శ్రీమన్మహాదేవదేవీ! మహిమండలావాసమైయున్న యో
దేవతాసార్వాభౌమామణీ! ధీమణీ! లోకసంచారిణీ భక్త
చింతామణీ! దుష్టశిక్షామణీ! మంజుభాషామణీ! పాపసంహారిణీ!
పుణ్యసంచారిణీ! ముక్తి కాంతామణీ! పావనీ! నిన్ను
వర్ణింపగా బ్రహ్మాశేషాదులు న్నోపలేరునేనెంతవాడన్ ధరన్
మున్నుయాదానవానీక దుర్మార్గముల్ బాపగా పెక్కురూపంబు
లంబెక్కు నామంబులన్ నుద్భవంబందవే, తొల్లీఇంద్రాది
లోకంబులంజేరి తాజేయు కల్లోలముల్ జూచి భీతాత్ములైనట్టి
యా దేవసంఘంబులంద్రుంపగా జూచి మాంసాదికానేక
శల్యాపురీషాదులుంగల్గు కూపంబులం ద్రోయగా దేవతానీక
మాబాధలన్ జిక్కితాజేయు నద్దేదియుంగాన కోదేవి!
యోశాంభవీ! శాంకరీ! కనకదుర్గాంబ! యో కంచి కామాక్షి! యోకాళి!
యోపార్వతీ! శంభురాణీ! భవానీ! సురాపూజితా! దేవీయంచున్
గడున్ దీనతన్నొంది నిన్నార్తులై వేడ నవ్యవతారంబుల్పొందియుం
బెక్కులౌబాహులన్ ఖడ్గశూలాద్యనేకాయుదాల్బట్టి
ఝుంకారమొప్పార క్రోధాగ్ని జ్వాలా ప్రకాశంబునే
వెల్గుచున్వచ్చు నీ మోమునుంగాంచి యాదానవానీక బృందంబు
లబ్బబ్బ ఈ రూపమేనాడు జూడంగలేదంచు
యో తల్లి! యోమాత! యోదేవి! రక్షింపు రక్షింపు మంచుందగన్వేడుచున్నట్టి
యవ్వారినివ్వీడిమహిషాసురం ద్రుంచి దేవాదులంగాచి
రక్షించవా! భూమినింగల్పి యేడేడు లోకంబులంబుట్టి
వర్ధిల్లు నీ మానవానీక మయ్యొయ్యొ నీ యాగ్రహంబందునం
జిక్కి బందీక్రుతుల్గాక క్రొధంబుచేనీవు తీవ్రంబుగా తాపముల్
కల్గగా జేసితే, కేకలార్పటముల్గల్గగా జేసితే గొప్పగా పెక్కులే
పొక్కు లెక్కించితే దేహమాయాసము న్సల్పులుందీపులుం
గల్గగాజేసితే, వారు నిన్ గొల్పినీయుత్సవంబొప్పగా జేతుమో
తల్లి యోదేవి యంచున్ గడున్ బెక్కుదండంబులం బెట్టగాజాలి
యున్నొంది యారోగ్యమున్నొందగా జేసితే వారలారొగ్యమున్
చెంది స్నానమంబులంజేసి యానందవారాశినిందేలి నీయుత్సవం
బొప్పుగాచేసియుం జంతుజాలంబులం బండ్లు బక్వాన్న
పానీయము ల్భక్తితోదెచ్చి నీ కర్పితంబొప్పుగా జేయ సంతోషమున్
జెంది నూకాల మారేళ్ళ మర్దీమహంకాళి నామాది
కానేక నామంబులంజెంది తాముండు నీరూప తేజంబులం
జేర్చి యద్భూతసంఘంబులం గాలిదయ్యంబులం శాకినీ
మొహినీ రాక్షసానీకముంచేర్చియు న్విందుగావించి సంతోషముం
జెందుచున్నట్టి నోదేవి యోతల్లి యోమాత ఈనాదు
ఈగ్రామముందుండి ఈరీతి మాబిడ్డలన్ వ్యధలనొందిపగానేల!
