ” రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాలిక నీకు చెబుతాను. మన దెగ్గర కామరూపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దెగ్గరికి పంపి ‘ అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు ‘ అని రాముడితో చెబుతారు. భరతుడి మీద ఉన్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది, అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము ” అన్నాడు.
అప్పుడు నికుంభుడు(కుంభకర్ణుడి కుమారుడు) అన్నాడు ” దీనికింత మోసం ఎందుకు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి, రామలక్ష్మణులని తినేసి వస్తాను ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు ” 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటె యుద్ధానికి వెళ్ళడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజు మీదకి వెళ్ళడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్ళడం తేలిక. ఈ మూడు లోపాలు ఉన్న రాజు మీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని, మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటె అంత చేతకానివాడిలా కనపడుతున్నాడ. రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకొని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు(తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు), నదములకు(పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు) భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకా పట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దెగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా. యుద్ధానికి వెళ్ళేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగ అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలం ఉంటె వేరొక మార్గాన్ని ఆలోచించాలి, శత్రువు కన్నా మనకే ఎక్కువ బలం ఉంటె, ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశార?
మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది, ధర్మం ఎక్కడుంటె దేవతలు అక్కడ ఉంటారు, కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటె, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చెయ్యండి ” అన్నాడు.
విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు.
విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు, పూజలు, అగ్నికార్యాలు జెరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి ” అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతె నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.
నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటె, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.
ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము ” అన్నాడు.
అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి ” ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు ” అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.
తన మనస్సు నిరంతరము పరకాంత యందు ఉండుట చేత, సోదరుడు చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోవుచున్నాడు.
తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభా మండపానికి రమ్మన్నాడు. అందరూ సభలొ కూర్చున్నాక ఆయనంటాడు ” నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమ వాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. ప్రహస్త! వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా ” అన్నాడు.
తరువాత ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు ” మూడు లోకాలలో సీతకన్నా అందగత్తె లేదు, కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతని చూస్తుంటే నాలొ కామ ప్రచోదనం పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువ అవ్వడం వల్ల నేను నీరసించిపోతున్నాను ( ఆ రావణుడు సీతమ్మ గురించి ఇంకా నీచంగా వర్ణిస్తాడు, అది ఇక్కడ రాయడం బాగోదని రాయడం లేదు). నేను సీతని అపహరించి తీసుకొచ్చాక ‘ రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, ఒక సంవత్సర కాలం చూద్దాము ‘ అని సీత నన్ను అడిగింది. ఒక సంవత్సరం వరకూ నా మంచం ఎక్కను అనింది, పోనిలె ఒక సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను ” అన్నాడు.
అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు ” నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడు మా అందరినీ పిలిచి, ఏమి చెయ్యను అని అంటావేంటి. ఈ మాట నువ్వు మమ్మల్ని అపహరించే ముందు అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసేముందు న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు కాని నిర్ణయం చేస్తే, ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి సీతని తీసుకొచ్చావు, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికి ఉన్నావు. ఏదో తప్పు చేశావు సరె, ఇంక బెంగపెట్టుకోమాకు. హాయిగా లోపలికి వెళ్ళి మధ్యం తాగి, నీ కాంతలతో సుఖంగా విహరించు. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి ఆ రామలక్ష్మణులని సంహరించి, ఆ వానరులందరినీ తినేసి వస్తాను ” అన్నాడు.
అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు ” ఒక కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి, బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు ” అన్నాడు.
రావణుడు ఆ మహాపార్షుడిని దెగ్గరికి పిలిచి ” ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. కాని నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మ సభకి వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెని వెంట తరిమి, వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది, అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి ‘ ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే, ఉత్తర క్షణం నీ శిరస్సు నూరు ముక్కలవుతుందని ‘ బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు ” మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటె మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహొదరుడు కాని, నికుంభుడు కాని, వీరేవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు ” అన్నాడు.
అప్పుడు ప్రహస్తుడు ” ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు, మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకూ తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు ” అన్నాడు.
విభీషణుడు ” ఇక్ష్వాకు వంశస్తుడైన ఆ రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త! నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామ బాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటె నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామ బాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటె, అందరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం చెయ్యండి, రావణుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చెయ్యండి, అలా చేస్తే మీరు బతికుంటారు లేకపోతె నశించిపోతారు ” అన్నాడు.
ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి ” వీర్యంలొ కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రి!. పద్దాక ‘ రాముడు వచ్చేస్తాడు ‘ అని మాట్లాడుతున్నావు, ఎందుకంత భయం నీకు, ఏంచేస్తాడు రాముడు వస్తే ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు ” నువ్వు బాలుడివి, నీకేమి తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకోచ్చినవాడిని, నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు. ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకురా ఇంద్రజిత్, కుర్చో ” అన్నాడు.
అప్పుడు రావణుడు అన్నాడు ” ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండచ్చు. శత్రువు అని తెలిసి, ఆ శత్రువు ఉన్న చోట ఉండచ్చు. కాని మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి, ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను జాగ్రత్తగా విను విభీషణ. ఆ ఏనుగులు అన్నాయి ‘ మనకి అగ్నివల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి మన జాతి వల్లే భయం ‘ అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజం అనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమొస్తోంది. ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు ” నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితొ నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటె నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి ” అని చెప్పి, రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.
విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు ” రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి ” అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు.
ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా ” నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు ” అన్నాడు.
వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దెగ్గరికి వెళ్ళి ” వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటె మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కలపిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. ” అన్నాడు.
అప్పుడు రాముడన్నాడు ” నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవ. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా ” అని అడిగాడు.
అంగదుడు లేచి అన్నాడు ” మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము ” అన్నాడు.
తరువాత శరభుడు అన్నాడు ” మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు అన్నాడు ” ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనని తీసుకోకపోవడమే మంచిది ” అన్నాడు.
మైందుడు అన్నాడు ” మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దెగ్గరికి పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము, విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటె ఆయనని స్వీకరిద్దాము, లేకపోతె ఆయనని స్వీకరించద్దు ” అన్నాడు.
రాముడు హనుమ వంక ‘ నువ్వేమి చెప్పవా, హనుమ! ‘ అన్నట్టు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు ” మహానుభావ! మూడు లోకములలో జెరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నాయందు గౌరవముంచి అడిగారు, నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి.
ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు, విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి ‘ నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను ‘ అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢచారులని పంపమన్నారు, మనకి తెలీకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కాని ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు. కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు, మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసినవాడు అమిత్రత్వంతో అక్కడినుంచి వెళ్ళిపోవచ్చు, దానివల్ల మనం నష్టపోతాము. అందుకని అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటె స్వీకరిద్దాము అన్నారు, వేరొకరియందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మనయందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము, కాలము యందు దోషముందని చెప్పారు, దేశము చేత, కాలము చేత ఇప్పుడే యదార్ధమైన స్థితి ఉంది.
ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు, అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవ, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దెగ్గరికి వచ్చి భూమి మీద పడి ‘ రామ! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు ‘ అనినవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ
వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరె రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జెరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడొ వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.
సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.
పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి, ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతె, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటె నేను రాజుని అవుతాన? క్షత్రియుడని అవుతాన? ఈ భూలోకంలొ ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరె నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతె, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు అన్నాడు ” రామ! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ” అన్నాడు.
రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దెగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ‘ ఇది రాముడు నిలబడిన భూమి ‘ అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు ” రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దెగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి ” అన్నాడు.
రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు ” విభీషణ బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు ” మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటె యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను ” అన్నాడు.
మళ్ళి రాముడు అన్నాడు ” లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను ” అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.
ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దెగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దెగ్గరికి వెళ్ళి ” అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు ” అన్నాడు.
” నేను మాత్రం సీతని ఇవ్వను ” అని, సుకుడు అనేవాడిని పిలిచి ” నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ‘ నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి ‘ అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు ” అని సుకుడిని పంపించాడు.
ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు ” దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు ” అన్నాడు.
ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ‘ రామ రామ ‘ అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.
ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు ” రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది ” అన్నాడు.
చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో  అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు ” పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతె నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు ” అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.
అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.
ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి ” భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటె అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దెగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు ” అన్నాడు.
అపడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి   వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. ” అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది ” అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.
వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రరంభిస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ‘ సీతారామ ప్రభువుకి జై ‘ అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువుని నిర్మించేసారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది.
” మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చెరుకోండి ” అని రాముడు అన్నాడు.
అప్పుడా వానరములలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళి సేతువు ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకలించి సముద్రంలో పడేసి, దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటె, ఎవరూ చెప్పలేకపోయారు, అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నిరోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.
అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి ” మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడన్నవాడు రాయబారం చెయ్యడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు ” అని అడిగాడు.
అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాముడు ” నువ్వు ఎందుకొచ్చావు” అని అడిగాడు.
సుకుడన్నాడు ” బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు, ఇందులో నా తప్పు లేదు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు ” అన్నాడు.
అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి ” నువ్వు అన్నీ చూశావ? ” అని అడిగాడు. అప్పుడా సుకుడు ” ఇంకా చూడలేదు ” అన్నాడు.
” విభీషణ! వీడిని తీసుకెళ్ళి దెగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు. చూపించాక వీడిని వదిలెయ్యండి, వెళ్ళిపోతాడు ” అన్నాడు.
ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణుడి దెగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు ” రెక్కలు విరిగిపోయాయే ” అని సుకుడిని చూసి ఎకిలించాడు.
సుకుడన్నాడు ” నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దెగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు, వెనుక భాగమునందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు ” అన్నాడు.
తరువాత రావణుడు సుక, సారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దెగ్గరికి తీసుకెళ్ళి ” వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను ” అన్నాడు. ఇంతకముందు సుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు.
ఆ సుక సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు ” వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి ” అన్నాడు.
అప్పుడు రావణుడు సుక సారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి ” వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు ” అన్నాడు.
అప్పుడు సారణుడు అన్నాడు ” రావణ! అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమము ఉన్నవాడు, కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లోనుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలయిపోతాయి. వాళ్ళకి వేరె ఆయుధములు అక్కరలేదు, వాళ్ళకి గోళ్ళు, కోరలు ఆయుధములు. పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలని విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలం, కొంతమందిది 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, లక్ష ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైనవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు. ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు, 4 యోజనముల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరములు సర్వకాలములయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి ‘ రారా రావణ ‘ అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రాసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధినాదుడు, ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కిందని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్ర మాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది.
అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు, కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమాధనుడి శక్తి అంత ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకా పట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. లంకా పట్టణం చుట్టూ ఉన్న వనాలలొ ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు ఉన్నాయి, ఈ భల్లూకాలన్నిటికి జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు, గయుడు, గవాక్షుడు కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకి ఇవ్వాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను, పది పదివేలయితే ఒక లక్ష, పది లక్షలయితే పదిలక్షలు, పది పదిలక్షలు అయితే ఒక కోటి, లక్ష కోట్లయితే ఒక సంకువు, వెయ్యి సంకువులు ఒక మహా సంకువు, వెయ్యి మహా సంకువులు ఒక వృందము, వెయ్యి వృందములు ఒక మహా వృందము, వెయ్యి మహా వృందములు ఒక పద్మము, వెయ్యి పద్మములు ఒక మహా పద్మము, వెయ్యి మహా పద్మములు ఒక ఖర్వము, వెయ్యి ఖర్వములు ఒక మహా ఖర్వము, వెయ్యి మహా ఖర్వములు ఒక సముద్రము, వెయ్యి సముద్రములు ఒక ఓధము, వెయ్యి ఓధములు ఒక మహా ఓధము. ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు.
అదుగో అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ, ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది, ఏ అస్త్ర-శస్త్రములకి ఆయన కట్టుబడదు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాలవంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకుని, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు, కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్ర-శస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్ర-శస్త్రములు తెలుసు ” అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెబుతున్నాడు.
అప్పుడు రావణుడు ఆ సారణుడిని ఆపి ” నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటె. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావ. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుంచి ” అని, మళ్ళి శార్దూలుడిని పిలిచి ” ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా ” అన్నాడు.
తరువాత రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి ” నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారుచెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయతుణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి ” అన్నాడు.
కొంతసేపటికి ఆయన అశోక వనానికి వెళ్ళి ” సీత! నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు ” అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి ” రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకురమ్మన్నానని చెప్పండి ” అన్నాడు.
అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పది మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దెగ్గరికి విసిరేసి ” సీత! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావ ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యధాతధంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ అనింది ” రామ! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయిష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితొ అంతిమ సంస్కారం జెరుపుకోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కులేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటె క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తు ఉంటుంటాయి. భార్యయందు దోషం ఉంటె, భార్య ప్రవర్తనయందు విశేషమైన వైక్లవ్యం ఉంటె భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామ ” అని సీతమ్మ ఏడ్చింది.
సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఆమె అనింది ” ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంచేస్టి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు ” అని సీతమ్మ అనింది.
అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి ” మహారాజ! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్తాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది ” అన్నాడు.
వెంటనే రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్-బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దెగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి ” నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడ?, రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్దానమయ్యిపోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు ” అనింది.
” నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు ” అని సీతమ్మ సరమతో అనింది.
అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి ” ఇప్పుడే నేను విని వచ్చాను, రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. ‘ ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జెరగదు ‘ అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి ” అని చెప్పింది.
సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది.
ఈలోగా మాల్యవంతుడు(తాత వరస) రావణుడి దెగ్గరికి వచ్చి ” సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటినుంచి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి-కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడినుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడిగుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతాన, రాముడు గొప్పవాడే కావచ్చు కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు, ఇది నా స్వభావం ” అని చెప్పాడు.
అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు ” సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు ” అన్నాడు.
తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దెగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో  ” నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా ” అని రాముడు అంగదుడితొ చెప్పాడు.
అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితొ ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు, అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు, ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది.
రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధంకండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యదికారి అయిన ప్రహస్తుడిని మోహరించాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షులని నియమించాడు, పశ్చిన దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు.
అప్పుడు రాముడు ” తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి ” అన్నాడు.
యుద్ధం ప్రారంభమయ్యింది
వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.
అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు ” యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి ” అని చెప్పాడు.
ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జెరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితొ బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.
అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.
తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు ” అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ‘ ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ‘ అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి ” మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను ” అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.
అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.
రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి ” నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి ” అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు. 
కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి ” నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని ” అని బాధపడ్డాడు.
విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి ” ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది ” అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు ” మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము ” అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.
ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో ” తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి ” అన్నాడు.
ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి ” యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి  ” అని ఆజ్ఞాపించాడు.
తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి ” మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దెగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. ‘ ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ ‘ అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి ” అన్నాడు.
యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ ” నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి ‘ అమ్మ! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది ‘ అన్నారు. కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటె దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి ‘ తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది ‘ అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.
రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతార, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావ. నువ్వు నన్ను చేసుకోకపోతేనె బాగుండేదేమో ” అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. అప్పుడు త్రిజట ” ఏడవకు సీతమ్మ. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావ, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటె ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ ” అని చెప్పింది.
తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.
ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి ” ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఎలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు( ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు ” అని రాముడు బాధపడ్డాడు.
అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి ” సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను ” అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు ” విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో ” అన్నాడు.
అప్పుడు సుషేణుడు ” పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జెరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళి జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మనదెగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాం ఉంటుంది ” అన్నాడు.
సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుగ్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుగ్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుగ్మంతుడు వాళ్ళిద్దరిని దెగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. గరుగ్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి.
అప్పుడు గరుగ్మంతుడు ” నాయనా రామ! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది ” అన్నాడు.
అప్పుడు రాముడు ” మీరు ఎవరు? ” అని అడిగాడు.
గరుగ్మంతుడు అన్నాడు ” నేను గరుగ్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామ ” అన్నాడు.
రాముడు ” చాలా సంతోషం, మీరు వెళ్ళండి ” అన్నాడు.
గరుగ్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.
రెట్టింపు ఉత్స్సహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి ” ఏమి జెరిగిందో చూడండి ” అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.
అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి ” నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు ” అన్నాడు.’
అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.
ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.
తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.
ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.  
అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి ” ప్రహస్త! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతె తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటె యుద్ధం ఆపేద్దాము ” అన్నడు.
అప్పుడు ప్రహస్తుడు ” మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది ‘ సీతమ్మని ఇచ్చెయ్యండి ‘ అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” ప్రహస్త! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు ” అన్నాడు.
అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.
అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జెరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతొ ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.
ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి ” ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి ” అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు.
రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ‘ మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు ‘ అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.
విభీషణుడు అన్నాడు ” రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు( ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.
అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.
అప్పుడు రాముడు రావణుడిని చూసి ” ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు ” అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.
రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.
వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి ” రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను ” అన్నాడు.
హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి ” ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి ” అన్నాడు.
అప్పుడు హనుమంతుడు ” ఛి దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను ” అన్నాడు.
అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.
అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.   
ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని ” అన్నయ్య! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు ” అని చెప్పాడు.
” దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు ” అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు ‘ నేను విష్ణు అంశ ‘ అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.
వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు( లక్ష్మణుడు పడిపోయేముందు ‘ నేను విష్ణు అంశని ‘ అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి ‘ నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా ‘ అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళి స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.
అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లెగిసిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది ” బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు ” అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వసుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. వెంటనే హనుమంతుడు వచ్చి ” స్వామీ! ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి ” అన్నాడు.
అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి ” దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అపహరించినవాడ! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను…………” అని రాముడు చెబుతుండగా, రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు. ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతుంది. అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.
అవి బాణాల, మెరుపులా? అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి అన్ని మర్మస్థానాలని బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.
(ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు)
అప్పుడు రాముడు ” భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళి రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ ” అన్నాడు.
రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని ” గరుగ్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు.
ఒకనాడు బ్రహ్మగారు నాతో ‘ నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు ‘ అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు( రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ‘ ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు ‘ అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి ‘ స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు ‘ అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు( నందీశ్వరుడిని చూసి రావణుడు ‘ కోతి ముఖంవాడ ‘ అని హేళన చేశాడు. ‘ ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా ‘ అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య  అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.  
అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు లెగిస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి ” అన్నాడు.
రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి ” ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు ” అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతొ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.
అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు, భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వాళ్ళు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.    
తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి, ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతొ ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.
అప్పుడా రాక్షసులు ” కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఇవ్వాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము ” అన్నారు.
అప్పుడు కుంభకర్ణుడు ” ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దెగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు ఒక లెక్కా. నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చెయ్యడానికి వెళితే నేను తినడానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను ” అన్నాడు.