మేమెన్నడునీకు నీయొగ్గుగా వింపగా లేదెలేకున్న
ఈబాలలీకూనలేమైన గావించినం, తల్లిచందాన, శాంతమ్ము
నుంబొంది జ్ఞానంబునుంగల్గగా జేయకేఇట్లు ఘోరంబుగా
బాధనొందింపగానేలనో యంబిక శాంభవీ పావనీలోక
మాతా మముంగావ నీకన్నవేరెవ్వరున్లేరు, కాపాడిరక్షించు
మీబిడ్డలం జెందు ఈ తాపమాయాసముల్ బాపియే
బాధలేకుండగా యుంగరోగమ్ములున్నేత్రరోగంబులున్ క్షుత్తు
దుఃఖంబు లేకుండగాచేసి మా బిడ్డలన్మాదుపొత్తిల్లలో చేర్చు
మీచేర్చినన్నీకు మాశక్తి లోపంబు లేకుండగా పానకం
బాదిగాదెచ్ఛి నీకర్పితం బొప్పగా చేతుమోతల్లి దేవీ భవానీ
పార్వతీశంభురాణీ కృపాద్రుస్టినన్ మమ్ముగాపాడు నీకన్న
మాకెవ్వరున్నారు నిన్ గొల్చి ఏటేట నియుత్సవంబాదిగా జాతర
ల్చేసి తీర్ధమ్ము గావించి యానందమున్ బొందుచున్నట్టి
మాయందునీకింత క్రోధంబు గల్గంగ మాచేయు లోపంబు
లేమైననున్నన్ సదామాతవై గాచి రక్షించరాదే సురానీకముం
జూచుచందాన మమ్మెప్పుడున్ జూడగారాదె మాయాప
దల్బాపి కాపాడుచుం బాడియంబంటయున్ సంపదైశ్వర్య
ముల్నిచ్ఛి బ్రోవంగరాదే యటంచున్వడి న్నిన్ను ఈరీతి
స్తోత్రంబులంజేయు నీపాదభక్తుంద నీదాస దాసానదాసుండ
కాకాపురీవాసుడన్ వైశ్యుడన్గుండు వంశాబ్ది సోముండనం
జెల్లు సర్వేశ నామాఖ్యునిం ఋద్రుడున్నార్య భక్తుండనై యొప్పు
భూమిం జగన్నాధదాసుండనిన్ గొల్వగా దండకం బొప్పగా
వ్రాసి నీ కంఠమందొక్క పూదండగా నుంచగా నెంచి
నీకర్పితం బొప్పగా జేతు మా మొర్రలాలించి మా పిల్లలన్
గాచి మా యాపదల్దీర్చి మా బిడ్డలన్ బొందు నీతాపముల్బాపి
రక్షింపుమా తల్లివై జూడుమా, త్రాతవై బ్రోవుమా, తండ్రివై
గావుమా నేతవై గాంచుమా దేవివైబ్రోవు మాయమ్మ నూకాల
తల్లీ మహంకాళీదేవీ సురాభూజవల్లీ, మహాకాళి తల్లీ భవానీ
విశాలాక్షి, యోకంచికామాక్షి, యోశాంభవీ, శాంకరీ, పార్వతీ,
అన్నపూర్ణ మహాదేవి మీరందున్నేక భావంబుతో మమ్ము
రక్షింపుడీ, బ్రహ్మణుల్ క్షత్రియుల్ వైశ్యులున్ శూద్ర సంఘం
బులు న్నీదునామంబుల న్మానసం బందునన్ భక్తితో గొల్చి
స్తోత్రంబులం జేయు నవ్వారికేగాక ఈ దండకం బెప్పుడున్
భక్తితో పల్కు నవ్వారికిన్ శ్రద్ధతో వ్రాయు నవ్వారికిన్ బాపము
ల్బాపియున్మోక్షముంగల్గ జేయంగ నేగోరితిన్నాదు వాక్యంబు
లందుండు లోపంబులన్ గాంచ కేప్రొద్దు నీ దాసునింగాంచి
రక్షించుమా లోకమాతా నమస్తే నమస్తే నమః