అప్పుడు ఆ రాక్షసులు ” అలా వెళ్ళిపోకయ్యా. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి, ఆయన ఎలా నిర్దేసిస్తే అలా వెళ్ళు ” అన్నారు.
” ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను ” అని కుంభకర్ణుడు అన్నాడు.
స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి,( కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం, లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలికి కూడా వాడు కనిపించాడు) కొంతమంది చెట్లు ఎక్కేసారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువెక్కి పారిపోయారు.
ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ‘ ఏంటి విషయము ‘ అని అడుగగా, విభీషణుడు అన్నాడు ” మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు, ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి, అలా చెబితే వాళ్ళు భయపడతారు, అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి ” అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళి తిరిగి వచ్చాయి.
అప్పుడు రాముడు ” విభీషణ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి. వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడ ” అని అడిగాడు.
విభీషణుడు అన్నాడు ” కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటె, ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ‘ ఆకలీ ‘ అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి ‘ ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా ఆ తినెయ్యడం. కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణి కోటిని బతకనివ్వవా ‘ అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎరిగి ‘ నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి ‘ అని, ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోసాడు. అప్పుడా ఐరావతం కింద పడిపోయింది. అప్పుడాయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు ‘ సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడ! అలా తినెయ్యడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి ‘ అన్నారు.
తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దెగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి ‘ నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో ‘ అన్నారు.
కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కాని రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో ‘ అదేమిటి తాత అలా శపించావు, వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా, కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి ‘ అన్నాడు.
అప్పుడు బ్రహ్మగారు ‘ వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు. తినంగానే మళ్ళి నిద్రపోతాడు ‘ అన్నారు.
అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామ. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితొ యుద్ధం అంటె సామాన్య మైన విషయం కాదు రామ ” అన్నాడు.
ఇంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు ” అన్నయ్య! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావ. ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు, ఇప్పుడది ఉపద్రవం అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు కాని, నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి, సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే, ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా?, నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా?. వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా?. ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు ” అని అడిగాడు.
ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి ” నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప, నా తప్పుని పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు, లేకపోతె వెళ్ళి పడుకో, కాని ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది ” అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు ” ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు. నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి. యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను ” అని బయలుదేరుతున్నాడు.
ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి ” కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం, ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతె రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి.అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనన్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది ‘ ఇంత సభ జెరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా….  ‘ అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటె భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు ” అని అన్నాడు.
అప్పుడు కుంభకర్ణుడు ” మీరెవరు రావక్కరలేదు, నేనొక్కడినే వెళతాను ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు ” అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.
అప్పుడా కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది.
యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు, అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దుకేస్తున్నారు. అలా బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళి ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.
అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు.
అప్పుడు అంగదుడు వాళ్ళందరి దెగ్గరికి వెళ్ళి అన్నాడు ” ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతార. మీ పౌరుషం ఏమయ్యింది ” అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.
ఇంతలో నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దెగ్గరికి వెళ్ళారు. అప్పుడా కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. తరువాత వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యం, బలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. తరువాత ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతొ సుగ్రీవుడిని కొట్టాడు, ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు, కాని మళ్ళి స్పృహ వచ్చి పైకి లెగబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు ” సుగ్రీవ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు ఋక్షరజస్సు కొడుకువి(బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులొ స్నానం చేశాడు. అలా స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యుక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠ భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకంలో స్నానం చేయించాడు, అప్పుడాయన మళ్ళి తన వానర రూపాన్ని పొందాడు). నేను నిన్ను విడిచిపెడతాన….” అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కిందపడిపోయాడు.
అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడా కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు ‘ నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది, వేచి చూద్దాము ” అని హనుమంతుడు అనుకున్నాడు.
ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీదనుంచి చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేశాడు. అలా చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.  
ఇంక ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో ” ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దెగ్గరి వెళతాను ” అన్నాడు.
లక్ష్మణుడు కొట్టిన బాణాలకి, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ” వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు ” అన్నాడు.
అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు, అంతే, అన్ని వానరాలు కిందపడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దెగ్గరికి వెళ్ళారు. ” రామ! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి ” అన్నారు.
రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు.
రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది.
కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ ” అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది ” అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.
వాళ్ళన్నారు ” నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము ” అన్నారు.
అప్పుడు రావణుడు ” ఇప్పటికయినా నా కోరిక తీర్చండి ” అన్నాడు.
అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. 
ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు ” విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు ” అని అడిగాడు.
అప్పుడు విభీషణుడు ” ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం ” అన్నాడు.
ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు ” లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి ” అన్నాడు.
అతికాయుడన్నాడు ” పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను ” అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు ” అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే ” అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.
ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో ” వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.
అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి ” నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది ” అన్నాడు.
అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)
హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతొ కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు.
అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు ” ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని ” అన్నాడు.
అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతొ కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో ” రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు ” అని చెప్పాడు.
ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని ” అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? ” అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు)
అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు ” జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా ” అని అడిగాడు.
అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు ” నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? ” అని అడిగాడు.
విభీషణుడు అన్నాడు ” నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు  రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు అన్నాడు ” మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? ” అని అడిగాడు.
వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని ” తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు ” అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు ” అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు) , విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా ” అన్నాడు.
జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.
తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు.
ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.
ఆ ఓషదులను చూసిన హనుమంతుడు ” ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా ” అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.
అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు.
అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దెగ్గర పెట్టి వచ్చేశాడు.
అప్పుడు సుగ్రీవుడు అన్నాడు ” మనన్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి ” అన్నాడు.
సుగ్రీవుడు అలా అనంగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది. 
అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.
అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.
ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.
ఆ ఇంద్రజిత్ మళ్ళి అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.  
అప్పుడు లక్ష్మణుడు రాముడితో ” అన్నయ్య! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను ” అన్నాడు.
రాముడన్నాడు ” పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ ” అన్నాడు.
రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు ‘ ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి ‘ అనుకుని ఆలోచించాడు. అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలొ కుర్చోపెట్టాడు.
ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ ‘ హా రామ, హా రామ ‘ అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ ” దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావ, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు ” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.
అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు ” ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను ” అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.
ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ ” ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను ” అని ఏడుస్తూ రాముడి దెగ్గరికి వెళ్ళి ” రామ! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు ” అని చెప్పాడు.
ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.
తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.
అప్పుడు లక్ష్మణుడు అన్నాడు ” అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము ” అన్నాడు.
వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి ” ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను ” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.
విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్దపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.
అప్పుడు విభీషణుడు ” లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి ” అన్నాడు.
వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి ‘ ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను ‘ అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.
అప్పుడు లక్ష్మణుడు ” దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటె నాతో యుద్ధం చెయ్యి ” అన్నాడు.
అప్పుడు ఇంద్రజిత్ ” ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ ” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.
లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు ” నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు ” అన్నాడు.
విభీషణుడు అన్నాడు ” నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను ” అన్నాడు.
అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుధం జెరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు.
ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జెరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.
లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు ” ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు ” అన్నాడు.
ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్
అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి ” మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక ” అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.
ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు ” నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను ” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు ” ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావ రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను ” అని అంతఃపురానికి వచ్చేశాడు.
మరునాడు రావణుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు.
ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.
అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.
‘ తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు ‘ అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దెగ్గర పెట్టాడు.
అప్పుడు రాముడన్నాడు ” నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు ” అని బాధపడ్డాడు.
అప్పుడు హనుమంతుడు ” రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు ” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.
” ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో ” అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు ‘ దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు ‘ అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.
అప్పుడా మాతలి రాముడితో అన్నాడు ” రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి ” అన్నాడు.
రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జెరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జెరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు ” ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి ” అన్నాడు.
అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు ‘ ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-సస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది ‘ అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు.
అప్పుడు రావణుడు ఆ సారధితో ” ఛి నీచుడ! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దెగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు? ” అన్నాడు.
అప్పుడా సారధి ” మీ దెగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జెరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దెగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టబడిన సారధిని నేను ” అన్నాడు.
అప్పుడు రావణుడు ” నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధి. నువ్వు ఉత్తమ సేవకుడివి ” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.
ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ” ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.
పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.   
పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ‘ అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ‘ అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?
ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ‘ అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ‘ అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ‘ నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ‘ అని అన్నారు.
దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ‘ ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ‘ అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు ” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ‘ ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం ‘ అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి ” రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది ” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు……
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్
హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్
వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః
తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః
ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమానః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
1 నుండి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు  : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే.
16 నుండి 20 శ్లోకాలు  : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం
అగస్త్యుడు అన్నాడు ” ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు ” అన్నాడు.
రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.
ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు.
అప్పుడు రాముడు ” మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు ” అన్నాడు.
ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి ” రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి ” అని స్వస్తి వాచకం చేస్తున్నారు.
రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.
రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.
వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.
గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ
ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ” ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక ” అన్నారు.
అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళి ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళి బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటిదానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళి కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి సిరస్సులని కొట్టాడు.  
అప్పుడు రాముడు అనుకున్నాడు ‘ ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది ‘ అని అనుకున్నాడు.
వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జెరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది.
అప్పుడు మాతలి ” రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీయొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు ” అన్నాడు.
అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడివంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి.
రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.
రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు.
రావణాసురుడు మరణించాడు.
రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, ” రామ రామ ” అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.
రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు.
ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు .
రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దెగ్గరికి పరిగెత్తాడు. అప్పుడాయన అన్నాడు ” అన్నయ్యా! ఆనాడే నేను నీకు చెప్పాను ‘ యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో ‘ అన్నాను. కాని నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయి ఉన్నావో చూశావ. ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, అతిరధుడు, అతికాయుడు, నరాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నెరపి స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసినవాడు ఇవ్వాళ కేవలం కిందపడిపోయి, ఎందుకూ పనికిరానివాడిగా చేతులు భూమికి ఆన్చి, నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావాన్నయ్య ” అని ఏడిచాడు.
అప్పుడు రాముడు ” విభీషణ! నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చెయ్యడానికి బెంగపెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు ” అన్నాడు.
అప్పడు అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతలు పరిగెత్తుకుంటూ వచ్చి ” రావణ! నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా అయిదోతనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది. ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు ” అన్నారు.
ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని ” ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించవు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి ‘ నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను ‘ అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావ ” అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.
రాముడిని చూడగానే మండోదరి అనింది ” ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపాలు ధరింప చేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్ని సార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువు అని ఎందుకు అర్ధం కాలేదు రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.
ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మయందు కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు, ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమి లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వల్ల కాంచన లంకని అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు, కాని సీతమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం ఇవ్వాళ విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.
రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా, నాకన్నా గొప్ప రూపవతా,  నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. ఇవ్వాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వల్ల 10 రోజులలో నా పరిస్తితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది ” అని బాధపడింది. ( ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పతివ్రత అయిన వేరొకడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు, నా భార్య నేను చేసిన పని వల్ల ఏడిచినా, ఆ పాపం వల్ల నేను నశించిపోతాను)
అప్పుడు రాముడు ” ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కనుక, ఈ శరీరానికి చెయ్యవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు ” రామ! మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పర స్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంచేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాము ” అన్నాడు.
అప్పుడు రాముడు ” విభీషణ! అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనె వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు ‘ చెయ్యను ‘ అంటె, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకూ అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను ” అన్నాడు.
అప్పుడు విభీషణుడు రావణుడికి అంచేష్టి సంస్కారం చేశాడు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయారు.
అప్పుడు రాముడు ” విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జెరిగితే చూడాలని ఉంది లక్ష్మణా. సముద్రానికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చెయ్యండి ” అన్నాడు.
విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి ” ఇవ్వాళ విభీషణుడు అభిషేకం జెరిగి లంకకి రాజయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. అందుకని ఇవ్వాళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉంది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు ” అన్నాడు.
హనుమంతుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళగా, సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళి ఓ సారి హనుమంతుడి వంక చూసి ” హనుమ! నువ్వు కదా ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” సీతమ్మ! రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని తన పక్కన పెట్టుకుని, వాళ్ళ యొక్క సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవ్వాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు, అందుచేత నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” ఎంత మంచిమాట చెప్పావయ్య హనుమ ” అని చెప్పి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది.
అప్పుడు హనుమంతుడు ” అదేమిటమ్మ ఏమి మాట్లాడావు ” అన్నాడు.
సీతమ్మ ” 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటాన అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటరాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కాని నేను ఆలోచన చేస్తే, నేను నీకు ఏమి ఇవ్వగలను. ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, మూడు లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవ్వాళ నీకు ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు హనుమ. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతొ కూడిన బుద్ధి ఉంది, వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్య ” అనింది.
అప్పుడు హనుమంతుడు ” అమ్మ! నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి, నాకు ఇవ్వడానికి నీ దెగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేనొక వరం అడుగుతాను ఇస్తావ తల్లి ” అని, ” ఇంతకముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చుని చూశానమ్మా, ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. ‘ నిన్ను అనుమతించాను హనుమ ‘ అని ఒక్కమాట అను, నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” హనుమ! వాళ్ళు దాసీజనం, ప్రభువు ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళయందు ఉందని వాళ్ళని చంపేస్తావు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటివాడివో వాళ్ళు కూడా అటువంటివాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను.
పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడా వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకొని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే భల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది. 
ఈ స్థితిలో పులి భల్లూకంతో ‘ వాడు నరుడు, మనిద్దరమూ క్రూర జంతువులము, మనిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కనుక వాడిని కిందకి తోసేయ్యి ‘ అనింది.
అప్పుడా భల్లూకం ‘ వాడు తెలిసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి. కనుక నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిధ్యం ఇస్తున్నాను ‘ అనింది.
ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపయ్యాక భల్లూకం వేటగాడితో ‘ నాకూ పెద్ద పులి చేత ప్రమాదమే. నాకు నిద్రొస్తోంది, నిద్రొస్తే జారి కిందపడిపోతాను. అందుకని నేను నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు ‘ అనింది. అప్పుడా వేటగాడు ‘ తప్పకుండా పడుకో ‘ అన్నాడు.
ఆ భల్లూకం పడుకున్నాక పెద్ద పులి అనింది ‘ దానికి నిద్రలేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ భల్లూకాన్ని కిందకి తోసేయ్యి. అప్పుడు నేను ఆ భల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తరువాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ‘ అనింది.
ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ భల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడా పులి ‘ చూశావ, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు, ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే. అందుకని వాడిని కిందకి తోసేయ్యి ‘ అనింది.
అప్పుడా భల్లూకం ‘ అపకారం చేసినవాడే అయినా, వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి, అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారము చెయ్యకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను ‘ అని ఒక భల్లూకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి, క్షత్రియ కాంతనై, రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలని చంపిస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతాన. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడయిపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికి నా రక్ష ” అనింది.
” అమ్మ! ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి ” అని సీతమ్మతో అని, అక్కడినుంచి బయలుదేరి రాముడి దెగ్గరికి వెళ్ళి ” రామ! సీతమ్మ నీ దర్శనం చెయ్యాలని అనుకుంటోంది ” అని రాముడితో చెప్పాడు.
హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంచెంసేపు ఆలోచించాడు, ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చాలా శోకం పొందినవాడిలా అయ్యి, ఒకసారి భుమివంక చూసి, తన పక్కన ఉన్న విభీషణుడిని పిలిచి ” విభీషణ! నువ్వు లోపలికి వెళ్ళి, సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి, పట్టు వస్త్రం కట్టించి, అన్ని అలంకారములు చేసి నా దెగ్గరికి ప్రవేశపెట్టు ” అన్నాడు.
రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చయపోయి సీతమ్మ దెగ్గరికి వెళ్ళి ” సీతమ్మ! నువ్వు తల స్నానం చేసి, పట్టుబట్ట కట్టుకొని, ఒంటినిండా అలంకారాలు చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు ” అన్నాడు.
సీతమ్మ అనింది ” నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనస్సు కోరుకుంటోంది ” అనింది.
విభీషణుడు అన్నాడు ” అమ్మా! అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చెయ్యడం మంచిది. అంతఃపుర కాంతలు నీకు తలస్నానం చేయిస్తారు, నువ్వు దివ్యాంగరాదములను అలదుకొని, మంచి భూషణములను వేసుకొని, రాముడికి దర్శనం ఇవ్వమ్మా ” అన్నాడు.
సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దెగ్గరికి తీసుకు వెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి.
అప్పుడు రాముడు ” మీరు ఆవిడని పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు. దిగి నడిచి రమ్మనండి ” అన్నాడు.
అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు (ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు). అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు.
రాముడన్నాడు ” ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడావిడ నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తార. వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియ బంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జెరుగుతున్నప్పుడు, యుద్ధం జెరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటకి రావచ్చు. ఇవ్వాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను, కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడడంలో దోషంలేదు ” అన్నాడు.
అప్పుడు హనుమంతుడు ” రామ! ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో, ఆ సీతమ్మ మీ దెగ్గరికి వచ్చింది ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ రాముడి దెగ్గరికి వచ్చి, తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవడం వల్ల ఏడుస్తూ, ఆ ముసుగులో నుంచి ” ఆర్యపుత్రా ” అని, అలా నిలబడిపోయింది.
అప్పుడు రాముడు ” శత్రువుని జయించాను, నిన్ను పొందాను. ఏ దైవము యొక్క అనుగ్రహము లేకపోవడము చేత, ఏ దైవము యొక్క శాసనము చేత నువ్వు అపహరింపబడ్డావో దానిని పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడిని సంహరించి నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషము, పరాక్రమము ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే, వాడు తన ప్రయత్నంతో ఆ అపవాదుని తుడిచిపెట్టుకోకపోతే, వాడు చేతకానివాడు అని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి, రాముడి భార్యని రావణుడు అపహరిస్తే, రావణుడిని రాముడు ఏమి చెయ్యలేదు అని అనకుండా ఉండడం కోసం రావణుడిని సంహరించాను. 100 యోజనముల సముద్రాన్ని గడిచి లంకా పట్టణాన్ని చేరి, హనుమ చేసిన ఈ లంకా భీభత్సం అంతా నేటితో సార్ధక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోడానికి. ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి, రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండిపోకూడదు, అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను.
సీత! ఇవ్వాళ నీ చారిత్రము శంకింపబడింది. నువ్వు చాలాకాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, కంటియందు జబ్బు ఉన్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో, అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్యరాశివి, నిన్ను చూసినవాడు చపలచిత్తుడైతే వెంటనే నీ యందు మనస్సు పెట్టుకుంటాడు. పరమ చపలచిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు, బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు, తన తొడ మీద కుర్చోపెట్టుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు, అశోకవనంలో పెట్టాడు, 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వూ మహా అందగత్తెవి, వయస్సులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడువడితో ఉన్నావని నేను ఎలా నమ్మను. అందుకని ఇప్పుడు నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కాని, భరతుడితో కాని, విభీషణుడితో కాని, సుగ్రీవుడితో కాని నువ్వు వెళ్ళిపోవచ్చు, వీళ్ళు కాదు ఈ పది దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏవిధమైన అవసరం లేదు ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ” రామ! నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేశావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్య జీవనం చేశామే, నేను ఎటువంటిదాననో నీకు తెలియదా, నేనంత చేతకాని స్త్రీలా నీకు కనపడుతున్నాన. నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించినవాడివైతే ఆనాడు హనుమని నాకోసం ఎందుకు పంపించావు. నేను రాక్షసుల మధ్యలో ఉన్నాను అని హనుమ నీకు చెబితే, మళ్ళి హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేస్తే నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చెయ్యకుండా నాకోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు, ఎందుకు సముద్రానికి సేతువు కట్టి, లంకకి వచ్చి, అంత యుద్ధం చేశావు. యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు, నువ్వు గెలవచ్చు రావణుడు గెలవచ్చు. నాయందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కాని ఇవ్వాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నావు. నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా. నా భక్తి, నా సౌశీల్యం, నా నడువడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలిగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలిగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడ్డాక నాకీ జీవితంతో సంబంధం లేదు. లక్ష్మణా! చితి పేర్చు ” అనింది.
అప్పుడు లక్ష్మణుడు రాముడివంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంతకన్నా కోపంగా, ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడివంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు.
అప్పుడు సీతమ్మ ” నా మనస్సు రాముడియందే ఉన్నదైతే, సర్వకాలములయందు రాముడిని ధ్యానము చేసిన దాననైతే, పృధ్వీ, ఆకాశము, అష్ట దిక్పాలకులు, అంతరాత్మ, అగ్ని సాక్షిగా ఉండి, ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక ” అని చెప్పి అగ్నిలో దూకింది.
అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు ” అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగినవాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య ” అన్నారు.
అప్పుడు రాముడు ” మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి ” అన్నాడు.
అప్పుడు బ్రహ్మ ” సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు ” అని రాముడిని స్తోత్రం చేశారు.
తరువాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోపెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడాయన ” రామ! ఈవిడ మహాపునీత. గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది, ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జెరిగింది. ఈ తల్లి మనస్సుతో కాని, వాక్కుతో కాని పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను, ఈ తల్లియందు కించిత్ దోషం లేదు. రామ! సర్వకాల సర్వావస్తలయందు నీ నామం చెప్పుకుని, నీ పాదములయందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈమెని నువ్వు స్వీకరించు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు, సర్వకాలములయందు ఈమె మనస్సు నా దెగ్గెర ఉందని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటనట్టు, అగ్నిని చేత పట్టలేనట్టు, సీతని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం రేపు లోకమంతటికి తెలియాలి. చేతకానివాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్రము ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను ” అన్నాడు.
అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యివేసి ఆమెని దెగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు.
దేవతలందరితో పాటుగా అక్కడికి వచ్చిన శివుడు అన్నాడు ” నాయన రామ! నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు, ఆయనని ఓదార్చు. నీ తల్లి అయిన కౌసల్యని ఊరడించు. కైకేయి, సుమిత్రలకి నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి, నీవారిని సంతోషపెట్టు. ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. యాగాలు చెయ్యి, బ్రాహ్మణులకు భూరి దానాలు చేసి పరమ సంతృప్తిని పొందు. తదనంతరం స్వర్గానికి చేరుకుందువుగాని. అదిగో, ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు ఉన్నారు, వెళ్ళి చూడు ” అన్నాడు.
తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు దశరథుడు రాముడిని ఒకసారి ఆనందంతో గట్టిగా కౌగలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ” రామ! నేను స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కాని నువ్వు లేకపోతె అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదురా. ఆనాడు నీకు పట్టాభిషేకాన్ని చేద్దాము అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దెగ్గరికి వెళ్ళడం, కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నం అవ్వడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నేను ఇప్పుడు తెలుసుకున్నదేంటంటే, ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కారణం దేవతలు. రావణ సంహారం జెరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు ” అన్నాడు.
అప్పుడు రాముడు ” ఆనాడు మీరు భావనా వ్యగ్రతని పొంది, నా పట్టాభిషేకం భగ్నం అవ్వడానికి కైకమ్మ కారణం అనుకొని ‘ ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు ‘ అన్నారు. ఆ మాటని మీరు ఉపసంహారం చెయ్యండి, నేను సంతోషిస్తాను ” అన్నాడు.
అప్పుడు దశరథుడు ” నువ్వు కోరుకున్నటు తప్పకుండా జెరుగుతుంది ” అన్నాడు. తరువాత ఆయన లక్ష్మణుడితో ” నాయన లక్ష్మణా! నువ్వురా ప్రాజ్ఞుడవి అంటె. చక్కగా అన్నయ్య సేవ చేశావు, ఇలాగె సర్వకాలములయందు అన్నయ్యని, వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్ధం చేసుకో ” అన్నాడు.
అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకి నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మని దెగ్గరికి పిలిచి ” అమ్మా సీతమ్మ! నీ మనస్సుకి కష్టం కలిగిందా. ‘ సీత! నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు ‘ అని మావాడు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధపడ్డావ. ఇవ్వాళ నేను ఊర్ధలోకవాసినమ్మా, తప్పు మాట చెబితే కిందకి పడిపోతాను, నీకొక నిజం చెప్పనా, రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.
కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల జెరిగిన గొప్పతనం ఏమిటో తెలుసా, ఇతఃపూర్వం పతివ్రతలై భర్తని సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి, పతివ్రత అంటె సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమిలేదమ్మ, నీకు అన్నీ తెలుసు, కాని మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవము అని తెలుసుకో ” అన్నాడు.
తరువాత దశరథుడు విమానంలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయాడు.
అప్పుడు దేవేంద్రుడు ” రామ! ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృధా కాకూడదు. అందుకని ఏదన్నా ఒక వరం కోరుకో ” అన్నాడు.
రాముడన్నాడు ” నాకోసమని తమ యొక్క కొడుకులని, భార్యలని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి, మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి, కొన్నిటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి, కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే, యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బతకాలి, యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళి జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళి అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి, వాళ్ళు తాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి ” అన్నాడు.
ఇంద్రుడు ” తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నాను ” అన్నాడు.
వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు, యమ సదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు.
ఆరోజు రాత్రి అక్కడ విశ్రమించారు, మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి ” నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలి నడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదన్నా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా ” అన్నాడు.
విభీషణుడు ” మన దెగ్గర పుష్పక విమానం ఉంది, ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరిపోతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ లభించింది కదా, సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టు పుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి, పట్టు పుట్టాలు కట్టుకుని, ఆభరణములను దాల్చి, నా దెగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను ప్రీతి పొందుతాను ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తు రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చెయ్యకముందు నేను స్నానం చెయ్యనా. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోన. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోన. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉంది ” అన్నాడు.
విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు, రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక ” మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను…….” అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ అన్నారు ” మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, మిమ్మల్ని కన్న కౌసల్యని ఒకసారి చూడాలని ఉంది, మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటె చూడాలని ఉంది రామ ” అన్నారు.
విశాల హృదయుడైన రాముడు సరె అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ ” సీత చూశావ, ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని అనుకున్నాము. ఇదే కిష్కింద, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు ” అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబా వచ్చి ” రామ! మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తార, రుమ చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాము ” అన్నాడు.
అప్పుడా పుష్పకాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తార, రుమలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దెగ్గరికి వెళ్ళి ” రండి, రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి ” అనింది. అప్పుడు వాళ్ళు మానవ కాంతలగా కామరూపాలని పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసేసి, లోపలికి ఎక్కి ” సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ? ” అని అడిగారు. 
” ఆవిడే సీతమ్మ ” అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.
మళ్ళి రాముడన్నాడు ” సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావ సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు ” అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది.
కొంతముందుకి వెళ్ళాక ” అదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడే అగస్త్యడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. అక్కడ కనపడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము ” అన్నాడు.
అలా ఆ పుష్పకం కొంత ముందుకి వెళ్ళాక వాళ్ళకి భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భారద్వాజుడికి నమస్కరించారు. అప్పుడు భారద్వాజుడు ” రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దెగ్గర ఉండి, విశ్రాంతి తీసుకొని, నా ఆతిధ్యం తీసుకొని బయలుదేరు ” అన్నాడు.
అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి ” హనుమ! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు, అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. తరువాత అక్కడినుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్ళి, నేను తిరిగొస్తున్నాను అని భరతుడికి చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను, భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగ కనిపెట్టి తిరిగిరా ” అన్నాడు.
వెంటనే హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకొని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలని వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.
మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భారద్వాజుడు అన్నాడు ” నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది రామ. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి ” అని అడిగాడు.
తరువాత భారద్వాజుడి దెగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలంతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.
అప్పుడు భరతుడు తన సైనికులతో ” రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి, రథాలని తీసుకురండి, పెద్దవాళ్ళని తీసుకురండి, అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము ” అని భరతుడు ఆజ్ఞాపించాడు.
రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.
రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని ” ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుంచి మనం అయిదుగురము అన్నదమ్ములము సుగ్రీవ ” అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలని ‘ మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు, మీరు ఎంత మంచివారు ‘ అని అందరినీ కౌగలించుకున్నాడు.
పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ళ ప్రేమలని, వాళ్ళ అలంకారాలని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు ” ఈ వానర కాంతలందరికి మేమే తలస్నానాలు చేయిస్తాము ” అని, వాళ్ళందరికీ తలస్నానం చేయించారు.
తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని ” కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపో ” అని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దెగ్గరికి వెళ్ళిపోయింది.
అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో ” మా అమ్మ అయిన కైకేయి ఆనాడు రెండు వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలని న్యాసంగా ఇచ్చి నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దెగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు, అందుకని ఇవ్వాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను ” అన్నాడు.
భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు.
శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి ” అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జటలు పట్టేసింది కదా అందుకని క్షుర కర్మ చేయించుకో ” అన్నాడు.
అప్పుడు రాముడు ” నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కాని, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాయందున్న ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలని తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షని విరమించను ” అన్నాడు.
భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకొని, దివ్యాభరణములను ధరించి బయటకి వచ్చాడు.
తన కొడుకు ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి సీతమ్మకి అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగుని తీసుకొచ్చి దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు, ఆ రథం యొక్క పగ్గములను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు మరొకపక్క విభీషణుడు వింద్యామర వేస్తున్నారు. అలా రథంలో అయోధ్యకి వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.
ప్రతి ఇంటిమీద పతాకాలు ఎగురవేశారు, అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు, సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ అందరూ వెళుతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాల వేద పండితులు నడిచారు, తరువాత పెద్దలు, వాళ్ళ వెనకాల కన్నె పిల్లలు, కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు అయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాలని వానరాలు తీసుకొచ్చాయి. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు.
వానరాలు తీసుకోచ్చిన ఆ జాలలని రాముడి మీద పోసి ఆయనకి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకారం చేశారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలు, లక్షల ఆవులు, వేల ఎద్దులు దానం చేశాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో ” అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు ” అన్నయ్య! నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు ” అన్నాడు.
తరువాత యువరాజ పట్టాభిషేకం భరతుడికి జెరిగింది.
సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రముల ద్వయం, హారాలు ఇచ్చారు.
ఆ సమయంలో, సీతమ్మ తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు సీత వంక చూసి ” ఈ హారాన్ని ఎవరికి ఇస్తావో తెలుసా. పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, పాండిత్యము ఎవడిలో ఉన్నాయో, అటువంటివాడికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు, అన్నిటినీమించి వాడు నీ అయిదోతనానికి కారణం అయ్యి ఉండాలి ” అన్నాడు.
అప్పుడు సీతమ్మ ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.
ఎప్పుడైతే ధర్మాత్ముడైన రాముడు సింహాసనం మీద కూర్చున్నాడో, అప్పుడు ఎవరినోట విన్నా’ రాముడు, రాముడు ‘ తప్ప, వేరొక మాట వినపడలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, శత్రువుల భయం లేదు, నెలకి మూడు వానలు పడుతుండేవి, భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది, చెట్లన్నీ ఫలపుష్పములతో నిండిపోయి ఉండేవి, చాతుర్వర్ణ ప్రజలు తమ తమ ధర్మములయందు అనురక్తులై ఉన్నారు, చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు ప్రేతకార్యం చెయ్యడం రామ రాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.
రామాయణం యొక్క ఫలశ్రుతి –
ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
రామాయణం పూర్తయ్యింది